పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ is located in Andhra Pradesh
పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్
ఆంధ్ర ప్రదేశ్ లో స్థానం
అధికార నామంపోతిరెడ్డిపాడు రిజర్వాయర్
దేశంభారత దేశము
ప్రదేశంపోతిరెడ్డిపాడు
ఆవశ్యకతరాయలసీమ ప్రాంతాలకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థ

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ (Pothireddypadu Head Regulator) ప్రాజెక్టు అనగా శ్రీశైలం ప్రాజెక్టు (నీలం సంజీవరెడ్డిసాగర్‌ ప్రాజెక్టు) నుండి రాయలసీమ ప్రాంతాలకు సరఫరా చేసే నీటిని జలాశయం నుండి కాలువలోకి తీసుకునే నీటి నియంత్రణా వ్యవస్థ. [1][2][3] పోతిరెడ్డిపాడు అనే గ్రామం వద్ద దీనిని నిర్మించారు కనుక దీనికి ఆ పేరు వచ్చింది. నీటి సరఫరాను నియంత్రించే వీలు కలిగిన నాలుగు తూములు ఇక్కడ ఉన్నాయి.

స్థలం[మార్చు]

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ శిలాఫలకం

నంద్యాల జిల్లాలో, జూపాడు బంగ్లా మండలంలో, నందికొట్కూరు, ఆత్మకూరు పట్టణాలకు మధ్య పోతిరెడ్డిపాడు ఉంది. కర్నూలు- గుంటూరు రహదారి నుండి 4 కి.మీ. లోపలికి ఈ గ్రామం ఉంది. శ్రీశైలం జలాశయపు ఒడ్డున ఉన్న ఈ గ్రామం వద్ద కాలువలోకి నీటిని మళ్ళించే హెడ్‌రెగ్యులేటర్ ను స్థాపించారు.

విశేషాలు[మార్చు]

వివరాలు

శ్రీశైలం జలాశయం నుండి 11500 క్యూసెక్కుల నీటిని కాలువలోకి పారించగలిగే సామర్థ్యం గల నాలుగు తూములను ఇందులో ఏర్పాటు చేసారు. శ్రీశైలం జలాశయం వద్ద కృష్ణా నదిలో ప్రవహించే వరదనీటిని, చెన్నైకి ఇవ్వవలసిన 15 టి.ఎం.సి. తాగునీటిని జలాశయం నుండి పారించే పథకమిది. రెగ్యులేటర్‌ ద్వారా ఈ నీరు శ్రీశైలం కుడి ప్రధాన కాలువలోకి వెళ్తుంది. ఈ కాలువ 16.4 కి.మీ.ప్రయాణం చేసి, బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు చేరి ముగుస్తుంది. ఈ బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ మూడు రెగ్యులేటర్ల సమూహం. శ్రీశైలం నీళ్ళను మూడు మార్గాల లోకి ఈ క్రాస్‌ రెగ్యులేటర్‌ మళ్ళిస్తుంది. అవి:

 1. కడప, కర్నూలు జిల్లాలకు నీళ్ళందించే శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ
 2. తెలుగుగంగ కాలువ
 3. గాలేరు-నగరి లేదా అధిక వరద నీటి మళ్ళింపు కాలువ

వివాదం[మార్చు]

ఈ హెడ్‌రెగ్యులేటర్ సామర్థాన్ని పెంచే ప్రతిపాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జి.ఓ.ను జారీ చేసింది. 2005 సెప్టెంబర్ 13 న జారీ చేసిన ఈ జి.ఓ.170 ప్రకారం ఈ హెడ్‌రెగ్యులేటర్ లోని నాలుగు తూములతో పాటు మరో 7 తూములను ఏర్పాటు చేసి, దాని సామర్థ్యాన్ని ప్రస్తుత 11500 క్యూసెక్కుల నుండి, 40,000 క్యూసెక్కులకు పెంచుతారు. తెలుగుగంగ, గాలేరు-నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువలకు అవసరమైన 102 టీఎంసీల నీటిని, వరద వచ్చినపుడు 30 రోజుల్లో తరలించడానికి వీలుగా పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని పెంచదలచింది. దీనికి ప్రభుత్వం చూపిన కారణం ఇలా ఉంది.

ప్రభుత్వ వాదన:

 • గత ఇరవై ఏళ్లుగా నిర్మాణంలో ఉండి పూర్తి కానున్న ప్రాజెక్టులకు నీళ్లివాలంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచక తప్పదు. శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించేది వరద నీరు మాత్రమే. చెన్నైకు తాగునీటి సరఫరాతో సహా తెలుగుగంగకు 45 టీఎంసీలు, గాలేరు-నగరికి 38 టీఎంసీలు, శ్రీశైలం కుడిగట్టు కాలువకు 19 టీఎంసీలు - మొత్తం 102 టీఎంసీలు అవసరం. ఈ ప్రాజెక్టులను డిజైన్ చేసినపుడు 45 రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అంచనా వేశారు. కానీ గత పదేళ్లుగా 30 రోజులకు మించి వరద ప్రవాహం లేదు. ఈ పరిస్థితిలో 30 రోజుల్లో 102 టీఎంసీల నీటిని మళ్లించాలంటే రోజుకు 40 వేల క్యూసెక్కుల సామర్థ్యం అవసరం. శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉన్నప్పుడు మాత్రమే 40 వేల క్యూసెక్కులు వెళ్తాయి. కనీస నీటిమట్టం 854 అడుగులు ఉన్నప్పుడు మూడువేల క్యూసెక్కులు మాత్రమే వెళ్తాయి.
  • ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నీటిపారుదల శాఖ సలహాదారు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద 9 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు మూడు కాలువల సామర్థ్యం 11,700 క్యూసెక్కులు. కానీ రెండున్నర లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరందించే ఎస్ఆర్ఎస్‌పీ వరద కాలువ సామర్థ్యం మాత్రం 22,000 క్యూసెక్కులు. కొద్ది రోజులు మాత్రమే వచ్చే వరద నీటిని ఉపయోగించుకొనేందుకే కాలువ సామర్థ్యం ఎక్కువగా పెట్టాం. పోతిరెడ్డుపాడు హెడ్‌రెగ్యులేటర్ పరిస్థితి కూడా ఇంతే.

తెరాస వాదన:

 • నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వచ్చే నీటిని శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా తరలించడం సాగర్‌లో విద్యుదుత్పత్తి పైనా, ఆయకట్టుకు సాగునీటి సరఫరాపైనా ప్రభావం చూపుతుంది. హక్కు లేని ప్రాంతాలకు నీటిని తరలించడం తప్పు. బలవంతంగా గేట్లు ఎత్తి శ్రీశైలం నుంచి సీమకు నీటిని తరలించిన సంఘటనలు గతంలో ఉన్నాయి. ఇప్పుడు సామర్థ్యం పెంచితే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది.
  • తెరాసకు చెందిన జలవనరుల నిపుణుడు విద్యాసాగర్‌రావు: "వరద నీటి వినియోగం తప్పు కాదు. భవిష్యత్తులో, వరద లేనప్పుడు కూడా మొత్తం నీటిని తీసుకెళ్తారన్నదే మా ఆందోళన."

వివాదాలపై వార్తలు[మార్చు]

 • 2005 నవంబర్ 25: కాంగ్రెసు శాసన సభ్యులు, పి.జనార్ధనరెడ్డి - "పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని మహా అయితే 40వేల క్యూసెక్కుల వరకూ పెంచొచ్చు. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాల్వల నీటివిడుదల సామర్థ్యం కంటే ఇది చాలా ఎక్కువ. వరదనీటిని తీసుకుంటే ఫర్వాలేదు. కానీ రాయలసీమలోని 7.25లక్షల ఎకరాలకు నీరివ్వాలన్న ఉద్దేశ్యాన్ని జీవో-170లోనే చెప్పారు. నీటిపారుదలకు నికరజలాలు (ఎస్యూర్డ్‌ ఇరిగేషన్‌ ఫెసిలిటీ) ఇస్తున్నట్టు దానిలో స్పష్టంగా ఉంది. ఒక్కసారి నీరిస్తే.. ఆ తర్వాత ఏడాది నుంచీ అక్కడివాళ్లు డిమాండు చేస్తారు. రబీ సీజన్లో వరి వద్దంటే రైతులు విన్నారా? ఒకసారి అలవాటు చేస్తే ఇక అంతే. రాజోలిబండ మళ్లింపు పథకం విషయంలో కర్నూలు, మహబూబ్‌నగర్‌ జిల్లాల రైతులు కొట్లాడుకోవటం మర్చిపోవద్దు. పోతిరెడ్డిపాడు ఫలితంగా సాగర్‌, కృష్ణాడెల్టా ఆయకట్టుకు నీరు తగ్గిపోతుంది. శ్రీశైలం, సాగర్, ప్రకాశం బారేజిలలో పూర్తిస్థాయిలో నీళ్లుంటేనే... పోతిరెడ్డిపాడు నుంచి నీటివిడుదల జరగాలి. అప్పుడే వరదనీరిచ్చినట్లుగా ఉంటుంది. పోతిరెడ్డిపాడుతో జంటనగరాలకు కృష్ణానీళ్లు తేవటం సాధ్యం కాదు. సాగర్‌, కృష్ణాడెల్టా ఆయకట్టులోనూ ఇబ్బందే. ఈ ప్రాంతాల్లోని కాంగ్రెస్‌ శాసన సభ్యులులతో ముందుగా ముఖ్యమంత్రి చర్చించాలి. ప్రజలకే కాదు, శాసన సభ్యులుగా నాక్కూడా సందేహ నివృత్తి జరగాలి. కృష్ణాజలాల్లో ఆంధ్రప్రదేశ్‌ వాటా 800 టీఎంసీల్లో ఏప్రాంతానికి ఎంతన్న విషయాన్నీ తేల్చాలి".


ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-05-09. Retrieved 2014-11-02.
 2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-01. Retrieved 2014-11-02.
 3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2013-01-25. Retrieved 2014-11-02.

ఇతర లింకులు[మార్చు]