రాంభట్ల కృష్ణమూర్తి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాంభట్ల కృష్ణమూర్తి
జననంమార్చి 3, 1920
అనాతవరం, తూర్పు గోదావరి జిల్లా
మరణండిసెంబర్ 7, 2001
హైదరాబాదు, తెలంగాణ
ఇతర పేర్లుకృష్ణ, సంజయ, విశ్వామిత్ర, అగ్నివేశ, కాట్రేని ఎర్రన వగైరా.
వృత్తిపరిశోధన, అధ్యయనం పత్రికా రచన
ఉద్యోగంమీజాన్(1943-'48), విశాలాంధ్ర (1952-'55), ఈనాడు (1978-'90), తదితర పత్రికల్లో సబ్ ఎడిటర్-ఆర్టిస్ట్-కార్టూనిస్ట్; 1976 :ఈనాడు సంస్థలో  జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్-ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు
కుటుంబంసుభద్ర (భార్య), అరుణ (కుమార్తె), ఆర్మెన్ (కుమారుడు)

రాంభట్ల కృష్ణమూర్తి బహుముఖ ప్రజ్ఞాశీలి. బాల్యంలోనే ఆయన తండ్రి మరణించడంతో, రాంభట్ల చిన్ననాటినుంచీ తన పొట్ట తానే పోసుకోవలసి వచ్చింది. బాలకార్మికుడిగా జీవితం మొదలుపెట్టిన రాంభట్ల అనేక రంగాల్లో విశిష్టమైన అధ్యయనాలూ పరిశోధనలూ సాగించిన సాహసిగా రాణించారు.  

ముఖ్యంగా వేద సంస్కృతి, అసీరియా-సుమేరియా సాంస్కృతిక చరిత్ర పరిశోధకుడిగానూ, బహు భాషావేత్తగానూ, మనోధర్మశాస్త్ర పరిశోధకుడిగానూ ఆయన వినూత్నమైన ఆలోచనలు సారించారు. సాహిత్య విమర్శకుడిగా ఆయన మార్గం అనితరసాధ్యమనిపించుకున్నది. ఇక, పత్రికల్లో సబ్ ఎడిటర్ గా - చిత్రకారుడిగా - కార్టూనిస్టుగా - ఎడిటరుగా బాధ్యతలు నిర్వహించిన రాంభట్ల కృష్ణమూర్తి తెలుగులో మొట్టమొదటి జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్ గా వ్యవహరించారు; వందలాది పాత్రికేయులను ఆయన స్వహస్తంతో సానబట్టారు.

1920 మార్చి మూడో తేదీన నాటి తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుతం కోనసీమ జిల్లా) లోని అనాతవరం గ్రామంలో మాతామహుల ఇంట పుట్టారు రాంభట్ల కృష్ణమూర్తి. బాల్యంలోనే తండ్రిని కోల్పోయిన రాంభట్ల కొంతకాలం పితామహుల పెంపకంలో ఉన్నారు; అక్కడి నుంచి తల్లీ-అన్నగార్లతో కలిసి హైదరాబాద్ వచ్చి ఉర్దూ మీడియంలో చదువు కొనసాగించారు. ఆయన మూడు చోట్ల చదివినా అయిదో తరగతి పూర్తి చెయ్యలేకపోయానని తరచు చెప్తుండేవారు! తన విషాదాన్ని హాస్యంగా మలచి చెప్పే ఈ అభ్యాసమే రాంభట్లను కార్టూనిస్టుగా మార్చిందని ఆయనే విశ్లేషించి చెప్పేవారు. మూసకట్టు విద్య అభ్యసించని కారణంగా తనకు లాభమూ-నష్టమూ రెండు జరిగాయన్నది రాంభట్ల విశ్లేషణల్లో మరొకటి!   

1943లో రాంభట్ల సుల్తాన్ బాజార్ లోని శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం కార్యదర్శిగా ఎన్నికయ్యారు. అది రాంభట్ల సాహిత్యజీవనంలో మూలమలుపు లాంటిది. అక్కడున్న రోజుల్లోనే రాంభట్ల తెలుగు ప్రబంధాలూ-కావ్యాలను నూతన దృక్పథంతో అధ్యయనం చెయ్యడం మొదలుపెట్టారు. దాదాపు అదే సమయంలో రాంభట్ల ఆర్యసమాజ్ ప్రభావ పరిధిలోకి వచ్చారు. దయానంద సరస్వతి చెప్పిన "అందరికీ విద్య-జ్ఞానప్రాప్తి-సత్యప్రకాశం" అనే ఆదర్శాలు రాంభట్లలాంటి వాణ్ణి ఆకర్షించడంలో వింతేముంది? అయితే వేదమంత్రాల అర్థతాత్పర్యాలు గ్రహించడం దగ్గిరే రాంభట్ల ఆగిపోలేదు.

