చిదంబరం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  ?చిదంబరం
తమిళనాడు • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 11°24′N 79°42′E / 11.4°N 79.7°E / 11.4; 79.7Coordinates: 11°24′N 79°42′E / 11.4°N 79.7°E / 11.4; 79.7
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం
ఎత్తు

• 3 మీ (10 అడుగులు)
జిల్లా(లు) కడ్డలూరు జిల్లా
జనాభా 58 (2001 నాటికి)
ఈ వ్యాసం కడలూరు జిల్లాలోని ఒక పట్టణానికి సంబంధించినది. భారత ఆర్ధిక మంత్రి కోసం పి. చిదంబరం చూడండి.

చిదంబరం తమిళనాడు లోని కడలూరు జిల్లాకు చెందిన మునిసిపాలిటీ మరియు తాలూకా కేంద్రం. ఇది తీరానికి 11 కి.మీ మరియు చెన్నైకి రైలు ద్వారా 240 కి.మీ దక్షిణంగా ఉంది.

పట్టణం ఉనికి[మార్చు]

పరమ శివుడు శివతాండవం చేస్తూ నటరాజుగా వెలసిన చిదంబరం దేవాలయం 40 ఎకరాల సముదాయంలో ఉంది. శైవులకు దేవాలయం లేదా తమిళంలో కోయిల్‌ అంటే చిదంబరం ఉన్న ఈ నటరాజ దేవాలయం. చిదంబరం -- చిత్ - స్పృహ + అంబరం - ఆకాశం - అంటే శివుడు తాండవమాడే స్థలం అని అర్థం.

ఆలయ కథా విశేషం[మార్చు]

చిదందరం ఇతిహాసం ప్రకారం పరమశివుడు ఒకనాడు తిల్లాయ్ వనవిహారానికి వెళ్ళాడు.ఈ వనంలో ఉన్న ఋషులు తమ మంత్రాలతో దేవతలను ఆవాహనం చేయగల్గినవారు. శివుడు ఆ ఋషులు పఠిస్తున్న మంత్రాలతో లొంగి పీతాంబరధారి అయి ఉసిరి కాయలు తింటున్నాడు. శివుని భార్య పార్వతి కూడా శివుని వెంబడించింది.ఋషులు, ఋషి పత్నులు ఆ పీతాంబర వాసిని అనేక రకాలుగా స్తోత్రాలు చేశారు. తమ భార్యలూ, ఇతర స్త్రీజనం మోహితులై ఉండటం చూసిన మునులు కోపోద్రిక్తులై తమ మంత్ర ప్రభావంతో ఎన్నో పాములను ఆవాహన చేశారు. భిక్షువు రూపంలో ఉన్న భగవంతుడు ఆ పాములను ఎత్తి జడలు కట్టిన జుత్తు చుట్టూ, మెడలో మరి నడుము చుట్టూ ఆభరణాల్లా వేసుకున్నాడు. ఆవేశం పట్టలేని ఋషులు ఒక భయంకరమైన పులిని ఆవాహన చేశారు. భగవంతుడు దాని చర్మం వలిచి నడుముకి బట్టగా కట్టుకున్నాడు. పూర్తిగా విసుగెత్తిన ఋషులు వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తం ఉపయోగించి 'ముయలకన్' అనే శక్తిమంతమైన మరియు అహంభావియైన రాక్షసిని ఆవాహన చేశారు. చిరు మందహాసం చిందిస్తూ భగవంతుడు ఆ రక్కసి వీపుపై కాలు మోపి దాన్ని నిశ్చలనం చేసి దివ్యమైన ఆనంద తాండవం చేసి తన అసలు రూపాన్ని చూపాడు. ఋషులు భగవంతుడిని గుర్తెరిగి, తమ మంత్ర తంత్రాలు పని చేయవని తెలుసుకొని ఆయనకు దాసోహమన్నారు.

చిదంబరం చిత్సభలో నటరాజమూర్తి. ఎడమ ప్రక్క ఉన్న మూర్తి చిదంబర రహస్యం - సువర్ణ బిల్వ పత్రాలు మాత్రం కనుపిస్తాయి. కుడివైపున అమ్మవారు శివకామసుందరి.

