బీచుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బీచుపల్లి
—  రెవెన్యూ గ్రామం  —
Mahabubnagar in Telangana (India).svg
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°9′41″N 77°55′54″E / 16.16139°N 77.93167°E / 16.16139; 77.93167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా జొగులాంబ గద్వాల
మండలం ఇటిక్యాల
ప్రభుత్వం
 - సర్పంచి మరియమ్మ
పిన్ కోడ్ 509 125
ఎస్.టి.డి కోడ్ 08546

బీచుపల్లి, తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలంలోని గ్రామం.[1] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. [2]ఈ గ్రామం 7వ నెంబర్ జాతీయ రహదారిపై ఉంది. కృష్ణానది ఒడ్డున ఉన్న ఈ గ్రామములో ప్రతి 12 సంవత్సరాలకు జరిగే కృష్ణానది పుష్కరాలు ఘనంగా నిర్వహిస్తారు. ఇక్కడ ప్రాచీనమైన ఆంజనేయస్వామి దేవాలయం ఉంది.[3]. జాతీయ రహదారికి అతి సమీపంలో ఉండుటచే లక్షలాది భక్తులు పుష్కరస్నానం చేయడానికి తరలివస్తుంటారు. ఇది మంచి పర్యాటక కేంద్రం కూడా. కృష్ణవేణి దేవాలయం, ఇతరదేవాలయాలు, ఉద్యానవనం మున్నగునవి ఇక్కడకు వచ్చే పర్యాటకులను సంతృప్తిపరుస్తాయి. జాతీయరహదారిపై కృష్ణానదిపై కల వంతెన దాటుతున్నప్పుడు ఈ దృశ్యాలు కానవస్తాయి.పిన్ కోడ్ నం. 509 125.

చారిత్రక నేపథ్యం[మార్చు]

కృష్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉండటం వలన అలంపూర్, గద్వాల ప్రాంతాలను నడిగడ్డగా పిలుస్తారు. నడిగడ్డలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న బీచుపల్లి మౌర్యులు, శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు, సుల్తానుల పాలనలో కొనసాగింది. క్రీ, పూ. 902 సంవత్సరంలో చోడబల్లి దేవుడు అనే రాజు విశ్వనాథ దేవుడు అనే వ్యక్తికి ఈ ప్రాంతాన్ని దానంగా ఇచ్చినట్లు ఇక్కడ లభించిన శిలాశాసనం ద్వారా తెలుస్తుంది[4].

కృష్ణానది వంతెన[మార్చు]

కృష్ణానదిపై రోడ్డువంతెన, బీచుపల్లి

బీచుపల్లి వద్ద కృష్ణానది 7వ నెంబరు జాతీయ రహదారిపై కృష్ణానది మీదుగా ఒక కిలోమీటరు పొడవు కల వంతెన ఉంది. దీన్ని 1958లో 36 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఇటీవల రెండు లేన్ల రహదారిని నాలుగు లేన్ల రహదారిగా చేస్తున్న తరుణంలో మరో కొత్త వంతెన నిర్మాణాన్ని కూడా ప్రారంభించారు. దీని 15 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.[5]

ఆంజనేయ స్వామి దేవాలయం[మార్చు]

మహబూబ్‌నగర్ జిల్లాలో 7వ నెంబరు జాతీయ రహదారి పైన కృష్ణా నది తీరాన బీచుపల్లిలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం ఉంది. స్వామి వారిని వ్యాసరాయలు ప్రతిష్ఠించారని ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించిన పిమ్మట సా.శ.1521 సంవత్సరమున అతనికి కుహూ యోగం ప్రారంభమాయెనట. అపుడు మహారాజు వారు వ్యాసరాయలను ఆశ్రయించగా, ఆయన సా.శ.1521 నుండి సా.శ.1524 వరకు మూడేండ్ల కాలం తానే శ్రీకృష్ణ ముద్రతో రాజ్య పాలనము చేసి అనంతరమతని సామ్రాజ్యము అతనికి దానం చేసెనట.అపుడు రాయల వారు వ్యాసరాయలను సత్కరించదలచి మదనపల్లి జిల్లా నంతటిని అతనికి దానం చేసిరట. అప్పటి నుండి ఆ ప్రదేశానికి వ్యాస సముద్రం అని రూఢీ అయినదట. దానం గ్రహించిన పిమ్మట ఆ దోష పరిహారార్థం 378 ప్రాణ దేవతల ప్రతిష్ఠలు చేసినాడట. ఇక్కడి ప్రతిష్ఠ వాటిలో ఒకటిగా భావిస్తారు.వ్యాస రాయల ప్రతిష్ఠలో హనుమంతునికి ఇరువైపులా శంఖ, చక్రాలుంటాయి. ఆయన ఇక్కడ హనుమంతున్ని ప్రతిష్ఠించి, మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని సెలవిచ్చినాడట. అప్పుడక్కడ స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే బోయపిల్లవాడు స్వామి దర్శనానికి రాగా, అప్పటి నుండి బీచుపల్లిలో బోయవారిదే ప్రథమ పూజ. సా.శ.1961 వ సంవత్సరంలో అష్టగ్రహకూటమి సంభవించినప్పుడు, గద్వాల వాస్తవ్యులైనటువంటి కె.పి.వర్ధన్ ఇక్కడ గొప్ప శ్రీ రామకోటి యాగం చేసారు.దానితో ఈ క్షేత్రం గురించి దేశవ్యాప్తంగా తెలియవచ్చింది.