ఫ్రెడ్రిక్ రాసెన్, రుడాల్ఫ్ ఫాన్ రాత్, ఫ్రెడ్రిక్ మ్యాక్సుమ్యూలర్ రచనలు సంపాదించి చదవడానికి రాంభట్ల నానాపాట్లూ పడ్డారు. ముఖ్యంగా, ఏ మాత్రం తీరిక దొరికినా, మ్యాక్సుమ్యూలర్ సంకలించిన "ద సేక్రేడ్ బుక్స్ ఆఫ్ ద ఈస్ట్" -ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రచురణ- చదవడానికి కేటాయించేవారు రాంభట్ల. లూయీ మోర్గన్, జే.జీ.ఫ్రేజెర్, ఎడ్వర్డ్ వెస్టెర్మార్క్, టీ.జీ. టేలర్ తదితరుల రచనలు సంపాదించేందుకు - ఆ కాలంలో- రాంభట్ల ఎంత శ్రమపడివుంటారో ఈ కాలపు పాఠకులకు కేవలం అనూహ్యం!  

అయితే పాశ్చాత్య ఇండాలజిస్టుల దగ్గిర కూడా రాంభట్ల ఆగిపోలేదు. జవాహర్ లాల్ నెహ్రూ, శ్రీ పాద అమృత్ డాంగే, రాహుల్ సాంకృత్యాయన్ లాంటి భారతీయ చింతన-చరిత్ర పరిశోధకుల రచనలను కూడా రాంభట్ల మథించారు. వారు చూపిన బాటలో వేద కాలపు గణసమాజంలో జీవన విధానాన్ని - ఋగ్వేదంలోని మంత్రాల సహాయంతో - ఆయన తరుణ యవ్వనంలోనే ఊహించారు. ఆ క్రమంలోనే ఆయన తంత్ర సంస్కృతి గురించిన అధ్యయనం కొనసాగించారు రాంభట్ల. అదే తనను భౌతికవాదం వైపు నడిపించిందని తరచు అనేవారు.   

ఈ భౌతికవాద దృక్పథమే, రాంభట్లను సామాజిక మానవ శాస్త్రం (సోషల్ ఆంత్రపాలజీ) అధ్యయనం దిశగా నడిపించింది. అదే ఆయన్ని తాపీ ధర్మారావు లాంటి వారికి చేరువ చేసింది. ఈ మేధోపరిణామ క్రమమే రాంభట్లను మార్క్సిజం వైపు నడిపించింది.

1948లో, రజాకార్లు చెలరేగిన నేపథ్యంలో, రాంభట్ల హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. అప్పట్లో కమ్యూనిస్టు పార్టీ మీద ప్రభుత్వం నిషేధం విధించింది. మద్రాసు (నేటి చెన్నై), బెజవాడ (నేటి విజయవాడ) తదితర ప్రాంతాల్లో కమ్యునిస్టులు నడిపించే "సందేశం" లాంటి రహస్య పత్రికల్లో రాంభట్ల పనిచేశారు. 1952లో సి.పి.ఐ.పై నిషేధం ఎత్తివేసిన తర్వాత మొదలైన దినపత్రిక "విశాలాంధ్ర"లో రాంభట్ల సబ్ ఎడిటరు - కార్టూనిస్టుగా పనిచేశారు. అప్పట్లోనే ఆయన "శశవిషాణం" పేరిట విశాలాంధ్రలో ఓ కార్టూన్-కవితా కాలం రాశారు.

1960-70 దశకాల్లో, రాంభట్ల ఇస్కస్-అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించారు. ముఖ్యంగా, రాంభట్ల-గజ్జెల మల్లారెడ్డీ కలిసి రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలన్నీ తిరిగి - అప్పటికి 17-18 సంవత్సరాలుగా స్తబ్ధంగా పడివుండిన అరసం పునర్నిర్మాణ కృషిలో - అభ్యుదయ రచయితలను ఒకే గొడుగు కిందకి తీసుకొచ్చారు. 1973లో గుంటూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ అరసం రాష్ట్ర మహాసభలో రాంభట్ల ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. దాదాపు దశాబ్ద కాలం ఆయన అరసం-ఇస్కస్ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ వచ్చారు. 1976 లో ఈనాడు స్కూల్ ఆఫ్ జర్నలిజం మొదలైన తర్వాత ఆయన తిరిగి ప్రధాన స్రవంతి పత్రికా రంగంలో ప్రవేశించారు.   

2001 డిసెంబర్ ఏడో తేదీన రాంభట్ల హైదరాబాద్ లోని స్వగృహంలో కన్నుమూశారు.

రచనలు

[మార్చు]

శశవిషాణం

పారుటాకులు

జన కథ

వేదభూమి

వేల్పుల కథ

సొంతకథ

- ఇవి కాక ఎన్నో ప్రత్యేక సంచికలకు, వివిధ పత్రికలకు రాసిన వ్యాసాలు ఉన్నాయి పలు సదస్సులలో ఆయన సమర్పించిన అధ్యయన పత్రాలు ఉన్నాయి. అంతే కాకుండా అనేక మంది ప్రముఖ రచయితల పుస్తకాలకు ఆయన రాసిన ముందుమాటలు చాలా ఉన్నాయి. వీటన్నింటినీ సంకలితం చేసి ప్రచురించాల్సి ఉంది.

కొన్ని పురస్కారాలు

[మార్చు]

ప్రతిష్ఠాత్మకమైన శ్రీ తుమ్మల వెంకట్రామయ్య సాహితీ పురస్కారం

శ్రీ పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం

మూలాలు

[మార్చు]

రాంభట్ల కృష్ణమూర్తి శత జయంతి విశేష సంచిక