Jump to content

రామదాసు

వికీపీడియా నుండి
భద్రాచల రామదాసు
భక్త రామదాసు
జననంకంచెర్ల గోపన్న
1620
నేలకొండపల్లి , ఖమ్మం జిల్లా
నివాస ప్రాంతంనేలకొండపల్లి , ఖమ్మం జిల్లా
ఇతర పేర్లుభక్త రామదాసు
వృత్తితహసిల్దారు(పాల్వంచ పరగణా)
ఉద్యోగంతహసిల్దారు
ప్రసిద్ధిభక్త రామదాసు
మతంహిందూ
భార్య / భర్తకమలమ్మ
పిల్లలురఘునాధ
తండ్రిలింగన్నమూర్తి
తల్లికామాంబ

భద్రాచల రామదాసు గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620 లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించాడు[1]. వీరి భార్య కమలమ్మ. ఈయన శ్రీరాముని కొలిచి, కీర్తించి, భక్త రామదాసుగా గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధం. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు. దాశరథీ శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. (కబీరుదాసు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ ఉంది).

ఉద్యోగమునకై మేనమామల సహాయం

గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానీషాగారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరగణా తహసిల్దారు పని లభించింది. గోదావరి తీరములోని భద్రాచల గ్రామం ఈ పరగణాలోనిదే. వనవాసకాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెననీ, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెననీ స్థలపురాణము.

ఆలయ నిర్మాణం

పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరి భక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయనిర్మాణానికి ధనం సేకరించాడు గాని, అది చాలలేదు. జనులు తమ పంటలు పండగానే మరింత విరాళములిచ్చెదమని, గుడి కట్టే పని ఆపవద్దనీ కోరినారు. అప్పుడు అతను తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంతసొమ్ము మందిర నిర్మాణ కార్యమునకు వినియోగించెను.

గోపన్నకు జైలు శిక్ష

ఈ విషయం తెలిసి కోపించిన నవాబుగారు గోపన్నకు 12 ఏండ్ల చెరసాల శిక్ష విధించాడు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులో నున్న రామదాసు గోడపై సీతారామలక్ష్మణాంజనేయులను చిత్రంచుకొని, వారిని కీర్తించుచూ, ఆ కరుణా పయోనిధి శ్రీ రాముని కటాక్షమునకు ఆక్రోశించుచూ కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలములోనే వెలువడినాయి. "నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి", "పలుకే బంగారమాయెనా", "అబ్బబ్బో దెబ్బలకునోర్వలేనురా" వంటివి. అతని బాధను వెళ్ళగక్కిన "ఇక్ష్వాకు కులతిలక, ఇకనైన పలుకవే రామచంద్రా", కీర్తన బాగా ప్రసిద్ధి చెందినది- "నీకోసము ఇంతింత ఖర్చు పెట్టాను. ఎవడబ్బ సొమ్మని కులుకుచున్నావు? నీబాబిచ్చాడా? నీ మామిచ్చాడా?" - అని వాపోయి, మరలా - "ఈ దెబ్బలకోర్వలేక తిట్టాను. ఏమీ అనుకోవద్దు. నా బ్రతుకిలాగయ్యింది. నీవే నాకు దిక్కు" - అని వేడుకొన్నాడు. అతను సీతమ్మ వారికి చేయించిన చింతాకు పతకము, లక్ష్మణునకు చేయంచిన హారము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణాలు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి.

రామ లక్ష్మణుల తిరిగి చెల్లింపు

అతని కర్మశేషము పరిసమాప్తి కాగానే, రామ లక్ష్మణులు తానీషా గారి వద్దకు వెళ్ళి, ఆరు లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి, రామదాసు విడుదల పత్రము తీసుకొన్నారని ప్రతీతి. ఆప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకం ముద్ర, మరొకవైపు రామభక్తుడు హనుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలిసుకున్న నవాబు వెంటనే ఆయనను విడుదల చేయించి, భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయం అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగింది.ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతుంది.[2].

వాగ్గేయకారులలో ఆధ్యుడు

శ్రీ రాముని సేవలో, సంకీర్తనలో రామదాసు తమ శేషజీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు ఇతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన - "ధీరుడౌ రామదాసుని బంధము దీర్చినది విన్నానురా రామా?" - ఇంకా ప్రహ్లాదవిజయములో "కలియుగమున వర భద్రాచలమున నెలకొన్న రామచంద్రుని పాదభక్తులకెల్ల వరుడనందగి వెలసిన శ్రీరామదాసు వినుతింతు మదిన్" - అన్నాడు .

పూర్తి రామదాసు కీర్తనలు విక్కీసోర్స్ లో

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

మూలాలు

  1. శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన, రచన: శ్రీవైష్ణవ వేణుగోపాల్, 2016, పేజీ 88
  2. శ్రీ వేపూరు హనుమద్దాసు కీర్తనలు - పరిశీలన, రచన: శ్రీవైష్ణవ వేణుగోపాల్, 2016, పేజీ 90
"https://te.wikipedia.org/w/index.php?title=రామదాసు&oldid=4273068" నుండి వెలికితీశారు