Jump to content

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం

అక్షాంశ రేఖాంశాలు: 13°44′58″N 79°41′54″E / 13.74944°N 79.69833°E / 13.74944; 79.69833
వికీపీడియా నుండి
(శ్రీకాళహస్తి ఆలయం నుండి దారిమార్పు చెందింది)
Srikalahasti Temple
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం
Srikalahasti Temple శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం is located in ఆంధ్రప్రదేశ్
Srikalahasti Temple శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం
Srikalahasti Temple
శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం
భౌగోళికాంశాలు :13°44′58″N 79°41′54″E / 13.74944°N 79.69833°E / 13.74944; 79.69833
పేరు
ప్రధాన పేరు :శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం
Sri Kalahastheeswara Devasthanamu
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:తిరుపతి
ప్రదేశం:శ్రీకాళహస్తి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:Sri Kalahastheeswara Swami (శివుడు)
ప్రధాన దేవత:Gnana Prasunambika Devi (పార్వతి)
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :దేవాలయం
ఇతిహాసం
వెబ్ సైట్:http://www.srikalahasthitemple.com

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి, శివుడు తనను ఆపి మోక్షం ఇవ్వడానికి ముందు కన్నప్ప లింగం నుండి ప్రవహించే రక్తాన్ని కప్పడానికి తన రెండు కళ్లను సమర్పించడానికి సిద్ధంగా ఉన్న ప్రదేశంగా చెప్పబడింది.[1]

తిరుపతికి 36 కి.మీ దూరంలో ఉన్న శ్రీకాళహస్తి ఆలయం, పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి (గాలి లింగం) ప్రసిద్ధి చెందింది, ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహు-కేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. లోపలి ఆలయం 5వ శతాబ్దంలో నిర్మించబడింది. బయటి ఆలయం 11వ శతాబ్దంలో రాజేంద్ర చోళ - I తరువాత చోళ రాజులు, విజయనగర రాజులచే నిర్మించబడింది. వాయు రూపంలో శివుడు కాళహస్తీశ్వరుడుగా పూజింపబడతాడు.

క్షేత్ర పురాణం

[మార్చు]
భక్త కన్నప్ప కొండ నుండి శ్రీకాళహస్తి దృశ్యము
సుమారు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన రామసేతు వంతెన. సువర్ణముఖి నది ఈ కోవెలకు పశ్చిమ వాహినిగా ప్రవహిస్తూ వుంది
ఆలయం ప్రవేశం వద్ద కోలాహలం

సువర్ణముఖీ నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు. స్వయంభువు లింగం, లింగానికెదురుగా వున్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడును. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీ అని అంటారు.

ఇక్కడి అమ్మవారు జ్ఞానప్రసూనాంబ, అంబాత్రాలయాలలో ఒకరు. శివలింగం ఇక్కడ వర్తులాకారం వలె గాక చతురస్రంగా వుంటుంది. స్థల పురాణాల ప్రకారం ఇది బ్రహ్మకు జ్ఞానం ప్రసాదించిన ప్రదేశం. వశిష్ఠుడు, సాలెపురుగు, పాము, ఏనుగు, బోయడు అయిన తిన్నడు (కన్నప్ప), వేశ్య కన్యలు, యాదవ రాజు, శ్రీ కాళహస్తీశ్వర మహత్యం వ్రాసిన దూర్జటి) వంటి వారి కథలు ఈ క్షేత్ర మహాత్మ్యంతో పెనవేసుకొని ఉన్నాయి.

కన్నప్ప అనే వేటగాడు నిత్యం స్వామిని కొలుస్తుండేవాడు. అతని భక్తిని పరీక్షించడానికి స్వామి ఒకరోజు తన కంటినుండి నెత్తురు కార్చేడట. వెంటనే కన్నప్ప తన కన్ను పీకి స్వామి కంటికి అమర్చాడట. అప్పుడు స్వామి రెండవకంటి నుండి కూడా నెత్తురు కారటం మొదలయింది. భక్తుడైన కన్నప్ప సందేహించకుండా తన రెండవకన్ను కూడా పీకి స్వామికి అమర్చాడు. స్వామి ప్రత్యక్షమై భక్తుడైన కన్నప్పని కరుణించి ముక్తి ప్రసాదించాడు.

