ఏదుట్ల శేషాచలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఏదుట్ల శేషాచలం మహబూబ్ నగర్ జిల్లా, వనపర్తి సమీపంలోని ఖిల్లా ఘనపురం వాసి. ఒకనాటి వనపర్తి సంస్థానంలో ఆస్థాన కవి. ఇతను సంగీత సాహిత్య భరతశాస్త్రాది కళాప్రవీణుడు. ఇతని తండ్రి నాగేశం, తాత చెన్నయ్య. ఇతని వంశస్తుల్లో చాలా మంది సంగీత సాహిత్యాలలో ఆరితేరినవారు. ఇతనికి ఆ సంపదే వారసత్వంగా వచ్చిందంటారు. వీరి పూర్వికులు ఒకనాటి జటప్రోలు సంస్థానం సమీపంలోని ఏదుట్ల గ్రామస్థులు. ఈ కవి జటప్రోలు సంస్థానాన్ని వదిలి, వనపర్తి సంస్థానాన్ని ఆశ్రయించటం కొంత విడ్డూరమైనా, అప్పటికే ఏదుట్లను వదిలి ఖిల్లాఘనపురంలో స్థిరపడి ఉండం ఒక కారణం కావచ్చు. ఈ కవి ' జగన్నాటకం ' అను యక్షగాన నాటక కావ్యాన్ని రచించాడు. దీనివెనుక ఓ పెద్ద కథే ఉంది. దాని గురించి ఆరుద్ర గారి మాటల్లో..." మన సాహిత్యంలో కల రాని కవి, దేవుడు కనిపించి ఆజ్ఞాపించని కావ్యం లేదు. అయితే మన కవులు రిపోర్టు చేసిన తమ కలలో ఏ ఒక్కటి తలాతోకా లేనివి లేవు. వాస్తవానికి కలలో అన్నీ కలగాపులగంగా ఉండాలి. స్వప్న చిత్రాల మాంటేజ్ విచిత్రంగా ఉంటుంది. ఇటువంటి కలవచ్చినవాడు మన సాహిత్యంలో ఏదుట్ల శేషాచలం ఒక్కడే కనిపిస్తాడు..[1] అటువంటి విచిత్రమైన కలలో ' హరే రామా గోవిందా ' అంటూ అర్థనారీశ్వరుడు వచ్చి అజ్ఞాపిస్తే రాసిన రచనే ' జగన్నాటకం ' అని కవి చెప్పుకున్నాడట. ఈ కవి ఈ రచనను ఆధ్యాత్మ విద్యానుసారంగా, భరతశాస్త్రానుసారంగా రచించాడు. పరబ్రహ్మ నుండి ప్రకృతి, జీవుడు జన్మించడం, ప్రపంచనాటకం ఆరంభించటం మొదలగు విషయాలన్ని ఇందులో వర్ణితాలు. ముక్తికాంతా పరిణయం, రాజ రంజన విద్యావిలాస నాటకం మొదలగు ఆధ్యాత్మిక యక్షగానాల కోవలోకి ఈ యక్షగానం కూడా చేరుతుందని పండితుల అభిప్రాయం. ఇందులో అడుగడుగున భక్తిరసైక నిష్ట కలదందురు.

మూలాలు

[మార్చు]
  1. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12 వ సంపుటం, కడపటిరాజుల యుగం, రచన: ఆరుద్ర, ఎమెస్కో, సికింద్రాబాద్,1968, పుట-34