మంగళంపల్లి బాలమురళీకృష్ణ
మంగళంపల్లి బాలమురళీకృష్ణ (జూలై 6, 1930 - నవంబర్ 22, 2016) కర్ణాటక సంగీత గాయకుడు, వయొలిన్ విద్వాంసుడు, వాగ్గేయకారుడు, సినీ సంగీత దర్శకుడు, గాయకుడు.[1][2] ప్రపంచ వ్యాప్తంగా 25 వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చాడు.[1] 8 సంవత్సరాల అతి చిన్న వయసులోనే కచేరీ చేయడం ద్వారా బాలమేధావి అనిపించుకున్నారు. 1939నుంచీ అతను ప్రొఫెషనల్ కచేరీలు చేస్తూనే ఉన్నాడు. అతను వయోలిన్, మృదంగం, కంజీరా లాంటి వాయిద్యాలన్నీ బాగా వాయించగలడు. భక్తప్రహ్లాద సినిమాలో నారదుడిగా, సందెని సింధూరం అనే మలయాళం సినిమాలో నటించాడు. పలు చిత్రాలకు అతను సంగీతాన్ని అందించారు. పద్మభూషణ్, డాక్టరేట్లను వంటి బిరుదులను పొందాడు. ప్రపంచ స్థాయిలో ఫ్రాన్స్ ప్రభుత్వం నుండి చేవెలియర్ అఫ్ ఆర్డర్ అఫ్ ఆర్ట్స్ అండ్ లెటర్స్ గౌరవాన్ని అందుకున్నారు.[3] చెన్నై లోని తన స్వగృహంలో, మధ్యాహ్న భోజనం తరువాత నిద్రించి నిద్రలోనే అనాయాస మరణం పొందాడు.
బాల్యం , నేపథ్యం
బాలమురళీకృష్ణ 1930, జూలై 6న మద్రాసు రాష్ట్రం లోని, తూర్పు గోదావరి జిల్లా, రాజోలు తాలూకా, శంకరగుప్తంలో మంగళంపల్లి పట్టాభిరామయ్య, సూర్యకాంతమ్మ దంపతులకు జన్మించాడు.[1] ఈయన పుట్టిన 15 రోజులకే తల్లి మరణించడంతో,[1] ఆయన పెద్దమ్మ సుబ్బమ్మ సంరక్షణలో పెరిగాడు. మురళీకృష్ణ అని ఆమె ఆ శిశువుకు నామకరణం చేసింది. ఆయన కుటుంబీకులు వృత్తి రీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. తండ్రి పట్టాభిరామయ్య స్వగ్రామం సఖినేటిపల్లి మండలం అంతర్వేదిపాలెం. బాలమురళి పుట్టిన తర్వాత ఆమె అమ్మమ్మ ఊరైన గుడిమెళ్ళంకకు వచ్చారు. మురళీకృష్ణ చిన్నతనంలోనే తండ్రి పట్టాభిరామయ్య శిష్యులకు సంగీతం నేర్పిస్తుంటే ఈయన కూడా కూర్చుని నేర్చుకునేవాడు. కొచ్చర్లకోట రామరాజు అతను మొదటి గురువు. తరువాత తమిళనాడులో పక్షితీర్థానికి చెందిన సుబ్రహ్మణం అయ్యర్ దగ్గర కొన్నాళ్ళు శిష్యరికం చేశాడు. ఉన్నట్టుండి అతను కనపడకుండా పోవడంతో మళ్ళీ పెద్దకల్లేపల్లికి వచ్చి సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి దగ్గర చేరాడు. అతను తదనంతరం అతను శిష్యుడైన పారుపల్లి రామకృష్ణయ్య పంతులు దగ్గర ఉన్నత స్థాయి సంగీతం నేర్చుకుని విజయవాడలో స్థిరపడ్డాడు. పట్టాభిరామయ్య కూడా పారుపల్లి రామకృష్ణయ్య దగ్గరే సంగీతం నేర్చుకోవడం విశేషం.[4] ఈయన ప్రముఖ సంగీతకారుడు, వేణువు, వయోలిన్, వీణ విద్వాంసుడు. వయోలిన్ టీచర్ గా శంకరగుప్తంలో సంగీత తరగతులు నిర్వహించేవాడు.
