జి.ఎన్.బాలసుబ్రమణియం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జి.ఎన్.బాలసుబ్రమణియం
1940లో విడుదలైన తమిళ చిత్రం శకుంతలైలో జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి
వ్యక్తిగత సమాచారం
జననం(1910-01-06)1910 జనవరి 6
మూలంగుడలూరు, మాయవరం, తంజావూరు జిల్లా, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటీషు ఇండియా
మరణం1965 మే 1(1965-05-01) (వయసు 55)
మద్రాసు, మద్రాసు రాష్ట్రము, భారతదేశం
సంగీత శైలికర్ణాటక సంగీతం - భారతీయ శాస్త్రీయ సంగీతం
వృత్తిగాయకుడు
క్రియాశీల కాలం1920–1965
బంధువులుఆర్. విశ్వేశ్వరన్ (మేనల్లుడు)

గుడలూరు నారాయణస్వామి బాలసుబ్రమణియన్ (6 జనవరి 1910 – 1 మే 1965) ఒక భారతీయ కర్ణాటక సంగీత విద్వాంసుడు. ఇతడు, సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్, మదురై మణి అయ్యర్ ముగ్గురినీ 20వ శతాబ్దపు కర్ణాటక సంగీత త్రిమూర్తులుగా పిలుస్తారు. ఇతడు లయను నియంత్రించి గమకాలను తగ్గించడం ద్వారా కర్ణాటక సంగీతానికి కొత్త సొబగులు తీసుకు వచ్చాడు.[1] ఇతడు కొన్ని తమిళ సినిమాలలో నటించాడు.

ఆరంభ జీవితం

[మార్చు]

జి.ఎన్.బాలసుబ్రమణియం (జి.ఎన్.బి) తమిళనాడు, మాయవరం సమీపంలోని గుడలూరు అనే చిన్న గ్రామంలో 1910, జనవరి 6న జి.వి.నారాయణస్వామి అయ్యర్, విశాలాక్షి దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి నారాయణస్వామి అయ్యర్ సంగీత ప్రియుడు. ఇతడు మొదట తన తండ్రి వద్ద, తరువాత మదురై ఎస్.సుబ్రహ్మణ్య అయ్యర్ వద్ద సంగీతం అభ్యసించాడు. అరియకుడి రామానుజ అయ్యంగార్ ను తన మానసిక గురువుగా స్వీకరించాడు. ఇతని విద్యాభ్యాసం మద్రాసు ట్రిప్లికేన్‌లోని హిందూ హైస్కూలులో నడిచింది. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో ఇంగ్లీషులో బి.ఎ.ఆనర్స్ చదివాడు. తరువాత అన్నామలై విశ్వవిద్యాలయంలో టి.ఎస్.సబేశ అయ్యర్ మార్గదర్శకత్వంలో సంగీతంలో స్వల్పకాలిక కోర్సులో చేరాడు. అయితే అనారోగ్యం వల్ల ఆ కోర్సును పూర్తి చేయలేక పోయాడు. తరువాత మద్రాసు విశ్వవిద్యాలయంలో సంగీతంలో డిప్లొమా కోర్సులో మొదటి బ్యాచిలో చేరాడు. అప్పుడు టైగర్ వరదాచారి ఇతని గురువు. ఇతడు 2 సంవత్సరాలలోనే కచేరీలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు. ఇతడు తన మొదటి సంగీతకచేరీ 1928లో చేశాడు.

వృత్తి

[మార్చు]

ఇతడు భామావిజయం (1934), సతీ అనసూయ (1937),శకుంతలై (1940), ఉదయనన్ వాసవదత్త (1947) (వైజయంతిమాల తల్లి వసుంధరాదేవితో కలిసి), రుక్మాంగధరన్ (1947) మొదలైన తమిళ సినిమాలలో నటించాడు. భామావిజయంలో నారదుని పాత్ర, వాసవదత్తలో ఉదయనన్ పాత్ర, శకుంతలైలో దుష్యంతుని పాత్రలు ధరించాడు. శకుంతలై చిత్రంలో ఎం.ఎస్. సుబ్బులక్ష్మి ఇతని సరసన నటించింది. కొన్ని సినిమాలలో నటించిన తర్వాత ఇతడు కర్ణాటక సంగీతానికే పరిమితమై 1965లో మరణించే వరకూ ఆ రంగంలోనే కొనసాగాడు.

