వీణ కుప్పయ్యర్
వీణ కుప్పయ్యర్18-19 శతాబ్దాలకు చెందిన వాగ్గేయకారుడు.[1] ఇతడు త్యాగరాజుకు ప్రీతిపాత్రుడైన ముఖ్యశిష్యుడు. ఇతడు మద్రాసు సమీపంలోని తిరువత్తియూరులో జన్మించాడు. ఇతని తండ్రి సాంబమూర్తి అద్భుతమైన ప్రతిభకల వీణావాదకుడు, గాయకుడు. "సాంబడు వాయించాలి సాంబడే (శివుడే) వినాలి" అని ప్రజలు సాంబమూర్తి ప్రతిభను గూర్చి చెప్పుకునేవారు. వీణ కుప్పయ్యర్ తమిళ బ్రాహ్మణుడు. భరద్వాజస గోత్రీకుడు. ఇతడు చిన్నతనము నందే సంగీత సాహిత్యాలలో గొప్ప పాండిత్యం సంపాదించాడు. ఇతడు వీణావాదనలో, గాత్రములో మంచి ప్రావీణ్యము పొందాడు. నారాయణ గౌళ రాగంలో విశేషమైన ప్రతిభ కలిగినందున ఇతడిని "నారాయణ గౌళ కుప్పయ్యర్" అనీ, "పాట కుప్పయ్యర్" అనీ పిలిచేవారు. ఇతడికి "గాన చక్రవర్తి" అనే బిరుదు కూడా ఉంది. వేణుగోపాల స్వామి ఇతని కులదైవం. ఇతడు ప్రతియేటా చైత్రపౌర్ణమికి, వినాయక చవితికి రెండు సార్లు వేణుగోపాలస్వామి ఉత్సవాలు జరిపేవాడు. ఆ సమయంలో ప్రముఖ విద్వాంసులతో కచేరీలు 10 రోజులు ఏర్పాటు చేసేవాడు. రాధారుక్మిణీ సమేతుడైన వేణుగోపాలుని చిత్రపటాన్ని అలంకరించి తన ఇంటి హాలులో పెట్టి పూజలు చేసేవాడు. ఒకసారి ఉత్సవాల సమయంలో త్యాగరాజు అక్కడకు విచ్చేసి జగన్మోహనుడైన వేణుగోపాలుని చూసి "వేణుగానలోలుని గన వేయి కన్నుల కావలనె" అని కేదారగౌళ కృతిని ఆలపించాడు. వీణ కుప్పయ్యర్ తన కృతులలో "గోపాలదాస" అనే ముద్రను వాడాడు. కుప్పయ్యర్ తన నివాసాన్ని మద్రాసు ముత్యాలపేటలోని రామస్వామి వీధిలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇతనికి ఇద్దరు భార్యలు. కృష్ణస్వామి, రామస్వామి, త్యాగయ్యర్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. వీరిలో త్యాగయ్యర్ వాగ్గేయకారుడిగా పేరుగడించాడు.
రచనలు
[మార్చు]ఇతడు అనేక వర్ణాలు, కృతులు, తిల్లానలు రచించాడు. తానవర్ణ రచయితగా ఇతనికి గొప్ప పేరు ఉంది. ఇతడు తన రచనలను తెలుగులోను, సంస్కృతంలోను రచించాడు. రీతిగౌళ, నారాయణ గౌళ రాగాలలో అద్భుతంగా వర్ణాలను రచించాడు. కృతుల రచనలలో ఇతడు తన గురువు త్యాగరాజు పోకడలను పాటించాడు. కృతులలో చిట్టిస్వరములు వ్రాయడం ఇతనికి మక్కువ.
ఇతని కృతులలో కొన్ని ముఖ్యమైనవి:
- వేంకటేశ్వర పంచరత్నాలు:
- మమ్ముబ్రోచు - సింహ్మేంద్ర మధ్యమం
- నన్ను బ్రోవ - ముఖారి
- సరోజాక్ష - సావేరి
- నీవే దిక్కని - దర్బారు
- బాగు మీరగను - శంకరాభరణం
- శ్రీకాళహస్తీశ్వర పంచరత్నాలు:
- కొనియాడిన - కాంభోజి
- నన్ను బ్రోవరాదా - సామ
- బిరాన నన్నుబ్రోవ - హంసధ్వని
- సామగానలోల - సాళగ భైరవి
- సేవింతమురా - శహన
- తామసమేలనమ్మ - సురటి
- నా మొరాలకించి - ధన్యాసి
- నిన్నే నెరనమ్మితి - భైరవి
- పర దేవీ నీ పాదములే - సురటి
- తల్లీ నా మీద ఇంతదయ - సురటి
- నీ సహాయము లేని - దేవగాంధారి
- జో జో జో జో దేవి - కేదార గౌళ
- నీ దివ్యపాదములకు - సురటి
- పరమాత్ముని మానసము గన - ఖమాసు
- కనికరము లేకపోయె - ఆనందభైరవి
- మనవ్యాలకించవే దేవి - ఖమాసు
- ఇంత పరాకేలనమ్మా - బేగడ
- జగదభిరామ - కానడ
- పరాకేలజేసేవు - గౌరీమనోహరి
ఇతని రచనలన్నింటిని ఇతని కుమారుడు తిరువత్తియూర్ త్యాగయ్యర్ "పల్లవి స్వరకల్పవల్లి" అనే పేరుతో పుస్తకరూపంలో అచ్చొత్తించాడు.[2]
శిష్యులు
[మార్చు]ఇతని శిష్యులలో కొందరు ప్రసిద్ధులు:
- తిరువత్తియూర్ త్యాగయ్యర్ (వీణ కుప్పయ్యర్ కుమారుడు)
- పల్లవి సీతారామయ్య
- ఫిడేల్ పొన్నుస్వామి
- కొత్త వాసల్ వేంకట్రామయ్యర్
మూలాలు
[మార్చు]- ↑ కోవెల, శాంత. సంగీత సిద్ధాంత సోపానము. pp. 40–43.
- ↑ మధురిమ. "వేణుగోపాల భక్తశిరోమణి శ్రీ వీణ కుప్పయ్యార్". అచ్చంగా తెలుగు. Archived from the original on 11 జనవరి 2019. Retrieved 10 December 2017.