1938 జూలైలో ఎనిమిదేళ్ళ ప్రాయంలో విజయవాడలో తన గురువు పారుపల్లి రామకృష్ణయ్య, అతను గురువు సుసర్ల దక్షిణామూర్తి పేరున ఏర్పాటు చేసిన సద్గురు ఆరాధనోత్సవాల సందర్భంగా మొట్టమొదటి సారిగా కచేరి చేశాడు.[5][6] ఇదే కార్యక్రమంలో అతని గానానికి ముగ్ధుడైన హరికథ విద్వాంసుడు ముసునూరి సత్యనారాయణ అతని పేరు మురళీకృష్ణకు ముందు బాల అని చేర్చి బాలమురళీకృష్ణ అని పిలిచాడు.[5]
వృత్తి జీవితం
బాలమురళీకృష్ణ చాలా చిన్న వయసులోనే తన వృత్తి జీవితాన్ని ప్రారంభించాడు. మరణించే వరకు ప్రపంచవ్యాప్తంగా సుమారు 25,000 కచేరీలు చేశాడు. సంగీతంలోని అన్ని విభాగాలలోను విస్తారమైన పాండిత్యము, మంత్రముగ్దులను చేసే గాత్రం, కంపోసింగ్ లో ప్రత్యేక శైలి అతన్ని సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలకు చేర్చింది. హిందుస్తానీ సంగీతంలోని సంగీతకారులతో కలిసి పనిచేశాడు. జుగల్ బందీ తరహా కచేరీల రూపకల్పనకి ఆద్యుడు. ఈ తరహా కచేరీ మొట్టమొదట పండిట్ భీమ్‌సేన్ జోషితో కలిసి ముంబయిలో నిర్వహించారు. పండిట్ హరిప్రసాద్ చౌరాసియా, కిషోరీ అమోన్కర్, మొదలగు వారితో కూడా జుగల్ బందీ కచేరీలు చేసాడు. ఈ కచేరీలు అతనికి దేశం మొత్తంలో ప్రజాదరణ తీసుకురావడమే కాక, సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి. బాలమురళీకృష్ణ వయోలిన్, వయోలా, వీణ, మృదంగం మెదలగు సంగీతవాయిద్యాలు వాయించడంలో ప్రావీణ్యం సంపాదించాడు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకొన్నాడు. ఇతను తిరుపతి తిరుమల దేవస్థానము, శృంగేరీ పీఠాలకు ఆస్థాన విద్వాంసుడు.[7]
కచేరీలు

తన చిన్నప్పుడు గురువు పారుపల్లి రామక్రిష్ణయ్య వెంట తమిళనాడు అంతా తిరిగాడు. అప్పట్లో ప్రతి ఊళ్ళోనూ రసికమణి అని పేరుమోసిన ఒక ధనవంతుడైన సంగీతప్రియుడుండేవాడు. అతని మెప్పు పొంది, వాళ్ళింటో కచేరీ చేస్తేనే యువ కళాకారులకి గౌరవం దక్కేది. చిన్నవయసులో గురువు వెంట వెళ్ళిన బాలమురళి వారందరి ముందరా గాత్రం వినిపించి బహుమతులూ, ప్రశంసలూ పొందడంతో అతనికి అనేక స్థానిక అవకాశాలు లభిస్తూ ఉండేవి. క్రమంగా ఈ పాతకాలపు పద్ధతులన్నీ వెనకబడడంతో సంగీతసభల ప్రాబల్యం పెరిగింది.
