క్షేత్రయ్య
కర్ణాటక సంగీతంలో పేరెన్నికగన్న వాగ్గేయకారులలో క్షేత్రయ్య (1595-1660) ఒకడు. ఈయన అసలు పేరు మొవ్వా వరదయ్య గా భావిస్తున్నారు. అనేక పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను సందర్శిస్తూ వాటి గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండటం చేత ఈయనకు క్షేత్రజ్ఞుడనే పేరు వచ్చింది. క్రమేణా అది క్షేత్రయ్యగా మారింది.
జీవిత విశేషాలు[మార్చు]
క్షేత్రయ్య జీవితకాలం 1595 - 1660 మధ్యకాలం కావచ్చును. ఇతని అసలుపేరు "వరదయ్య". ఇంటిపేరు "మొవ్వ". క్షేత్రయ్య పదాలలోని "వరద" అనే ముద్ర స్వనామ ముద్రగా భావించి అతని అసలుపేరు 'వరదయ్య'గా నిర్ణయించారు. ఇతని జన్మ స్థలం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ లోని, కృష్ణా జిల్లాలో మొవ్వ గ్రామం. ఆ వూరిలో వెలసిన వేణుగోపాల స్వామి అతని ఇష్టదైవం.
జనబాహుళ్యంలో ఉన్న కథ ప్రకారం చిన్నతనంనుండి వరదయ్యకు గాన అభినయాలంటే మక్కువ. కూచిపూడిలో ఒక ఆచార్యుని వద్ద నాట్యం నేర్చుకొన్నాడు. సహపాఠి అయిన "మోహనాంగి" అనే దేవదాసితో సన్నిహితుడైనాడు. తరువాత మేనమామ కూతురు "రుక్మిణి"ని పెండ్లాడాడు. కాని మోహనాంగి పట్ల అతని మక్కువ తగ్గలేదు. దేవదాసి అయిన మోహనాంగి చాలా వివేకం కలిగిన పండితురాలు. తమ ఆరాధ్య దైవమైన మువ్వగోపాలునిపై నాలుగు పదాలు పాడి తనను మెప్పించగలిగితే తాను వరదయ్య ప్రేమను అంగీకరిస్తానని మోహనాంగి షరతు విధించిందట.
మోహనాంగి పెట్టిన షరతు కోసం వరదయ్య నిరంతరం సాధన చేయసాగాడట. ఆ సాధన కారణంగా ప్రపంచములోని జీవాత్మలన్నీ స్త్రీలని, పరమాత్ముడయిన మువ్వగోపాలుడొక్కడే పురుషుడనే తత్వం వరదయ్యను అలుముకొన్నదట. క్రమంగా ఆ మధురభక్తితో అనేక పాటలు పాడాడు. వాటికి మోహనాంగి నాట్యం చేసిందట.
మరొక కథ: బాల్యంలో విద్యాగంధం లేని వరదయ్య పశువుల కాపరిగా ఉండేవాడు. ఒక యోగి ఇతనికి 'గోపాల మంత్రం' ఉపదేశించాడు. ఆనాటి నుండి అతనికి గొప్ప కవితా శక్తి అలవడింది.
దేశాటనం, సన్మానాలు, గుర్తింపు[మార్చు]
ఆంధ్ర దేశంలోని తిరుపతి, కడప, శ్రీశైలం మున్నగు క్షేత్రాలలో నెలకొన్న దేవతలపైనే కాక, కంచి, శ్రీరంగం, మధుర, తిరువళ్ళూరులలో వెలసిన స్వామి వార్లపై కూడా క్షేత్రయ్య పదాలు రచించారు. కాని, అన్నిటిని మువ్వ గోపాలునికి అంకితం గావించి ఆ స్వామితో ఆయా దేవతలకు అభేదం కల్పించారు. ఈ దేశాటనం కారణంగానే అతనికి క్షేత్రయ్య అనే నామం స్థిరమైనదనిపిస్తున్నది.
ముందుగా గుంటూరు జిల్లా బెల్లంకొండలో చలువు చక్కరపురీశుని దర్శించాడు (చలువ చక్కెరపురి నిలయుడని మదిలో వలవేసి నిను వలపించలేద?) . అనంతరం భద్రాచలం లోని సీతారామచంద్రస్వామిని, పిదప శ్రీశైలం మల్లికార్జునుని, ఆపై హంపి హేమాద్రి నిలయుని దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన ఇతర క్షేత్రాలు - పాలగిరి చెన్నకేశవుడు, ఇనగలూరు ఇనపురి స్వామి, (దేవుని) కడప వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. తిరుపతి చేరి వెంకటేశ్వర స్వామి, ఇతర దేవతామూర్తులపై అనేక పదాలు రచించాడు.
