పాత్రికేయం , అనువాదం, ప్రజాసంబంధాలు, ఆకాశవాణి న్యూస్ రీడర్, సాహిత్య పరిశోధకులు
డాక్టర్ జె. చెన్నయ్య మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పాత్రికేయులు, రచయిత, సాహిత్య పరిశోధకులు, ఆకాశవాణి న్యూస్ రీడర్, అనువాదకులు, తెలంగాణ సారస్వత పరిషత్ ప్రధాన కార్యదర్శి.
డాక్టర్.జె. చెన్నయ్య మహబూబ్ నగర్ జిల్లాజడ్చర్ల మండలం కావేరమ్మపేటలో 06.01.1958న జన్మించారు. చిన్నప్పటి నుంచి తెలుగు భాషంటే అభిమానం. ఉస్మానియా విశ్వవిద్యాలయములో ఎం.ఎ. తెలుగు, "తెలుగు దినపత్రికలు - బాషా సాహిత్య స్వరూపం" అనే అంశంపై పీహెచ్.డి పరిశోధ చేసి డాక్టరేట్ పొందారు. మాస్టర్ అఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం మదురై కామరాజ్ విశ్వవిద్యాలయం, మదురైలో, పి.జి. డిప్లొమా ఇన్ ట్రాన్స్‌లేషన్ స్టడీస్, ఆంధ్ర విశ్వవిద్యాలయంవిశాఖపట్నంలో పూర్తి చేశారు. జడ్చర్లలో కళాశాల విద్యార్థిగా, మొబైల్ బ్రాంచి పోస్టాఫీస్ పోస్ట్‌మాస్టర్‌గా, కళాశాల విద్యార్థి సంఘం కార్యదర్శిగా ఉంటూ, నాటకాలు, ఏకపాత్రాభినయాలు, బుర్రకథలు ప్రదర్శిస్తూ, ఆ రోజుల్లోనే రేడియోకు కథానికలు, కవితలు, రూపకాలు రాస్తూ, ఒక దినపత్రికకు విలేకరిగా పనిచేసేవారు. పాత్రికేయునిగా, అనువాదకునిగా, ఉత్తమ ప్రజా సంబంధాల అధికారిగా, ఆకాశవాణి న్యూస్ రీడరుగా చేపట్టిన అన్ని రంగాల్లో ప్రతిభావంతునిగా పేరు తెచ్చుకున్నారు. కష్టపడి చదువుకొని పైకి రావాలనుకున్న వారికి పేదరికం, గ్రామీణ నేపథ్యం వంటివేవీ అవరోధం కాదని నిరూపించిన వ్యక్తి.[1]
సురవరం తెలంగాణం పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జుర్రు చెన్నయ్య ని సత్కరిస్తున్న సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
డా. చెన్నయ్య గారు అనువాద రంగంలో విశేష కృషి చేశారు.
గవర్నర్ సుర్జిత్‌సింగ్ బర్నాలా నిజ జీవితంలో చేసిన సాహసాలతో కూడిన ‘క్వెస్ట్ ఫర్ ఫ్రీడమ్ - ఎ స్టోరీ ఆఫ్ ఎన్ ఎస్కేప్’ ("Quest for freedom A Story of an escape") అనే గ్రంథాన్ని స్వేచ్ఛకోసం ఒక విహంగ యాత్ర పేరుతో తెలుగులోకి అనువదించారు.
నేషనల్ బుక్ ట్రస్ట్ ఇండియా కోరికపై, పంజాబీ రచయిత్రి దిలీప్ కౌర్ తివానా రచించిన ట్వైలైటు, మార్క్ ఆఫ్ డైమండ్ నోస్‌రింగ్ ("1. Twil Light. 2. Mark of Dimond nose ring") అనే నవలికల్నిసంధ్యారాగం, వజ్రపు ముక్కుపుడక అనే పేర్లతో నవలికలను తెలుగులోకి అనువాదం చేశారు.