జగద్రక్షకుడైన విష్ణు అవతారానికి పరుపుగా భాసించే ఆదిశేషుడు ఆనంద తాండవం గురించి విని దాన్ని చూసి ఆనందించాలని కుతూహల పడ్డాడు. భగవంతుడు ఆయన్ని ఆశీర్వదించి, కాలగమనంలో నాట్యము చూపెదనని చెప్పి సాధువైన పతంజలి వేషములో వెళ్ళమని చెప్పి తిల్లాయ్ అడవికి పంపెను. పతంజలి వ్యాఘ్రపాదర్ / పులికాల్ముని (వ్యాఘ్ర / పులి, పాదర్ - పాదములు కలవాడు - ఈయన తేనెటీగలు రాకమునుపే పూవులు కోయటానికి చెట్లెక్కేందుకు వీలుగా పులి కాళ్ళు, చూపు కోరి సంపాదించుకున్నాడు) తో కలిసి తిల్లాయ్ అడవిలోనికి వెళ్ళి భగవంతుణ్ణి శివలింగ రూపంలో పూజించారు. ఆ దేవుణ్ణి ఈ నాటికీ 'తిరుమూలతనేశ్వర్' (తిరు - శ్రీ, మూలతనం - మూలమైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు)గా పూజిస్తున్నారు.

పురాణాల ప్రకారం, శివుడు తన దివ్యమైన 'ఆనంద తాండ'వాన్ని నటరాజు రూపంలో ఆ ఇద్దరు సాధువులకు తమిళుల 'తాయ్' (జనవరి-ఫిబ్రవరి) నెలలో పూసమ్ నక్షత్రపు తేదీన చూపాడు.

చిదంబరం అనేక రచనల్లో తిల్లయ్ (ఆలయం ఉన్న తిల్లయ్ అడవిని సూచిస్తూ) అని, పెరుంపత్రపులియూర్ లేదా వ్యాఘ్రపురం (వ్యాఘ్రపాదర్ స్వామి వారి గౌరవ సూచకంగా) అనీ పేర్కొనబడి ఉంది. ఈ ఆలయం'విరాట్ హృదయ పద్మ స్థలం' అంటే కమలం వంటి విశ్వపు గుండెలో ఉన్నదని ప్రతీతి.

పరమశివుడు ఆనంద తాండవం చేసిన స్థలంలో - 'తిరుమూలతనేశ్వర్' ఆలయానికి దక్షిణంగా - ఇప్పుడు శివుడు నృత్య భంగిమలో కనిపించే పొన్నాంబళం/పోర్ సబై ('పొన్'అంటే బంగారం 'సబై' అంటే సభ లేదా వేదిక) ఉంది. ఇక్కడి దేవుణ్ణి 'సభానాయకర్' - అంటే వేదికపై కొలువైన దేవుడు - అని కూడా పిలుస్తారు.

ఈ బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఆలయపు గర్భగుడి. ఇందులో స్వామి క్రింద తెలిపిన మూడు రూపాల్లో దర్శనమిస్తారు:

1) సంపూర్ణ రూపం - నటరాజు రూపంలోని స్వామి 2) అసంపూర్ణ రూపం - స్ఫటిక రూపంలోని చంద్ర మౌళీశ్వరర్ 3) నిరాకారం - పంచ భూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భ గుడిలోని ఖాళీ స్థలం

ఈ విధంగా చిదంబరం పంచభూత స్థలాల్లో (పంచభూతములు - భూమి, నీరు, నిప్పు, గాలి మరియు ఆకాశం) ఒకటిగా వెలుగొందుతోంది. మిగిలినవి - భూ స్వరూపంగా కొలువబడుతున్న కాంచీపురం లోని ఏకాంబరేశ్వరర్ దేవాలయం, నీటి స్వరూపంగా కొలువబడుతున్న తిరుచ్చిరాపల్లి దగ్గరలోని తిరువనైకవల్లో గల జంబుకేశ్వరర్ దేవాలయం, అగ్ని స్వరూపంగా కొలువబడుతున్న తిరువణ్ణామలై లోని అన్నమలైయర్ దేవాలయం మరియు గాలి స్వరూపంగా కొలువబడుతున్న శ్రీ కాళహస్తి లోని శ్రీకాళహస్తీశ్వర దేవాలయం.

పరమశివుడు నృత్యం చేసినట్లుగా చెప్పబడే ఐదు స్థలాల్లో చిదంబరం కూడా ఒకటి. ఈ స్థలాలు అన్నింటిలోనూ వేదిక/సభైలు కనిపించడం విశేషం. చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు తిరువాలంగడు లోని రత్తినసబై (రత్తినం - రత్నం), కౌర్తాళ్ళం లోని చిత్రసబై (చిత్ర - చిత్రకళకు ప్రతీక), మదురై లోని మీనాక్షి దేవాలయంలోని రజతసబై (రజత - వెండి) మరియు తిరునెల్వేలి లోని నెల్లైఅప్పర్ దేవాలయంలోని తామిరసబై (తామిరం - రాగి).