పిదప దక్షిణాభిముఖంగా సాగి (దక్షిణ ఆర్కాటు జిల్లా) కోవిల్లూరు మువ్వగోపాల స్వామిని దర్శించాడు. తిరువళ్ళూరు వీర రాఘవస్వామి, వేద నారాయణపురం వేదపురీశుడు, సత్యవేడు సత్యపురవాసుదేవుడు, కరిగిరి స్వామి దేవుళ్ళ దర్శనం చేసుకొన్నాడు. మార్గంలో పండితుల, పాలకుల సత్కారాలందుకొన్నాడు. క్షేత్రయ్యను ఎందరో ప్రభువులు సన్మానించారు. వారిలో మధురనేలిన తిరుమల నాయకుడు, గోల్కొండ నవాబు, తంజావూరు రఘునాధ నాయకుడు, చెంజి కృష్ణప్ప నాయుడు (తుపాకుల రాయుడు) ప్రముఖులు. రఘునాధ నాయకునిపై క్షేత్రయ్య వేయి పదాలు చెప్పాడు.
చిదంబంరం గోవిందస్వామిని "తిల్ల గోవిందస్వామి" అని క్షేత్రయ్య ప్రస్తుతించాడు. చిదంబరం పాలకుడైన కృష్ణప్పనాయకుని సన్మానం అనంతరం క్షేత్రయ్య తంజావూరు వెళ్ళి రఘునాధనాయకుని ఆస్థానంలో కొంతకాలం ఉన్నాడు. అక్కడినుండే శ్రీరంగం, కంచి, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాడు. క్షేత్రయ్య దర్శించిన క్షేత్రాలలోని దైవం గురించి కొన్ని క్షేత్రయ్య పదాలు మనకు లభిస్తున్నాయి.
1646లో తంజావూరు పతనమై గోల్కొండ నవాబు వశమైంది. గోల్కొండ సైన్యాధిపతి మీర్ జుమ్లా సాహిత్యాభిమాని. క్షేత్రయ్యను సగౌరవంగా గోల్కొండ నవాబు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా వద్దకు తోడ్కొని వెళ్లాడు.ఆ నవాబు ఆస్థానంలో క్షేత్రయ్య పెక్కుకాలం ఉండి 1500 పదాలు వ్రాశాడు.
తిరుగుప్రయాణంలో భద్రాచలం క్రొత్త తాసిల్దార్ కంచెర్ల గోపన్న క్షేత్రయ్యను ఆదరించాడు. అనంతరం క్షేత్రయ్య తన స్వగ్రామం మొవ్వకు తిరిగివచ్చాడు. తాను వివిధ పాలకులవద్ద కూర్చిన పదాలగురించ ఈ క్షేత్రయ్య పదం ద్వారా మనకు తెలుస్తుంది.
- దేవగాంధారి రాగం - ఆది తాళం
పల్లవి:
వేడుకతో నడచుకొన్న - విటరాయడే
అనుపల్లవి:
ఏడుమూడు తరములుగా - ఇందు నెలకొన్న కాణాచట!
కూడుకొని మువ్వ గోపాలుడే నా విభుడు ||వేడుక||
చరణాలు:
మధుర తిరుమలేంద్రుడు - మంచి బహుమానమొసగి
యెదుట కూర్చుండమని - ఎన్నికలిమ్మనెనే
యిదిగో రెండువేల పదములు - ఇపుడెంచుకొమ్మనగా?
చదురు మీదనే యున్న సామికి - సంతోషమింతింత గాదె? ||వేడుక||
అలుకమీరి తంజావూరి అచ్యుత విజయరాఘవుడు
వెలయ మనుజుల వెంబడి - వేగమె పొడగాంచి
చలువ చప్పరమున నుండగ - చక్కగ వేయి పదముల
పలుకరించుకోగానే బహుమానమిచ్చేనావేళ ||వేడుక||
బలవంతుడయిన గోలకొండ - పాదుషా బహుమానమిచ్చి
తులసిమూర్తితో వాదు తలచే నావేళ
వెలయు మువ్వ గోపాలుడు - వెయ్యిన్నూరు పదములు
నలువది దినములలో - నన్ను గలసి వినిపించెనే ||వేడుక||
క్షేత్రయ్య పద విశిష్టత[మార్చు]
మాట, పాటలను స్వతంత్రంగా రచించగలిగినవారినే వాగ్గేయకారులు లేదా బయకారులు అన్నారు.
