Jump to content

శబరి

వికీపీడియా నుండి
రామునికి రేగు పళ్ళు ఇస్తున్న శబరి

seshu(ఆంగ్లం: Shabari ; సంస్కృతం: शबरी) ramanayam శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచియుండి చివరికి రామ దర్శనం పొందిన ధన్యజీవి.

అందరికి గుర్తుండే శబరి

[మార్చు]

శబరి అనగానే రామునికి ఎంగిలి రేగిపండ్లు పెట్టిన విషయం గుర్తుకు వస్తుంది. దేవుడుకు ఎదైనా పదార్థం ప్రసాదంగా చేసినప్పుడు, పిల్లలు తెలియక ఎంగిలి చేస్తారని ముందుగానే చెపుతుంటారు. దేవుడుకు నైవేధ్యంగా పెట్టిన తరువాతనే అది ప్రసాదమవుతుంది. ఇది అందరికి తెలుసు. రాముడని హిందూ సంప్రదాయం ప్రకారం దేవుడుగా భావిస్తారు. దేవుడైన రాముడు ఒకే ఒక్కసారి ఒకరి ఎంగిలి తిన్నాడని పురాణాల ద్వారా తెలుస్తుంది. అదే శబరి ఎంగిలి![1]  

మతంగి ముని ఆశ్రమంలో శబరి

[మార్చు]

శబరి బోయ కుటుంబంలో పుట్టిన ఒక స్త్రీ.ఈమె పంపానదీ తీరంలో మతంగ మహాముని వద్ద, ముని కన్యల మధ్య అమాయంకంగా పెరిగింది.అందువలన బోయ కులంలో పుట్టి ముని చెప్పిన మాటలు శ్రద్ధగావినేది. దాని వలన అమె యోగాభ్యాసం చేసేది.మతంగ మహామునిని పరమశివుడుగా, ఆశ్రమాన్ని కైలాసంగా భావించేది.ఆశ్రమంలో అన్ని పనులు చేస్తూ సేవా మార్గంలో కాలం గడిపేది.

రాముడుని చూడాలనే కోరిక

[మార్చు]

మతంగ మహాముని మాటల్లో శ్రీరాముడు విష్ణుమూర్తి అవతారమని, రాక్షసులను సంహరించిన వీరుడని తెలుసుకుంది.మతంగ మహామునికి రాముడు అరణ్యవాసానికి వెళ్లిన విషయం తపశ్సక్తి ద్వారా తెలిసింది. అలా తెలుసుకున్న మతంగముని శిష్యులు, తాము స్వర్గానికి వెళుతూ శబరికి ఆ విషయం చెబుతారు. వనవాసంలో ఉన్న రాముడు ఒకానొక సందర్భంలో ఆశ్రమానికి వస్తాడని, అతని దర్శనం తర్వాత శబరి కూడా శరీరాన్ని వదలవచ్చని వివరిస్తారు.సీతా,లక్షణ సమేతుడై శ్రీరాముడు ఆశ్రమం వైపు వస్తున్నాడని తెలిసింది.అతణ్ని చూడాలని ఆశపడింది. ఆ ఆశని రాముని గురించి మతంగ మహర్షి చెప్పిన మాటలు రెట్టింపు చేశాయి. ఒక్కసారి జీవితంలో రాముణ్ని చూస్తే చాలనుకుంది. అంతకుమించి ధన్యత లేదనుకుంది. రాముని రూపురేఖలు చూసి తరించాలనుకుంది.[1]

దర్శనభాగ్యంకోసం ఎదురు చూపులు

[మార్చు]
శబరి పెట్టిన పండ్లు శ్రీరాముడు ఆరగించుట
శబరి పెట్టిన పండ్లు శ్రీరాముడు ఆరగించుట

