మీజాన్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మీజాన్
ఆగష్టు 12, 1947 నాడు మీజాన్ పత్రిక మొదటి పేజీలో నిజాం హైదరాబాదు, భారతదేశంలోనూ, పాకిస్తాన్లోనూ చేరకుండా స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని ప్రకటించిన సందర్భంగా
ఆగష్టు 12, 1947 నాడు మీజాన్ పత్రిక మొదటి పేజీలో నిజాం హైదరాబాదు, భారతదేశంలోనూ, పాకిస్తాన్లోనూ చేరకుండా స్వతంత్ర రాజ్యంగా కొనసాగుతుందని ప్రకటించిన సందర్భంగా
రకముదిన పత్రిక
ఫార్మాటుక్రౌను సైజు

యాజమాన్యం:గులాం మహమ్మద్ కలకత్తావాలా
ప్రచురణకర్త:గులాం మహమ్మద్ కలకత్తావాలా
సంపాదకులు:అడవి బాపిరాజు (తెలుగు)
మిర్జా అబీద్ అలీ బేగ్ (ఆంగ్లం)
హబీబుల్లా ఔజ్ (ఉర్దూ)
స్థాపన1944
హైదరాబాదు
వెల1 అణా
ప్రధాన కేంద్రముహైదరాబాదు

మీజాన్ 1944 నుండి 1948 వరకు హైదరాబాదు నుండి వెలువడిన దినపత్రిక. బొంబాయికి చెందిన వ్యాపారవేత్త గులాం మహమ్మద్ కలకత్తావాలా ఈ పత్రికకు యజమాని. మధ్య మధ్యలో కొన్ని అంతరాయాలతో ఈ 1944 నుండి 1948 వరకు నైజాం ప్రాంతంలో వెలువడినది. ఏకకాలంలో ఆంగ్లం, తెలుగు మరియు ఉర్దూ భాషలలో వెలువడిన ఏకైక పత్రిక మీజాన్[1] మూడు సంచికలకు యాజమాన్యం ఒకటే అయినా మూడూ వేరు వేరు పంథాలలో నడిచేవి. ఆంగ్ల మీజాన్ ఫ్యూడల్ వ్యవస్థకు అనుకూలితమైన పత్రిక. ఇది నిజాం ప్రభుత్వ చర్యలకు మద్దతు పలికింది. ఉర్దూ సంచిక రజాకార్లకు మద్దతునిచ్చింది. తెలుగు సంచిక నిజాం వ్యతిరేక శక్తులకు అనుకూలమైన వార్తలను ప్రచురించేది.[2] మీజాన్ ఆంగ్ల సంచికకు మిర్జా అబీద్ అలీ బేగ్ సంపాదకుడు కాగా ఉర్దూ సంచికకు హబీబుల్లా ఔజ్ సంపాదకుడు. అడవి బాపిరాజు మీజాన్ తెలుగు సంచికకు సంపాదకునిగా పనిచేశాడు.

పత్రికా యాజమాన్యం యొక్క ప్రధానోద్దేశ్యం మీజాన్‌ ద్వారా నిజాం కీర్తి ప్రతిష్ఠల్ని ఇనుమడిరప జేస్తూ, ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రచారం కల్పించడం. అయితే తెలుగు సంచిక సంపాదకుడు అడివి బాపిరాజు ప్రజల పక్షాన నిలబడి కమ్యూనిస్టులు జరిపిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి, కాంగ్రెస్‌ వారు నిర్వహించిన ఆంధ్రమహాసభలకు, భారతదేశంలో హైదరాబాదు విలీనోద్యమాలకు మద్ధతుగా వార్తలు ప్రకటించేవాడు.[3]

మీజాన్ పదవ్యుత్పత్తి[మార్చు]

మీజాన్ అనే పదము అరబ్బీభాషా పదము. దీనర్థం "త్రాసు" లేదా "తరాజు". మీజాన్ అనే పదము న్యాయము మరియు న్యాయసూత్రాన్ని సూచిస్తుంది. సమాజంలో న్యాయాన్ని సమతౌల్యాన్ని సాధించుటకు కూడా ఈ పదాన్ని వాడుతారు.

చారిత్రిక నేపథ్యం[మార్చు]

మీజాన్ ఉర్దూ దినపత్రిక 1944 మార్చి 14 - లభ్యమౌతున్న తొట్టతొలి ప్రచురణలలో ఒకటి

1940వ దశకంలో నిజాం పాలకుడు ఉస్మాన్‌ అలీఖాన్‌ మరియు ప్రభుత్వాధికారులు, ప్రజలపై తమ పట్టు సడలుతున్నట్లు భావించి, వారికి తాము చేపడుతున్న అభివృద్ధి కార్యకలాపాలను వారి భాషలోనే తెలిపితే బాగుటుందన్న ఆలోచనతో మీజాన్‌ పత్రిక స్థాపించబడింది.[3] నిజాం నవాబు యొక్క స్నేహితుని అల్లుడు, బొంబాయికి చెందిన వ్యాపారవేత్త గులాం మహమ్మద్ కలకత్తావాలా ఈ పత్రికకు యజమాని. ఐనా మీజాన్ పత్రికలో వచ్చే వార్తలపైన, పత్రిక దృక్పథంపైన పైనుంచి ఆయన అదుపు ఉండేది కాదు. ప్రారంభంలో మీజాన్ పత్రిక ఆంగ్లం మరియు ఉర్దూలలో ప్రచురించబడింది. అయితే పత్రికను తెలుగులో కూడా ప్రచురించాలని తలచి కలకత్తావాలా ఒక మంచి సంపాదకునికై వెదకటం ప్రారంభించాడు.[4]

