జ్వాలాముఖి (రచయిత)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వీరవెల్లి రాఘవాచార్య
జ్వాలాముఖి
జననంవీరవెల్లి రాఘవాచార్య
ఏప్రిల్ 12, 1938
మెదక్ జిల్లా ఆకారం
మరణండిసెంబర్ 14, 2008
మరణ కారణంకాలేయ వ్యాధి, గుండెపోటు
ఇతర పేర్లుజ్వాలాముఖి
వృత్తివిరసం సభ్యుడు
ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో
ప్రసిద్ధిప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు
భార్య / భర్తయామిని
తండ్రినరసింహాచార్యులు,
తల్లివెంకటలక్ష్మీనర్సమ్మ.

జ్వాలాముఖి (ఏప్రిల్ 12, 1938 - డిసెంబర్ 14, 2008) ప్రముఖ రచయిత, కవి, నాస్తికుడు భారత చైనా మిత్రమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. తెలుగు సాహితీ ప్రపంచంలో దిగంబర కవులుగా ప్రసిద్ధికెక్కిన ఆరుగురు కవుల్లో జ్వాలాముఖి ఒకడు. విరసం సభ్యుడు. శరత్ జీవిత చరిత్రను 'దేశ దిమ్మరి ప్రవక్త శరత్‌బాబు' పేరుతో హిందీ నుంచి అనువదించాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

మెదక్ జిల్లా ఆకారం గ్రామంలో 1938 ఏప్రిల్ 12 న జన్మించిన ఆయన అసలు పేరు వీరవెల్లి రాఘవాచార్య. తల్లిదండ్రులు నరసింహాచార్యులు, వెంకటలక్ష్మీనర్సమ్మ. హైదరాబాదు‌లోని మల్లేపల్లి, నిజాం కళాశాలలో విద్యాభాస్యాన్ని పూర్తి చేసుకున్న ఆయన నిజాం కళాశాలలో ఎల్.ఎల్‌.బీ. పూర్తిచేశాడు. ఉపాధ్యాయుడిగా సికింద్రాబాద్, బెంగుళూరు సైనిక పాఠశాలల్లో 12 ఏళ్లు విధులు నిర్వహించాడు. తరువాత హైదరాబాదు‌లోని ఎల్.ఎన్‌.గుప్తా సైన్స్, కామర్స్ కళాశాలలో24 ఏళ్లు అధ్యాపకుడిగా పనిచేసి 1996లో పదవీ విరమణ చేశాడు. మొదట్లో నాస్తికవాదం, పిదప మానవతా వాదం, అనంతరం మార్కిస్టు ఆలోచన విధానం వైపు మొగ్గు చూపాడు. 1958లో 'మనిషి' దీర్ఘకవితకు గుంటూరు రచయితల సంఘంవారు కరుణశ్రీ చేతులమీదుగా ఉత్తమ రచయిత పురస్కారాన్ని అందజేశారు. 1965-70 మధ్య దిగంబర కవుల పేరుతో కవితా సంపుటాలు రాశాడు. ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రాటిక్ రైట్స్ (ఓ.పీ.డీ.ఆర్) సంస్థతో ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. రెండు సార్లు చైనాకు వెళ్లారు. 1971లో విరసం సభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద నిఖిలేశ్వర్, చెరబండరాజులతో ముషీరాబాద్ జైల్లో యాభై రోజులున్నాడు.[1] 1975 ఎమర్జెన్సీ కాలంలో 15 రోజులు జైల్లో ఉన్నారు. ఈయన పై మఖ్దూం మొహియుద్దీన్ ప్రభావం ఉంది. డిసెంబరు 14 2008 న కాలేయ వ్యాధి, గుండెపోటుతో మరణించాడు.

