Jump to content

పాతూరి నాగభూషణం

వికీపీడియా నుండి
పాతూరి నాగభూషణం
జననం(1907-08-20)1907 ఆగస్టు 20
పెదపాలెం గ్రామం తెనాలి దగ్గర, గుంటూర్ జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం
మరణం1987 జూలై 24(1987-07-24) (వయసు: 79)
విజయవాడ
వృత్తిగ్రంధాలయోద్యమ నాయకుడు, రచయత, అనువాదకుడు, సంపాదకుడు, ప్రచురణకర్త
తరువాతివారురావి శారద
జీవిత భాగస్వామిచంద్రమొలక రాజేశ్వరమ్మ
పిల్లలుకుమారుడు స్వర్గీయ సూరిబాబుగారు, కుమార్తెలు (స్వర్గీయ) సుజాత, రావి శారద
తల్లిదండ్రులు
  • పాతూరి బుర్రయ్య (తండ్రి)
  • పాతూరి ధరిణమ్మ (తల్లి)

పాతూరి నాగభూషణం 1907 ఆగస్టు 20 న గుంటూరు జిల్లా, పెదపాలెం గ్రామానికి చెందిన సామాన్య రైతు కుటుంబంలో ధరణమ్మ, బుర్రయ్య దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్య కూచిపూడి, పెదపాలెం గ్రామాలలోను, ఉన్నత విద్య నిడుబ్రోలులోని ఎడ్వర్డ్ హైస్కూలులోను, కళాశాల విద్య మద్రాసులోని లయోలా కళాశాలలోనూ ఆ తర్వాత మదనపల్లె లోని బెసెంట్ థియొసాఫికల్ కాలేజి లోనూ అభ్యసించారు. గ్రంథాలయ నిర్వహణ, వయోజన విద్యాబోధన విషయాలలో అధ్యయనం చేశారు.

గ్రంథాలయోద్యమం

[మార్చు]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రంధాలయోద్యమాన్ని అయ్యంకి వెంకట రమణయ్య ఆరంభించారు. దీనిని పాతూరి నాగభూషణం ముందుకు నడిపించి దాని వ్యాప్తికి దోహదం చేశారు. గ్రంధాలయోద్యమ వ్యాప్తికి, గ్రంధాలయ విద్య, శిక్షణ, అంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘానికి ఆయన 5 దశాబ్దాలుగా చేసిన సేవ ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రాథమిక విద్య అభ్యసించే రోజుల్లోనే ఈయన తన గ్రామంలో బాలసరస్వతీ భండారము అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత గ్రంథాలయ భవనం నిర్మించి, వేలకొలది గ్రంథాలను సేకరించి చుట్టుపక్కల నలభై గ్రామాలకు అందుబాటులో ఉంచారు. పెదవడ్లపూడి, దుగ్గిరాల గ్రామాలలో శాఖాగ్రంథాలయాలను నెలకొల్పారు. గుంటూరు గ్రంధాలయ సంఘానికి కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి దాదాపు 160 గ్రామాలలో గ్రంధాలయాలను నెలకొల్పడానికీ, 28 గ్రంధాలయాలకు కొత్త భవనాలు నిర్మించడానికీ కృషి చేశారు. 1935-42 మధ్య 7 సంవత్సరాల పాటు బ్యాంక్ కాలువ మీది ప్రయాణీకుల పడవలలో సంచార గ్రంథాలయాన్నినడిపారు. ఆంధ్రదేశ మంతటా గ్రంథాలయ నిర్మాణ, నిర్వహణలను ఒక మహోద్యమంగా నిర్వహించారు. పల్లెపల్లెలలో సంచరించి ప్రచారం చేసి, ప్రోత్సహించి గ్రంథాలయాలను నెలకొల్పడానికి కారకుడయ్యారు. ఆంధ్రప్రదేశ్ పౌర గ్రంధాలయ చట్టం రూపొందించడానికి ఏర్పడ్డ కమిటీలో ఈయన కూడా సభ్యులు. 1949 లో, విజయవాడ నగరం మధ్య పటమటలో భూమిని సేకరించి ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘానికి స్వంత భవనం "సర్వోత్తమ భవనం" ఏర్పరచారు. 1958 లో బాపూజీ మందిర్, 1960లో జోగిరాజు భవనం, 1983 లో రామినేని సదన్ నిర్మించారు. సర్వోత్తమ గ్రంధాలయం ఇక్కడే ఏర్పాటు చేశారు. గ్రంధాలయ మహాసభలను నిర్వహించారు. గ్రంథాలయ విద్యలో శిక్షణనిచ్చి వాటి నిర్వహణకు కావలసిన కార్యకర్తలను సమకూర్చారు. విజయవాడ ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం, దాని ముద్రణాలయం లను నిర్మించారు. ఆంధ్ర గ్రంథాలయ సంఘానికి కార్యదర్శిగాను, గ్రంథాలయ సర్వస్వము పత్రికకు సంపాదకునిగాను, ఇండియన్ లైబ్రరీ అసోసియేషన్కు కౌన్సిల్ మెంబరుగానూ పనిచేశారు.