మొదట మీజాన్‌ తెలుగు పత్రిక సంపాదకుడిగా కాకినాడకు చెందిన హైదరాబాద్‌ ప్రభుత్వోద్యోగి, సాహితీవేత్త ఖాసింఖాన్‌ను ఎంపిక చేద్దామని అనుకున్నారు. అయితే ముస్లింల పత్రిక అని ముద్రపడితే తెలుగు వారు చదవబోరు అనే ఆలోచనతో రాయప్రోలు, కురుగంటి సీతారామ భట్టాచార్య, ఖాసింఖాన్‌ల సలహాతో అడివి బాపిరాజుని మీజాన్‌ పత్రిక సంపాదకుడిగా ఎంపిక చేశారు. అప్పటికే బాపిరాజు కృష్ణా పత్రిక దర్బార్‌లో రెగ్యులర్‌గా పాల్గొనడం, ముట్నూరి కృష్ణారావు దగ్గర జర్నలిజంలో ఓనమాలు దిద్దుకోవడం ఆయన ఎంపికకు దారి తీసింది. పత్రిక సంపాదకునిగా స్థానికున్ని నియమించినట్లయితే అతను నిజాంకు వ్యతిరేకంగా వార్తలు రాసి రహస్యంగా ఆంధ్రమహాసభకు మధ్దతిస్తాడనే ఆలోచనతో తెలంగాణ వాళ్ళకు అవకాశమివ్వలేదు. ఎందుకంటే అప్పటికి ప్రచారంలో ఉన్న గోలకొండ పత్రిక పూర్తిగా నిజాం వ్యతిరేక వార్తలతో ప్రభుత్వానికి తలనొప్పిగా ఉండేది. ఆ ఉద్దేశంతోనే స్థానికేతరుడైన బాపిరాజును ఎంపిక చేశారు.[3] బాపిరాజు సంపాదకత్వంలో మీజాన్ పత్రిక యొక్క గౌరవము మరియు సర్క్యులేషను ఇనుమడించాయి. బాపిరాజు, ఇతర సంపాదకవర్గం సహాయంతో పత్రికను అభ్యుదయ భావాలకు ఆలవాలంగా మలిచారు. ఈయన రాంభట్ల కృష్ణమూర్తి, బొమ్మకంటి సుబ్బారావు, తిరుమల రామచంద్ర, పి.సి.కామరాజు మరియు శ్రీనివాస చక్రవర్తి వంటి సాహితీవేత్తలను ఉపసంపాదకులుగా నియమించి, రాజకీయ పత్రిక అయిన మీజాన్ కు సాహితీ గుబాళింపులు ఆపాదించాడు.[4]

పత్రిక[మార్చు]

తెలుగు మీజాన్ క్రౌను సైజులో నాలుగు పేజీలుగా వచ్చేది. తొలి, ఆఖరు పేజీలలో వార్తలు ప్రచురించబడేవి. రెండో పేజీలో ధూపదీపాలు అనే శీర్షికతో పాటు సంపాదకీయాన్ని బాపిరాజు వ్రాసేవాడు. దీనితో పాటు తిరుమల రామచంద్ర వ్రాసే నుడి నానుడి, శ్రీనివాస చక్రవర్తి వ్రాసే నర్తనశాల, బిసి కామరాజు వ్రాసే కలంపోటు, రాంభట్ల కృష్ణమూర్తి వ్రాసే మిర్చిమసాలా, బొమ్మకంటి సుబ్బారావు వ్రాసే టైంబాంబులు అనే శీర్షికలు ప్రచురితమయ్యేవి. మూడో పేజీలో బాపిరాజు నవల డైలీ సీరియల్ అచ్చయ్యేది. దినపత్రికలో రోజూ కొద్దికొద్దిగా నవలను ప్రచురించే సంప్రదాయాన్ని మొదలు పెట్టింది మీజాన్.[5]

మీజాన్ పత్రికను బాపిరాజు తెలుగు సాహిత్యసేవకై చక్కగా వినియోగించుకున్నాడు. తన సొంత నవలలైన హిమబిందు, గోన గన్నారెడ్డి, తుఫాను, కోనంగి మరియు అడవి శాంతిశ్రీ లను ధారావాహికలుగా రోజూ అచ్చువేయటంతో పాటు అనే కథానికలు, కథలు మరియు గేయాలను పత్రికలో ప్రచురించాడు. పత్రికకు సంపాదకత్వం వహించడమే కాక పాఠకులను ఆకట్టుకునేందుకు ధూపధీపాలు మరియు సాహిత్వ కలాపం వంటి శీర్షికలలో సాహిత్వ వ్యాసాలు ప్రచురించేవాడు.[4]

