సుంకిరెడ్డి నారాయణరెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సుంకిరెడ్డి నారాయణ రెడ్డి
SUNKI REDDY NARAYANA REDDY.jpg
జననం
వృత్తివిశ్రాంత అద్యాపకుడు
భాగస్వామిహేమలత
బహుళ

సుంకిరెడ్డి నారాయణ రెడ్డి ప్రముఖ తెలుగు కవి, సాహితీవేత్త, చరిత్రకారుడు. సురవరం ప్రతాప రెడ్డి బాటలో నడుస్తూ మరుగునపడ్డ తెలంగాణ సాహిత్యాన్ని, చరిత్రను వెలికి తీసి పుస్తకాలు రాసి భావితరాలకు అందించిన గొప్ప గ్రంథకర్త. నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా పనిచేశాడు. అటు అధ్యాపకుడిగా పని చేస్తూనే తెలంగాణా ప్రాచీన సాహిత్యాన్ని ముంగిలి పేరుతో గ్రంథస్తం చేశాడు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి సాహిత్యానికి చేసిన సేవలకు గాను..తెలుగు విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించింది.

జీవిత విశేషాలు[మార్చు]

సుంకిరెడ్డి నారాయణ రెడ్డి నల్లగొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామంలో 1954, మార్చి 12న కోటమ్మ, మాధవరెడ్డి దంపతులకు జన్మించాడు. అభ్యుదయ కవిత్వంలో మధ్యతరగతి జీవితచిత్రణ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1982లో ఎం.ఫిల్ పట్టా పొందాడు. అదేవిధంగా అదే యూనివర్సిటీ నుంచి "తెలుగు కవిత్వం-తాత్విక నేపథ్యం" అనే అంశంపై పరిశోధన చేసి 1991లో పీహెచ్‌డీ పొందాడు. [1] ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ చదువుతున్న రోజుల్లోనే ఉస్మానియా రైటర్స్ సర్కిల్‌కు కన్వీనర్‌గా ఉంటూ పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించాడు. అతని సంపాదకత్వంలో 1971-80 దశాబ్దం ఈ తరం యుద్ధం కవిత వెలువడింది. శ్రీకాకుళం సాహితీ వ్యవస్థాపకులుగా శ్రీకాకుళంలో పలు సాహితీ కార్యక్రమాలు నిర్వహించారు.

నల్లగొండలో నీలగిరి సాహితిని స్థాపించి 1992 నుంచి 1998 వరకు ఎందరో యువకవులను, రచయితలను ప్రోత్సహించడమే కాకుండా బహుజన, దళిత, ముస్లింవాద కవిత్వం తెలుగు సాహిత్యంలో రావడానికి ప్రధాన కారకులయ్యాడు. 1992 నుంచి నీలగిరి సాహితితో పాటు జలసాధన సమితి పక్షాన తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని పలు వేదికల ద్వారా వివరించాడు. 1998లో తెలంగాణ సాంస్కృతిక వేదికను ఏర్పాటు చేయడంలో కీలకపాత్ర పోషించారు. వేల ఏండ్ల నుంచి తెలుగువారంతా కలిసే ఉన్నారన్న ఆంధ్రపాలకుల తప్పుడు వాదనల్ని తిప్పికొడుతూ తెలంగాణ ప్రాంత విశిష్టతను, అస్థిత్వాన్ని తన వ్యాసాల ద్వారా వెల్లడించాడు. ఇందులో భాగంగా ముంగిలి, తెలంగాణ చరిత్ర అనే రెండు గ్రంథాలను వెలువరించాడు. గుంటూరు ఏసుపాదం, గుడిహాళం రఘునాథంలతో కలిసి సముద్రాలతో సంఘర్షణలతో అనే విపశ్యన కవితా సంపుటిని వెలువరించి అస్థిత్వ ఉద్యమాలకు తాత్విక నేపథ్యాన్ని అందించాడు. 2012, మార్చి 31న చండూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ చేశాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

అతని భార్య హేమలత. అతనికి ముగ్గురు కుమార్తెలు.

రచనలు[మార్చు]

 • తోవ ఎక్కడ
 • దాలీ
 • మత్తడి
 • గనుమ
 • అరుణతార
 • తెలంగాణా ఉద్యమ కవిత్వం
 • విపశ్యన కవిత్వం
 • నల్లవలస
 • తావు....పేరుతో కవితా సంకలనాలు
 • సురవరం దస్తూరి
 • సురవరం వ్యాపాలు
 • సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన తెలంగాణా చరిత్ర అనే గ్రంథం విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 2012 లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని యూనివర్సిటీల్లో పాఠ్యాంశంగా పొందుపరిచారు. పీహెచ్‌డీ విద్యార్థులు ఈ గ్రంథంపై పరిశోధనలు సైతం చేశారు.

పురస్కారాలు[మార్చు]

 1. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు - 2015 అవార్డు - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వం, 2015 జూన్ 2
 2. 2015లో తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారం 2012 (ముంగిలి-తెలంగాణ ప్రాచీన సాహిత్యం పుస్తకానికి)[2]

మూలాలు[మార్చు]

 1. "ఎడారిలో ఒక్క పువ్వే.. తోటంత విలువ చేస్తుంది అన్న కవి".
 2. నవ తెలంగాణ, స్టోరి (16 June 2015). "ఉత్తమ గ్రంథాలకు తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాలు". NavaTelangana. Archived from the original on 21 July 2020. Retrieved 21 July 2020.

బయటి లంకెలు[మార్చు]