దేవాలయం చాలా పెద్దది, పై కప్పుపై రంగులతో చిత్రించిన అనేక చిత్రాలతో కూడుకుని ఉన్నాయి. " మణికుండేశ్వరాఖ్య " అనే మందిరం ఉంది.. కాశీ క్షేత్రంలో వలె ఇక్కడ చనిపొయే వారికి పరమశివుడు ఓంకార మంత్రంను, తారకమంత్రంను ఉపదేశించి మోక్షం ఇచ్చునని భక్తుల నమ్మకం. దేవాలయ ప్రాంతంలోనే పాతాళ విఘ్నేశ్వరాలయం ఉంది. దేవాలయానికి సమీపంలోగల కొండపై భక్త కన్నప్పకి చిన్న ఆలయం నిర్మించారు. శ్రీకాళహస్తీశ్వరాలయం రాజగోపురం సింహద్వారం దక్షిణాభిముఖం. స్వామి వారు ఉత్తరాభిముఖులై వుంటారు. ఆదిశంకరులు ఇక్కడ శ్రీ చక్రం స్థాపించారు. ఈ క్షేత్రానికి గల ఇతర నామాలు దక్షిణకైలాసమనియు, సత్య మహా భాస్కరక్షేత్రమనియు, సద్యోముక్తిక్షేత్రమనియు, శివానందైక నిలయమనియు పేర్కొనటం జరిగింది. మహా శివరాత్రినాడు ఇక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతుంది.

ధూర్జటి శ్రీకాళహస్తీశ్వరుడు మీద శతకం వ్రాశాడు. అందులో శ్రీ కాళహస్తి స్థలపురాణం స్పృశిస్తూ

ఏవేదంబు పఠించెలూత భుజంగంబే శాస్త్రముల్ చదివె తా
నేవిద్యాభ్యాసమొనర్చె కరి చెంచే మంత్రమూహించె బో
ధావిర్భావ విధానముల్ చదువులయ్యా కావు మీపాద సం
సేవా శక్తియె కాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా!

చరిత్ర

[మార్చు]

సా.శ.పూర్వం మూడవ శతాబ్దంలో తమిళ సంగం వంశానికి చెందిన నక్కీరన్ అనే తమిళ కవి రచనల్లో శ్రీకాళహస్తి క్షేత్రం గురించి దక్షిణ కాశీగా చారిత్రక ప్రస్తావన ఉంది. ఇంకా తమిళ కవులైన సంబందర్, అప్పర్, మాణిక్యవాసగర్, సుందరమూర్తి, పట్టినత్తార్, వడలూర్ కు చెందిన శ్రీరామలింగ స్వామి మొదలగు వారు ఈ క్షేత్రంను సందర్శించారు.[2]

ఆలయానికి ఆనుకుని ఉన్న కొండ రాళ్ళపై పల్లవుల శైలిలో చెక్కబడిన శిల్పాలను గమనించవచ్చు. తరువాత చోళులు పదకొండవ శతాబ్దంలో పల్లవులు నిర్మించిన పాత దేవాలయాన్ని మెరుగు పరచడం జరిగింది. ఒకటవ కులోత్తుంగ చోళుడు ప్రవేశ ద్వారం వద్దగల దక్షిణ గాలి గోపురాన్ని నిర్మించాడు. మూడవ కులోత్తుంగ చోళుడు ఇతర ఆలయాల్ని నిర్మించాడు. సామాన్యశకం 12వ శతాబ్దానికి చెందిన వీరనరసింహ యాదవరాయ అనే రాజు ప్రస్తుతం ఉన్న ప్రాకారాలను, నాలుగు ద్వారాలను కలిపే గోపురాలను నిర్మించాడు. సామాన్యశకం 1516 విజయనగర సామ్రాజ్యాధీశుడైన శ్రీకృష్ణదేవరాయల రాతిపై చెక్కించిన రచనల ఆధారంగా ఆయన వంద స్తంభాలు కలిగిన మంటపం, అన్నింటికన్నా తూర్పు పడమర దిక్కుల వైపుకు ఉన్న ఎత్తైన గాలిగోపురం నిర్మించినట్లు తెలుస్తోంది. ఈ గోపురాన్ని 1516 వ సంవత్సరంలో గజపతులపై విజయానికి సూచనగా నిర్మించినట్లు తెలియజేస్తుంది. ఈ గోపురం 2010 మే 26 న కూలిపోయింది. పది సంవత్సరాలుగా గోపురంలో అక్కడక్కడా పగుళ్ళు కనిపిస్తున్నప్పటికీ దానికి ఆలయ అధికారులు మరమ్మత్తులు చేస్తూ వస్తున్నారు అయితే కూలిపోక ముందు కొద్ది రోజుల క్రితం సంభవించిన లైలా తుఫాను కారణంగా ఒక వైపు బాగా బీటలు వారింది. మరో రెండు రోజులకు పూర్తిగా కూలిపోయింది. ఆలయ అధికారులు ముందుగా అప్రమత్తమై ముందుగా చుట్టుపక్కల కుటుంబాలను దూరంగా తరలించడంతో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు కానీ రెండు రోజుల తర్వాత శిథిలాల క్రింద ఒక వ్యక్తి మృతదేహం లభ్యమయింది.[3] ఈ కూలిపోవడానికి గల కారణాలు అన్వేషించడానికి ప్రభుత్వం సాంకేతిక నిపుణలతో కూడిన ఒక కమిటీని నియమించింది.[4]