వయోజన విద్య

[మార్చు]

వయోజన విద్యాప్రచారంలో ఈయన పాత్ర ప్రశంసనీయమైనది. ఎడ్వర్డ్ హైస్కూలులో చదువుకునే రోజుల్లోనే రెండేళ్లపాటు మాచవరంలో వయోజనులకొరకు రాత్రిబడిని నడిపారు. ఇండియన్ అడల్ట్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ కౌన్సిల్ సభ్యుడిగా, దక్షిణ భారత వయోజన విద్యా సంఘం ప్రాంతీయ కార్యదర్శిగా, దక్షిణ భారత వయోజన విద్యా సహకార ప్రచురణ సమితి (మద్రాసు) డైరెక్టరుగా, నూతన అక్షరాస్యుల పుస్తకాల ప్రభుత్వ బహుమతి నిర్ణాయక సంఘం పరిశీలకునిగా సేవలను అందించారు. వయోజన విద్యను గూర్చి స్వయంగా ఎన్నో పుస్తకాలను ప్రచురించారు.

జాతీయోద్యమం

[మార్చు]

మద్రాసు లయోలా కళాశాలలో విద్యార్థి గానే అఖిల భారత కాంగ్రెస్ మహా సభకు స్వచ్ఛంద కార్యకర్తగా పనిచేశారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ఆందోళనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మహాత్మాగాంధీ ఆధ్వర్యంలో జాతీయోద్యమంలో పాల్గొన్నారు. ఈయన 1930లో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నందుకూ, 1932లో ప్రభుత్వ ధిక్కారానికీ కఠిన కారాగారశిక్ష అనుభవించిన స్వాతంత్ర్య సమరయోధుడు. 1942 లో క్విట్ ఇండియా ఉద్యమంలో రహస్య జీవితం గడిపారు, వార్తాహరులుగా వ్యవహరించి పత్రికలు కాగితాలు పంపిణీ చేశారు. స్వాతంత్ర్యానంతరం నిర్మాణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈయనని గుంటూరు జిల్లా కాంగ్రెస్ కమిటిలోను, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోను సభ్యునిగా నియమించి గౌరవించారు. కేంద్ర ప్రభుత్వం వీరిని స్వాతంత్ర్య సమర యోధునిగా గుర్తించి తామ్రపత్రంతో సత్కరించింది.[1]

గాంధేయవాది

[మార్చు]

పాతూరి నాగభూషణం గాంధీ అడుగుజాడల్లో నడిచారు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారకనిధి రాష్ట్ర బోర్డులో సుమారు 15 సంవత్సరాలు, విజయవాడ కేంద్రంలో గాంధీ తత్వప్రచారక్ గాను, గాంధీ శత జయంతి సందర్భంగా లిటరేచర్ పబ్లికేషన్ కమిటీ ఎడిటోరియల్ బోర్డులో సభ్యుడిగానూ పనిచేశారు. మహాత్ముని జీవితంలో వివిధ అంశాలను పొందుపరచే 10 గ్రంధాలను ఇతర భాషలనుంచి తర్జుమాచేసి బాలబాలికలకు కానుకగా అందించారు. పెదపాలెంలో 1928లో సేవాశ్రమం స్థాపించాడు. ఈ ఆశ్రమంలో జాతీయకళాశాల, ఖాదీ, స్వదేశీ స్టోరు, హిందీ భాషోద్ధరణ, హరిజనోద్ధరణ, వయోజన విద్యా ప్రచారం, ప్రకృతివైద్యం, వ్యవసాయం, పశుపోషణ, పుస్తకప్రచురణ సేవాదళ నిర్వహణ మొదలైన కార్యక్రమాలు నడిపారు. ఒక లిఖిత పత్రికను కూడా ప్రారంభించారు. సర్వోదయ ముద్రణాలయం స్థాపించి మహిళలను నియమించి వారికి స్వావలంబన కలిపించారు. జీవితాంతం తాను ఖద్దరు ధరించి తన ధర్మపత్ని చేత కూడా ధరింపచేశారు.[1]

పారిశ్రామికవేత్త

[మార్చు]

ఈయన పరిశ్రమల రంగంలో కూడా తనదైన ముద్రను చూపారు. నిడదవోలు కెమికల్స్ లిమిటెడ్‌కు డైరెక్టర్‌గా, శ్రమజీవి ప్రెస్ లిమిటెడ్ (మద్రాస్) డైరెక్టర్‌గా, సర్వోదయ ప్రెస్ విజయవాడకు డైరెక్టర్‌గా, నిర్వాహకుడిగా పనిచేసారు.