దేవాలయపు భక్తులు[మార్చు]

ఈ దేవాలయపు భక్తుల్లో మొదటివారుగా పరిగణింపబడుతున్నవారు ఆలయ నిర్వహణ చూసే తిల్లై వాళ్ అంధనార్ (తిల్లైలో ఉండే పూజారులు అని అర్థం) అని పిలవబడే పూజారులు. నలుగురు భక్త కవులు ఈ దేవాలయాన్ని ఈ స్వామిని అజరామరం చేశారు. వాళ్ళెవరంటే తిరుజ్ఞాన సంబంథర్, తిరునావుక్కరసర్, సుందరమూర్తి నయనార్ మరియు మాణిక్కవసాగర్ . మొదటి ముగ్గురి రచనలు దేవరములుగా ఖ్యాతి పొందాయి. తిరుజ్ఞాన సంబంథర్ చిదంబరం స్వామి పైన రెండు దేవరములు, తిరునావుక్కరసర్ నటరాజ స్వామి పైన ఎనిమిది దేవరములు మరియు సుందరమూర్తి నయనార్ నటరాజ స్వామి పైన ఒక్క దేవరము రచించి స్వరపరిచారు. మాణిక్కవసాగర్ రెండు రచనలు చేశారు. మొదటిది చిదంబరంలో ఎక్కువగా పాడబడే తిరువాసకం (పవిత్ర వచనాలు) మరియు రెండవది పూర్తిగా చిదంబరంలోనే పాడబడే తిరుచిత్రాంబలక్కోవైయార్ (లేదా తిరుకోవైయార్). మాణిక్కవసాగర్ చిదంబరంలోనే ఆధ్యాత్మిక ఆనందం, ముక్తి పొందారని చెప్పబడుతుంది.

తిరునావుక్కరసర్[మార్చు]

జైనులు తిరునావుక్కరసర్ని ఒక రాతి బండకికట్టి సముద్రంలో పారివేసారు; అతనప్పుడు పంచాక్షరాలని జపించాడు.రాతిబండ తేలిపోయు అతన్ని సురక్షితంగా తీరాన్ని చేర్చింది. ఈ అద్భుతాన్ని విని ఒక పల్లవరాజు తిరునావుక్కరసర్ ని పూజించి శైవమతం స్వీకరించాడు.ఈ రాజే పాటలీపుత్రంలోని జైనుల మఠాన్ని విరగగొట్టించి ఆరాతితోనే గుణభర-ఈశ్వరం అనే గుడి కట్టించాడు.ఇది పెరియపురాణం కధ.తిరునావుక్కరసర్ కొన్ని శివాలయాలు దర్నించి వాటొలోని ప్రధాన దైవాల గురించి పాడాడని సంప్రదాయం ఉన్నది.ఈ ఆలయాలు తొండె మండలంలోని పొన్నియార్ నది ఉత్తరం వైపున ఉన్నవి- అలంగాడు, పాంపూర్, కాళహస్తి, తిరువట్రిమూర్, కాంచీపురం దేవాలయాలు. ఈయన మహేంద్రవర్మ 1 కాలము వాడు. ఇంచుమించు 7వ శతాబ్దానికి చెందినవాడు.

తిరుజ్ఞానసంబంధర్[మార్చు]

ఆళుడపిళ్ళయార్ ని అవతల వదిలి అతని తండ్రి కొలనులో స్నానం చేస్తూ ఉండగా ఉమాదేవి అతనికి పాలు ఇస్తుంది. పిల్లవాడు ఏడుస్తాడు.ఇది పెరియపురాణం కధ. ఈ పిల్లవాడే తిరుజ్ఞానసంబధర్. స్కందుడే సంబందర్ గా పుట్టాడని అందురు.

భౌగోళికం[మార్చు]

చిదంబరం భౌగోళికంగా 11.4° N 79.7° E[1]లో ఉంది. ఇది రమారమి 3 మీటర్లు (9 అడుగులు) ఎత్తులో ఉంది.

జనాభా వివరాలు[మార్చు]

2001 వ సంవత్సరపు భారతదేశం జనాభా లెక్కల "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. మూలం నుండి 2004-06-16 న ఆర్కైవు చేసారు. Retrieved 2008-11-01. Cite web requires |website= (help) ప్రకారం, చిదంబరం జనాభా 58,968. అందులో మగవారు 49% మరియు ఆడవారు 51%. చిదంబరంలో సగటు అక్షరాస్యుల శాతం 80%. ఇది జాతీయ సగటు 59.5% కన్నా ఎక్కువ. ఇందులో మగవారి శాతం 84% ఐతే ఆడవారి శాతం 76%. 10% జనాభా 6 సంవత్సరాలలోపు వయసు వారు.