భక్తుడు తనను నాయికగా భావించి భగవంతుని పొందుకోసం చెందే ఆరాటమే మధుర భక్తి. ఇలాంటి మధుర భక్తి ప్రబలంగా ఉన్న 17 వ శతాబ్దంలో క్షేత్రయ్య జీవించాడు. పదకవితలకు ఆద్యుడిగా క్షేత్రయ్యను భావిస్తున్నారు. ఆయన పదకవితలు నేటికీ సాంప్రదాయ నృత్యరీతులకు వెన్నెముకగా నిలిచి ఉన్నాయి. ఆయన 4, 500 కు పైగా పదాలు రచించాడు అని "వేడుకతో నడుచుకొన్న విటరాయుడే" అనే పదం వలన తెలుస్తున్నది. వాటిలో 1, 500 పదాల వరకు గోల్కొండ నవాబు అబ్దుల్లా కుతుబ్ షాకు అంకితమిచ్చాడు. ఈనాడు మనకు 330 పదాలు మాత్రమే లభిస్తున్నాయి.[1]-
క్షేత్రయ్య పదాలలో లలితమైన తెలుగుతనంతో పాటు చక్కని అలంకారాలు, జాతీయాలు ఎక్కువగా కనిపిస్తాయి. సంగీతానికి, సాహిత్యానికి సరైన ప్రాధాన్యము యిచ్చిన పదకర్తగా ఆధునికులు క్షేత్రయ్యను మిక్కిలి ప్రశంసించారు.
డాక్టర్ మంగళగిరి ప్రమీలాదేవి తన రచనలో క్షేత్రయ్య పదాలకు ఈ విశిష్టతలు ఉన్నాయని వివరించింది [1]-
- భావ విస్తృతికి అనువైన రాగ ప్రస్తారం.
- క్షేత్రయ్య పదాలకు సంగతులు పాడే అలవాటున్నది.
- ఈతని పదాలు రాగ భావ పరిపూరితాలు. రాగాలను భావానుగుణంగా ప్రయోగించడం తెలిసిన సంగీతజ్ఞుడు క్షేత్రయ్య. ఈయన తన పదాలలో సుమారు 40 రాగాలను ఉపయోగించాడు. త్రిపుట తాళంలో ఎక్కువ పదాలు పాడాడు.
- క్షేత్రయ్య పదాలు ఎక్కువగా అభినయం కోసం ఉద్దేశింపబడినవి. వీనిలో నృత్తానికి అవకాశం తక్కువ.దృశ్య యోగ్యాలైన శబ్దాలను ఎన్నింటినో చక్కగా వాడాడు.మూర్తి వర్ణన కూడా చాలా చక్కగా చేశాడు.
- ఒక్కమాటలో చెప్పాలంటే క్షేత్రయ్య పదం దృశ్య శ్రవణ సమసంబంధి! కళాహృదయ చైతన్య గ్రంథి! సంగీత సాహిత్య అభినయాలకు సముచిత ప్రాధాన్యత ఉన్న పదకవితలను రచించి క్షేత్రయ్య తరువాతివారికెందరికో మార్గదర్శకుడైనాడు.
క్షేత్రయ్య పదాల లక్షణాల గురించి డా. దివాకర్ల వేంకటావధాని ఇలా వ్రాశాడు[2]
- తెలుగులో గేయములను ఆరు విధాలుగా విభజింపవచ్చును - కృతులు, కీర్తనలు, తత్వములు, పదములు, జావళీలు, పాటలు. వీటిలో పదములు, జావళీలు అభినయానుకూలములు. అందునా పదములు రాగతాళవిలంబముతో కూడియుండును.
- క్షేత్రయ్య వట్టి పదకర్తయే కాదు. అలంకారశాస్త్రములో ప్రావీణ్యత సంపాదించి క్రొత్త పుంతలు త్రొక్కినాడు.
- పదములలో గొప్ప సంగీత కళాపాటవమును ప్రవేశపెట్టినవారిలో అగ్రగణ్యుడు క్షేత్రయ్య... అదివరకెవ్వరు రాగమునకిట్టి అందచందములు కూర్చలేదు. తరువాతి వాగ్గేయకారులకును, సంగీతకారులకును క్షేత్రయ్య మార్గదర్శియైనాడు.
- కాలప్రభావముననుసరించి అతడు తన పదములలో శృంగారమునకే అధిక ప్రాధాన్యతనిచ్చాడు.
- మనమెట్టి నాయికానాయకుల గురించి తెలుసుకోవాలన్నా గాని క్షేత్రయ్య పదాలలో చక్కని ఉదాహరణం లభిస్తుంది.
- భావ ప్రకటనమున క్షేత్రయ్య మిక్కిలి ప్రౌఢుడు. అతని పదములన్నియును వినివారి హృదయములకత్తుకొనే భావములకు ఉనికిపట్టు.