బాలమురళీకృష్ణ అమెరికా, కెనడా, బ్రిటన్, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, అనేక ఇతర దేశాలలో కచేరీలు చేశాడు. తెలుగులోనే కాక సంస్కృతం, కన్నడం, తమిళం, హిందీ, బెంగాలీ, పంజాబీ భాషలలో కూడా పాటలు పాడాడు. 2016, ఫిబ్రవరి 18 న అనకాపల్లిలో చివరిసారిగా కచేరీ చేశాడు.[8]
సినిమాలు
1957 జనవరి 12న విడుదలైన వరలక్ష్మీ పిక్చర్స్ వారి సతీ సావిత్రి సినిమా ద్వారా అతను గాయకుడుగా, సంగీత దర్శకుడిగా చిత్రరంగానికి పరిచయమయ్యాడు. తర్వాత ఆయన గాత్రధర్మానికి అనువైన చిత్రాల్లో సంగీత దర్శకులు ఆయనచేత పాడిస్తూ వచ్చారు. 1967లో రోజారమణి ప్రహ్లాదుడిగా, ఎస్. వి. రంగారావు హిరణ్యకశిపుడిగా నటించిన భక్త ప్రహ్లాద చిత్రంలో అతను నారదుడిగా నటించాడు. అదే సినిమాలో అతను ఆది అనాదియు నీవే దేవా, నారద సన్నుత నారాయణా, వరమొసగే వనమాలి పాటలు కూడా పాడాడు. అలాగే నర్తనశాల చిత్రంలో అతను పాడిన సలలిత రాగ సుధారస సారం, శ్రీరామాంజనేయ యుద్ధంలో మేలుకో శ్రీరామా, ముత్యాల ముగ్గు సినిమాలో శ్రీరామ జయరామ, గుప్పెడు మనసు చిత్రంలో మౌనమె నీ బాస ఓ మూగ మనసా, మేఘసందేశం చిత్రంలో పాడనా వాణి కల్యాణిగా మొదలైన పాటలు బహుళ ప్రజాదరణ పొందాయి.[9] కన్నడ సినిమా మధ్వాచార్యకు అతను అందించిన సంగీతానికి గాను 1986లో ఉత్తమ సంగీత దర్శకునిగా[10], హంసగీతెలో ఆలపించిన గీతానికి 1975లో ఉత్తమ సినీ గాయకునిగా[11] జాతీయ సినిమా పురస్కారాలు పొందారు.
బిరుదులు, పురస్కారాలు

బాలమురళీకృష్ణకి ఎన్నో బిరుదులు, పురస్కారాలు లభించాయి.
కర్నాటక సంగీతకారులలో పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అన్న 3 జాతీయ పురస్కారాలూ పొందిన ఏకైక వ్యక్తి బాలమురళీకృష్ణ. పద్మపురస్కారాల్లాంటి జాతీయ పురస్కారాలతో పాటు ఎన్నో విశ్వవిద్యాలయాల నంచి గౌరవ డాక్టరేట్లు అందుకున్నాడు. సినీ సంగీత దర్శకునిగానూ, సినీ గాయకునిగానూ జాతీయ అవార్డులు అందుకున్నారు.2001లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సంగీతంలో విశిష్ట పురస్కారం
ఆయనకు దక్కిన బిరుదులు, గౌరవాలలో కొన్ని
- సంగీత కళానిధి
- గాన కౌస్తుభగాన
- కళాభూషణ
- గాన గంధర్వ
- గాయక శిఖామణి
- జ్ఞాన శిఖామణి
- జ్ఞాన చక్రవర్తి
- గాన పద్మం
- నాథ జ్యోతి
- సంగీత కళా సరస్వతి
- నాథ మహర్షి
- గంధర్వ గాన సామ్రాట్
- జ్ఞాన సాగర
- కాళిదాస్ సమ్మాన్
మొదలైనవి. దేశ సమైక్యతకు కృషి చేసినందుకు గాను మహారాష్ట్ర గవర్నరు బాలమురళీకృష్ణని సన్మానించాడు.
పలువురి ప్రశంసలు
నరసాపురమునకు చెందిన కవికథకరత్న బిరుదాకింతుడు శ్రీ పెద్దింటి సూర్యనారాయణ దీక్షితదాస భాగవతులు, గారు మంగళంపల్లి బాలమురళీకృష్ణ రచించిన "జనకరాగ కృతి మంజరి"[12] అను గ్రంథములో మంగళా శాసనములను మూడు పద్య రత్నాల ద్వారా ఆశీస్సులు తెలియ పరిచారు.
