గర్భగుడి
దేవాలయములో 'మూలవిరాట్టు'గల ప్రదేశాన్ని'గర్భగుడి'అని అంటారు. దేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడినే మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్ని కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమసూత్రాలను అనుసరించి నిర్మించబడిఉంటాయ. ప్రతి ఆలయంలోను విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ఈ రెండింటికి ఎప్పుడు ఒక నిర్ణీత సంబంధం వుండటంవల్లనే గర్భగుడి లోపల ప్రణవమంత్రం ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ప్రణవమంత్రమైన ఓంకారాన్ని ఉచ్ఛరించినపుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది. [1]
లోకం లోని ఉత్తమ ద్రవ్యాలతో నిండిన గర్భ పాత్రను విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికాది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు.
విశేషాలు
[మార్చు]శబ్దాన్ని బట్టి రాయి జాతిని నిర్ణయించి దానిని మూలవిరాట్టుగా మలిచి యంత్ర సహితంగా గర్భాలయములో ప్రతిష్ఠ చేస్తారు. ఆలయం ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గర్భగుడి మాత్రం చాలా చిన్నదిగా వుంటుంది. ఆలయం బయటంత శిల్ప సంపద, విద్యుత్ కాంతులు కనిపిస్తాయి. కానీ గర్భాలయంలో అలాంటివేమీ వుండవు. దైవం కేవలం తన ఎదురుగా ఉండే 'దీపారాధన' వెలుగులో మాత్రమే కనిపిస్తుంటుంది.[2]
గర్భాలయం పైన గల విమానం ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విమానంపై ఒక కలశం మాత్రమే ఉంచుతారు. రాగితో చేయబడిన ఈ కలశం బంగారు పూతను కలిగి ఉంటుంది. నవగ్రహాలు, 27 నక్షత్రాల నుంచి వచ్చే శక్తివంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి శక్తిని గర్భాలయంలో ఉన్న యంత్రములనబడే రాగిరేకులకు చేరవేస్తుంది. అప్పుడు ఆ శక్తిని వాటి నుండి విగ్రహం గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్లి అక్కడి దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తుల దేహంపై ప్రభావం చూపి ఆరోగ్యాన్నిస్తుంది.
గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒక వైపుకు మాత్రమే వెళ్లాలని 'ఆగమ శాస్త్రం'చెబుతోంది. ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా, ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేస్తారు. ఆ వైపు నుంచి మాత్రమే భక్తులు దైవాన్ని దర్శించి ఆయన నుంచి తమకి కావలసిన శక్తిని పొందుతుంటారు.
తిరుమలలో గర్భగుడి
[మార్చు]తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది. అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడి వైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది.[3] శ్రీ వైకుంఠం నుండి లక్ష్మీ దేవిని వెతుకుతూ వచ్చిన శ్రీనివాసుడు ఇక్కడ అద్భుత సాలగ్రామ శిలలో స్వయం వ్యక్త మూర్తిగా ఆవిర్భవించి ఆరాధింప బడుతున్నాడు.
వారి గర్భాలయం శక్తి నిలయం. స్వయంభువుగా వెలసిన మహావిష్ణువును సేవించాలని ఎందరో దేవతలు గర్భాలయాన్ని ఆశ్రయించి ఉంటారు. వారందరి మహత్యంతో గర్భాలయం శక్తివంతమైన వలయంగా ఉంటుంది. [4]
దేహంలో గర్భాలయం
[మార్చు]దేహాన్ని దేవాలయం అని వేదాలు, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఇది ఒక చోట స్థిరంగా ఉండే దేవాలయం కాదు. ఇది చర దేవాలయం. కదులుతూ ఉండేది. బయట కనిపించే దేవాలయాన్ని మానవులే కట్టిస్తారు. అందులో దేవుణ్ణి కూడా మానవులే ప్రతిష్టిస్తారు. కాని ఈ శరీరమనే దేవాలయాన్ని భగవంతుడే నిర్మించి, హృదయమనే గర్భగుడిలో తనకు తానే ప్రతిష్టితుడై కూర్చున్నాడు. బయటి గుడికి - ఈ గుడికి అదే తేడా ఇక్కడ భగవంతుడు 'స్వయంభూ ' అన్నమాట. "దేహం దేవాలయం" అయితే, "హృదయం గర్భగుడి" అవుతుంది, జీవుడు దేవుడౌతాడు. [5]
శిలాపద్మం
[మార్చు]గర్భాలయం పై కప్పుమీద ఒక చక్రాన్ని చిత్రించడం కాకతీయుల ప్రత్యేకత. దేవాలయం పెద్దదయినా చిన్నదయినా గర్భాలయంలోని ఈశ్వరునికి పై భాగంలో అష్టకోణాలతో ఈ చక్రం కనిపిస్తుంది. గణపేశ్వరాలయపు గర్భాలయంలో అర్చామూర్తికి పైభాగంలో ఆలయపు పైకప్పుకు సౌష్టవాకారంలోని రాతి పద్మాలు వున్నాయి. దానిచుట్టూ ఒక క్రమపద్దతిలో చెక్కిన పద్మదళాలు కూడా వున్నాయి. ముక్కంటేశ్వర, వేణుగోపాల అంతరాలయ మంటపాలలోనూ, రంగమంటపంలో కూడా అందమైన పద్మనిర్మాణాలను గమనించవచ్చు.[6]
ఇవి కూడా చూడండి
[మార్చు]ఇతర విషయాలు
[మార్చు]- గర్భాలయం (నవల) - 2008 : ఇది ప్రాచీన భారతీయ ఇతిహాసాల్నీ, ఆధునిక సైకో అనాలసిస్ సిధ్ధాంతాల్నీ సహేతుకంగా సమన్వయించే, సస్పెన్స్ థ్రిల్లర్. దీనిని నండూరి శ్రీనివాస్ రాసాడు. [7]
మూలాలు
[మార్చు]- ↑ "గర్భగుడి ప్రాధాన్యం | Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Archived from the original on 2020-07-21. Retrieved 2020-07-21.
- ↑ "గర్భగుడి ." ap7am.com. Archived from the original on 2020-07-22. Retrieved 2020-07-21.
- ↑ "తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని 10 నమ్మలేని నిజాలు". Samayam Telugu. Retrieved 2020-07-21.
- ↑ JSK. "శ్రీవారి దివ్యమంగళ స్వరూపం చూస్తే కోరికలు గుర్తుకురావు... రమణదీక్షితులు ఇంటర్వ్యూ". telugu.webdunia.com. Archived from the original on 2020-07-21. Retrieved 2020-07-21.
- ↑ "చావు తర్వాత కూడా జీవితం ఉంటుందా?". Asianet News Network Pvt Ltd. Archived from the original on 2020-07-21. Retrieved 2020-07-21.
- ↑ "పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/27 - వికీసోర్స్". te.wikisource.org. Retrieved 2020-07-21.
- ↑ "Garbhalayam by Nanduri Srinivas". Pusthakalu.com (in బ్రిటిష్ ఇంగ్లీష్). Archived from the original on 2020-07-21. Retrieved 2020-07-21.
బాహ్య లంకెలు
[మార్చు]- "[CC] తిరుమల గర్భాలయం వద్ద మనం చూడని 10 విశేషాలు |10 secrets at Tirumala Sanctum | Nanduri Srinivas - YouTube". www.youtube.com. Retrieved 2020-07-21.
- Nagendra (2019-10-19). "దేహమే దేవాలయం ఎలాగో తెలుసా?". telugu news | Manalokam.com. Retrieved 2020-07-21.[permanent dead link]