మల్లినాథుడు

వికీపీడియా నుండి
(మల్లినాథ సూరి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కోలాచలం మల్లినాథసూరి లేదా మల్లినాథుడు తెలుగుకవి, సంస్కృత పండితుడు, విమర్శకుడు. అతను విమర్శకుడిగా బాగా పేరు పొందాడు. అతను 14 వ శతాబ్దం ఉత్తరార్ధంలోని వాడు. కాకతీయ రాజుల ఆదరణతో ఓరుగల్లు చేరాడు. కాకతీయ రాజుల పతనం తర్వాత రాచకొండ రాజుల ఆస్థానానికి వచ్చాడు. వీరిది కామకాయన గోత్రమని అతని ఊళ్ళో అదే రకమైన ఇంటిపేరు ఉన్నవారు చెప్పుకొంటారు.[1] కొంతమంది అతని గోత్రం కాశ్యపస గోత్రమని చెప్పుకొంటారు.[2] ఈ గోత్ర భేదాలతో మల్లినాథసూరి వంశపరంపరలోనివారు ఎవ్వరని నిర్ణయించడానికి తగిన ఆధారాలు లేవు.[3] సంస్కృతంలోని పంచమహాకావ్యాలకూ అతడు రాసిన భాష్యాలు పేరు తెచ్చి పెట్టాయి. అతను మహామహోపాధ్యాయ, వ్యాఖ్యాన చక్రవర్తి అనే బిరుదులు పొందాడు. ఇతను రాచకొండరాజైన సింగభూపాలుడు, విజయనగరాన్ని మొదటి దేవరాయలు పాలిస్తున్ననాటి వాడు. అతని రాతలను బట్టి అతను 1350-1450 మధ్య కాలపు వాడని తెలుస్తోంది.

తొలినాళ్ళు

[మార్చు]

మల్లినాథుడి ఇంటిపేరు కోలాచలం అని మనకు సంస్కృత వాఙ్మయంలో కన్పిస్తుంది. దీనికి కొలచేల, కొలిచాల, ఇంకా కొలిచెలమ అనే వికారాలున్నాయి.[4] కొలిచెలమ (నేటి కొల్చారం) అనే గ్రామం మెదక్ జిల్లా కేంద్రమైన మెదక్ కు 17 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకతీయుల పాలన సమాప్తమయ్యాక కొలచెలమ వారు సింగభూపాలుని రాజధాని రాచకొండకు వలస వెళ్ళారు. సంజీవని రాసిన గద్యాల నుండి తైవచ్చేదేమిటంటే సింగభూపాలుడు మల్లినాథుడిని మహామహోపాధ్యాయునిగా, మల్లినాథుని కొడుకును మహోపాధ్యాయుని బిరుదుతో సత్కరించాడు.

జీవిత విశేషాలు

[మార్చు]

మల్లినాథ సూరి మెదక్ జిల్లా కొల్చారంలో జన్మించాడు. ఆయన సా.శ. 1350-1430 మధ్య కాలంలో జీవించాడు. చిన్నతనంలో మల్లినాథసూరికి చదువు అబ్బకపోవడంతో పశువులను కాసేవాడు,. ఈ క్రమంలోనే అడవిలో ఓ యోగి పరిచయం కాగా, ఆ యోగి అవసాన దశలో ఉండగా, మల్లినాథసూరి ఆయనకు సపర్యలు చేశాడు. దీనితో ఆ యోగి మల్లినాథసూరికి మంత్రోపదేశం చేసి నాలుకపై బీజాక్షరాలు వ్రాశాడు. వెంటనే దుర్గామాత సాక్షాత్కారం పొందిన మల్లినాథ సూరి కాశీకి వెెళ్లి అక్కడ 19 శాస్త్రాల్లో ప్రావీణ్యం సాధించి మహాభాషా కర్తగా, విద్యాపండితుడిగా ఖ్యాతి పొందాడు.

ఈయన మొదట కాళిదాసు రచించిన కుమార సంభవం కావ్యానికి వ్యాఖ్య రాశాడు. అంతకు ముందు దీనిపై 37 వ్యాఖ్యానాలున్నాయి. రఘు వంశ సంజీవిని అనేది సూరి మొదటి వ్యాఖ్యానం. దీని ముందు అవన్నీ దిగ దుడుపే. ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్భుత మైన శ్లోకం రాసి కొత్త దారి తొక్కాడు. కుమార సంభావానికి అంతకు ముందున్న 25 వ్యాఖ్యానాలు సూరి వ్యాఖ్యానం ముందు తల వంచాయి. అయితే ఉన్న పదిహేడు సర్గలలో ఏడు సర్గల వ్యాఖ్యానమే లభిస్తోంది. ఎనిమిదో దానికి సీతా రామ పండితుడు వ్యాఖ్య రాశాడు . అదే పార్వతీదేవి, పరమేశ్వరుల సంభోగ శృంగారం. మేఘ దూతానికి 50 వ్యాఖ్యానాలున్నాయి. సూరి వ్యాఖ్య మాత్రమే బహుళ ప్రచారం పొందింది.

