Jump to content

బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం

వికీపీడియా నుండి
బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం
బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం
మతం
అనుబంధంహిందూ
జిల్లాజోగులాంబ జిల్లా
దైవంఆంజనేయస్వామి
ప్రదేశం
ప్రదేశంబీచుపల్లి, ఇటిక్యాల మండలం
రాష్ట్రంతెలంగాణ
దేశంభారతదేశం
వాస్తుశాస్త్రం.
శైలిదేవాలయ

బీచుపల్లి ఆంజనేయస్వామి దేవాలయం అనేది తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా, ఇటిక్యాల మండలం, బీచుపల్లి గ్రామంలోని దేవాలయం. జురాలా ప్రాజెక్ట్ తరువాత కృష్ణానది ఒడ్డున 30 కిలోమీటర్ల దిగువన ఉంది.[1]

చరిత్ర

[మార్చు]

జోగలాంబ జిల్లాలో 7వ నెంబరు జాతీయ రహదారి పైన కృష్ణా నది తీరాన ఈ దేవాలయం వెలిసింది.[2] ఇక్కడి స్వామివారిని వ్యాసరాయలు ప్రతిష్ఠించారని ప్రతీతి. శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించిన పిమ్మట సా.శ.1521 సంవత్సరమున అతనికి కుహూ యోగం ప్రారంభమయింది. అపుడు మహారాజు వ్యాసరాయలను ఆశ్రయించగా, ఆయన సా.శ.1521 నుండి సా.శ.1524 వరకు మూడేండ్లకాలం తానే శ్రీకృష్ణ ముద్రతో రాజ్య పాలనము చేసి అనంతరమతని సామ్రాజ్యం అతనికి దానం చేశాడు. అపుడు రాయలు వ్యాసరాయలని సత్కరించి మదనపల్లి జిల్లా నంతటిని అతనికి దానంగా ఇచ్చాడట. అప్పటినుండి ఆ ప్రదేశానికి వ్యాస సముద్రం అని పేరు వచ్చింది. దానం గ్రహించిన తరువాత ఆ దోష పరిహారార్థం 378 ప్రాణ దేవతల ప్రతిష్ఠలు చేశాడట. ఇక్కడి ప్రతిష్ఠ వాటిలో ఒకటిగా భావిస్తారు. వ్యాస రాయల ప్రతిష్ఠలో హనుమంతునికి ఇరువైపులా శంఖ, చక్రాలుంటాయి. ఆయన ఇక్కడ హనుమంతున్ని ప్రతిష్ఠించి,[3] మొదట ఎవరు స్వామి దర్శనానికి వస్తే వారినే పూజారిగా నియమించమని సెలవిచ్చినాడట. అప్పుడక్కడ స్వామి దర్శనానికి మొదట బీసన్న అనే బోయపిల్లవాడు స్వామి దర్శనానికి రాగా, అప్పటి నుండి బీచుపల్లిలో బోయవారిదే ప్రథమ పూజ ఆనవాయితీగా వస్తోంది.

కొన్ని సంవత్సరాల క్రితం, గద్వాల రాజులు గర్భగుడిలో దక్షిణం వైపుగా విశాలమైన మండపం నిర్మించారు. హనుమాన్ విగ్రహం తూర్పు ముఖంగా ఉంది. సా.శ.1961 వ సంవత్సరంలో అష్టగ్రహకూటమి సంభవించినప్పుడు, గద్వాలకు చెందిన కె.పి.వర్ధన్ ఇక్కడ గొప్ప శ్రీ రామకోటి యాగం చేసాడు. దానితో ఈ క్షేత్రం గురించి దేశవ్యాప్తంగా తెలియవచ్చింది.

కలిమి చెట్టు పుట్ట

[మార్చు]
కణ్వమహార్షి తపోవనం

ఆంజనేయస్వామి దేవాలయ సమీపాన ఒక పుట్టపై కలిమిచెట్టు ఉంది. ఈ ప్రాంతంలో ఒకప్పుడు ఒక మహర్షి జీవించాడని, ఇక్కడే సమాధి అయ్యాడని ఇక్కడి ప్రజల విశ్వాసం. ఈ ప్రాంతం చుట్టూ ఇప్పడు ఒక వేదికను నిర్మించారు. క్షేత్రమహ్మాత్యానికీ వేదిక కీలక స్థానమని భావిస్తారు. ఇక్కడ ఉన్న కలిమి చెట్టుకు ఏ కాలంలో నైనా, ఏ ఋతువులోనైనా ఒక పువ్వో, కాయో, పండో కనిపించడం జరుగుతుందట. స్వామి వారి ఉత్సవాల సందర్భంగా రథోత్సవం రోజు రథం గుడి దగ్గర నుండి ఈ కడీమి చెట్టు వేదిక దాకా రావడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది.

బ్రహ్మోత్సవాలు

[మార్చు]

ప్రతీ సంవత్సరం మే నెలలో ఐదురోజులపాటు దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయి. తొలిరోజు ఉదయం దేవాలయంలో పంచామృతాభిషేకం, అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహ ణం, బలిహరణం, రాత్రికి తెప్పోత్సవం... రెండోరోజు ఉదయం పంచామృతాభిషేకం, స్వామివారికి ఉపనయనం, రాత్రికి ప్రభోత్సవం... మూడోరోజు ఉదయం పంచామృతాభిషేకం, వ్యాసపూజ, సీతా రామ కల్యాణం, బలిహరణం, రథాంగ హోమం, రాత్రికి స్వామి వారి రథోత్సవం... నాలుగవరోజు పంచామృతాభిషేకం, చౌకీసేవ, బలిహరణం, రాత్రికి ప్రభోత్సవం... ఐదవరోజు అమృతస్నాపనం, పంచామృతాభి షేకం, పల్లకీసేవ కార్యక్రమాలు, అవభృతస్నానం తదితర పూజ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.[4]

మూలాలు

[మార్చు]
  1. "Beechupally Hanuman Temple | District JOGULAMBA GADWAL ,Government of Telangana | India". Archived from the original on 2021-05-08. Retrieved 2023-10-10.
  2. "Welcome to Official Website of Telangana Tourism Corporation". tourism.telangana.gov.in. Archived from the original on 2023-10-10. Retrieved 2023-10-10.
  3. "A spiritual abode on the banks of Krishna". www.deccanchronicle.com. 2018-06-23. Archived from the original on 2023-10-10. Retrieved 2023-10-10.
  4. ABN (2023-05-02). "ఆపద మొక్కుల వాడు బీచుపల్లి ఆంజనేయుడు". Andhrajyothy Telugu News. Archived from the original on 2023-10-10. Retrieved 2023-10-10.