తమిళ సంగం సభలు
తమిళ సంగం సభలు తమిళ పండితులూ, కవుల సమ్మేళనం. తమిళుల ప్రకారం లెక్కకు రాని కాలం నుండి ఇవి నిర్వహించబడుతున్నాయి. నేటి పండితుల ప్రకారం వీటిని కూటల్ లేదా గోష్ఠి అనేవారు, ఇదే పేరు మదురైకు కూడా ఉంది. మూడు సంగం సభలు మాత్రమే వివరించబడి ఉన్నాయి. మొదటి రెండు సభలు నిర్వహించిన ప్రదేశం సముద్రంలో కలిసిపోయింది అని, మూడవ సభలు క్రీ.పూ. 5వ శతాబ్దంలో జరిగిన ప్రదేశం ప్రస్తుత మదురై నగరమనీ నమ్మిక. కొన్ని తమిళ గ్రంథాలైన తేవరం, తిరువిలయ్యాటల్ పురాణం, పెరియపురాణం ఇంకా ఇరయనాల్ ఆహపొరుల్ లలో సంగం అనే పదం పరిషత్తు అనే అర్ధంలో ఇవ్వబడింది. మరో నమ్మకం ప్రకారం నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొఴి 300 కవులతో ఏర్పరిచిన సభలో ఆమోదించబడింది. సంగం కాలము దాదాపుగా క్రీ.పూ.3000 నుండి సా.శ.300 వరకూ ఉందవచ్చు. ఇదే కాలంలో మొదటి తమిళ సాహిత్యం రూపుదిద్దుకుని ఉండవచ్చు. కానీ, సంగం సభలు, సంబంధిత కథనాలు చాలా కాలం తరువాత చలామణిలోకి వచ్చి ఉండవచ్చు. మొదటి రెండు సంగం సభలు అచారిత్రకమనీ, అవస్తవమనీ కొట్టి పారేసే వారున్నప్పటికీ, కమిల్ ఴ్వెలెబిల్ లాంటి కొందరు ఆధునిక పండితులు ఆ మొదటి రెండు సభల్లో కనీసం ఒకటి కచ్చితంగా జరిగి ఉండవచ్చు అని నమ్ముతారు. ఏది ఏమైనా, సంగం సభల కథనాలే తమిళనాడుని రాజకీయంగా, సామాజికంగా, ఇంకా సాహిత్య పరంగా ప్రభావితం చేస్తూ వచ్చాయి, ముఖ్యంగా 20వ శతాబ్దంలో.
సంగం కథనాలు
[మార్చు]పల్లవ సామ్రాజ్యానికి ముందు ఉన్న సాహిత్యంలో ఎక్కడా సంగం పరిషత్తుల గురించి ప్రస్తావన రాలేదు. ఏడవ శతాబ్దానికి చెందిన అప్పర్, సంబంధర్ అనే శైవ కవుల ద్వారా మొదటి సారి సాహిత్యంలో సంగం సభల ప్రస్తావన చూచాయగా దొరుకుతుంది. ఇవి మదురైలో జరిగిన మూడవ సంగం సభలకు సంబద్ణించి ఉండవచ్చని అనుకోలు. పూర్తి స్థాయిలో సంగం సభల గురించి నక్కీరర్ రాసిన ఇరయనర్ ఆహప్పొరుల్ వ్యాఖ్యానంలో కనిపిస్తుంది. నక్కీరర్ ప్రకారం సంగం (చంకం) సభలు వేల ఏళ్ళ నుండి నిర్వహించబడ్డాయి. మొదటి సంగం (ముతర్ చంకం) సముద్రంలో మునిగిపోయిన మదురై నగరంలో జరిగాయని, ఇవి మొత్తం 4400 సంవత్సరాల పాటూ, 549 సభ్యులతో శివుడు, కుబేరుడు, కుమారస్వామి వంటి దేవుళ్ళ సమక్షంలో జరిగాయని చెప్పాడు. ఈ సంగం ద్వారా 4449 కవుల సాహిత్యం ప్రచురితమయిందని చెప్పబడింది. కాయ్సిన వలుది మొదలు కడుంగొన్ వరకూ 89 పాండ్య రాజుల పాలనలో ఈ సంగం నిర్వహించబడింది. మొదటి సంగంలో అగత్తియం అనే వ్యాకరణం వాడారు. రూపొందించిన కవితలు పరిపాడల్, ముదునరై, ముదుకురుగు, కలరియవిరై. ఒకవేళ ఇరయనర్ ఆహప్పొరుల్ ను అనుసరిస్తే, మొదటి సంగం మొదలయింది క్రీ.పూ.9000లో.
రెండవ సంగం (ఇతైచంకం) కపటపురంలో నిర్వహించబడింది. ఇది 3700 సంవత్సరాలపాటూ, 59 సభ్యులతో, 3700 కవులతో నిర్వహించబడింది. వెందెర్చ్చెలియన్ నుండి ముదత్తిరుమారన్ వరకు 59గురు పాండ్య రాజులు ఈ కాలంలో పాలించారు. ఈ నగరం కూడా సముద్రంలో మునిగిపోయిందని నమ్మిక. వ్యాకరణం బుదపురాణం, అగత్తియం, తొల్కాప్పియం, మపురాణం, ఇసైనునుక్కాన్ని అనుసరించి ఉంది.