వ్యాఖ్యాన చక్రవర్తి

[మార్చు]

మల్లినాథసూరిని వ్యాఖ్యాన చక్రవర్తి అంటారు. ఆయన సంస్కృత భాషలో మహాకావ్యాలైన మేఘసందేశం, కుమారసంభవం, రఘువంశం ( ఈ మూడూ కాళిదాస మహా కవి కృతులు), కిరాతార్జునీయం ( ఇది భారవి రచన). శిశుపాలవధ ( ఇది మాఘుని రచన ), హర్షనైషధం ( ఇది శ్రీహర్ష మహారాజ కృతి) లను తన వ్యాఖ్యానాలతో జనరంజకం చేశాడు. న మూలం లిఖ్యతే/నానపేక్షిత ముచ్యతే-మూలంలో లేనిది చెప్పను, అనవసరమైనదీ చెప్పను అంటూ ఆయన తన వ్యాఖ్య రచనా సరళి గురించి చెప్పుకున్న విషయాలు సుప్రఖ్యాతం.

అతను మొదట కాళిదాసు రచించిన కుమార సంభవం కావ్యానికి వ్యాఖ్య రాశాడు. అంతకు ముందు దీనిపై 37 వ్యాఖ్యానాలున్నాయి. రఘు వంశ సంజీవిని అనేది సూరి మొదటి వ్యాఖ్యానం. ప్రతి సర్గ వ్యాఖ్యానానికి ముందు అద్భుత మైన శ్లోకం రాసి కొత్త దారి తొక్కాడు. కుమార సంభవానికి అంతకు ముందున్న 25 వ్యాఖ్యానాలు సూరి వ్యాఖ్యానం ముందు తల వంచాయి. అయితే ఉన్న పదిహేడు సర్గలలో ఏడు సర్గల వ్యాఖ్యానమే లభిస్తోంది. ఎనిమిదో దానికి సీతా రామ పండితుడు వ్యాఖ్య రాశాడు . అదే పార్వతీదేవి, పరమేశ్వరుల సంభోగ శృంగారం. మేఘ దూతానికి 50 వ్యాఖ్యానాలున్నాయి. సూరి వ్యాఖ్య మాత్రమే బహుళ ప్రచారం పొందింది.

ఒక విశేషం

[మార్చు]

మల్లినాథసూరి హాస్యప్రియత్వాన్ని గురించిన ఒక కట్టుకథ ఈ విధంగా వ్యాప్తిలో ఉంది. ఒకసారి మల్లినాథసూరి భార్య ' చాలామంది గురించి పద్యాలుచెబుతారుకదా, నాగురించికూడా ఓ పద్యం చెప్పండీ' అందిట. అప్పుడు ఆయన

 శ్లో|| తింత్రిణీ దళ విశాలలోచనా నింబపల్లవ సమాన కుంతలా|
       మేరుమందర సమాన మధ్యమా మల్లినాథ గృహిణీ విరాజతే||
 

అని అన్నాడుట.

చింతాకుల అంత విశాలమైన కళ్లతోను (అంటే, చికిలి కళ్లతో), వేపచిగురుతో సమానమైన జుట్టుతోను (అంటే, రాగిరంగు జుట్టుతో), మేరు పర్వతంతో సమానమైన నడుముతోను (అంటే, పెద్ద పొట్టతో) మల్లినాథులవారి భార్య ప్రకాశిస్తోంది అని ఈ శ్లోకానికి అర్థం.

కృతులు

[మార్చు]

మల్లినాథుడు వ్యాఖ్యానకర్త అయినప్పటికీని ఎన్నో సృజనాత్మక కృతులు కూడా చేసాడు. ఈయన రాసిన సంజీవని అనే మేఘసందేశ భాష్యం మిక్కిలి ప్రసిద్ధమయినది. [5]అతను కవి అన్న విషయం చాలా మందికి తెలియదు. కానీ సంస్కృత సాహిత్యాన్ని క్షుణ్ణంగా పరిశీలించినవారికి ఇతను సుపరిచితుడే.

వ్యాఖ్యానాలు

[మార్చు]

ఈ కింది తెలిపిన జాబితా సంస్కృత మహాకావ్యాలపై మల్లినాథుడు రాసిన వ్యాఖ్యానాల పేర్లను వివరిస్తుంది.

  1. సంజీవని - కాళిదాసుని రఘువంశం, కుమారసంభవం, మేఘదూతం పైన
  2. ఘంటాపథం - భారవి కిరాతార్జునీయం పై
  3. సర్వంకషా- [మాఘుని]శిశుపాలవధ పై
  4. జీవాతు - శ్రీహర్షుని నైషధం పై
  5. సర్వపథీనా - భట్టికావ్యం పై

శాస్త్రీయ కృతులపై ఈయన రాసిన వ్యాఖ్యానాలు:

  1. తరల - విద్యాధరుని అలంకార శాస్త్రం పై
  2. నిశాంతక - వరదరాజుని తార్కికరక్ష టీకా పై

సృజనాత్మక కృతులు

[మార్చు]
  1. రఘువీరచరితం
  2. వైశ్యవంశ సుధాకరం
  3. ఉదార కావ్యం

మల్లినాథుడి వ్యాఖ్యానం ఎంత ప్రాచుర్యం పొందిందంటే మరాఠీలో వ్యాఖ్యానించడానికి వాడే పదం మల్లినాథి.

మూలాలు

[మార్చు]
  1. "Pulikonda Subbachary". www.facebook.com. Retrieved 2020-08-18.
  2. సరసభారతి ఉయ్యూరు. "మహా వ్యాఖ్యాత కోలాచలం మల్లి నాద సూరి". sarasabharati-vuyyuru.com. Retrieved 3 March 2017.
  3. "మీఁగడ తఱకలు/కొలచెలమవారు - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-08-18.
  4. పీజీ లాల్యె రాసిన మల్లినాథ, పుట 13
  5. మేఘసందేశ: ఎన్ ఎసెస్మెంట్ ఫ్రొం ది సౌత్, పుట. 24

బయటి లంకెలు

[మార్చు]