సిద్దేంద్ర యోగి

వికీపీడియా నుండి
(సిద్ధేంద్ర యోగి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సిద్దేంద్ర యోగి
సిద్దేంద్ర యోగి
సిద్దేంద్ర యోగి
సిద్దేంద్ర యోగి

సిద్ధేంద్ర యోగి (1672 - 1685) ప్రసిద్ధ కూచిపూడి నాట్యాచార్యుడు. కూచిపూడి నాట్యానికి ఇతను మూలపురుషుడని జనశ్రుతిలోని మాట. ఇతడు ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామానికి చెందినవాడు. ఇతని గురువు నారాయణ తీర్థులు.

జీవితం[మార్చు]

గోలి శివరామ్‌ చిత్రించిన సిద్ధేంద్రయోగి వర్ణచిత్రం

సిద్ధేంద్రయోగి జీవితాన్ని గురించి స్పష్టమైన ఆధారాలు లేవు. కనుక జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న కథలే ప్రస్తుతం లభించిన ఆధారాలు. సిద్ధేంద్రయోగి పూర్వనామం సిద్ధప్ప అనీ, ఇతడు కూచిపూడి వాస్తవ్యుడనీ అనుకోవచ్చును. కూచిపూడి, మొవ్వ, శ్రీకాకుళం, ఘంటసాల ప్రాంతాలు అప్పుడు సమీపంలోనే ఉన్న సాంస్కృతిక కేంద్రాలు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణ తీర్ధులు 1580-1680 మధ్యకాలంవాడు కావడం వలనా, సిద్ధేంద్రయోగి సమకాలికుడైన క్షేత్రయ్య 1590-1675 కాలంలో ఉన్నాడనడంవల్లా, సిద్ధేంద్రయోగి 1600-1700 మధ్యకాలంలో జీవించినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

ఈయన గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. సిద్ధేంద్ర కాశీలో చదువుకుంటున్నప్పుడు, భార్య గర్బాధానానికి సిద్ధమైనది అని కబురు వస్తుంది. యువ రక్తంలోని సహజ సిద్దమైన తొందరతో, ఆతురతతో, వేగంగా, ఉత్సాహంగా భార్య కడకు బయలుదేరి వస్తాడు, కాని, కూచిపూడి దగ్గరకు రాగానే కృష్ణానది పొంగి పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. అలలమీద అయినా నదిని దాటుదామని సిద్ధేంద్ర నదిలోకి దూకుతాడు. కాని దురదృష్టవశాత్తూ నది మధ్యలోకి రాగానే, నదిలో మునిగిపోవడం మొదలెడతాడు. 'ఇక ఎలాగైనా చావు తప్పదు' అని అనుకొని "కనీసం పుణ్యమైనా దక్కుతుందని" అక్కడికక్కడే తనకు తానే మంత్రం చెప్పుకొని సన్యాసం స్వీకరిస్తాడు. సంసార సాగరాన్ని దాటించగల ఆ కృష్ణ భగవానుడు, సిద్ధేంద్రను కృష్ణా నది కూడా దాటిస్తాడు. ఇక ఇంటికి వెళ్ళి, భార్యను పీటలపై కూర్చోమంటే, భార్య సిద్ధేంద్రను ఇతనెవరో గడ్డాలు, మీసాలు ఉన్న సన్యాసి, నా మొగుడు కాదు అని అంటుంది. అప్పుడు జరిగిన కథ చెప్పి, భార్యకి కృతజ్ఞతలు చెప్పి, మరలా పెద్దలందరి అనుమతితో సన్యాసం తీసుకుంటాడు. ఈ కథకే చిన్న చిన్న రూపాంతరాలున్నాయి.