దేవాలయ శిల్ప కళ మరియు దేవాలయ విశేషాలు[మార్చు]

ఈ దేవాలయానికి 9 ద్వారాలు ఉన్నాయి. ఈ తొమ్మిదిలో 4 పెద్ద గాలి గోపురాలు ( తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిక్కులలో). ఈ నాలుగు గాలి గోపురాలు చాల పురాతనమైనవి. తూర్పు గాలి గోపురము మీద 108 ముద్రలతో భరత నాట్యం చేస్తున్న శిల్పాలు చెక్కబడ్డాయి. ఆలయ సముదాయం 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ ఆలయ సముదాయములోనే ఒక పెద్ద తటాకము (శివ గంగ) మరియు చిన్న ఇళ్ళు ఉన్నాయి. ఇవి కాక ఐదు సభలు లేదా వేదికలు ఉన్నాయి. అవి - గర్భగుడిగా వెలుగొందుతున్న చిత్సబై, చిత్సబైకి ఎదురుగానే ఉన్న నిత్యపూజలు జరిగే కనకసబై, గర్భగుడికి ఎదురుగానే శివుడు 'కాళి' తో నాట్యమాడినట్లుగా చెప్పబడుతున్న నృత్యసబై లేదా నాట్యసబై - ఇది శక్తి స్వరూపం, భగవంతుడి ఆధిపత్యాన్ని చాటి చెప్పిన ప్రాంతం, రాజ్యసబై లేదా 1000 స్తంభాల మంటపం (నిజానికి ఉన్నది 999 స్తంభాలే, భగవంతుడు దర్శనమిచ్చినప్పుడు ఆయనే 1000వ స్తంభం) మరియు పంచమూర్తులు కొలువైన దేవసబై (పంచ - ఐదు, మూర్తులు - భగవంతుడి విగ్రహాలు. ఆ ఐదు ఏవంటే గణేశుడు - విఘ్నాలు తొలగించే స్వామి, తన భార్య 'శివానందనాయకి'తో కూడి కూర్చున్న భంగిమలో దర్శనమిచ్చే సోమస్కందర్ స్వామి, మురుగా స్వామి మరియు భక్తముఖ్యుడు, ప్రధాన భక్తుడు ఐన చండికేశ్వరర్).

ఇవి కాక పతంజలి, వ్యాఘ్రపాదర్ పూజించిన తిరుమూలతనేశ్వరర్ మరియు ఆయన దేవేరి ఉమయ్య పార్వతి ఆలయం, 63 ప్రధాన భక్తులు లేదా అరుబత్తుమూవర్ ల ఆలయాలు, 'జ్ఞాన శక్తి'కి నిలయమైన శివగామి ఆలయం, విఘ్నాలు పోగొట్టే గణేశాలయం, మూడు విధాలైన శక్తులు - ఇచ్ఛై లేదా కోరిక అవతారమైన భార్య వల్లి, క్రియకు ప్రతిరూపమైన భార్య దేవయాని, అజ్ఞానాన్ని నాశనం చేసేందుకు స్వామి వాడే జ్ఞానానికి ప్రతిరూపమైన బల్లెం - వీటిని కలిగిన మురుగా లేక పాండియనాయకం ఆలయం కూడా ఉన్నాయి.

ఆలయ ప్రాంగణంలో గోవిందరాజ పెరుమాళ్, ఆయన దేవేరి పుండరీగవల్లి తాయర్ దేవాలయం కూడా ఉంది. ఈ దేవాలయాన్ని తిల్లై తిరుచిత్రకూడమ్ అంటారు. ఇది 108 వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. దివ్యదేశాలంటే ప్రముఖ భక్తులైన ఆళ్వార్లు మంత్రాలు (నాలయిర దివ్యప్రబంధం) చదివి శుద్ధి (మంగళాశాసనం) చేసిన విష్ణ్వాలయాలు.

ఆలయ ప్రాంగణంలో ఇంకా చాలా చిన్న ఆలయాలు ఉన్నాయి.