సామాన్యశకం 1529 అచ్యుతరాయలు తన పట్టాభిషేక మహోత్సవాన్ని ముందు ఇక్కడ జరుపుకొని తరువాత తన రాజధానిలో జరుపుకొన్నాడు. 1912లో దేవకోట్టైకి చెందిన నాటుకోట్టై చెట్టియార్లు తొమ్మిది లక్షల రూపాయలు విరాళం ఇవ్వడం ద్వారా దేవాలయానికి తుదిరూపునిచ్చారు.[2]

దేవాలయ చరిత్ర, ప్రత్యేకతలు

[మార్చు]

ఈ దేవాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది.

  • శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది.
  • ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది.
  • ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం

ఆలయ విశేషాలు

[మార్చు]
స్వామివారి రథం. మహాశివరాత్రి మరుసటి రోజు, రథోత్సవం కన్నులపండుగగా జరుగుతుంది.
.శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణం

దేవాలయం దేశంలోని అతి పెద్ద దేవాలయాలలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధికి సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కేవలం కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహు కేతు సర్ప దోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొన్న శ్రీకాళహస్తీశ్వరస్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు.

నాలుగు దిక్కుల దేవుళ్ళు
గుడి గర్భాలయంలోని శ్రీకాళహస్తీశ్వర, జ్ఞాన ప్రసూనాంబ విగ్రహాలు.

శ్రీకాళహస్తీశ్వర ఆలయం నిర్మాణంలో ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ వినాయకుడు, శ్రీకాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరు ఒక్కొక్క దిక్కునకు అభిముఖులై ఉన్నారు. ఆలయ దర్శనం ద్వారా చతుర్విధ పురుషార్ధ సిద్ధి లభిస్తుందనడానికి ఇది సూచన అని భక్తుల విశ్వాసం. పాతాళ గణపతి ఉత్తరాభిముఖునిగాను, జ్ఞాన ప్రసూనాంబ తూర్పు ముఖంగాను, కాళ హస్తీశ్వరుడు పశ్చిమ ముఖంగాను దక్షిణామూర్తి దక్షిణ ముఖం (మహా ద్వారం ఎదురు) గాను ఉన్నారు. కాళహస్తిలోని శివలింగం పంచ లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. (కంచి ఏకాంబరేశ్వరుడు పృథ్వీలింగము, శ్రీరంగం వద్ద జంబుకేశ్వరుడు జలలింగము, అరుణాచలంలో తేజోలింగం, చిదంబరంలో ఆకాశలింగము). స్వామి వాయుతత్వరూపానికి నిదర్శనంగా గర్భగుడిలోని కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడూ చలిస్తూ ఉంటాయని చెబుతారు.