మరొక కథ ప్రకారం సిద్ధప్ప తల్లిదండ్రులు నిరుపేదలు, అంధులు కూడాను. ఎలాగోలా తల్లిదండ్రులను పోషిస్తున్న సిద్ధప్పను మెచ్చి శంకరాచార్యుడనే గురువు (లేక నారాయణ తీర్థులు) సిద్ధప్పకు కృష్ణమంత్రోపదేశం చేశాడట. మంత్రోపదేశం పొందిన సిద్ధప్ప శ్రీకృష్ణునిగురించి ఆడుతూ పాడుతూ ఉండేవాడట. శ్రీకృష్ణుడే స్వయంగావచ్చి అతనితో ఆడిపాడేవాడట. వారి సాంగత్యం మూలంగా సిద్ధప్ప తల్లిదండ్రులకూ శ్రీకృష్ణుని దర్శనమూ, ముక్తీ లభించాయట. ఆవెనక కూచిపూడి భాగవతులు భాగవతవేషం కట్టడం పరిపాటి అయినదట.

మరొక కథప్రకారం సిద్ధప్ప శ్రీకాకుళంలోని పేదబ్రాహ్మణుడు. ఇల్లువదలివెళ్ళి ఉడిపిలో గురుశుశ్రూష చేసి సంగీత నృత్య పాండిత్యాలలో నిష్ణాతుడయ్యాడు. గురువు ఆశీస్సులతో తిరిగి శ్రీకాకుళం వచ్చి కృష్ణానదిని దాటే సమయంలో ఆపద్ధర్మంగా సన్యాసం తీసుకొన్నాడు. మరొక కథ ప్రకారం సిద్ధప్ప రాయలసీమనుండి దేశాటనచేస్తూవచ్చిన బ్రహ్మచారి. కూచిపూడిలో సువాణం జోగావధానులు తన కుమార్తెనిచ్చి పెండ్లి చేశాడు. వివాహానంతరం అక్కడే స్థిరపడిన సిద్ధప్ప శాస్త్రాలను అభ్యసించి, అభినయంలో అద్భుతమైన పాండిత్యాన్ని గడించి క్రమంగా సిద్ధేంద్రయోగి అయ్యాడు.

కూచిపూడి నాట్యం[మార్చు]

ఆంధ్రదేశంలో నృత్యసంప్రదాయం రెండు పద్ధతులలో వర్ధిల్లింది (1) నట్టువమేళ సంప్రదాయము - ఆలయాలలో జరిగే ఆరాధనా నృత్యాలు, కళ్యాణ మంటపాలలో చేసే నృత్యాలు. (2) నాట్యమేళ సంప్రదాయము - భరతుని నాట్యశాస్త్రంలో చెప్పిన విధానికి అనుగుణంగా ఉంది. ఇది నృత్యనాటకము. ఇందులో నర్తకుల సంఖ్య ఎక్కువ. నాట్యమేళాలలో "కలాపములు" ప్రసిద్ధి చెందినవి. వీటిలో భామాకలాపము రచించి, ప్రచారంలోనికి తెచ్చినవాడు సిద్ధేంద్రయోగి. ఈ కూచిపూడి గ్రామం కృష్ణాజిల్లాలోని దివిసీమలో ఉంది. దీనికి సమీపంలోనే మొవ్వ, పెదపూడి, ఘంటసాల, శ్రీకాకుళం వంటి ప్రసిద్ధ సాంస్కృతిక, చారిత్రిక ప్రదేశాలున్నాయి.

సిద్ధేంద్ర యోగి చిత్రపటం

ప్రస్తుత కూచిపూడి నాట్యరీతి, సిద్ధేంద్ర యోగి స్థాపించిన నృత్యనాటక సంప్రదాయం, భాగవత మేళనాటకం నుండి ఆవిర్భవించింది. సిద్ధేంద్రయోగికి ముందే, అనగా 14వ, 15వ శతాబ్దాలలో కూచిపూడి భాగవతులు ఊరూరా ప్రదర్శనలిచ్చేవారని "మాచపల్లి కైఫీయతు" ద్వారా తెలుస్తున్నది. రకరకాలుగా విస్తరించిన కూచిపూడి నాట్యాన్ని సిద్ధేంద్రయోగి క్రమబద్ధం చేశాడని మనం గమనించవచ్చును.