ఆలయపు రూపకల్పనలోనూ, స్థాపత్యంలోనూ (స్థాపత్యం - ఆర్కిటెక్చర్) వేదాంతార్థాలు కోకొల్లలు. ఉన్న తొమ్మిది ద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. గర్భగుడిని ఒక ప్రక్కనున్న కనకసబై అనే వేదిక పైనుంచి పంచాచ్ఛరపది అనే ఐదు మెట్లు ఎక్కి చేరుకోవాలి. పంచాచ్ఛరపది అంటే : పంచ - ఐదు, అ-చ్ఛర - నాశము లేని శబ్దాలు శి వా య న మ . పొన్నాంబళం హృదయానికి ప్రతీక కనుక వేదిక పక్క నుంచి వెళ్ళడం (మిగతా దేవాలయాల్లో మాదిరి ముందు నుంచి కాకుండా). పొన్నాంబళం లేదా గర్భగుడిని 28 స్తంభాలు మోస్తున్నాయి. ఇవి 28 ఆగమాలను (ఆగమాలు శివుడిని అర్చించే వైదిక విధానాలు) సూచిస్తాయి. ఇక ఆలయం పైకప్పుని 64 కళలకు ప్రతీకలైన 64 దూలాలు, అంతు లేని రక్తనాళాలకు ప్రతీకలైన ఎన్నో అడ్డ దూలాలు మోస్తున్నాయి. పైకప్పుని 21600 శివయనమ అని రాసిన బంగారు పలకలతో కప్పారు. ఇవి 21600 శ్వాసలను సూచిస్తాయి. కప్పుపై 9 రకాలైన శక్తిని సూచించే 9 పవిత్ర కుంభాలు లేదా కలశాలతో తీర్చిదిద్దారు (చూ. ఉమాపతి శివమ్ రచించిన కుంచితాంగ్రిస్తవం)

చిదంబర రహస్యం[మార్చు]

చిదంబరంలో శివుడు నిరాకారుడిగా కొలువబడుతున్నాడు. స్వామి తన దేవేరి శక్తి లేదా శివగామితో అనంతంగా తన దివ్యమైన 'ఆనంద తాండవం' చేస్తుంటారని ప్రతీతి. దీన్ని గర్భగుడిలోని ఖాళీ స్థలంలో ఉన్న ఒక గోడపై 'యంత్ర' అనే చిత్రం ప్రతిబింబిస్తుంది. ఆ స్థలాన్ని ఒక తెర కప్పి ఉంచుతుంది. ఈ తెరను తీసినప్పుడు భగవంతుడి ఉనికిని తెలిపే బంగారు 'విల్వ' (బిల్వ) పత్రాలు వ్రేలాడుతూ కనిపిస్తాయి. ఈ తెర బయటి వైపు అజ్ఞానాన్ని సూచించే నలుపు రంగులోనూ, లోపలి వైపు జ్ఞానాన్నీ ముక్తినీ సూచించే ఎరుపు రంగులోనూ ఉంటుంది.

దైనందిన పూజా కార్యక్రమంలో భాగంగా తానే దైవత్వంతో ఉట్టి పడుతున్న ప్రధాన పూజారి (శివోహంభవ - శివ - భగవంతుడు, అహం - నేను/మేము, భవ - మన స్థితి) తెరను తొలగిస్తాడు. ఇది అజ్ఞానాన్ని తుడిచి పెట్టి నిరాకారుడైన భగవంతుడి ఉనికిని తెలియ జెప్పే ప్రక్రియ.

అందువల్ల చిదంబర రహస్యం ఏమిటంటే తనను తాను పరిపూర్ణంగా అర్పించుకున్నప్పుడు భక్తుడు భగవంతుడిని తన (భక్త్తుడి) అజ్ఞానాన్ని తొలగించనిచ్చి ఆయనను దర్శించుకుని ఆయన ఉనికిని, ముక్తిని అనుభవించగలడు

ఆలయ నిర్వహణ మరియు దైనందిన పూజలు[మార్చు]

ఆలయ నిర్వహణ బాధ్యతలను ఆనువంశికంగా వైదిక బ్రాహ్మణుల్లో ఒక శాఖ ఐన చిదంబరం దీక్షితార్లు చూసుకుంటున్నారు. పురాణాల ప్రకారం వీరిని కైలాస పర్వతాల నుంచి పతంజలి ఋషి ప్రధానంగా దైనందిన పూజాదికాలు జరపడానికీ, చిదంబరం ఆలయ నిర్వహణకూ తీసుకు వచ్చారు. దీక్షితార్లను శివుడిని నటరాజుగా కొలవటానికి నియోగించిన పతంజలి ఆలయ పూజా విధానాలను వేదాల నుంచి సేకరించి ఏర్పరిచారు.

అలా తిల్లై మూవాయిరమర్ అని పిలవబడే 3000 మంది దీక్షితార్లు (2999 మరియు భగవంతుడు) వచ్చారని ప్రతీతి. ఇప్పుడు మొత్తంగా దాదాపు 360 మంది ఉన్నారు. వీళ్ళు శివపూజకు ఆగమ పద్ధతులు పాటించే శివాచారియర్లు లేదా ఆదిశైవర్ల వలె కాక వైదిక పద్ధతులు పాటిస్తారు.