రాగాలు
మహాతి, సుముఖం, సర్వశ్రీ, ప్రతి మధ్యమావతి, గణపతి, సిద్ధి అనే కొన్ని కొత్త రాగాలను కూడా ఆవిష్కరించాడు.[13] ఈ కొత్త రాగాలు కనిపెట్టడం వల్ల అతను కొన్ని విమర్శలకు కూడా గురయ్యాడు.[2]
జీవితంపై పుస్తకాలు
బాలమురళీకృష్ణ సాధికారిక సంక్షిప్త జీవిత చరిత్ర అనదగ్గ పుస్తకం బందా వెంకయ్య రాసిన “మురళీమాధురి”. ఈ పుస్తకంలో బాలమురళి చిన్ననాటి సంగతులు, అతను అభిమానులకు ఆసక్తి కలిగించే ఎన్నో విషయాలు ఉన్నాయి. దీనికి నూకల చినసత్యనారాయణ ఉపోద్ఘాతం రాశాడు.[14]
ఇవి కూడా చూడండి
మూలాలు
- 1 2 3 4 ఈనాడు, విలేఖరి. "నినువిడిచి..ఉండలేమయా!". eenadu.net. చెన్నై: ఈనాడు. the original నుండి 23 November 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- 1 2 "Indian music legend M Balamurali Krishna dies aged 86". bbc.com. బిబిసి. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- ↑ "French govt selects Balamuralikrishna for 'Chevalier' award". Zee News (in ఇంగ్లీష్). 2 May 2005. the original నుండి 3 December 2019 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 3 December 2019.
- ↑ బి. ఎం., సుందరం. "A prodigy and a genius" (PDF). dhvaniohio.org. dhvaniohio.org. the original (PDF) నుండి 24 జూలై 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- 1 2 రెంటాల, జయదేవ. "పలుకే బంగారమాయెనా!". sakshi.com. సాక్షి. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- ↑ కడివెళ్ళ, రామ్. "Torchbearer of innovation". thehindu.com. ది హిందూ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- ↑ వన్ ఇండియా వెబ్‌సైటులో బాల మురళీ కృష్ణపై వ్యాసం Archived 2007-06-30 at the Wayback Machine, జులై 1, 2007న సేకరించారు.
- ↑ "అనకాపల్లిలో చివరి కచేరి!". eenadu.net. అనకాపల్లి. the original నుండి 23 November 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- ↑ ఓలేటి, శ్రీనివాస భాను. "సలలిత రాగ సుధారససారం..బాలమురళి చలనచిత్ర సంగీత ప్రస్థానం". eenadu.net. హైదరాబాదు. the original నుండి 23 November 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- ↑ "34th National Film Awards" (PDF). Directorate of Film Festivals. the original (PDF) నుండి 29 October 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 7 January 2012.
- ↑ "23rd National Film Awards" (PDF). Directorate of Film Festivals. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 October 2011.
- ↑ "జనకరాగ కృతి మంజరి". archive.org.
- ↑ ప్రత్యేక, ప్రతినిథి. "Balamuralikrishna turns 81". thehindu.com. ది హిందూ. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
- ↑ కొడవటిగంటి, రోహిణి ప్రసాద్. "ఈమాటలో బాలమురళీకృష్ణపై వ్యాసం". eemaata.com. ఈమాట. the original నుండి 5 నవంబర్ 2016 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 23 November 2016.
{{cite web}}: Check date values in:|archive-date=(help)
బయటి లింకులు
- Pages using infobox person with unknown parameters
- పారుపల్లి రామకృష్ణయ్య పంతులు శిష్యపరంపర
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with MusicBrainz identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with faulty authority control identifiers (SBN)
- కర్ణాటక సంగీత విద్వాంసులు
- తెలుగువారిలో సంగీతకారులు
- సంగీత కళానిధి పురస్కార గ్రహీతలు
- 1930 జననాలు
- వాగ్గేయ కారులు
- తెలుగు లలిత సంగీత ప్రముఖులు
- 2016 మరణాలు
- తూర్పు గోదావరి జిల్లా సంగీత విద్వాంసులు
- తూర్పు గోదావరి జిల్లా గాయకులు
- తూర్పు గోదావరి జిల్లా సినిమా సంగీత దర్శకులు
- కళారంగంలో పద్మశ్రీ పురస్కార గ్రహీతలు