ఎంత కాలం ఎదురు చూసినా రాముడు రాలేదు.అలాగని శబరి ఎదురు చూడకుండా ఉండలేకపోయింది. మతంగ ముని ముసలి వాడై, స్వర్గానికి వెళుతూ రాముడు వస్తాడనీ మరలా చెపుతాడు. నీకు దర్శనభాగ్యం కలిగిందని, ఆశ్రమాన్ని అంటి పెట్టుకొనే ఉండమంటాడు. ఎప్పటికయినా రాముడు వస్తాడని శబరి నమ్మకంతో ఉంటుంది.ఆశ్రమంలో చివరికి శబరి మాత్రమే ఒంటిగా మిగిలింది. రామనామమే  సర్వం అయింది. శబరికికూడా ముసలి తనం వచ్చింది. రాముడు రాలేదు. వస్తాడనే ఆమెకు ఇంకా నమ్మకం. ఒంట్లో శక్తే కాదు, కంటిచూపూ తగ్గింది.అయినా  రాముని వస్తాడనేదానిమీద నమ్మకం తగ్గలేదు. మతంగి ముని మాట మీద గురి పోలేదు.రాముడు వస్తాడని ప్రతిరోజు వేకువ ఝామునే ఆశ్రమ పర్ణశాలను శుభ్రం చేసి, అలికి ముగ్గులు పెట్టేది. నదిలో స్నానం చేసి కడవతో నీళ్ళు తెచ్చేది. పూలు, పళ్ళూ తెచ్చేది. పూలను మాలకట్టి అలంకరించేది.ఫలహారంగా పెట్టడానికి పళ్ళను సిద్ధంగా ఉంచేది.ప్రతిరోజూ రాముడొస్తున్నట్లు ఏ రోజుకారోజే ఎంతో ఎదురు చూసేది. రోజులూ నెలలూ సంవత్సరాలూ విసుగూ విరామం లేకుండా అలా ఎదురు చూపులతోనే 13 సంవత్సరాల కాలం గడిపింది.[1][2]

రాముడు దర్శనం, పండ్లు ఆరగించుట

[మార్చు]
రాముని అనుమతితో శబరి తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకున్న సన్నివేశాన్ని తెలిపే ఆయిల్ పెయింటింగ్ చిత్రం
రాముని అనుమతితో శబరి తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకున్న సన్నివేశాన్ని తెలిపే ఆయిల్ పెయింటింగ్ చిత్రం

శ్రీరాముడు శబరి వృత్తాంతం చివరికి కబంధుడు ద్వారా తెలుసుకొని, రాముడు శబరిని చూడటానికి వస్తాడు. కానరాని కళ్ళని పులుముకొని చూసింది.చూపు కనపడలేదు.ఒళ్ళంతా కళ్ళయినట్టు… చేతులతో తడిమింది. ఆరాటంలో అడుగు తడబడినా మాట తడబడలేదు. “రామ రామ” అని ఆత్మీయంగా పిలిచి కాళ్ళు కడిగి, నెత్తిన నీళ్ళు చల్లుకుంటుంది.పూలు చల్లింది.అప్పటికే ఏరి దాచి ఉంచిన రేగుపళ్ళను తెచ్చియిచ్చింది. వగరుగా ఉంటాయేమోనని కలవరపడింది. కొరికి రుచి చూసి ఇచ్చింది. రాముడూ ఎంగిలి అనుకోకుండా ఇష్టంగా తింటాడు.శబరి ఆత్మీయతకి ఆరాధనకి రాముడు ముగ్దుడవుతాడు జీవితమంతా ఎదురుచూపులతో గడిపిన శబరికి ఇంకో జన్మలేకుండా, గురుదేవులు వెళ్ళిన లోకాలకు వెళ్ళేలా వరం ఇస్తాడు. రాముని రూపం కళ్ళలో నిలుపుకొని పులకించి ఆవిధంగా పునీతమయింది శబరి!.[1]

శబరి ఎంగిలి పండ్లు పెట్టలేదు

[మార్చు]

అందరూ అనుకునేటట్లుగా రాముడు ఆశ్రమానికి వచ్చినప్పుడు శబరి ఎంగిలి పండ్లను ఇవ్వడం వాల్మీకి రామాయణంలో లేదని తెలుస్తుంది. అడవిలో దొరికిన ఆహారంతోనే ఆమె రామలక్ష్మణులకు ఆతిథ్యం ఇస్తుందని, ఆ తరువాత రాముని అనుమతితో శబరి తన శరీరాన్ని యోగాగ్నిలో అర్పించుకుని మోక్షాన్ని పొందిందని తెలుస్తుంది.ఈ కథలో గిరిజన స్త్రీ అయిన శబరికి  వేదం తెలియనప్పటకీ, యజ్ఞయాగాదులు చేసే అధికారం ఆనాడు లేకపోయిననూ,యోగసాధన, జ్ఞానం, మోక్షం పొందడానికీ అందరూ అర్హులే అని నిరూపించే ఘట్టమే రామాయణంలోని శబరి కథ.[2]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 "శబరి (For Children) | teluguglobal.in". www.teluguglobal.in. Retrieved 2020-07-15.
  2. 2.0 2.1 ఆంధ్రజ్వోతి (2018). "శబరి ఎంగిలి పండ్లు పెట్టలేదు!". epaper. Archived from the original on 2020-07-17. Retrieved 2020-07-15.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=శబరి&oldid=4360480" నుండి వెలికితీశారు