ద్రాక్షారామం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రెవిన్యూ గ్రామం
నిర్దేశాంకాలు: 16°47′34″N 82°03′49″E / 16.7928°N 82.0635°E / 16.7928; 82.0635Coordinates: 16°47′34″N 82°03′49″E / 16.7928°N 82.0635°E / 16.7928; 82.0635
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాకోనసీమ జిల్లా
మండలంరామచంద్రాపురం మండలం
విస్తీర్ణం
 • మొత్తం4.74 కి.మీ2 (1.83 చ. మై)
జనాభా వివరాలు
(2011)
 • మొత్తం9,299
 • సాంద్రత2,000/కి.మీ2 (5,100/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి1010
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్(PIN)533262 Edit this on Wikidata


ద్రాక్షారామం భీమేశ్వరాలయం

ద్రాక్షారామం, తూర్పు గోదావరి జిల్లా, రామచంద్రపురం మండలానికి చెందిన గ్రామం.[2] కాకినాడకి 32 కి.మీ దూరములోను, రాజమహేంద్రవరంకి 60కి.మీ దూరములోను ఉంది.

ఇది మండల కేంద్రమైన రామచంద్రపురం నుండి 6 కి. మీ. దూరంలో ఉంది.

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

పూర్వం దక్ష ప్రజాపతి నిరీశ్వర యజ్ఞం చేసిన ప్రదేశమే నేడు ద్రాక్షారామంగా పిలువబడుతుంది. ఒకప్పుడు ఇది "దక్ష ఆరామం"గా పిలువబడి కాలక్రమేణా అది ద్రాక్షారామంగా మారింది.తన భర్తకి ఆహ్వానం లేకపోయినప్పటికీ పుట్టింటిపై ప్రేమతో ఆ యజ్ఞానికి వచ్చి అవమాన పడిన పరమశివుని సతి సతీదేవి ఆత్మాహుతి చేసుకున్న ప్రదేశం ఇదే. తన భార్యను అవమాన పరిచినందుకు గాను వీరభద్రుడిని సృష్టించిన శివుడు దక్షుడి తల నరికించాడు. సతీదేవి వియోగ వివశత్వం నుంచి శివుడిని బయటపడేయడం కోసం శ్రీ మహా విష్ణువు ఆమె శరీరాన్ని 18 ఖండాలుగా చేశాడు. ఆమె శరీర అవయవాలు పడిన ప్రదేశాలు అష్టాదశ శక్తిపీఠాలుగా అవతరించాయి.

గ్రామం లోని దేవాలయాలు[మార్చు]

శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవాలయం[మార్చు]

Draksharama temple.jpg
భీమేశ్వర మందిర ఉత్తర భాగము లోపలివైపు
భీమేశ్వరస్వామి గర్భాలయ ద్వారము స్వామి పాదభాగము{తెల్లటిది}
భీమేశ్వరాలయ నందీశ్వరుడు, తూర్పుముఖధ్వారం.
పుష్కరిణి

శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి వార్ల దేవాలయం అతి ప్రాచీన సుప్రసిద్ధ శైవ క్షేత్రం. ఈ ఆలయాన్ని సాశ. 7, 8 శతాబ్ధాల మధ్య తూర్పు చాళుక్యుల వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తొంది. ఇక్కడి మూలవిరాట్ శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభుగా వెలసిన 14 అడుగుల శివలింగం, శుద్ధ స్ఫటికాకార లింగం. దేవేరి శ్రీ మాణిక్యంబా అమ్మవారు యావత్భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తి పీఠాలలో 12 వ శక్తిపీఠంగా వెలసింది.తెలుగుకు ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన. ఆ త్రిలింగమనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్ర త్రయంలో ద్రాక్షారామం ఒకటి. మిగిలిన రెండు క్షేత్రాలలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా, మరొకటి శ్రీశైలం.[3] త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా, అష్తాదశ శక్తిపీఠాలలో ద్వాదశ పీఠంగా, దక్షిణ కాశీగా, వ్యాస కాశీగా ద్రాక్షారామానికి ప్రశస్తి ఉంది. శిల్ప కళాభిరామమై, శాసనాల భాండాగారమై ద్రాక్షారామ భీమేశ్వరస్వామి ఆలయం ఒప్పారుతోంది.