జ్వాలాముఖి రచనలు[మార్చు]

  • 'వేలాడిన మందారం' నవల
  • హైదరా'బాధ'లు
  • 'ఓటమి తిరుగుబాటు' కవితా సంకలనం
  • 'రాంగేయ రాఘవ' జీవిత చరిత్ర హిందీ నుంచి తెలుగు అనువాదం

జ్వాలాముఖి గురించి నిఖిలేశ్వర్[మార్చు]

కాలేజీలో జరిగే డిబేటింగ్ లో విద్యార్థుల మధ్య వాగ్వివాదాలలో జ్వాలాముఖి ఆవేశంగా మాట్లాడేవాడు. నేనేమో తడబడుతూ గందరగోళంలో పడిపోయేవాణ్ణి! 1960లలో జ్వాల ప్రతిరోజు ఉదయాన్నే 7 గంటలకే సైకిల్‌పై బయలుదేరి మల్లేపల్లిలోని సీతారామ్ దేవాలయం నుంచి దాదాపు పదిహేను మైళ్లు ప్రయాణం చేసి సెంటర్‌కు చెమటలు కక్కుతూ ఎనిమిది గంటలకల్లా మారేడ్‌పల్లిలోని ఏ.ఓ.సి స్కూల్ కు చేరేవాడు. నేనేమో ముషీరాబాద్ నుంచి సైకిల్ తొక్కుతూ రోజు 10 మైళ్లు అదే అవస్థలో ఉద్యోగానికి హాజర్! నా ప్రేమ వివాహం 1963లో! కులాంతర వివాహం, పైగా అమ్మాయి ఇంట్లో చెప్పకుండా వచ్చేసింది.. ఇక ఆ రహస్య వివాహానికి జ్వాలాముఖి అన్నివిధాలా తోడ్పడి యాకుత్‌పురాలోని ఆర్యసమాజ్ మందిర్‌లో వివాహం జరిపించాడు. విజయవాడ దాకా తోడు వచ్చి నన్ను-యామినిని బెంగుళూర్ హానిమూన్‌కు పంపించేసాడు. ఆ తర్వాత మా కుటుంబాల ఆత్మీయ సంబంధాలు ఎంతో ఆప్యాయంగా సాగిపోయిన దశలోనే మా పిల్లల కులాంతర వివాహాలకు ఆయన నిర్వాహకుడు. ఆయన పిల్లల కులాంతర- మతాంతర వివాహాలకు నేను నిర్వాహకుడిగా..! మమ్మల్ని కాలేజీ ఉపన్యాసాలకు పిలిస్తే బాంబులతో వస్తారని ఆర్ఎస్ఎస్ అనుయాయులు (ఎబివిపి) కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఫోన్ చేసారు. అప్పుడు జ్వాల ప్రిన్సిపాల్ సమక్షంలోనే తనదైన శైలిలో ప్రసంగిస్తూ జేబుల్లోంచి కవితలు తీస్తూ, మేము బాంబులతో వస్తే పరిణామాలు మరో విధంగా వుండేవని చమత్కరించాడు. సభలు-సమావేశాలు- ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు. 1971లో వచ్చిన 'ఓటమి తిరుగుబాటు' తర్వాత మళ్లీ మరో సంపుటిని ప్రచురించలేదు. 'వేలాడిన మందారం' నవల, హైదరాబాదు కథలు ఉన్నాయి. ఆయన నిశిత వివేచనతో రాసిన సాహిత్య వ్యాసాలు సంపుటిగా రావలసి ఉంది.స్నేహశీలీ, ఆర్ద్ర హృదయుడు, భోజన ప్రియుడు, ఎక్కడ అన్యాయం జరిగినా ప్రతిస్పందించిన సాహితీవేత్త. సభలు - సమావేశాలు - ఉపన్యాసాల మూలంగా తన పుస్తక ప్రచురణను నిర్లక్ష్యం చేసాడు.

