Jump to content

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

వికీపీడియా నుండి
(జూరాలా ప్రాజెక్టు నుండి దారిమార్పు చెందింది)
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు
జూరాల ప్రాజెక్ట్
అధికార నామంజూరాల ప్రాజెక్టు
దేశంభారత దేశము
ప్రదేశంకురవపూర్, మహబూబ్ నగర్, తెలంగాణ
నిర్మాణం ప్రారంభం1981
ప్రారంభ తేదీ1996
నిర్మాణ వ్యయంరూ.550 కోట్లు

జూరాలా ప్రాజెక్టు qlodr తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాలా జిల్లాలోని ప్రాజెక్టులలో ఒకటి. కృష్ణా నది తెలంగాణలో ప్రవేశించిన తరువాత ఈ నదిపై ఉన్న మొదటి ప్రాజెక్టు ఇదే. ఇది బహుళార్థక సాధక ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు యొక్క నీటి నిల్వ సామర్ధ్యం 9.68టీఎంసీ లు.[1]

ప్రాజెక్టు ఉనికి

[మార్చు]

గద్వాలకు 16 కిలో మీటర్ల దూరంలో ఉన్న ధరూర్ మండలంలోని రేవులపల్లి గ్రామం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆత్మకూరు నుంచి గద్వాల వెళ్ళు రోడ్డు మార్గములో ఆత్మకూరు పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాజెక్టు ఉంది.[2] ఆత్మకూరు-గద్వాల రహదారి ఈ ప్రాజెక్టు పైనుంచి వెళుతుంది.

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు

ప్రాజెక్టు నిర్మాణ క్రమం

[మార్చు]

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి సుమారు 15 సం.లు పట్టింది. 1981 జనవరి 6 వ తేదిన అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టి. అంజయ్య శంకుస్థాపన చేశారు[3]. 1996 ఆగస్టు 5 వ తేదిన అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మొదటి దశ కింద నీటిని విడుదల చేసి, జాతికి అంకితం చేశారు.

ప్రాజెక్టు స్వరూపం

[మార్చు]

ఈ ప్రాజెక్టు రాతి కట్టడంతో నిర్మించబడింది. ఈ రాతి కట్టడం (మెసనరీ డ్యాం) పొడువు సుమారు ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది. ఎత్తు 27. 80 మీటర్లు ఉంటుంది. ఈ ప్రాజెక్టుకు 64 రేడియల్ క్రస్ట్ గేట్లు, ఎడమవైపు 4 నాన్ ఓవర్ ఫ్లో బ్లాకులు, కుడివైపు 10 నాన్ ఓవర్ ఫ్లో బ్లాకులు, 6 జలవిద్యుత్ ఉత్పాదన కొరకు నిర్మించిన బ్లాకులు వెరసి మొత్తం 84 బ్లాకులు ఉన్నాయి. ఇన్ని బ్లాకులున్న ప్రాజెక్టు దేశంలో ఇదొక్కటే. ఎడమ వైపు 1. 74 కిలో మీటర్లు, కుడివైపు 1.84 కిలో మీటర్లు దూరం మట్టికట్టలు ( ఎర్త్ డ్యాం) నిర్మించబడి ఉన్నాయి.

ప్రాజెక్టు వ్యయం

[మార్చు]

ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా వ్యయం రూ.76.40 కోట్లు కాగా, 7-12-2003 నాటికి రూ. 204.75 కోట్లకు చేరుకుంది. 2007 నాటికి రూ. 840 కోట్లు ఖర్చు కాగా, ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి రూ. 1224 కోట్లు ఖర్చు చేయవలసి ఉందని అధికారుల అంచనా.

ప్రాజెక్టు సాగునీటి సామర్థ్యం

[మార్చు]

ఈ ప్రాజెక్టు సుమారు లక్ష ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది. రెండు ప్రధాన కాలువల ద్వారా నీటి పారుదల సాగుతుంది.

  • కుడి కాలువ : ప్రాజెక్టు కుడి కాల్వను సోమనాద్రి కాలువగా పిలుస్తారు. ఈ కాలువ సుమారు 51 కిలో మీటర్లు ప్రవహించి గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలోని 37,700 ఎకరాలకు సాగునీరును అందిస్తుంది.
  • ఎడమ కాలువ  : ప్రాజెక్టు ఎడమ కాల్వను ఎన్టీఆర్ కాల్వగా పిలుస్తారు. ఈ కాలువ ద్వారా ఆత్మకూరు, వనపర్తి , కొల్లాపూర్ నియోజకవర్గాలలోని 64,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది.
జూరాల జల విద్యుత్ కేంద్రం

ముంపు నష్టం

[మార్చు]

ఈ ప్రాజెక్టు నిర్మాణం వలన మహబూబ్ నగర్ జిల్లాలో సుమారు 11,504 ఎకరాలు, కర్ణాటక రాష్ట్రంలో 524 ఎకరాలు, మరో 18 గ్రామాలు ముంపునకు గురైనవి.

పర్యాటక ప్రాంతం

[మార్చు]

ఇది పర్యాటక స్థలంగా కూడా విలసిల్లుతోంది. జూన్ నుండి ఆగస్టు వరకు వరదల కారణంగా ప్రాజెక్టు నీటితో కళకళలాడుతుంది. ఈ సమయంలో అధిక సంఖ్యలో పర్యాటకులు ప్రాజెక్టును సందర్శిస్తుంటారు. అలాగే ఆదివారాలు, ఇతర సెలవు దినాలలో కూడా సందర్శకులు వస్తుంటారు. ప్రాజెక్టుకు సమీపంలో జింకల పార్కు ఉండేది, సరైన సంరక్షణ లేక కనుమరుగైంది. ఈ ప్రాజెక్టుకు కొన్ని కిలో మీటర్ల దూరంలో చంద్రగఢ్ కోట, పెద్ద చింతరేవుల ఆంజనేయ స్వామి దేవాలయం, పాగుంట వేంకటేశ్వర స్వామి ఆలయం వంటి దర్శనీయ స్థలాలు కూడా ఉన్నాయి.

జూరాల జలవిద్యుత్తు కేంద్రం

[మార్చు]

ఇక్కడ 240 మెగావాట్ల జలవిద్యుత్ ఉత్పాదన కేంద్రం నిర్మించి ఇటీవలే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ముందే, అప్పటి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ప్రభుత్వాలు విద్యుత్ గురించి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఇక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్తులో విధిగా సగభాగం కర్ణాటకకు ఇవ్వాలని 1976 ఆగస్టు 4 వ తేదిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించారు[4]. విద్యుత్ ఉత్పత్తి కయ్యే వ్యయంలో సగ భాగం కర్ణాటక భరించాల్సి ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (15 June 2021). "జూరాలకు వరద తగ్గుముఖం". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
  2. ఈనాడు దినపత్రిక, మహబూబ్‌నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 9, తేది జూన్ 11, 2008
  3. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 27
  4. ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 28