మూడవ సంగం (కటైచంకం/కడైచంగం) ప్రస్తుత మదురైలో 1850 సంవత్సరాల పాటు నిర్వహించబడింది. ముదత్తిమారన్ (ఇతడే సముద్రంలో మునిగిన కవటపురం నుండి మదురైకి వచ్చాడు) నుండి ఉక్కిరప్పెరు వలుది వరకు 49 పాండ్య రాజులు ఈ కాలంలో రాజ్యాన్ని పాలించారు. ఈ సంగం సభలో 49 సభ్యులు, 449 కవులు పాల్గొన్నారు. అగత్తియం ఇంకా తొల్కాప్పియం వ్యాకరణాలు వాడారు. కుఱుంతొగై, నేతుంతొగై, కురుంతొగై నానూరు, నఱ్ఱినై నానూరు, పురనానూరు, ఐంగురునూరు, పడిఱ్ఱుపాటు, కలి, పారిపాడల్, కుట్టు, వారి, సిఱ్ఱిసై, పెఱిసై ఈ సంగంలో రచించబడిన కవితలు.
తరువాత వచ్చిన కథనాల ప్రకారం మూడవ సంగం మదురై మీనాక్షి అమ్మవారి గుడిలోని స్వర్ణకమలాల కొలను తీరంలో జరిగాయి. వివిధ శైవ, వైష్ణవ సాహిత్యాల్లో ఎన్నో ఇలాంటి సభలు హరిగినట్టు తెలుస్తోంది.
ఈ సంగం సభల పరిషత్తు యొక్క ప్రస్తావన పెరుంపఱ్ఱపులియూర్ నంబి రచన తిరువిలయ్యాడల్ పురాణంలో కనిపిస్తుంది. నంబి ప్రకారం 49 మంది ఉన్న మూడవ సంగంలో 63 శైవ నాయనార్లలో వారయిన కపిలర్, పరణర్, నక్కీరర్ ముందుండి నడిపించారు. ఇంకో కథనం ప్రకారం నక్కీరర్ శివుడినే ఎదురించి వాదిస్తాడు.
పరంజోతి మునివర్ రాసిన తిరువిలయ్యాటల్ పురాణంలో కూడా సంగం సభా పరిషత్ గురించి ఉంది.
ఇప్పటి కథనాల ప్రకారం మొదటి రెండు సంగమ సభలు జరిగిన ప్రదేశాలు కుమారి కండం అనే కథలలో చెప్పే ఊహాజనిత మహాద్వీపంలో జరిగినట్టు, అది భారత భూభాగానికి దక్షిణాన ఉన్నట్టు చెప్పబడుతోంది. కుమారి కండాన్ని తమిళ సాహిత్యానికి పునాది గా, స్వర్గంగా పరిగణిస్తారు. కుమారికండం ప్రస్తుత కన్యాకుమారి జిల్లాకు దక్షిణంగా ఉండేదనీ, నిత్యం వచ్చే వరదలకు అది సముద్రంలో కలిసిపోయిందని నమ్మిక.
చారిత్రక నిరూపణ
[మార్చు]పీటీ శ్రీనివాస అయ్యంగర్ ఈ విషయమై పరిశోధించి "హిస్టరీ ఆఫ్ తమిళ్స్(తమిళుల చరిత్ర)" అనే పుస్తకంలో రాసాడు. కమిల్ ఴ్వెలిబిల్ ప్రకారం ఈ సభలు పాండ్య రాజుల ద్వారా మొదలుపెట్టబడి, వారి ద్వారానే పోశించబడ్డాయని తెలుస్తుంది. అందువలన పాండ్యుల రాజధాని ఏ నగరమయితే అక్కడ సంగం సభలు జరిగి ఉండవచ్చని ఒక ఊహ. మొదటి రెండు సంగం సభల అస్తిత్వాన్ని పూర్తిగా కొట్టిపారేయకూడదని ఈయన అంటారు. సా.శ. 470లో ద్రావిడ సంఘం ఒకటి మదురై వద్ద వజ్రనంది అనే జైనుడు నిర్వహించాడు. ఈ సంఘం తమిళ భాష, సాహిత్యం పై ఎక్కువ శ్రద్ధ చూపింది. ఇప్పటి సంగం సభలపై ఉన్న అన్ని కథనాలు ఈ సంఘం గురించే అయి ఉండవచ్చు అన్నది ఒక వాదన.
సంగ సాహిత్యం
[మార్చు]శాస్త్రీయ పరిశోధనల ప్రకారం తమిళంలో తొట్టతొలి సాహిత్యం క్రీ.పూ. 300 నుండి సా.శ. 200 మధ్య ఉండి ఉండవచ్చు. ఈ సాహిత్యం ముఖ్యంగా ప్రేమ, యుద్ధం, ప్రజాపాలన, వ్యాపారం, ఎడబాటు వంటి విషయాలపై ఉన్నాయి. అన్ని కథనాలకూ విరుద్ధంగా ఈ కాలంలో వచ్చిన సాహిత్యమంతా సంగం సాహిత్యంగా పరిగణించబడుతుంది; మొదటి, రెండవ లేదా మూడవ సంగం అనే భేదం లేకుండా. ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేనందువలన సంగం సాహిత్యంకి సంబంధించిన కథనాలకు నిరూపాలు లేవు. అందువలన సంగం కథనాలు అనవసరమయిన వివాదాలకు, తేదీల అయోమయానికి, రచైతల పేర్లకూ, ఇంకా కొన్ని సందర్భాల్లో సంగం సభల అస్తిత్వానికే అనుమానాలు వచ్చేలా దారి తీస్తున్నాయి. పురాతత్వ ఆధారల ప్రకారం మదురై ఇంకా సంగంకి సంబంధించిన శాసనం 10వ శతాబ్దానికి సంబంధించినదే ఆధారంగా ఉంది.