సంగం లక్ష్మీబాయి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంగం లక్ష్మీబాయి
సంగం లక్ష్మీబాయి


పదవీ కాలము
1957 - 1972
నియోజకవర్గము మెదక్

వ్యక్తిగత వివరాలు

జననం (1911-07-27) 1911 జూలై 27
ఘటకేసర్, తెలంగాణ, భారతదేశం
మరణం 1979 జూన్ 3
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి దుర్గాప్రసాద్ యాదవ్

సంగం లక్ష్మీబాయి (Sangam Laxmi Bai) (జూలై 27, 1911 - జూన్ 3, 1979) స్వాతంత్ర్య సమరయోధురాలు మరియు భారత లోక్ సభ సభ్యురాలు.[1] ఆంధ్రప్రదేశ్ నుండి లోక్ సభ సభ్యురాలైన తొలి మహిళ సంగం లక్ష్మీబాయే.

ఈమె 1911, జూలై 27ఘటకేసర్ సమీపంలోని ఒక కుగ్రామంలో జన్మించింది. ఈమె తండ్రి డి. రామయ్య. చిన్నతనంలోనే వివాహమైన తర్వాత బాల్యంలోనే తల్లిదండ్రులు, భర్త చనిపోవడంతో ఆమె అనాథ అయ్యింది. చాలా చురుకైన అమ్మాయి కావడంతో మద్రాసు ఆంధ్ర మహిళా సభలో చదువుకునే అవకాశం దొరికింది. ఈమె కార్వే విశ్వవిద్యాలయం, ఉన్నవ లక్ష్మీబాయమ్మ ప్రారంభించిన శారదా నికేతన్ మరియు మద్రాసు ఆర్ట్స్ కళాశాలలో చదువుకున్నారు. అక్కడ ఉన్నత చదువుల అనంతరం తిరిగి హైదరాబాద్‌కు చేరుకుంది. నారాయణగూడలో ఉన్న రాజాబహదూర్ వెంకట్రామిరెడ్డి ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు స్వాతంత్ర్యోద్యమంలో కీలకపాత్ర పోషించింది. ఎంతోమంది మహిళలను ఉద్యమాల్లో భాగస్వాములను చేసింది.[2]

ఈమె సాంఘిక సేవలోనే పూర్తి సమయం వెచ్చించి ఆ తర్వాత రాజకీయాలలో చేరారు. ఈమె విద్యార్థి రోజులలో సైమన్ కమీషన్ను వ్యతిరేకించింది. ఉప్పు సత్యాగ్రహం (1930-31) లో చురుగ్గా పాల్గొని ఒక సంవత్సరం జైలు శిక్ష అనుభవించింది.

ఈమె 1952 లో నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.[3] 1954 నుండి 1956 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో విద్యాశాఖ ఉప మంత్రిగా పదవిని నిర్వహించారు. 1957లో మెదక్‌ నియోజక వర్గం నుండి 2వ లోకసభకు ఎన్నికయ్యారు.[3] 1962 లో 3వ లోకసభకు ఎన్నికయ్యారు. మూడవసారి 1967లో 4వ లోకసభకు భారత జాతీయ కాంగ్రెసు సభ్యురాలిగా మెదక్ లోకసభ నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు.

ఈమె1979లో మరణించేవరకు లక్ష్మీబాయి స్త్రీలు, బాలికల సంక్షేమం కొరకు నిర్విరామంగా కృషిచేసినది. 1952లో తన సహచరులైన కె.వి.రంగారెడ్డి, ఏ.శ్యామలాదేవి, పి.లలితాదేవి, పాశం పాపయ్య మరియు ఎం.భోజ్ రెడ్డిలతో కలిసి మహిళలు, బాలికలకు సహాయం చేసే లక్ష్యంతో ఇందిరా సేవా సదన్ సొసైటీని స్థాపించింది.[4] సంతోష్ నగర్ చౌరస్తాలో ప్రస్తుతం ఐ.ఎస్.సదన్ గా పిలవబడుతున్న ప్రాంతంలో ఈమెకు రెండెకరాల స్థలంలో ఇల్లుండేది. తన సొంత ఇంటిలోనే అనాథశరణాలయాన్ని ప్రారంభించింది.

లక్ష్మీబాయి ఇందిరా సేవాసదన్ అనే అనాథశరణాలయానికి వ్యవస్థాపక సభ్యురాలు మరియు గౌరవ కార్యదర్శి. ఇదే కాకుండా ఈమె రాధికా మెటర్నిటీ హోమ్, వసు శిశువిహార్ మరియు మాశెట్టి హనుమంతుగుప్తా బాలికల ఉన్నత పాఠశాలల యొక్క స్థాపనలో ముఖ్యపాత్ర వహించింది. ఈమె వినోభా భావే యొక్క తొలి పాదయాత్రకు తెలంగాణాలో సారథ్యం వహించారు. ఇవే కాక హైదరాబాదు యాదవ మహాజన సమాజం యొక్క అధ్యక్షురాలిగా, అఖిలభారత విద్యార్థిసంఘం ఉపాధ్యక్ష్యురాలిగా, హైదరాబాదు ఫుడ్ కౌన్సిల్ మరియు ఆంధ్ర యువతి మండలి అధ్యక్షురాలిగా పనిచేసింది. ఆంధ్రప్రదేశ్ సామాజిక సంక్షేమ సలహా బోర్డుకు కోశాధికారిగా, హైదరాబాదు ప్రదేశ్ కాంగ్రేస్ యొక్క మహిళా విభాగానికి కన్వీనరుగాను ఉంది. ఈమె పద్దెనిమిదేళ్ల పాటు ఆంధ్ర మహిళా సభ యొక్క సభ్యురాలిగా ఉంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధికారిగా కొన్నాళ్లు, అఖిల భారత కాంగ్రెసు కమిటీ అధికారిగా కొన్నాళ్లు పనిచేసింది.

మూలాలు[మార్చు]

  1. Biography of Laxmi Bai, Sangam at Parliament of India.
  2. సంఘం మెచ్చిన బాయి - నమస్తే తెలంగాణా
  3. 3.0 3.1 పెరుమాండ్ల, కిషోర్‌ (17 Mar 2019). "లెజెండ్‌ సంగం లక్ష్మీబాయి". మూలం నుండి 15 Jul 2019 న ఆర్కైవు చేసారు. Cite news requires |newspaper= (help)
  4. http://brecw.ac.in/founder.htm