శాతవాహన రాజైన హాలుని కాలానికే ఈ ఆలయం ఉన్నట్లు లీలావతీ గ్రంథం అన్న ప్రాకృతభాషా కావ్యంలో పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని, సామర్లకోట లోని భీమేశ్వరాలయాన్ని కూడా చాళుక్య రాజయిన భీముడు నిర్మించాడని చెబుతారు. అందుకే ఈ రెండు గుడులు ఒకే రీతిగా ఉండటమేగాక, రెంటి నిర్మాణానికి ఉపయోగించిన రాయికూడ ఒకటేరకంగా ఉంటుంది. ఈ క్షేత్రాన్ని గురించిన ప్రశంస శ్రీనాథకవి భీమేశ్వర పురాణంలో వివరించాడు. దుష్యంతుడు, భరతుడు, నలుడు, నహషుడు ఈ స్వామిని అర్చించారని వ్రాశాడు.తిట్టుకవిగా ప్రసద్ధి నందిన వేములవాడ భీమకవి " ఘనుడన్ వేములవాడ వంశజుడ, ద్రాక్షారామ భీమేశునందనుడన్.... " అని చెప్పుకొన్నాడు. అతనికి కవిత్వం అబ్బటం స్వామి ప్రసాదం అయి ఉండవచ్చు.

ఎంతో మంది తెలుగు కవులు శ్రీ భీమేశ్వరస్వామిని తమ పద్యాలలో కీర్తించారు. వాటిలో ఈమధ్య వచ్చిన "దక్షారామ భీమేశ్వర శతకం" ఒకటి. దీనిని ప్రొఫెసర్ వి.యల్.యస్. భీమశంకరం రచించాడు.

భీమేశ్వరాలయం[మార్చు]

ద్రాక్షారామంలో శివుడు భీమేశ్వరుడిగా స్వయంభువుగా అవతరించాడు. శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నాడు. ద్రాక్షారామం త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు. ఇక్కడి స్వామివారిని అభిషేకించడానికి సప్తఋషులు కలిసి గోదావరిని తీసుకు వచ్చారనీ పురాణ కథనాలు వర్ణిస్తున్నాయి.అందువలన అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి' అని పిలుస్తూ వుంటారు. ఇక్కడి పంచలోహ విగ్రహాలు తామ్ర మూర్తులు 8 వ శతాబ్దం నుంచి ఉన్నవిగా భావిస్తున్నారు.

అష్ట లింగాలు[మార్చు]

ఈ భీమేశ్వరుడికి ఎనిమిది దిక్కులలోను ఎనిమిది శివలింగాలను చంద్రుడు స్వయంగా ప్రతిష్ఠించాడని విశ్వసించబడుతుంది. వీటిని అష్టలింగములు లేదా అష్ట సోమేశ్వరములు అంటారు. తూర్పున కోలంక, పడమర వెంటూరు, 'దక్షిణాన కోటిపల్లి ఉత్తరాన వెల్ల ఆగ్నేయంలో దంగేరు. నైరుతిలో కోరుమిల్లి' వాయువ్యంలో సోమేశ్వరం ఈశాన్యాన పెనుమళ్ళ ప్రాంతాలలో ఈ అష్ట సోమేశ్వర ఆలయాలు ఉన్నాయి. ఈ భీమేశ్వర ఆలయ ప్రాంగణంలో ఇంద్రేశ్వర, యజ్ఞేశ్వర, సిద్దేశ్వర, యోగీశ్వర, యమేశ్వర, కాళేశ్వర వీరభద్రేశ్వర లింగాలు దర్శనమిస్తాయి. ఇక తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ దిశగా ఉన్న ఒక్కో గాలి గోపురాన్ని ఒక్కో అమ్మవారు పర్యవేక్షిస్తున్నట్టు స్థలపురాణం వివరిస్తుంది.

స్థలపురాణం[మార్చు]