ఇతడు ప్రతి కచ్చేరీలోను వందలాది శ్రోతలను తన గానమాధుర్యంతో ఆకట్టుకునేవాడు. ఇతని కచేరీలకు శ్రోతలతో హాలు నిండిపోయి, హాలు బయటి నుండి 4 గంటలపాటు నిలబడి ఇతని పాటలను వినడానికి ప్రయత్నించేవారని కథనాలు ఉన్నాయి. ఇతడు పాడే ముఖ్యమైన పాటలలో హంసధ్వని రాగంలో ముత్తుస్వామి దీక్షితార్ గారి "వాతాపి గణపతింభజే", అదే రాగంలో ఇ.వి.రామకృష్ణ భాగవతార్ గారి "వినాయకా నిను వినా", పంతువరాళి రాగంలో త్యాగరాజు రచించిన "పరిపాలయ సరసీరుహ" మొదలైన కీర్తనలు ఉన్నాయి.

ఇతడు తన జీవితకాలంలో అనేక గ్రామఫోన్ రికార్డులు పాడి విడుదల చేశాడు. ఇతడు కళ్యాణి రాగంలో పాడిన త్యాగరాజ కృతి "వాసుదేవాయని" ఇతనికి ఆ రోజులలోనే 10,000 రూపాయలు ఆదాయాన్ని సంపాదించి పెట్టింది.

ఇతడు అనేక మంది శిష్యులను తయారు చేశాడు. వారిలో ఎం. ఎల్. వసంతకుమారి, రాధ జయలక్ష్మి, తంజావూరు ఎస్.కళ్యాణరామన్, త్రిచూర్ వి.రామచంద్రన్, టి.ఆర్.బాలు, టి.ఎస్.బాలసుబ్రమణియన్, రాగిణి మొదలైనవారు ముఖ్యులు.[1]

భారత ప్రభుత్వ ఉత్తర్వుతో ఇతడు చాలా సంవత్సరాలు ఆలిండియా రేడియో కర్ణాటక సంగీతపు డెప్యుటీ ఛీఫ్ ప్రొడ్యూసర్ అయ్యాడు. ప్రధాన నిర్మాత అయ్యారు. ఆ సమయంలో సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్ కర్ణాటక సంగీతానికి ఛీఫ్ ప్రొడ్యూసర్‌గా, మంగళంపల్లి బాలమురళీకృష్ణ లలిత సంగీతానికి ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇతడు తిరువనంతపురం లోని స్వాతి తిరునాళ్ సంగీత కళాశాలలో అధ్యాపకునిగా చేరి 1964లో ఆ కళాశాల ప్రిన్సిపాల్ అయ్యాడు.

స్వరకల్పన

[మార్చు]

ఇతడు 250కి పైగా కృతులను, వర్ణనలను, తిల్లానలను స్వరపరిచాడు. ఇతని వర్ణనలలో కొన్ని అపురూపమైన రాగాలు ఉన్నాయి. ఇతడు ఎక్కువగా తెలుగు కీర్తనలను, కొన్ని తమిళ, సంస్కృత కీర్తనలను స్వరపరిచాడు. ఇతడు కొన్ని కొత్త రాగాలను కూడా సృష్టించాడు. ఇతని స్వరకల్పనలో వచ్చిన కొన్ని తెలుగు సంగీత కృతులు[2]:

పల్లవి రకం రాగం తాళం
అంబోరుహ పాదమే నమ్మితి అఖిల జగన్మాతే వర్ణం రంజని ఆది
భారమా ఈ బాలుని బ్రోవ పరాశక్తి పతిత పావని కృతి హంసానాదం ఆది
ఎంతో మొరలిడ లేదా ఇంత తామసమేల కృతి కన్నడ రూపక
గతి వేరెవరమ్మా కామాక్షమ్మా కృతి భైరవి మిశ్రచాపు
ఇంత పరాకు నీవే జేసితే ఎందు బోదునే కృతి భైరవి ఆది
కరుణ జూడ రాదా తల్లి తనయుడనే కాదా జగన్మాతా కృతి సహన ఆది
మనసారకనే నమ్మక లేదా మా తల్లి నీకే తెలియ గాదా కృతి ఆభోగి ఆది
మరివేరే గతి నాకెవరు ఈ మహిలోన నిన్ను వినా అంబ కృతి మాళవి ఆది
మరవను నే నిన్ను మరవను నే మరకతాంగి మా రమణ సోదరి కృతి ఆరభి ఆరభి
నాకభయ వరమొసగి నన్ను బ్రోవవే అంబ కృతి నాటకురింజి రూపకం
నీ చరణాంబుజమును నెరనమ్మితి నీరజాక్షి కృతి కీరవాణి ఆది
నీ దయరాదా నీరజాక్షి నా తరమెరిగి నన్నేలుకో వర్ణం ఆందోళిక ఆది
నీ పాదమే గతి నళినకాంతిమతి కృతి నళినకాంతి రూపక
నీ సమానమెవరు లేరని నే పొగడ తరమా తల్లి కృతి శుభపంతువరాళి ఆది
నిరవధి సుఖ దాయకి నిన్నే నమ్మక లేదా కృతి మలయమారుతం రూపక
పరితాపములేక పతిత నాపై పరిహాసమెందుకు తల్లి కృతి షణ్ముఖప్రియ ఆది
పరాన్ముఖమేల నమ్మ పరాధీన పతిత నాపై కృతి కానడ ఆది
పరమకౄపా సాగరీ పాహి పరమేశ్వరి కృతి యదుకుల కాంభోజి రూపకం
సంతతము నిన్నే కోరితిని సకల భాగ్యదాయిని నీవేయని కృతి వలజ్ ఆది
శంకర మహాదేవ మనోహరి చరణాంబుజమును సదా నమ్మితి కృతి దేవమనోహరి ఆది
మారకోటి సుందరి మానిని మామవ సదా జగన్మోహిని కృతి బహుదారి ఆది
కువలయాక్షి కుశలం కురు భవరోగ హరి భవాని కృతి కదనకుతూహలం ఆది
నిన్ను పొగడ తరమా తల్లి కృతి కుంతల వరాళి ఆది
నిన్ను వినా వేరెవరు నన్ను రక్షించుదురు కృతి మాళవి రూపక
నిరతముగా నిన్నే శరణంటి నీరజ సమవదని అంబా కృతి ఉదయ రవిచంద్రిక ఆది
తామసమిక తాళను తాపత్రయ శమని అంబ కృతి ఆభోగి రూపక
వదరేరమ్మ నీ పాద మహిమ ఇంచుకైన తెలియక కృతి సావేరి ఆది
నా మొరలను వినరాదా నారాయణి నాతో వాదా కృతి నారాయణి రూపక
నన్ను బ్రోవ నీ కరుదా నామీద దయలేదా కృతి కాంభోజి రూపక

మరణం

[మార్చు]

ఇతడు తన 55వ యేట 1965, మే 1వ తేదీన అనారోగ్యంతో మరణించాడు.

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 "GNB, the good friend". The Hindu. 23 May 2003. Archived from the original on 6 జూన్ 2011. Retrieved 10 ఫిబ్రవరి 2021.
  2. "జి.ఎన్.బి.స్వరపరచిన సంగీత కృతుల వివరాలు". Archived from the original on 2021-01-11. Retrieved 2021-02-11.

బయటి లింకులు

[మార్చు]

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జి.ఎన్.బాలసుబ్రమణియం పేజీ