సాధారణంగా వంతుల వారీ ప్రధాన పూజారి పదవి, ఆలయ ఆదాయంలో వంతు ప్రతీ వివాహితుడైన దీక్షితారుకూ లభిస్తుంది. ఆలయాన్ని ఎంతో మంది పాలకులు సేవించుకున్నందువల్ల సుక్షేత్రమైన 5000 ఎకరాల మాన్యం ఉన్నట్టు తెలుస్తున్నా వర్తమానంలో ఇది పూర్తిగా ప్రైవేటు విరాళాలతోనే నడుస్తోంది.

అవాళ్టి ప్రధాన పూజారి తనను తాను శుద్ధి చేసుకునే మంత్రాదికాలు పూర్తి చేసి శివోహంభవ రూపు దాల్చడంతో దినచర్య ప్రారంభమౌతుంది. పిమ్మట పూజారి ఆలయ ప్రవేశం చేస్తారు. స్వామివారి పాదుకలను ఉదయం 7 గంటల వేళ పాలియారై లేదా పవళింపు గది నుంచి గర్భగుడికి భక్తుల మేళ తాళాలు, డమరుక ధ్వనుల మధ్య పల్లకీలో తీసుకురావడంతో పూజాదికాలు ఆరంభమౌతాయి. పూజారి అప్పుడు భగవంతుణ్ణి అడ్డంకులను తొలగించమని వేడుకుంటూ నైవేద్యం పెట్టి ఒక ఆవు, దూడ జంటను పూజిస్తారు.

పూజ రోజుకు 6 సార్లు జరుగుతుంది. పూజ చెయ్యడానికి ముందు ప్రతిసారీ స్వామి అసంపూర్ణ రూపమైన స్ఫటిక లింగానికి నెయ్యి, పాలు, పెరుగు, అన్నం, చందనం, విబూదితో లేపనం చేస్తారు. పిమ్మట స్వామికి అప్పుడే తయారు చేసిన తిండి పదార్థాలు, తీపి నైవేద్యం పెట్టి సంస్కృతంలో వేదాలు, పంచపురాణం (పన్నీరు తిరుమురై అని పిలువబడే 12 తమిళ రచనల నుండి ఎన్నిక చేసుకున్న 5 కవితలు) చదువుతూ అందంగా, వివిధ రకాలుగా అలంకరించిన దీపాలతో దీపారాధన చేస్తారు. పూజారి గర్భగుడి తెరను తొలగించి చిదంబర రహస్యాన్ని చూపడంతో పూజ ముగుస్తుంది.

రెండవ సారి పూజకు ముందు మామూలుగా స్ఫటిక లింగానికి చేసే సేవలతో పాటు ఒక రత్న నటరాజు విగ్రహం (రత్న సభాపతి) కూడా సేవలందుకుంటుంది. మూడవ పూజ మధ్యాహ్నం 12:00 గంటల సమయంలో జరుగుతుంది. తర్వాత ఆలయం మూసివేసి మళ్ళీ సాయంత్రం 4:30 గంటలకు తెరుస్తారు. నాల్గవ పూజ సాయంత్రం 6:00 గంటలకు, ఐదవది రాత్రి 8:00 గంటలకు, చివరి పూజ రాత్రి పది గంటలకు జరుగుతాయి. దీని తర్వాత స్వామివారి పాదుకలను ఆయన విశ్రమించడానికి వీలుగా ఊరేగింపుగా తీసుకువెళ్తారు. ఐదవ పూజకు ముందు పూజారి చిదంబర రహస్యానికి ప్రత్యేక పూజలు చేసి యంత్రానికి సుగంధ ద్రవ్యాలతో లేపనం చేస్తారు.

అర్ధజాము పూజ అని పిలువబడే చివరి పూజను చిదంబరంలో ప్రత్యేకమైన ఉత్సాహంతో చేస్తారు. స్వామివారు రాత్రి విశ్రమించేటప్పుడు విశ్వంలోని దైవిక శక్తి అంతా ఆయనలో విశ్రమిస్తుందని భక్త జనుల నమ్మకం.