గోపురాలు

ఆలయానికి నాలుగు దిక్కులా నాలుగు గోపురాలు, 120 అడుగుల ఎత్తుగల రాజగోపురం (కృష్ణదేవరాయలు కట్టించినది) ఉన్నాయి. స్వామి గ్రామోత్సవం ఈ గోపురంనుండే మొదలవుతుంది. ఆలయానికి చేరుకోవడానికి ముందుగా "తేరు వీధి"కి ఎదురుగా ఉన్న భిక్షాల గోపురంనుండి వస్తాడు. జంగమరూపుడైన శివుని సేవించి తరించిన దేవదాసి "బిచ్చాలు" దీనిని కట్టించిందట. ఈ గోపుర నిర్మాణం యాదవ నరసింహరాయల కాలంలో జరిగిందని అంటున్నారు. తూర్ప గోపురాన్ని "బాల జ్ఞానాంబి గోపురం" అని, ఉత్తరం గోపురాన్ని "శివయ్య గోపురం" అని, పశ్చిమ దిక్కు గోపురాన్ని "తిరుమంజన గోపురం" అని అంటారు. తిరుమంజన గోపురానికి కుడినైపున "సూర్య పుష్కరిణి", ఎడమవైపున "చంద్ర పుష్కరిణి" ఉన్నాయి. స్వామి అభిషేకానికి, వంటకు నీటిని సూర్యపుష్కరిణి నుండి తీసుకెళతారు. ఈ గోపురంనుండి సువర్ణముఖి నదికి వెళ్ళవచ్చును. దక్షిణం గోపురంనుండి భక్త కన్నప్ప గుడికి, బ్రహ్మ గుడికి వెళ్ళవచ్చును.

ఇతర శివలింగాలు, పరివార దేవతలు

ఇక్కడ అనేక శివలింగాలు మహర్షులు లేదా దేవతలచే ప్రతిష్ఠింపబడినవిగా భావిస్తారు. భృగు మహర్షి - అర్ధ నారీశ్వర లింగము; అగస్త్యుడు - నీలకంఠేశ్వర లింగము; ఆత్రేయుడు - మణి కంఠేశ్వర లింగం; ఇంకా వ్యాసుడు, మార్కండేయుడు (మృత్యంజయేశ్వర లింగము), రాముడు, పరశురాముడు, ఇంద్రాది దేవతలు, సప్తర్షులు, యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ధర్మరాజు ప్రతిష్ఠించినవనే లింగాలున్నాయి. వర్షాల కోసం మృత్యుంజయేశ్వరునికి సహస్రలింగాభిషేకం చేస్తారు. కాశీ విశ్వేశ్వరుడు కూడా మూర్తి స్వరూపుడై యున్నాడు.

ఇక్కడ క్షేత్ర పాలకుడు కాలభైరవుడు. వివిధ గణపతి మూర్తులు, సుబ్రహ్మణ్య స్వామి, సూర్య, శని గ్రహ మూర్తులు ఉన్నారు. వేంకటేశ్వర స్వామి, వరదరాజ స్వామి, వీరరాఘవ స్వామి మూర్తులు ఉన్నారు. నిలువెత్తు కన్నప్ప విగ్రహం ఉంది. శంకరాచార్యుల స్ఫటిక లింగము, 64 నాయనార్ల లోహ విగ్రహాలున్నాయి.

మంటపాలు

ఆలయంలో శిల్పకళతో శోభించే స్తంభాలు, మంటపాలు ప్రత్యేకంగా చూపరులను ఆకర్షిస్తాయి. ఇంకా అనేక వర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి. నగరేశ్వర మంటపము, గుర్రపుసాని మంటపము, నూరుకాళ్ళ మంటపము (రాయల మంటపము), పదునారు కాళ్ళ మంటపము, కోట మంటపము వాటిలో కొన్ని. నూరుకాళ్ళ మంటపం చక్కని శిల్పాలకు నిలయం. పదహారు కాళ్ళ మంటపంలో 1529లో అచ్యుత దేవరాయలు (కృష్ణదేవరాయలు సోదరుడు) పట్టాభిషేకం జరిగింది. అమ్మవారి ఆలయం ఎదురుగా అష్టోత్తర లింగ ముఖద్వారం పైకప్పులో చక్కని చిత్రాలున్నాయి.

రాహు కేతు క్షేత్రం

ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి "రాహు కేతు క్షేత్రము" అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.

దక్షిణామూర్తి

దక్షిణాభిముఖంగా ఉన్న ఆలయ ప్రవేశ ద్వారంనుండి లోనికి ప్రవేశించగానే ఉత్తరముఖంగా కొలువైయున్న దక్షిణామూర్తిని దర్శించవచ్చును. దక్షిణామూర్తి పూజలందుకొనడం కారణంగా ఇది జ్ఞాన ప్రధానమైన క్షేత్రం అయ్యింది. ఈ విధమైన దక్షిణామూర్తి విగ్రహం వేరెక్కడా కనుపించదు. ఇక్కడ వైదిక సంప్రదాయానికి ప్రముఖస్థానం ఉంది.