కూచిపూడి నృత్యానికి ఆద్యుడై సిద్ధేంద్ర యోగి భామా కలాపం రచించాడు. ఇందులో కృష్ణుడు, సత్యభామ, రుక్మిణి ప్రధాన పాత్రలు. తన ఊరిలోని మగవారితోనే ఆడవేషాలు వేయించి ఆడించాడు. సిద్ధేంద్ర యోగి యక్షగానాలకు మెరుగులు దిద్ది, భరతుని నాట్యశాస్త్ర రీతులను తన కూచిపూడి నాట్యంలో ప్రవేశపెట్టాడు. శాస్త్రీయ నాట్యరీతుల్ని జానపదకళా నృత్యాలతో మేళవించాడు. తనను కృష్ణానదిలో మునిగి పోకుండా కాపాడిన ఆ కృష్ణుని స్తుతిస్తూ, సిద్ధేంద్ర యోగి పారిజాతాపహరణం నృత్యనాటికను వ్రాశాడనీ, అది కూచిపూడి నృత్యనాటకాలలో అతి పురాతనమైనదనీ చెబుతారు. .

ఇతర విశేషాలు[మార్చు]

భామా కలాపం[మార్చు]

సిద్ధేంద్రయోగి అంతకుముందే భాగవతులచేత అనేక వేషాలు వేయించియున్నాడు. శ్రీకాకుళంలోని ఆంధ్రవిష్ణువు దేవాలయంలో దేవదాసీలు భగవంతుని సేవగా చేసే నృత్యాన్ని పరిశీలించియున్నాడు. ఉడిపిలో సంగీత, సాహిత్య అభినయాలను కూలంకషంగా అభ్యసించాడు. సిద్ధేంద్రయోగి గురువైన నారాయణతీర్ధులు సంస్కృతంలో రచించిన కృష్ణలీలా తరంగిణి, తెలుగులో రచించిన పారిజాతాపహరణమూ దక్షిణదేశంలో అప్పటికే ప్రచారంలో ఉన్నాయి. పారిజాతాపహరణం కథనే తెలుగులో "పారిజాతం" అనే పేరుతో నృత్యనాటికగా సిద్ధేంద్రయోగి రచించాడు. అదే "భామాకలాపం"గా ప్రసిద్ధి చెందింది. ఆ భామాకలాపాన్ని కూచిపూడిలోని బ్రాహ్మణుల పిల్లలకు బోధించాడు. కూచిపూడిలో పుట్టిన ప్రతిమగపిల్లవానికి సిద్ధేంద్రుని పేరుచెప్పి, ముక్కు కుట్టి, కాలిగజ్జె కట్టి, ఆ పిల్లవాడు పెద్దయ్యాక ఏ వృత్తిని అవలంబించినా గాని స్వామి సన్నిధిలో భామవేషం వేసి తీరాలని, స్త్రీలకు ఈ కళలో ప్రవేశం ఉండరాదని సిద్ధేంద్రుడు శాసించాడు. ఆ నియమం చాలాకాలంవరకూ కొనసాగింది. భామాకలాపం రచనావిధానం యక్షగానరీతిలో ఉన్నాగాని దాని ప్రదర్శన రీతి విశిష్టమైనది. భామాకలాపంలో నృత్యము, సంగీతము ప్రాధాన్యం వహిస్తాయి. ఇందులో నాయిక సత్యభామ. నాయకుడు కృష్ణుడు. చెలికత్తె మాధవి మరో ముఖ్యమైన పాత్ర. 'కలాపము' అంటే 'కలత' లేదా 'కలహము' అని అర్ధము.భామాకలాపము విఘ్నేశ్వరస్తుతితో (శ్రీ విఘ్నేశ్వర పాదపద్మములనే సేవించి నా యాత్మలో అని)ఆరంభమవుతుంది. ఆ వెనుక సరస్వతీప్రార్ధన ఉంటుంది. వెన్నెలపదం పాడుతూ సత్యభామ ప్రవేశించడంతో కథ ఆరంభమవుతుంది. నేవెవరవు అని చెలికత్తె అడుగుతుంది. అప్పుడు సత్యభామ