- ఆనాటి పలుకుబడులెన్నో అతని పదాలలో గోచరిస్తాయి. అతడు మారు మూల పదములు, జాతీయములు ఎక్కువగా వాడాడు. శబ్దరత్నాకరంలో అతని పదాలను విరివిగా ఉదహరించారు.
- క్షేత్రయ్య పదములు అభినయానుకూల్యమైనవి.
పూర్తి క్షేత్రయ్య పదాలు[మార్చు]
ఉదాహరణలు[మార్చు]
ఆనంద భైరవి రాగం - ఆదితాళం
పల్లవి:
శ్రీపతి సుతు బారికి నే-నోపలేక నిను వేడితే
కోపాలా? మువ్వ గోపాలా?
అనుపల్లవి:
ఏ ప్రొద్దు దానింటిలోనే-కాపైయుండి నీ సరస స
ల్లాపాలా? మువ్వ గోపాలా?
చరణాలు:
పైపూత మాటలు నేర్ప-జూపుదాని రతిపై నింత
తీపేలా? మువ్వ గోపాలా?
చూపుల నన్యుల దేరి-చూడని నాతో క
లాపాలా? మువ్వ గోపాలా?
నా పొందెల్ల దానికబ్బి-యే పొందును లేక యుసురనుటే
నా పాలా? మువ్వ గోపాలా?
ఇంతసేపు మోహమేమిరా ? ఇందరికంటే - నింతి చక్కనిదేమిరా ?
సుంతసేపు దాని - జూడకుండలేవు
అంతరంగము దెలుప - వదియేల మువ్వగోపాలా ! ||ఇంత||
నీకెదురుగ వచ్చునా ? నెనరూరగా - నిండు కౌగిట జేర్చునా ?
ఆకుమడుపు లిచ్చునా ? తన చెలిమి
కైన వాడని మెచ్చునా ? తమి హెచ్చునా ?
ఏకచిత్తమున మీరిద్దరు - నింపు సొంపుగ నున్న ముచ్చట
నాకు వినవిన వేడుకయ్యిరా ! యిపుడానతీరా ! ||ఇంత||
మోవి పానకమిచ్చునా ? కొసరి కొసరి - ముద్దులాడనిచ్చునా ?
తావి పువ్వుల దెచ్చునా ? తన సొగసుకు
తగినవాడని మెచ్చునా ? మనసిచ్చునా ?
దేవరే మొగడు గావలెనని - భావజుని పూజ లొనరించిన
యా వనిత పేరేమి సెలవీరా ? సిగ్గేలరా ? ||ఇంత||
సంతోషముగ నాడునా ? తంబుర మీట - సంచు పాట పాడునా ?
వింత రతుల గూడునా ? ఆ సమయమున
విడవకుమని వేడునా ? కొనియాడునా ?
సంతతము న న్నేలుకొని యా - కాంతపై వలచినపుడె యిక
కొంత యున్నదో మువ్వగోపాల ? గోరడ మేలా ? ||ఇంత||
ఇవి కూడా చూడండి[మార్చు]
- మహాకవి క్షేత్రయ్య సినిమా.
మూలాలు[మార్చు]
- క్షేత్రయ్య, దక్షిణాది భక్తపారిజాతాలు, శ్యామప్రియ, యస్.వి.యస్.గ్రాఫిక్స్, హైదరాబాదు, 2003.
- క్షేత్రయ్య - (తెలుగు వైతాళికులు సిరీస్ ప్రచురణ) - రచన: డా. మంగళగిరి ప్రమీలాదేవి - ప్రచురణ: తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (1996)
బయటి లింకులు[మార్చు]
- తెలుగు శోధన[permanent dead link]లో విస్సా అప్పారావు రచన - క్షేత్రయ్య పదములు.
- మధుర తంజావూరు నాయక రాజుల నాటి ఆంధ్ర వాఙ్మయ చరిత్ర - మధుర తంజావూరు నాయకరాజుల కాలంలో విలసిల్లిన సాహిత్యాన్ని గురించిన పరిశోధన.
- క్షేత్రయ్య పదములు- సాహిత్యము మంచాల జగన్నాధరావు
Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.
![]() |
Wikimedia Commons has media related to Paintings_of_men_from_Andhra_Pradesh. |
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- All articles with dead external links
- Articles with dead external links from జనవరి 2020
- Articles with permanently dead external links
- టాంకు బండ పై విగ్రహాలు
- Commons category link is locally defined
- సంగీతకారులు
- వాగ్గేయ కారులు
- తెలుగు కవులు
- కృష్ణా జిల్లా కవులు
- ప్రాచీన తెలుగు కవులు