ప్రభుత్వ అధీనంలోకి[మార్చు]

చిదంబరం ఆలయాన్ని ప్రైవేటు ఆలయంగా ప్రకటించాలన్న స్థానిక దీక్షితుల అభ్యర్థనను మద్రాస్ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆ ఆలయ నిర్వహణా బాధ్యతలు జిల్లా యంత్రాంగం అధీనంలోకి వచ్చాయి. సుమారు 1500 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన చిదంబరం ఆలయంలో న్యాయస్థానం నిర్ణయం కారణంగా ఓ శకం ముగిసినట్త్లెంది. ఈ ఆలయం కొన్ని వందల సంవత్సరాలుగా స్థానిక దీక్షితుల అధీనంలో ఉంది. వీరి పూర్వీకులు స్వయంగా కైలాసం నుంచి వచ్చి ఈ ఆలయ వ్యవహారాలను చక్కదిద్దేవారని ఈ సాంప్రదాయ బ్రాహ్మణ వంశం గట్టిగా నమ్మేది. సుదీర్ఘ న్యాయపోరాటం అనంతరం గతవారం మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఈ ఆలయం ప్రభుత్వం పరమైంది. (ఈనాడు 9.2.2009)

పండుగలు[మార్చు]

మానవుల ఒక్క సంవత్సరం దేవుళ్ళకు ఒక్క రోజని ప్రతీతి. రోజుకు ఆరు సార్లు పూజలు చేసినట్లే ప్రధాన దైవమైన నటరాజ స్వామికి సంవత్సరంలో ఆరు ప్రత్యేక పూజలు చేస్తారు. అవి - మొదటి పూజను సూచించే మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), రెండవ పూజకు సూచనగా మాసి (ఫిబ్రవరి-మార్చి) నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే 14 వ రోజు (చతుర్దశి), మూడవ పూజ లేదా ఉచ్చి కాలం సూచించే చిత్తిరై తిరువోణం (ఏప్రిల్ - మే), సాయంత్రాన్ని లేదా నాల్గవ పూజను సూచించే ఆణి ఉత్తరం (జూన్ - జూలై) లేదా ఆణి తిరుమంజనం, ఐదవ పూజను సూచించే ఆవణి (ఆగస్టు - సెప్టెంబరు) చతుర్దశి మరియు ఆరవ పూజ లేదా అర్ధజాము పూజను సూచించే పురతసి (అక్టోబరు - నవంబరు) చతుర్దశి.

వీటిలో మార్ఘాళి తిరువాధిరై (డిసెంబరు - జనవరి), ఆణి తిరుమంజనం (జూన్ - జూలై) అత్యంత ప్రధానమైనవి. ఈ పండుగల సందర్భంగా ప్రధాన దైవాన్ని గర్భగుడి బయటకు ఊరేగింపుగా తెచ్చి, రథోత్సవం జరిపి పెద్ద ప్రత్యేక పూజ చేస్తారు. కొన్ని లక్షల మంది జనం ఈ ప్రత్యేక పూజనూ, గర్భగుడిలోనికి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు జరిగే స్వామివారి ఆచారపూర్వకమైన నృత్యాన్నీ చూడటానికి బారులు తీరుతారు.

ఉమాపతి శివం యొక్క 'కుంచితాంగ్రిస్తవం' లో మాసి పండుగనాడు కూడా స్వామి ఊరేగింపు ఉన్నట్టు ఉటంకించినా వర్తమానంలో అది జరగటం లేదు.

చారిత్రిక ఉటంకాలు[మార్చు]

చిదంబరం ఆలయపు అసలు మూలాలు తెలియవు. పురాణాల (ముందు మౌఖికంగా, తర్వాతి కాలంలో వ్రాతపూర్వకంగా అందించబడిన చరిత్ర) ప్రకారం పులికాల్మునివర్ స్వామి సిమ్మవర్మన్ ద్వారా పవిత్రమైన ఆలయ పనుల్లో సింహ భాగాన్ని జరిపించినట్లు తెలుస్తోంది.పల్లవ రాజుల్లో సిమ్మవర్మన్ పేరుగల రాజూలు ముగ్గురున్నారు. భక్త కవి ఐన తిరునావుక్కరసర్ (ఈయన జీవన కాలం కాస్త అటు ఇటుగా సరిగ్గానే లెక్కించబడింది) సమయానికే ఆలయం ప్రశస్తి పొందినందువల్ల సిమ్మవర్మన్ దాదాపు క్రీ.శ. 430-458 మధ్య కాలంలో జీవించి ఉండాలి. కొట్రావన్ కుడి లోని 'పట్టాయం' లేదా రాగిరేకులతో చేసిన శాసనం ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కానీ తండన్ తొట్ట పట్టాయం ఇంకా ఇతర పల్లవ కాలపు పట్టాయాలలో ఈయన ప్రసక్తి లేదు. అందువల్ల ఆయన తన హక్కులను త్యజించి చిదంబరానికి వచ్చి జీవించి ఉండవచ్చని నమ్మకం. పులికాల్మునివర్, సిమ్మవర్మన్ సమకాలికులని తెలుస్తుండడం వల్ల ఆలయం ఆ సమయంలో ఉనికిని పొందిందని భావిస్తారు. కానీ భక్త కవి మాణిక్కవసాగర్ భక్త కవి తిరునావుక్కరసర్ కన్నా ఎంతో ముందే చిదంబరంలో జీవించి ముక్తిని పొందినట్లు తెలుస్తుండడం వల్ల, అంతే కాక నటరాజ స్వామి విగ్రహం, దాని భంగిమ, దాని స్వరూపం అదే కాలపు ఇతర పల్లవ శిల్పరీతులతో సరిపోలనందువల్ల ఈ ఆలయం సిమ్మవర్మన్ కన్నా చాలాకాలం ముందు నుంచే ఉనికిలో ఉండేదని విశ్వసిస్తున్నారు.