భారత సైనికదళాల ప్రధానాధికారిగా, త్రివిధ, దళాల సుప్రీం కమాండర్ గా పనిచేసిన జనరల్ కె.వి.కృష్ణారావు రాసిన ("In the service of the Nation : Reminiscences") సర్వ సైన్యాధ్యక్షునిగా, జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల గవర్నర్‌గా పనిచేసిన జనరల్ కె.వి.కృష్ణారావు అనే బృహత్ గ్రంథం తెలుగు విశ్వవిద్యాలయం కోరికపై దేశసేవలో .. జనరల్ కె.వి.కృష్ణారావు జ్ఞాపకాలు పేరుతో తెలుగులోకి అనువదించిన నాలుగు అనువాదకుల్లో ఒకరు.
సీనియర్ పాత్రికేయుడు ఆర్. జె. రాజేంద్రప్రసాద్ రాసిన ‘ఎమర్జెన్స్ ఆఫ్ తెలుగుదేశం’ ("Emergence of Telugu Desam") అనే గ్రంథాన్ని "వీచిన ప్రాంతీయ పవనాలు" పేరుతో తెలుగులోకి అనువదించారు.
సీనియర్ పాత్రికేయుడు ఆర్. జె. రాజేంద్రప్రసాద్ రాసిన ‘డేట్ లైన్ ఆంధ్ర’ ("Dateline Andhra") గ్రంథాన్ని తెలుగులోకి "డేట్ లైన్ ఆంధ్ర" అనే పేరుతో అనువదించారు.
డా. ఎ. పి. జె. అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా చేసిన ప్రసంగాలను తెలుగులోకి అనువదించి ఒక సంకలనంగా కూర్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో ప్రతియేటా ఆర్థిక మంత్రి శాసన సభలో బడ్జెట్ ప్రవేశపెడుతూ చేసిన ప్రసంగాలను 12 సంవత్సరాల పాటు తెలుగులోకి అనువదించారు.
క్యాజువల్ ఎనౌన్సర్, వార్తా విభాగంలో ప్రాంతీయ, జాతీయ వార్తలు చదివే క్యాజువల్ న్యూస్ రీడరుగా, అనువాదకునిగా, కార్యక్రమాల రూపకల్పన నిపుణుడిగా అనుభవం గడించారు. సరళతరమైన అనువాదానికి, స్పష్టమైన ఉచ్ఛారణతో కూడిన వార్తా పఠనానికి పేరు పొందారు. గణతంత్ర దినోత్సవం, స్వాత్రంత్య దినోత్సవం, మొదలైన ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రి, ప్రసంగాలను అనువదించి భావయుక్తంగా చదవడంలో ప్రత్యేకత సాధించారు. ప్రధానమంత్రి మన్ కీ బాత్ అనువాదం, పఠనం. మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు మరియి నందమూరి తారక రామారావు అంత్యక్రియలకు ఆకాశవాణిలో ప్రత్యేక్ష వ్యాఖ్యానం. దూరదర్శన్ లో రాష్ట్రావతరణ దినోత్సవం, డా. పుట్టపర్తి నారాయణాచార్యుల శతజయంత్యుత్సవ ప్రత్యేక్ష వ్యాఖ్యానం. దూరదర్శన్‌లో కూడా ఎన్నోసార్లు వ్యాఖ్యాతగా ప్రేక్షకులకు కనిపించారు.
హైదరాబాద్ ఫరేడ్ గ్రౌండ్ లో జరిగిన అన్నమయ్య లక్ష గళ సంకీర్తనార్చనలో, గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో జరిగిన రెండవ, మూడవ, నాల్గవ, అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో ప్రత్యేక్ష వ్యాఖ్యానం. (ఈ కార్యక్రమాలు గిన్నిస్ రికార్డుల్లో స్థానం సంపాదించుకున్నాయి.) కాలిఫోర్నియాలో జరిగిన మొట్టమొదటి అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనంలో, అమెరికా న్యూజెర్సీ తెలుగు సాంస్కృతికోత్సవంలో ప్రత్యేక్ష వ్యాఖ్యానం. వివిధ ప్రక్రియలు, కళారంగాల్లో పురస్కారాలు, గౌరవ డాక్టరేట్లు పొందిన వెయ్యిమందికి పైగా ప్రముఖుల ప్రశంసాపత్రాల రచన. అంతర్జాతీయ సమ్మేళనాల్లో వ్యాఖ్యాతగా ఎంతోమంది అభినందనలు అందుకున్నారు.
తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ & దాక్షిణాత్య ఆర్ట్స్ అకాడమి సంయుక్త సమర్పణలో మాట్లాడుతున్న జుర్రు చెన్నయ్యడా.సి .వి . నరసింహారెడ్డి బెస్ట్ పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ అవార్డు - పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అఫ్ ఇండియా (పి. ఆర్ . ఎస్ . ఐ )
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ అఫ్ ఇండియా ఆలిండియా అవార్డు
ఉత్తమ అనువాద సాహితీ పురస్కారం - తెలుగు విశ్వవిద్యాలయం
అధికారభాష సంఘం పురస్కారం - తెలంగాణ ప్రభుత్వం
ఆరాధన ఆకాశవాణి పురస్కారం
హృదయ భారతి విశిష్ట పురస్కారం
ఉత్తమ ప్రజా సంబంధాల అధికారి అవార్డు - శిల్ప ఆర్ట్స్ క్రియేషన్స్
అనువాదకుడిగా, ప్రజా సంబంధాల అధికారిగా, న్యూస్ రీడర్‌గా మూడు బాధ్యతలను ఏకకాలంలో నిర్వహించిన చెన్నయ్య మూడు రంగాల్లో పురస్కారాలు పొందారు. అనువాదానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి, ఉత్తమ ప్రజా సంబంధాల అధికారిగా పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి, ఉత్తమ న్యూస్ రీడర్‌గా అప్పటి న్యూస్ రీడర్ పి.ఎస్.ఆర్. ఆంజనేయ శాస్ర్తీ కుటుంబ సభ్యులు నెలకొల్పిన సంస్థ నుండి అవార్డులు పొందారు. అధికార భాషా సంఘం, ఢిల్లీ తెలుగు అకాడెమీ, ఆరాధన, హృదయభారతి, శిల్పా ఆర్ట్స్ క్రియేషన్స్, మహబూబ్‌నగర్ జిల్లా యంత్రాంగం, మానస ఆర్ట్స్ థియేటర్స్ నుండి పురస్కారాలు పొందారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నుండి జాతీయ బహుమతి పొందారు. బెస్ట్ చైర్మన్‌గా జాతీయ పురస్కారం పొందారు. విద్యార్థి రోజుల్లో సిద్దిపేట డిగ్రీ కాలేజీ రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీల్లో ప్రథమ బహుమతి పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అంతర కళాశాల ఏకపాత్రాభినయం పోటీల్లో వరుసగా మూడేళ్లు కర్ణ, చాణక్య, భగత్‌సింగ్ పాత్రలకు ప్రథమ బహుమతి పొందారు.
తెలుగు విశ్వవిద్యాలయంలో 1990 నుండి 2016 దాకా పనిచేశారు. ప్రజా సంబంధాల అధికారిగా అసమాన సేవలు అందించి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం తెలంగాణా సారస్వత పరిషత్‌కి ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, తెలుగు భాషకు, సాహిత్యానికి అవిరామంగా సేవ చేస్తున్నారు. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్ కార్యదర్శిగా, ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా సేవ చేశారు. సిలికానాంధ్ర (యుఎస్‌ఏ) భారతదేశ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ప్రస్తుతం సిలికానాంధ్రకు వైస్‌ప్రెసిడెంట్. 12 దేశాలలో ఉన్న ‘మన బడి’కి ఎంతో సేవలందిస్తున్నారు. శ్రీమతి సుశీల నారాయణ రెడ్డి ట్రస్టు కన్వీనర్ గా కూడా ఉన్నారు.
అనేక విద్యా, సాహిత్య సభల్లో పాల్గొని పత్ర సమర్పణ చేశారు. పత్రికల్లో పలు వ్యాసాలు రావారు. అమెరికా, మారిషస్, శ్రీలంక, సింగపూర్, మిచిగాన్, మలేషియా, దుబాయ్, వంటి దేశాలలో భారత సంస్కృతి ప్రచారం చేసి తెలుగు భాష, సాహిత్య కీర్తి పతాకనెగురవేశారు.