తెలంగాణ అవతరణ దినోత్సవం
తెలంగాణ అవతరణ దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | తెలంగాణ |
రకం | రాష్ట్రీయ దినోత్సవం |
ప్రాముఖ్యత | తెలంగాణ అవతరణ (2014) |
జరుపుకొనే రోజు | జూన్ 2 |
ఆవృత్తి | వార్షికం |
తెలంగాణ అవతరణ దినోత్సవం అనేది తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 2న నిర్వహించే రాష్ట్ర అవతరణ పండుగ.[1] ఈ రోజున హైదరాబాదుతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవతరణ ఉత్సవాలు జరుగుతాయి.[2][3] మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరుగుతుంది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటగా ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తాడు. తరువాత గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి. అనంతరం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించి, అవతరణ దినోత్సవ సందేశాన్ని అందిస్తాడు. రాష్ట్రావతరణ దినోత్సవం నేపథ్యంలో తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, రాజ్‌భవన్, రవీంద్రభారతి, ఇతర భవనాలను విద్యుద్దీపాలతో అలంకరిస్తారు.
చరిత్ర
[మార్చు]దశాబ్దాలుగా (1969 నుండి 2014వరకు) వివిధ దశలలో సాగిన తెలంగాణ ఉద్యమంలో వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. ప్రత్యేక తెలంగాణ అంశంపై 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదం లభించగా... 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోకసభలో, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది.[4] 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 (ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు, లేదా తెలంగాణ బిల్లు) ను ప్రవేశపెట్టింది.[5] 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించగా, 2014 జూన్ 2వ తేదీన దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.[6]
కార్యక్రమాలు
[మార్చు]- 2017: ముఖ్యమంత్రి కేసీఆర్, గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించి, అక్కడినుండి సికింద్రాబాదు పరేడ్ మైదానానికి చేరుకుని ఉదయం 10.30 గంటలకు జాతీయపతాకాన్ని ఎగురవేసి రాష్ట్రావతరణ వేడుకలను ప్రారంభించాడు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను చేసింది. మండల స్థాయినుంచి రాష్ట్రస్థాయి వరకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ పురస్కారాలు అందించడం జరిగింది.[7]
- 2019: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటగా ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. తరువాత గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించాడు. అనంతరం నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీయం కేసీఆర్ ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించాడు.[8] మూడు రోజులపాటు తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వరంలో హైదరాబాద్ పబ్లిక్‌గార్డెన్, జూబ్లీహాల్, రవీంద్రభారతి వేదికల్లో కవి సమ్మేళనం, ఒగ్గుడోలు కళాకారుల నృత్యం, కూచిపూడి నృత్యం, జయజయహే తెలంగాణ నృత్య రూపకం, పేరిణి నృత్యం, ఒడిస్సీ నృత్యం, అవతరణ ఫిల్మోత్సవం, షార్ట్‌ఫిల్మ్‌ల స్క్రీనింగ్ వంటి పలు కార్యక్రమాలు జరిగాయి.
- 2020: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో 2020 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరిగాయి. ఉదయం 8.30 గంటలకు గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం దగ్గర నివాళులర్పించిన సీఎం కేసీఆర్, ప్రగతిభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరించాడు. అనంతరం రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మాసపత్రిక ప్రత్యేక సంచికను విడుదల చేశాడు.[9]
- 2021: కరోనా కారణంగా 2021లో రాష్ట్ర అవతరణ వేడుకలు నిరాఢంబరంగా (అన్ని కార్యక్రమాలు రద్దుచేసి కేవలం జెండా ఆవిష్కరణ) జరిగాయి. జెండా వందనం సందర్భంగా 12 మంది పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించాలని, వేదిక వద్ద పదిమంది మాత్రమే ఉండాలని, మాస్కులు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్, పబ్లిక్ గార్డెన్స్ లలో జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించాడు.[10]
- 2022: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో భాగంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మొదటగా ప్రగతిభవన్ లో జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. తరువాత గన్‌పార్క్ అమర వీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించాడు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్ జరిగిన తెలంగాణ అవతరణ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న సీయం కేసీఆర్ ఉదయం 9 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించాడు.[11] రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపి అవతరణ దినోత్సవ సందేశాన్ని అందించాడు.[12] టర్కీ వేదికగా జరిగిన వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన బాక్సర్ నిఖత్ జరీన్, జర్మనీ వేదికగా జరిగిన జూనియర్ షూటింగ్ ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించిన ఇషాసింగ్ లను పోచంపల్లి పట్టు శాలువాతో సత్కరించి, చేరో 2 కోట్ల రూపాయల నగదు ప్రోత్సాహంతోపాటు జూబ్లీహిల్స్ (బంజారాహిల్స్) ప్రాంతంలో నివాస స్థలాలాన్ని బహుమతిగా అందించాడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగులయ్యను కూడా శాలువాతో సత్కరించి కోటి రూపాయల చెక్కును, హైదరాబాదులో బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో నివాస స్థలాలాన్ని బహుమతిగా అందించాడు.[13] సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కారం అందుకున్న ప్రముఖ కవులచే కవి సమ్మేళనం నిర్వహించబడింది.
- 2023: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు పూర్తయి పదవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం 2023 జూన్ 2 నుండి 22వ తేదివరకు 21 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించింది.[14]
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telangana to celebrate state formation day tomorrow". Deccan Herald. 1 June 2018. Retrieved 2 June 2019.
- ↑ "Telangana Formation Day Award for TITA". Thehindu.com. 4 June 2018. Retrieved 2 June 2019.
- ↑ "Government departments, institutions observe Telangana Formation Day". Thehindu.com. 3 June 2018. Retrieved 2 June 2019.
- ↑ "Telangana bill passed in Lok Sabha; Congress, BJP come together in favour of new state". Hindustan Times. Archived from the original on 18 February 2014. Retrieved 18 February 2014.
- ↑ "Telangana bill passed by upper house". The Times of India. Retrieved 20 February 2014.
- ↑ "The Andhra Pradesh reorganisation act, 2014" (PDF). Ministry of law and justice, government of India. Archived from the original (PDF) on 8 January 2016. Retrieved 2 June 2019.
- ↑ "నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం.. వాడవాడలా సంబురాలు!". ap7am.com (in ఇంగ్లీష్). 2017-06-02. Archived from the original on 2017-06-04. Retrieved 2022-06-03.
- ↑ ఆంధ్రజ్యోతి, తెలంగాణ ముఖ్యాంశాలు (2 June 2019). "ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్." Archived from the original on 2 June 2019. Retrieved 2 June 2019.
- ↑ Garrepally, Rajashekhar (2020-06-02). "ఈసారి నిరాడంబరంగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు". www.telugu.oneindia.com. Archived from the original on 2020-07-10. Retrieved 2022-06-03.
- ↑ Chilukuri, Arun (2021-06-02). "Telangana Formation Day: నేడు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం". www.hmtvlive.com. Archived from the original on 2022-03-17. Retrieved 2022-06-03.
- ↑ telugu, NT News (2022-06-03). "KCR SPEECH | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం పూర్తిపాఠం". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
- ↑ telugu, NT News (2022-06-03). "అద్వితీయం తెలంగాణ ప్రగతి". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
- ↑ telugu, NT News (2022-06-03). "మొగులయ్య, ఇషా, నిఖత్‌కు సత్కారం". Namasthe Telangana. Archived from the original on 2022-06-03. Retrieved 2022-06-03.
- ↑ "CM Kcr: 21 రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు: సీఎం కేసీఆర్". EENADU. 2023-05-13. Archived from the original on 2023-05-13. Retrieved 2023-05-13.