బాపిరాజు మీజాన్ పత్రికలో సినిమా వార్తలకై ఒక ప్రత్యేక శీర్షికను కేటాయించి దీని బాధ్యతను బొమ్మకంటి సుబ్బారావుకు అప్పగించాడు. తెలంగాణా పత్రికలలో ప్రత్యేకంగా సినిమాలకై ఒక శీర్షికను ప్రారంభించడం ఇదే ప్రథమం.[4]

ప్రజా ఉద్యమాల్లో భాగస్వామ్యం[మార్చు]

పత్రిక నిర్వాహణలో స్వాతంత్ర్యాన్ని ఉపయోగించుకుని ఆంధ్రమహాసభ ప్రారంభించిన పలు ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఉద్యమాలకు చేయూత నందించారు. 1940ల్లో తెలంగాణ గ్రామాల్లో దేశ్ ముఖ్ లు, పటేళ్ళు, పట్వారీలు, భూస్వాములు సామాన్య ప్రజానీకంపై చేస్తున్న దాడులు, అణచివేత చర్యలు, వాటిని ప్రతిఘటిస్తూ ప్రజలు చేసే చిన్నా పెద్దా పోరాటాలు, ఖండన, నిరసన ప్రకటనలు నిర్భయంగా పత్రికలో ప్రచురించారు. మీజాన్ పత్రికను చదువుతూంటే అది పార్టీ పత్రికగా పనిచేసిందా? అనిపిస్తుంది అంటూ ప్రజాసాహితిలోని అడవి బాపిరాజు మరోచూపు వ్యాసంలో పేర్కొన్నారు.
ఆంధ్ర మహాసభ వారు 1946 జూన్ 4 తేదీన దొడ్డి కొమరయ్య మరణించిన తరువాత జూలై 25వ తేదీన కడివెండి దినంగా పాటించి, సభలు, సమావేశాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పిలుపుకు మీజాన్ పత్రిక స్పందించి జూలై 25వ తేదీ సంచికను కొమరయ్య ప్రత్యేక సంచికగా వెలువరించింది. ఆ సంచికలో కొమరయ్య మృతదేహం ఫోటో ప్రముఖంగా వేసి, దాని కింద అతనిపై రాసిన పాటను ప్రచురించారు.
ఆంధ్రమహాసభకు చెందిన పలువురు కార్యకర్తలు ఉద్యమాన్ని గురించిన కథలు, రిపోర్టులు పంపించేవారు. స్వయంప్రతిభ పోకుండా, వాటిని ఎడిట్ చేసి ప్రచురించేవారు. ఆ క్రమంలోనే తెలంగాణ సాయుధ పోరాట క్రమాన్ని కథలుగా మలిచిన రచయిత ఆవుల పిచ్చయ్య తయారయ్యారు.[6]

పత్రిక దృక్పథం[మార్చు]

మీజాన్ లోగో కింద స్వాతంత్ర్యము - సమత్వము -సౌభ్రాతృత్వము అనే ఫ్రెంచి విప్లవం కాలం నాటి ఆశయాలు రాసి ఉండేవి. ఈ ఆశయాలను మీజాన్ తెలుగు ఎడిషన్ ప్రతిబింబించింది.

చరమాంకం[మార్చు]

పత్రిక యజమాని కాంగ్రేసుకు వ్యతిరేకంగా అసభ్యకరమైన భాషలో విమర్శలు చేయమని పురమాయించడంతో పత్రిక యొక్క తెలుగు సంచికకు సంపాదకుడైన అడవి బాపిరాజు రాజీనామా చేశాడు.[7] బాపిరాజు 1947 ఆగస్టు 7న మీజాన్ పత్రిక సంపాదకునిగా కలకత్తావాలా వారించినా వినకుండా రాజీనామా చేశాడు.[4] రజాకార్లకు మద్దతు ఇచ్చిన మీజాన్ ఉర్దూ సంపాదకుడు హబీబుల్లా ఔజ్ 1948లో అరెస్టయ్యి, విడుదలైన తర్వాత 1956లో లాహోరుకు వలస పోయాడు.[8] 1948లో హైదరాబాదుపై సైనిక చర్య ప్రారంభమయ్యే కొన్నిరోజుల ముందు మీజాన్ పత్రిక ప్రచురణ అర్ధాంతరంగా ఆపివేయబడింది. పత్రిక యజమాని గులాం మహమ్మద్ కలకత్తావాలా గూఢమైన పరిస్థితుల్లో హైదరాబాదు వదిలి పెట్టి పాకిస్తాన్‌కు వలసపోయాడు.[9]

మూలాలు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=మీజాన్&oldid=2436271" నుండి వెలికితీశారు