రాకమచర్ల వేంకటదాసు
రాకమచర్ల వేంకట దాసు తెలంగాణ ప్రాంత వాగ్గేయకారుడు. పూర్వం ముచుకుంద మహర్షి అంశ. ఎన్నో భక్తి కీర్తనలను రచించి ప్రచారం చేసాడు. ఈయన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సమీపాన గల రాకమచర్ల కేంద్రంగ ఆశ్రమాన్ని స్థాపించి భక్తి ప్రచారం చేసిన మహానుభావుడు. భక్తి ఉద్యమ కర్త తెలంగాణ తాత్వికుడు, దాదాపూ లక్ష కీర్తనలు రాసినట్లుగా ప్రతీతి.
వీరు ఆంధ్రప్రదేశ్ లో మహబూబ్ నగర్ జిల్లాలోని అచ్చంపేట తాలూకాలోని పెద్దాపురం గ్రామంలో 1808 సంవత్సరంలో జన్మించారు[1]. ఇతని తల్లి అనంతమ్మ, తండ్రి మల్లయ్య. ఇతడు పెద్ద ఉమ్మెంతాల గ్రామానికి సమీపంలో ముచుకుందా క్షేత్రమని ప్రసిద్ధిగాంచిన రాకమాద్రి చేరి అక్కడ అర్చారూపమున వెలసియున్న శ్రీ లక్ష్మీ యోగానంద నరసింహ స్వామి వారిని దర్శించి శ్రీహరి కటాక్షముచేత అనేక భక్తిరస ప్రధానమైన కీర్తనలచే దేవదేవున్ని స్తుతించిరి. వీరు దాదాపు లక్ష కీర్తనలు రచించిరని వినికిడి ఉన్నా మనకు సుమారు 500 మాత్రమే లభ్యమయ్యాయి. ఈ కీర్తనలు పండితులకే గాక పామరులకు కూడా సులభముగా అర్ధమగుటచేత విన్నవారికి భక్తిభావము ఉప్పొంగుతుంది.
లభ్యమైన దాసుగారి కీర్తనల పుస్తకములో అనేక తప్పులతో ఉన్నందుకు చింతించి ప్రస్తుతం పీఠాన్ని అలంకరించిన గోవిందయ్య గారు చాలా ఆవేదన చెంది సుమారు 800 సంవత్సరాల క్రిందట ముద్రించబడిన పురాతన గ్రంథము లభించినందువలన భక్తుల సహాయ సహకారములతో పునర్ముద్రించిరి.
రాకమచర్ల కీర్తనలు
[మార్చు]- అప్పవోయి రామప్పవోయి అప్పవోయి నీదుకరుణ దప్పకు
- కనుగొందునయ్యా మీ పదసేవా శ్రీవాసుదేవ కనుగొందు
- కృపాకర గోపకుమారహరి కృపాకర
- గురుమహరాజ గురుమహరాజ పరబ్రహ్మ సద్గురుమహరాజ
- గోవిందరాంరాం గోవిందాహరి గోవింద రాంరాం గోవిందా
- చెలియారోపోవె శ్రీహరి నిందుపిలుచుకరావె
- దేవనీచిత్తము దెలసివచ్చితె మంచిత్రోవజూచుకుందునూ
- దేహి శ్రీ వాసుదేవమాపాహీ
- నారాయణా వాసుదేవా రమానాధ సుజనానుసంజీవా
- నీ కన్న ఘనులెవ్వరయ్యా అట్ల గాకున్న నను బ్రోవవయా
- నీ వైనదయజూడవమ్మ లోకపావాని నను బ్రోవవమ్మ
- నేజూచినానె అంతర్లక్ష్యం నేజూచినానె
- పతీత పావన గోవిందా నవపద్మ దళాక్ష సదానందా
- పాహి రామచంద్ర సదామాంపాహి రామచంద్ర
- పాహి శ్రీమణి నాయకా వాసుదేవ పరమ సౌఖ్యదాయకా
- భామినీ పులువవమ్మ నా స్వామిని పిలువవమ్మ
- మనసా శ్రీహరిని బిలువవమ్మ మనవి చేకొమ్మా
- ముద్దుముద్దుగ ముచ్చటాడు నావద్దికిరార హరినెడూ
- యక్కాడి సంసారమెడబాయజాలదు రామచంద్ర
- యేకాంతసమయామురా మనకిదె మంచిదైయ్యుందిరా
- రాని కారణమేమిరా నేబిలచీతెరాని కారణమేమిరా
- రామ రామారాజ లలామ సోమ వదనసునామ మునిజన కామద్గురుణ ధామ నరవర
- రార రార రఘువీర దయానిధే చారుమకుట మణిహార ఖరాంతక
- రార వోరామకృష్ణ రార
- వందనమయ్య రామ వందిత సూత్రమ చందనచర్చితాంగ సజ్జనభవభంగ
- శ్రీపతిదాసులచేపట్ట గలడాని విన్నా
- శ్రీ వాసుదేవ చిన్మయ ప్రభావ
- శ్రీ వెంకటేశా ముజ్జగదీశ శ్రీ వెంకటేశా
- సదానందగోవిందా రిపుమదావహర మునికందా
- సదానందమూర్తి రామస్వామి చక్రవర్తి
- హరిచరణం భజశరణం సద్గురు చరణం భవహరణం
- హరి ధ్యానంబె పరమపదం సద్గురుని భజించుటె సుఖతరము
వేంకటదాసు గారు శాలివాహన శకమున 1781 (సా.శ.1859)కి సరియైన సిధ్ధార్థి నామ సంవత్సరము మార్గశిర శుద్ధ త్రయోదశి రోజున భౌతిక దేహాన్ని విడిచి దైవసన్నిధి చేరారు[2]. దాసుగారి సమాధి ఉమ్మెంతల గ్రామంలో ఉంది. వీరి సమాధిపై చిన్న ఆలయము నిర్మింపబడి శిథిలావస్థలో యుండగా గోవిందయ్య గారు అనేక వ్యయప్రయాసలకు లోనై అనేక గ్రామాలు సంచరించి విరాళాలు సేకరించి ఆలయం చుట్టూ 1000 మంది భక్తులు కూర్చొని సంకీర్తన చేయడానికి సరిపడే మండపం నిర్మించారు.
మూలాలు
[మార్చు]- ↑ శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన, రచన: శ్రీవైష్ణవ వేణుగోపాల్, 2016, పేజీ 90
- ↑ శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన, రచన: శ్రీవైష్ణవ వేణుగోపాల్, 2016, పేజీ 97