పూర్వము తారకాసురుడు అను రాక్షసుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేయగా, శివుడు సాక్షాత్కరించెను. ఆ రాక్షసుడు శివుని యొక్క ఆత్మలింగాన్ని వరంగా కోరగా శివుడు ఆత్మలింగాన్ని ప్రసాదించెను. క్రూర స్వభావం కలిగిన ఆ తారకాసురుడు ఆ లింగ శక్తి వలన దేవతలను, ఋషులను, సత్పురుషులను నానా ఇబ్బందులు పెట్టుచుండగా ఆ బాధలు భరించలేక వీరంతా విష్ణుమూర్తిని ప్రార్థించగా, అపుడు విష్ణువు ఆ లింగం తొలగితేగాని ఆ రాక్షసుని శక్తి నశించదనీ, ఈశ్వరుడి అంశతో జన్మించిన వానితో తప్ప మరెవ్వరి వలనా తనకు మరణం లేకుండా వరం పొంది ఉన్నాడని చెప్పగా, మన్మధ ప్రేరేపణచేత పార్వతీ కళ్యాణం, అనంతరం 'కుమార సంభవం' జరుగగా ఆ కుమారస్వామి రుద్ర గణములకు నాయకత్వం వహించి తారకాసురుడితో యుద్ధం చేయగా, కుమార స్వామి విసిరిన బాణం ఆ ఆత్మలింగానికి తగిలి అయిదు ముక్కలై భూమిమీద అయిదు చోట్ల పడెను. అవే పంచారామ క్షేత్రాలుగా అవతరించెను. అవి వరుసగా అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట ఇలా భూమి మీద పడిన ఆత్మలింగాలు కైలాసాన్ని చేరుకోవాలని ఎదగడం ప్రారంభించెను. అలా ఎదిగి పోతూ ఉంటే కలియుగం వచ్చేసరికి మానవులకు అభిషేకాలకు గాని, దర్శనానికి గాని అందకుండా పోతాయని ఒక్కోచోట పడిన ఆత్మలింగానికి ఒక్కొక్క దేముడు అవి ఎదిగిపోకుండా ప్రతిష్ఠ చేసి అభిషేకార్చనలు చేసారు. ఆఅ దేవుడు ప్రతిష్ఠ చేసిన లింగం ఆయా దేవుని పేరుతో పిలవబడుతోంది.

 • అమరావతి:- ఇక్కడ ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి 'అమరేశ్వరస్వామి ' గా వెలిసెను.
 • భీమవరం:- ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి 'సోమేశ్వరస్వామి ' గా వెలిసెను.
 • పాలకొల్లు:- ఇక్కడ శ్రీ రామచంద్రమూర్తి ప్రతిష్ఠించాడు కాబట్టి క్షీరారామలింగేశ్వరస్వామి ' గా వెలిసెను.
 • సామర్లకోట:-ఆత్మలింగాన్ని ఛేదించిన దోషం తనకు రాకూడదని కుమారస్వామే స్వయంగా ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించెను కాబట్టి 'కుమారారామ భీమేశ్వరస్వామి 'గా వెలిసెను

దైనందిన కార్యక్రమాలు[మార్చు]

ప్రతీరోజు ఉదయం

 • 5:00 మేలుకొలుపు, సుప్రభాతం,
 • 5:30 ప్రాతఃకాలార్చన, తీర్ధపుబిందె,
 • 5:45 బాలభోగం,
 • 6:00 నుండి 12:00 సర్వదర్శనం, అభిషేకాలు, అర్చనలు,

మధ్యాహ్నం

 • 12:00 మధ్యాహ్నకాలార్చన,
 • 12:15 రాజభోగం,
 • 12:15 -3:00విరామం,
 • 3:00 నుండి 8:00 వరకు సర్వదర్శనం, పూజలు, అర్చనలు,

రాత్రి

 • 7:30 నుండి 7:45 వరకు స్వస్తి ప్రవచనం,
 • 7:45 నుండి 8:00 వరకు ప్రదోషకాలార్చన, నీరాజన మంత్రపుష్పాలు, ఆస్థానపూజ-పవళింపుసేవ,
 • రాత్రి 8:00 నుండి ఉదయం 5:00 వరకు కవాటబంధం.

పండుగలు[మార్చు]

 • ప్రతీ ఏకాదశీ పర్వదినములలో ఏకాంతసేవ, పవళింపుసేవ
 • ప్రతీ మాసశివరాత్రి పర్వదినములలో గ్రామోత్సవం
 • ప్రతీ కార్తీక పూర్ణిమతో కూడిన క్రృత్తికా నక్షత్రం రోజున జ్వాలాతోరణ మహోత్సవం
 • ప్రతీ మార్గశిర శుద్ధ చతుర్ధశి రోజున శ్రీ స్వామివార్ల జన్మ దినోత్సవం
 • ప్రతీ ధనుర్మాసంలోనూ క్షేత్రపాలకులు అయిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వార్లకు ధనుర్మాస పూజలు
 • ప్రతీ మాఘశుద్ధ ఏకాదశీ ( భీష్మ ఏకాదశి ) రోజున శ్రీ స్వామి వారి అమ్మవార్లకు దివ్య కల్యాణ మహోత్సవం
 • ప్రతీ మహాశివరాత్రి పర్వదినములో శివరాత్రి ఉత్సవాలు జరుగును.
 • శరన్నవరాత్రులు (దేవీనవరాత్రులు) - ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు
 • కార్తీక మాసం ప్రత్యేక ఉత్సవాలు - జ్వాలాతోరణం (కార్తీక పున్నమి నాడు)
 • సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం- మార్గశిరశుద్ధ షష్ఠి నాడు