బీచుపల్లిలో శ్రీఆంజనేయస్వామి ఆలయంతో పాటు కోదండరామస్వామి ఆలయం కూడా ఉంది.[6] అంతేకాకుండా కృష్ణా నది మధ్యలో నిజాంకొండ కోట కూడా ఉంది. ఇక్కడ సినిమా షూటింగులు కూడా జరిగాయి.

శ్రీకోదండరామ స్వామి ఆలయం[మార్చు]

శ్రీ కోదండరామస్వామి ఆలయం,బీచుపల్లి

2004లో భక్తుల విరాళాలను పోగుచేసి, 50 లక్షల రూపాయలతో కృష్ణానదికి అతి సమీపాన శ్రీకోదండరామస్వామి ఆలయాన్ని నిర్మించారు. చినజీయర్ స్వామి చే పూజలు చేయించి, విగ్రహప్రతిష్ఠ చేయించారు., సుందరంగా నిర్మించబడిన ఈ ఆలయ గోపురంపై దశావతారాల శిల్పాలు ఆకట్టుకుంటాయి. విశాలమైన ఆవరణ కలిగి ఉండటం వలన, వివాహా వేడుకలకు అనుకూలంగా ఉండటం వలన, ఈ ఆలయంలో వేసవి కాలంలో పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి.

శివాలయం[మార్చు]

కృష్ణానది ఒడ్డున ఒక చిన్న గుడి రూపంలో ఉన్నదే శివాలయం. నదిలో స్నానాలు ఆచరించిన భక్తులు మొదటగా దర్శించుకొనేది ఇకడి పరమేశ్వరుడినే. ఈ పరమేశ్వరుడిని హనుమద్దాసులు వారు ప్రతిష్ఠించారని అంటారు.

కలిమి చెట్టు పుట్ట[మార్చు]

కణ్వమహార్షి తపోవనం

ఆంజనేయస్వామి ఆలయ సమీపాన ఒక పుట్టపై కలిమిచెట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక మహర్షి జీవించాడని, ఇక్కడే సమాధి అయ్యాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ప్రాంతం చుట్టూ ఇప్పడు ఒక వేదికను నిర్మించారు. క్షేత్రమహ్మాత్యానికీ వేదిక కీలక స్థానమని భావిస్తారు. ఇక్కడ ఉన్న కలిమి చెట్టుకు ఏ కాలంలో నైనా, ఏ ఋతువులోనైనా ఒక పువ్వో, కాయో, పండో కనిపించడం జరుగుతుందట. స్వామి వారి ఉత్సవాల సందర్భంగా రథోత్సవం రోజు రథం గుడి దగ్గర నుండి ఈ కడీమి చెట్టు వేదిక దాకా రావడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది.

నిజాం కోటకొండ[మార్చు]

బీచుపల్లి క్షేత్రం దగ్గర కృష్ణా నదిలో ఒక ద్వీపపు కొండ ఉంది. ఈ కొండపై ఒక బలిష్టమైన దుర్గాన్ని 18 వ శతాబ్దిలో నిర్మించారు. దీనిని నిజాం కొండ అని అంటారు. ఈ కోటను సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ కోటలోపల ఆంజనేయస్వామి ఆలయం, మజీదు, బావిని ఏర్పాటుచేశారు. నిజాం నవాబులు తమ సైనిక అవసరాల నిమిత్తం ఈ కోటను నిర్మించారని అంటారు. ఈ కోటను గద్వాల సంస్థానాధీశులు నిర్మించారన్న మరో వాదన కూడా ఉంది.

సినిమా చిత్రీకరణలు[మార్చు]

కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడుగా వచ్చిన కొండవీటి రాజా సినిమా చిత్రీకరణ ఇక్కడ జరిగింది. ఈ సినిమాకు ఈ ప్రాంతానికి చెందిన బుర్రి వెంకట్రామిరెడ్డి నిర్మాత కావడం విశేషం. సినిమా ప్రారంభమే ఇక్కడ మొదలవుతుంది. బీచుపల్లి వారథి, బీచుపల్లి ఆలయం, పరిసరాలు, నిజాం కొండపై చిత్రీకరణ జరిగింది.

రాజకీయాలు[మార్చు]

2013, జూలై 23న జరిగిన గ్రామపంచాయతి ఎన్నికలలో గ్రామ సర్పంచిగా మరియమ్మ ఎన్నికయింది.[7]

వనరులు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 244, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
  2. "జోగులాంబ గద్వాల జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. నా దక్షిణ భారత యాత్రావిశేషాలు, పాటిబండ్ల వెంకటపతిరాయలు, 2005 ముద్రణ, పేజీ 246
  4. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 34
  5. సాక్షి దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా ఎడిషన్, తేది 23-04-2009
  6. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లాఏడిషన్, పేజీ5, తేది 27.09.2008
  7. నమస్తే తెలంగాణ దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 24-07-2013

వెలుపలి లింకులు[మార్చు]