భామనే సత్యభామనే
భామరో శృంగార జగదభిరానే
ముఖవిజిత హేమాధామనే
ద్వారకాపురాఢ్యురామనే
వయ్యారి సత్యాభామనే

అనే దరువును పాడుతుంది. ఆ వెనుక అత్తమామల ప్రశస్తి చెప్పి, సత్యభామ హరి ఎక్కడున్నాడని అడిగి, అనంతరం భుదేవిని ప్రశస్తిస్తుంది. తరువాత దరువు, వెన్నెల పదము, మరికొన్ని దరువులు శ్రీకృష్ణునితో కలిసి పాడుతుంది. ఈ సందర్భంలోనే దశావతార వర్ణన సంవాదపూర్వకంగా సాగుతుంది. మంగళహారతితో భామాకలాపం ముగుస్తుంది. భామాకలాపం కొన్నిమార్పులు పొందింది. సిద్ధేంద్రుని పారిజాతంలో తొలిఘట్టమే భామాకలాపం. అయితే అనంతర ప్రదర్శనలలో పారిజాతం కథను తీసివేసి, సత్యభామ అష్టవిధ కథానాయికలుగా అభినయించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అలా మార్పులు చేసినవారిలో ముఖ్యుడు పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఆకివీడు వాస్తవ్యుడు మంగు జగన్నాధ పండితుడు. సిద్ధేంద్రునికి రెండువందల సంవత్సరాల తరువాతివాడు. తరువాత క్రమంగా మహిళలు భామాకలాపం ప్రదర్శనలో అగ్రగాములైనారు.

భామా కలాపం[మార్చు]

సిద్ధేంద్రయోగి గొల్లకలాపాన్ని కూడా రచించాడు. కాని గొల్లకలాపము భాగవతుల రామయ్య రచన అని మరికొందరి అభిప్రాయము. (ఇది సిద్ధెంద్రయోగి రచన అనడంలో సందేహం లేదని డా. ఎన్. గంగప్ప తన రచనలో పేర్కొన్నాడు.) గొల్లకలాపంలో నాయిక రేపల్లెవాడలోని గొల్లభామ. "చల్లోయమ్మ చల్ల" అంటూ గొల్లవనిత బ్రాహ్మణ పండితులతో వివాదంలో పడడం ఈ రచన ఇతివృత్తం. ఈ వివాదంలో మానవుని జననంనుండి మరణంవరకు, చల్లనుండి వెన్న తీయడం మొదలు జీవాత్మ పరమాత్మల సంబంధం వరకు మానవజీవితాన్ని గురించి, సృష్టిని గురించి చర్చిస్తారు.

ఇతని గురించిన కథ[మార్చు]

హంసలదీవి దీవి సుబ్బారావు రచించిన కవితల పుస్తకం నుండి

చెప్పబోయేది
సుమారు మూడు వందల యేబది యేళ్ళ క్రితం సంగతి

చదువు కోసం కాశీ వెళ్ళి
కూచిపూడి నుండి ఓ అబ్బాయి
అక్కడే వున్నాడు పదిపన్నెండేళ్ళు

అక్కడుండగా వచ్చింది కబురు
ఇంటి దగ్గర భార్య ఈడేరిందనీ
గర్బాధానానికి ముహూర్తం కూడా కుదిరిందనీ