బంగారు పలకలతో తాపడం చేయబడిన చిత్సబై పైకప్పు చోళ రాజు పరంథక I చేయించినట్లు చెప్పబడుతోంది. పరంథక II, రాజరాజ చోళ I, కులోత్తుంగ చోళ I కూడా ఆలయానికి విలువైన దానాలు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. రాజరాజ చోళుని కుమార్తె కుందవై సైతం బంగారు ఇతర ఆస్తులు ఇచ్చినట్లు చెప్పబడుతోంది. ఆ తరువాతి కాలపు చోళ రాజు విక్రమ చోళ (క్రీ.శ 1117-1136) కూడా నిత్య పూజలకుగాను నివేదనలు ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఆలయానికి పుదుకొట్టై మహారాజా, శ్రీ సేతుపతి (పచ్చరాయి ఆభరణం నేటికీ స్వామిని అలంకరిస్తోంది), పరి రాజు, టిప్పు సుల్తాను వంటి అనేకమంది రాజులు, పాలకులు, దాతలు బంగారునూ, ఆభరణాలను ఇచ్చారు. దీక్షితార్లు ఆలయంపై టిప్పు సుల్తాను దాడి చేసి దోచుకుంటాడని భయపడినట్లు కొన్ని ప్రస్తావనలు ఉన్నాయి (ఇవి దీక్షితార్లలో ఒక తరం నుంచి మరొక తరానికి మౌఖికంగా వచ్చినవి). ఎందరో దీక్షితార్లు తమ పవిత్రమైన, ప్రీతిపాత్రమైన దేవాలయం టిప్పు చేతుల్లో నాశనమవడం చూడటం కన్నా మృత్యువే మేలని ఎత్తైన పగోడాల పై నుంచి దూకి ప్రాణత్యాగం చేశారంటారు. ఇంకొందరు దీక్షితార్లు ఆలయానికి తాళం వేసి విగ్రహాలను ఎంతో భద్రంగా కేరళ లోని అళపుజకు తీసుకు వెళ్ళారంటారు. ఆక్రమణ భయం తగ్గిన తర్వాతనే వారు తిరిగి వచ్చారట.

విద్యా సంస్థలు[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  • వేదాంతార్థాలు, స్థాపత్య వివరాలు చిదంబరం మరియు నటరాజ స్వామి గురించిన పేరెన్నికగన్న రచనల సమాహారమైన 'నటరాజస్తవమంజరి'లో వివరించిన శ్రీ ఉమాపతి శివం యొక్క 'కుంచితాంగ్రిస్తవం' నుండి తీసుకోబడ్డాయి.
  • చరిత్ర మరియు చిదంబరంలో లయ నృత్యకారుడైన పరమశివుడి వివరాలు అధీన మహావిద్వాన్ శ్రీ ఎస్ ధండపాణి దేశికర్ రచించిన 'Adalvallan - Encyclopaedia of Adalvallan in Puranas, - Yantras, Poojas- Silpa and Natya Sastras' నుండి తీసుకోబడ్డాయి. ఈ పుస్తకాన్ని 'ది త్రివవదుత్తురై అధీనం, సరస్వతీ మహల్ లైబ్రరీ అండ్ రీసర్చ్ సెంటర్, తిరువవదుత్తురై, తమిళనాడు, ఇండియా 609803' వారు ముద్రించారు.
  • ఒక అందరికీ అందుబాటులో ఉన్న మూలం [1] నుండి సంగ్రహించి, తగిన మార్పులు చేయడమైనది
  • http://www.tamilnadutourism.org/chidam.htm
  • http://www.templenet.com/Tamilnadu/s122.htmlలో చూచినది
  • http://www.templenet.com/Tamilnadu/chidambaram.html
  • Nataraja Temple at Chidambaram
  • Chidambaram, Tamil Nadu, India
  • http://www.chennaionline.com
  1. Falling Rain Genomics, Inc - Chidambaram

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=చిదంబరం&oldid=2708555" నుండి వెలికితీశారు