సేవలు

ఆలయంలో జరిగే కొన్ని సేవలు - కర్పూర హారతి, అష్టోత్తర అర్చన, సహస్ర నామార్చన, త్రిశతి అర్చన, పాలాభిషేకము, పచ్చ కర్పూరాభిషేకము, కాశీ గంగాభిషేకము, రుద్రాభిషేకము, నిత్యదిట్ట అభిషేకము, శ్రీ శనేశ్వరస్వామి అభిషేకము, శుక్రవారం అమ్మవారి ఊంజలి సేవ, వివాహ కట్నం, పంచామృతాభిషేకము, అఖండ దీపారాధన కట్నం, నిత్యోత్సవం (ఉదయం), ప్రదోష నంది సేవ, ఏకాంత సేవ, వాహన పూజ, సుప్రభాత సేవ, శని నివారణ జ్యోతిదీప కట్నం, తళిగ కట్నం, సర్పదోష (రాహు కేతు) పూజ, పౌర్ణమినాడు ఊంజల్ సేవ, నంది సేవ, పెద్ద వెండి సింహ వాహనము

తీర్ధాలు

ఆలయం పరిసరాలలో 36 తీర్ధాలున్నాయట. సహస్ర లింగాల తీర్ధము, హరిహర తీర్ధము, భరద్వాజ తీర్ధము, మార్కండేయ తీర్ధము, మూక తీర్ధము, సూర్య చంద్ర పుష్కరిణులు వాటిలో ముఖ్యమైనవి. దేవాలయంలోని "పాతాళ గంగ" లేదా "మూక తీర్థము"లోని తీర్థాన్ని సేవిస్తే నత్తి, మూగ లోపాలు పోయి వాక్చాతుర్యం కలుగుతుందటారు.

ఇతర విశేషాలు

ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహము ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం సుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.

పండుగలు

[మార్చు]
శ్రీకాళహస్తి రాజగోపురం

పండుగల విషయానికొస్తే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజులపాటు అంగరంగ వైభోగంగా జరుగుతాయి. ఈ రోజులలో ఆలయం లోపలనే కాకుండా నాలుగు ప్రధాన వీధులైన నెహ్రూ వీధి, కుంకాల వీధి, తేరు వీధి, నగరి వీధులు జనంతో కిటకిటలాడుతుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక పక్క రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతారు. ఈ ఉత్సవం ప్రధానమైన మూడు రోజులు ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నిర్వహిస్తుంది. అన్నింటి కన్నా ఎక్కువగా మహాశివరాత్రి రోజున సుమారు లక్షకు పైగా భక్తులు స్వామి దర్శనార్థం విచ్చేస్తారు. ఈ రద్దీని తట్టుకోవడానికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. శివుడు కళాప్రియుడు కాబట్టి ఆలయం సమీపంలో ఏర్పాటు చేసిన వేదికపై రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన గాయకులు, హరికథకులు, నాట్య కళాకారులు, నర్తకీమణులు, భజన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, సంగీత వాయిద్య కారులు, భక్తులను తమ కౌశలంతో రంజింప జేస్తారు.

ఇక్కడికి విచ్చేసిన సినీ కళాకారుల్లో సినీ సంగీత దర్శకుడు మణిశర్మ, నటి, భరత నాట్య కళాకారిణి శోభన, నేపథ్య గాయకులు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం, మొదలైనవారు ముఖ్యులు. మహాశివరాత్రి పర్వదినాన జరిగే నందిపై ఊరేగింపు కన్నుల పండుగగా ఉంటుంది. నంది వాహనమెక్కి ఊరేగు శివుని ముందు అనేక జానపద కళా బృందాలు ప్రదర్శించే కళలు చూపరులను విశేషంగా ఆకట్టుకుంటాయి. మహాశివరాత్రి తరువాతి రోజు జరిగే రథ యాత్రలో కూడా ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇంకా నారద పుష్కరిణిలో జరిగే తెప్పోత్సవం కూడా ఉత్సవాల్లో ప్రధాన వేడుక. అందంగా అలంకరించిన తెప్పలపై స్వామి వారిని, అమ్మవారిని కోనేటిలో విహారం చేయిస్తారు. పట్టణం నడిబొడ్డులోగల పెళ్ళి మంటపంలో జరిగే కళ్యాణోత్సవంలో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్ళి చేసుకోలేని పేదలు స్వామి, అమ్మవారి కళ్యాణంతో పాటుగా పెళ్ళి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ.

ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనక దుర్గమ్మ అమ్మవారికి ఏటా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. ఈ తొమ్మిది రోజులపాటు కూడా భక్తులు విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటారు. ఇంతకు మునుపు చిన్నదిగా ఉన్న ఆలయాన్ని 2006లో విస్తరించడం జరిగింది. మరి కొంత దూరంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి కొండపై కూడా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి.

ధర్మరాజుల స్వామి తిరునాళ్ళు కూడా ఐదు రోజులపాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపదీ అమ్మవారు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు భారత పారాయణం జరుగుతుంది. విరాటపర్వం చదివిన రోజున పట్టణంలో కచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా ఐదవరోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేస్తారు.

ఇంకా ప్రతీ సంవత్సరం డిసెంబరు నెలలో జరిగే ఏడు గంగల జాతర కూడా చెప్పుకోదగ్గ ఉత్సవమే. ఈ ఉత్సవాలలో భాగంగా పట్టణం లోని ఏడు వీధులలో ఏడు రూపాలలో ఏర్పాటు చేసిన గంగమ్మలను ప్రతిష్ఠిస్తారు. ముత్యాలమ్మ గుడి వీధిలో గల గంగమ్మ దేవాలయం నుంచి ఈ ఏడు విగ్రహాలు ఊరేగింపుగా బయలుదేరి ఆయా వీధులలో ప్రతిష్ఠిస్తారు. ఆ గంగమ్మ విగ్రహాలు జీవం ఉట్టి పడేలా తయారు చేయడం ఆ కళాకారుల నైపుణ్యానికి నిదర్శనం.

పాతాళ గణపతి ఆలయం

[మార్చు]

ఈ ఆలయమునకు ప్రవేశద్వారము వైపున పాతాళ గణపతి ఆలయము ఉంది. ఇందులోనికి ప్రవేశము ఒకసారికి ఒకరికి మాత్రమే ఉంది. మెట్లద్వారాలోనికి వెళ్లేందుకు సన్నని సందు వంటి మార్గము లోనికి ఉంది. దాదపు 20 అడుగుల లోతు వరకు ప్రయాణించిన పిదప గణపతి విగ్రహం ఉంది. ఈ స్వామి కోర్కెలు తీర్చేవాడని ప్రసిద్ధి.

ఇతర విశేషాలు

ధర్మ కర్తల మండలి పరిపాలనలో, దేవాదాయ శాఖ అధ్వర్యంలోఆలయ నిర్వహణ జరుగుతుంది. యాత్రికుల కొరకు శ్రీకాళహస్తీశ్వరస్వామి వసతి గృహం, జ్ఞానప్రసూనాంబ వసతి గృహం, బాలజ్ఞానాంబ సత్రము, శంకరముని వసతిగృహము, త్రినేత్రనటరాజ వసతిగృహము, తిరుమల తిరుపతి దేవస్థానం వసతిగృహం ఉన్నాయి. పట్టణంలో ప్రైవేటు వసతిగృహాలున్నాయి. (2007 నాటికి) దేవస్థానానికి ఆదాయం షుమారు 7 కోట్ల రూపాయలు ఉంది. శ్రీ జ్ఞానప్రసూనాంబ అమ్మవారి నిత్యాన్నదాన పధకం ద్వారా భక్తులందరికీ ఉచిత భోజన సదుపాయం కలిగించే ప్రయత్నం జరుగుతున్నది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Devadiga, Disha (2022-01-31). "Srikalahasteeswara temple – The Kashi of South". Temples of India Blog. Retrieved 2022-05-20.
  2. 2.0 2.1 "Temples & Legends of Andhra Pradesh/Kalahasti/(Page5)". Archived from the original on 2008-03-07. Retrieved 2014-02-27. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "Kalahasti temple" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-05-30. Retrieved 2014-02-27.
  4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-08. Retrieved 2014-02-27.

ఇతర లింకులు

[మార్చు]