ఇంకేం బయలుదేరాడు సంతోషంగా
ఉరుకులు పరుగులు దారంతా
ఊరు దగ్గర పడుతుండగా
కృష్ణ కనిపించింది వురవళ్ళు పరవళ్ళుగా

యువకుడు గదా
దిగాడు ధైర్యం చేసి
తెలిసింది గాదు వరద వుధృతం దిగాక గాని
సగం దూరం పనికి వచ్చింది వచ్చిన ఈత
ఇక ఖాయమనుకొన్నాడు మునక

సన్యాసం పుచ్చుకొన్నాడు అక్కడికక్కడ
తనకు తానే మంత్రం చెప్పుకొని
పోయే ముందు పుణ్యమన్నా దక్కుతుందని

ఒకే సారి జరిగాయి
అట్లా ఆయన చేతులెత్తేయటం
ఇట్లా ఒక పెద్ద కెరటం వచ్చి ఒడ్డుకు తోసెయ్యటం
ఇంటికొచ్చి పడ్డాడు
బ్రతుకు జీవుడా అంటూ

పీటల మీదకొచ్చి కూర్చోవాల్సిన భార్య
ససేమిరా రానన్నది
అనుకొన్న ముహూర్తానికి
ఈయన ఎవరో గడ్డాలూ మీసాలూ ఉన్న సన్యాసిగాని
నా భర్తకాదు పొమ్మన్నది

అంతా తలో మాటా అన్నారు
చిన్నపిల్ల మంకుపట్టు పట్టిందని కొందరు
గాలో ధూళో సోకిందని ఇంకొందరు
ఆ పిల్లదొక్కటే పాట
ఎవరెన్ని అన్న
ఈయనెవరో సన్యాసి
నా భర్త కానే కాదు అని

అప్పుడు
పీటల మీద కూర్చొన్న యువకుడు
పంచె వుత్తరీయం తీసి పక్కన పెట్టాడు
వట్టి గోచీతో లేచి నుంచొన్నాడు
అక్కడున్న పెద్దలందరికీ నమస్కారాలు చెప్పాడు

వరదతో వున్న కృష్ణను
దాటలేక పోయిన వైనమూ
ఆఖరు క్షణంలో
ఆతుర సన్యాసం తీసుకొన్న తీరూ
దాచకుండా చెప్పాడు
ఇంకా

శ్రీ కృష్ణ భగవానుడే తనను
సంసారం నుండి రక్షించి ఒడ్డున పడేశాడనీ
తన భార్యే తనను
అధోగతి పాల్గోకుండా రక్షించిందనీ
చెప్పాడు

అట్లా చెప్పి అన్ని విషయాలు
సన్యాసం స్వీకరించాడు యథావిధిగా
అందరి అంగీకారంతో మరలా
అతడే యోగి సిద్దేంద్రుడు
జగన్నాటకంలో నిమిత్తమాతృడు

యౌవనంలో శృంగార వాంఛ పూర్తిగా పోక
అది పోయేటందుకుగా
శృంగార రసప్రధానంగా
సత్యభామా శ్రీ కృష్ణులు నాయికా నాయకులుగా
పారిజాతాపహరణం యక్షగానం కూర్చాడనీ
అదే భామాకలాపమనీ
ఆ వూరి మగవాళ్ళతోనే వేషం కటించి ఆడింపజేస్తూ వచ్చాడనీ
చెబుతారు విజ్ఞులు

ఇవీ చూడండి[మార్చు]

మూలాలు, వనరులు[మార్చు]

  • సిద్ధేంద్రయోగి (తెలుగువైతాళికులు శీర్షికలో రచన) - రచన: డా. ఎన్. గంగప్ప - ప్రచురణ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు (2006)

బయటి లింకులు[మార్చు]

Dhakshinandra yugam lo vachana rachanalu శ్రీ రంగ మహాత్యం, మాఘ మాసం,జైమిని భారతం, mahaabaaratham, vachana vichitra రామాయణం.