ఉత్ప్రేరక జ్వాలాముఖి కి అక్షర నివాళులు[మార్చు]

స్వతహాగా తీవ్రంగా స్పందించే గుణదాముడు. కవి పండితుడిగా ఎదిగిన క్రమంలో దిగంబర కవుల్లో' దిట్ట. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో విశిష్టునిగా పేరు పొందాడు. జీవనానికి తొలినాళ్ళలో స్టోర్స్ పర్చేజ్ అండ్ స్టేషనరీ డిపార్ట్ మెంటులో అతి కొద్దికాలం ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసాడు. ఆ మీదట ఉపాధ్యాయునిగా, కాలేజీలో ఉపన్యాసకుడిగా పనిచేస్తున్న రోజుల్లోనే ఉద్యోగ క్రాంతి అనే పత్రిక వ్యవస్థాపక సభ్యులకు సమకాలికంగా ఉద్యోగుల ఉద్యమాల్లో పాల్గొన్న ఐక్యవిప్లవోద్యమాభిలాషి.

"బాల్యానికి రక్షణ, యవ్వనానికి క్రమశిక్షణ, వార్ధక్యానికి పరిరక్షణ కల్పించగల వ్యవస్తే సోషలిస్టు సమాజం" అని విశదీకరించేవాడు. కిటికీలు, తలుపులు, బార్లాగా తెరిచి వుంచిన ఇంట్లోకి చేరిన దుమ్ము, ధూళిని చీపురుతో చిమ్మి ఆరోగ్యాన్ని కాపాడుకున్న క్రమంగా చైనా తియాన్‌మీన్ స్క్వేర్ ఘటనను అభివర్ణించాడు. ఒక నాస్తికుడిగా, మార్క్సిస్ట్ మేధావిగా, 'ప్రత్యామ్నాయ సంస్కృతి'ని అభివృద్ధి చేయడానికి గాను, హైదరాబాదు వంటి నగరంలో "ప్రత్యామ్నాయ సాంస్కృతిక కేంద్రం"ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత గురించి పలుమార్లు మిత్రులతో చెప్పుతుండేవాడు.

జ్వాలాముఖి పై మార్క్సిస్టుల విమర్శలు[మార్చు]

జ్వాలాముఖి 1975 వరకు విప్లవ రచయితల సంఘంలో పనిచేశాడు. ఆ తరువాత ఆయన విరసం నుంచి బయటకి వచ్చి జన సాహితి సంస్థలో చేరాడు. నాస్తికులలో ఎక్కువ మందికి మార్క్సిస్ట్ గతితార్కిక చారిత్రక భౌతికవాద సూత్రాలు తెలియవు. కనుక జన సాహితి సంస్థ సభ్యులు నాస్తిక హేతువాద సంఘాలకి దూరంగా ఉండాలని జనసాహితి సంస్థ తీర్మానించింది. మొదట జ్వాలాముఖి అందుకు అంగీకరించాడు కానీ తరువాత జ్వాలాముఖి నాస్తిక హేతువాద కార్యక్రమాలకు వెళ్ళి నాస్తిక ఉద్యమాన్ని పొగడడం విమర్శలకి దారి తీసింది.[2] జ్వాలాముఖిని విమర్శిస్తూ రంగనాయకమ్మ రెండు పుస్తకాలలో వ్యాసాలు వ్రాసారు. ఈ ఉద్యమాలలో మార్క్సిస్ట్ వ్యతిరేక స్వభావం కూడా ఉందని రంగనాయకమ్మ వాదన. స్త్రీవాద వివాదాలు పుస్తకంలో కూడా జ్వాలాముఖి పై ఇతర మార్క్సిస్టులు చేసిన విమర్శలు ప్రచురితమయ్యాయి.

అవార్డులు[మార్చు]

  • ఝాన్సీ హేతువాద మెమోరియల్ అవార్డు
  • దాశరథి రంగాచార్య పురస్కారం
  • హిందీలో వేమూరి ఆంజనేయ శర్మ అవార్డు

మూలాలు[మార్చు]

  1. The Wages of Impunity By K. G. Kannabiran పేజీ.298
  2. *జన సాహితితో మా విభేదాలు - రచన: రంగనాయకమ్మ, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్
    • నీడతో యుద్ధం - రచన: రంగనాయకమ్మ, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్

యితర లింకులు[మార్చు]