వసతి[మార్చు]

ప్రతీ నిత్యం భక్తులు ఆంధ్ర రాష్ట్రం నుండే గాక ఇతర రాష్ట్రాల నుండి కూడా వచ్చి ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుంటారు. యాత్రీకుల సౌకర్యార్ధం ఇచ్చట పైండా వారిచే నిర్మించబడిన అన్నసత్రం ఉంది. దేవస్థానం వారి యాత్రికుల వసతి గృహం ఆలయానికి 1/2 కి.మీ దూరంలో ఆర్.టి.సి బస్టాండుకు దగ్గరలో కోటిపల్లి రోడ్డులో ఉంది.

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9,234.[4] ఇందులో పురుషుల సంఖ్య 4,618, మహిళల సంఖ్య 4,616, గ్రామంలో నివాస గృహాలు 2,206 ఉన్నాయి.

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 2659 ఇళ్లతో, 9299 జనాభాతో 474 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4627, ఆడవారి సంఖ్య 4672. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1371 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 181. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 587646[5].పిన్ కోడ్: 533262.

విద్యా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో మూడు ప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు ఏడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు ఆరు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు ఆరు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, 2 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. ఒక ప్రైవేటు వృత్తి విద్యా శిక్షణ పాఠశాల ఉంది. ఒక ప్రభుత్వ అనియత విద్యా కేంద్రం ఉంది.సమీప ఇంజనీరింగ్ కళాశాల రామచంద్రపురంలో ఉంది. సమీప మేనేజిమెంటు కళాశాల రామచంద్రపురంలోను, వైద్య కళాశాల, పాలీటెక్నిక్‌లు కాకినాడలోనూ ఉన్నాయి.సమీప దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల కాకినాడలో ఉంది.

వైద్య సౌకర్యం[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం[మార్చు]

ద్రాక్షారామలో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డాక్టరు, నలుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక డిస్పెన్సరీలో ఒక డాక్టరు, ఇద్దరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. అలోపతి ఆసుపత్రి, సంచార వైద్య శాల గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం[మార్చు]

గ్రామంలో4 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీలు చదివిన డాక్టర్లు ఆరుగురుఒక నాటు వైద్యుడు ఉన్నారు. 8 మందుల దుకాణాలు ఉన్నాయి.

తాగు నీరు[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం[మార్చు]

గ్రామంలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది. మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా కూడా ప్రవహిస్తుంది. మురుగునీటిని నేరుగా జలవనరుల్లోకి వదులుతున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు[మార్చు]

ద్రాక్షారామలో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు[మార్చు]

గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు[మార్చు]

గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, సినిమా హాలు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.

విద్యుత్తు[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 15 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం[మార్చు]

ద్రాక్షారామలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

 • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 128 హెక్టార్లు
 • నికరంగా విత్తిన భూమి: 345 హెక్టార్లు
 • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 345 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు[మార్చు]

ద్రాక్షారామలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.

 • కాలువలు: 345 హెక్టార్లు

ఉత్పత్తి[మార్చు]

ద్రాక్షారామలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు[మార్చు]

చీరలు

చాటువు[మార్చు]

శ్రీనాథమహా కవి చాటువులకు ప్రసిద్ధి. అతడు ద్రాక్షారామానికి సంబంధించి చెప్పిన చాటువుగా దిగువపద్యం ప్రచారంలో ఉంది.

అక్షయ్యంబగు సాంపరాయని తెలుంగాధీశ కస్తూరికా
భిక్షాదానము సేయరా సుకవిరాట్ బృందారక శ్రేణికిన్
దక్షారామభీమవర గంధర్వాప్సరోభామినీ
వక్షోజద్వయ కుంభికుంభములపై వాసించుతద్వాసనల్

ప్రముఖులు[మార్చు]

చిత్రమాలిక[మార్చు]

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

 1. 2011 ఆంధ్ర ప్రదేశ్ జనగణన డేటా - గ్రామాలు దత్తాంశ సమితి (in ఇంగ్లీష్), భారత రిజిస్ట్రార్ జనరల్, జనగణన కమిషనరు కార్యాలయం, Wikidata Q42501043, archived from the original on 11 July 2017
 2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-07.
 3. వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?". ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Archived from the original on 28 సెప్టెంబర్ 2017. Retrieved 6 March 2015. {{cite journal}}: Check date values in: |archive-date= (help)
 4. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-07-19. Retrieved 2013-12-07.
 5. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".

వెలుపలి లింకులు[మార్చు]