రఘువీర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రఘువీర (1902 - మే 14, 1963) భాషావేత్త, విద్యావేత్త, పండితుడు, భారతీయ జనసంఘ్ నాయకుడు, భారత రాజ్యాంగ సంఘ సభ్యుడు. ఆయన వేద సంస్కృత భాషను పునరుద్ధరించడం, సప్రమాణ మహాభారతాన్ని రూపుదిద్దడం, ప్రపంచ భాషల నిఘంటువు నిర్మించడం వంటి మహా కార్యాల్లో కీలకమైన కృషి చేసిన వారు.

బాల్యం[మార్చు]

మున్షీరాం దంపతులకు 1902లో బ్రిటీష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్సుకు చెందిన రావల్పిండి నగరం (నేటి పాకిస్తానీ పంజాబ్ ప్రావిన్సులో ఉంది) లో రఘువీర జన్మించారు. ఆయన తండ్రి మున్షీరాం రావల్పిండిలో ఉన్నత పాఠశాల ప్రధానాధ్యాపకులుగా పనిచేసేవారు. తల్లి ఆయన చిన్నతనంలోనే మరణించారు. రఘువీర పూర్వీకులు నేటి హర్యానాలోని (అప్పటి పంజాబ్ ప్రావిన్సు) జగాధరీ పట్టణానికి చెందినవారు. ఆయనది వైశ్య కులంలో సంప్రదాయ వైష్ణవ కుటుంబం. రఘువీర పూర్వీకులు చాలావరకూ అధ్యయనం, బోధన రంగాల్లోనే పనిచేశారు.

విద్యాభ్యాసం[మార్చు]

రఘువీర చిన్నతనం నుంచీ చురుకైన విద్యార్థిగానే పేరు గడించారు. విద్యార్థి వేతనం స్వీకరిస్తూ సంస్కృతం ఎం.ఏ. పరీక్షలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణత పొందారు. ఆపైన పరిశోధక విద్యార్థిగా లాహోర్ లోని పంజాబ్ విశ్వవిద్యాలయంలో కృషిచేసి డాక్టరేట్ పొందారు. వారాహగృహ్య సూత్రాలపై చేసిన పరిశోధనకు గాను హాలెండ్ కు చెందిన యుట్ రీప్త్ విశ్వవిద్యాలయం నుంచి డి.లిట్. పొందారు. ఆయన 1928 నాటికే మూడు డాక్టరేట్లు పొందారు, 1940 నాటికి ఆయనకు విదేశీ విశ్వవిద్యాలయాల నుంచి మూడు డి.లిట్.లు లభించాయి.

పరిశోధన, బోధన[మార్చు]

లాహోర్ నగరంలోని సనాతన ధర్మ కళాశాలలో సంస్కృత ఆచార్యునిగా, సంస్కృత శాఖ అధిపతిగా దీర్ఘకాలం పనిచేసి 1946లో కళాశాలలోని ఉద్యోగాన్ని విరమించుకున్నారు. 1946 సంవత్సరంలో నాగ్ పూర్ ప్రాంతంలో అత్యంత ప్రాచీనమైన, విలువైన భూర్జ, తాళ పత్రాలు సేకరించి వేద సంస్కృత భాషను పునరుద్ధరించడంలో గట్టి కృషిచేశారు. రఘువీర జాతీయవాది అయిన భాషావేత్తగా ఆంగ్ల భాష సర్వాధిపత్యాన్ని ప్రశ్నిస్తూ సాగారు. హిందీ, సంస్కృతం, పర్షియన్, అరబిక్, ఆంగ్లం, ఉర్దూ, బెంగాలీ, మరాఠీ, తమిళం, తెలుగు, పంజాబీ మొదలుకొని అనేక భాషల్లో ఆయన ప్రావీణ్యత సంపాదించారు. సంస్కృత భాషలో అనేక విలువైన, ప్రామాణికమైన గ్రంథాలు నేరుగా ఆయన ప్రమేయంతోనో, ఆయన పరోక్షంగా ప్రోత్సాహంతోనో రూపుదిద్దుకున్నాయి.[1][2]

మూలాలు[మార్చు]

  1. http://www.amazon.com/s?ie=UTF8&page=1&rh=n%3A283155%2Cp_27%3ARaghu%20Vira
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-02-08. Retrieved 2016-07-27.
  • హంపీ నుంచి హరప్పా దాక, తిరుమల రామచంద్ర
"https://te.wikipedia.org/w/index.php?title=రఘువీర&oldid=3888598" నుండి వెలికితీశారు