గ్రంథాలు

[మార్చు]

ఈయన రచయితగా, అనువాదకుడిగా, సంపాదకుడిగా, ప్రచురణకర్తగా శతాధిక గ్రంథాలను వెలువరించారు.

స్వంతరచనలు

[మార్చు]
  1. గ్రంధాలయ సహకారము
  2. గ్రంధాలయ శాస్త్ర ప్రథమ పాఠములు
  3. గ్రంధాలయములు: రిజిస్ట్రేషన్
  4. తెలుగు పుస్తకాల వర్గీకరణము
  5. గ్రంధాలయ ప్రచారము-విజ్ఞాన వ్యాప్తి
  6. మదరాసు పౌరగ్రంథాలయముల చట్టము[2]
  7. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయోద్యమమం
  8. గ్రంథాలయములు (వ్యాసావళి) [3] మొదటి, రెండవ భాగాలు
  9. గ్రంధాలయ నిర్వహణము
  10. వాజ్మయ సూచీకరణము
  11. గ్రంధాలయాలు-ఆచూకీ సేవ
  12. పఠన మందిరాలు
  13. గ్రంధ వరణము
  14. గ్రంధాలయ నిర్మాణము[4]

అనువాద గ్రంథాలు

[మార్చు]
  1. గ్రంధాలయ సూత్రాలు
  2. మహనీయుల పుణ్యస్మృతులు
  3. దివ్యజీవన దృశ్యములు
  4. తపోవనంలో ప్రేమయోగి
  5. దాదాజీతో కొన్ని మధురక్షణాలు
  6. శీలము - సదాచారము
  7. సాధుపుంగవులు
  8. జ్ఞానబోధక గాథలు
  9. విద్యార్థి గాంధి
  10. బాపూ జీవిత ఘటనలు
  11. బాపూజీ ముచ్చట్లు
  12. బా - బాపు
  13. భారత యువజనులారా, లెండు!
  14. యువకులకు సందేశం
  15. గురుబోధామృతము
  16. సంక్షిప్త ప్రాచ్య వర్గీకరణ పద్ధతి
  17. అన్వేషణ[4]

సంకలనాలు

[మార్చు]
  1. జీవితధర్మము[5]
  2. అంధ్రదేశ గ్రంధాలయముల పట్టిక
  3. ఆంధ్ర గ్రంధములు-మొదటి జాబితా
  4. గ్రంధాలయ సూక్తులు
  5. గ్రంధాలయ గీతాలు
  6. గ్రంథాలయములు (వ్యాసావళి) 4వ భాగము[4]

సంపాదకత్వం

[మార్చు]
  1. ఆంధ్ర వాజ్మయ సంగ్రహ సూచిక
  2. గ్రంధాలయ ప్రగతి 1వ, 2వ, 3వ, 4వ భాగములు
  3. గ్రంథాలయములు (వ్యాసావళి) 3వ భాగము
  4. గ్రంధ సూచీకరణము
  5. గ్రంధాలయ వర్గీకరణము
  6. భర్తృహరి శృంగార శతకము
  7. భర్తృహరి నీతి శతకము
  8. భక్తియోగము
  9. భర్తృహరి వైరాగ్య శతకము
  10. సఫలత
  11. వయోజన విద్య (వ్యాసావళి) 1వ భాగం
  12. వందేవతరం (గాడిచెర్ల శత జయంతి సంచిక)
  13. ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ 24 నుండి 28వ మహాసభల సంచికలు
  14. గ్రంధాలయ సర్వస్వం - 13వ సంపుటము నుండి 48 వరకు
  15. ఆంధ్ర గ్రంధాలయం, త్రైమాసిక పత్రిక 2వ సంపుటము (సహసంపాదకులు) [4]

అభినందనలు, పురస్కారాలు

[మార్చు]

పాతూరి నాగభుషణాన్ని ఆంధ్ర దేశ గ్రంధాలయోద్యమ రూపశిల్పిగా భావిస్తారు. ఆయన సేవలను గుర్తించి ఆంధ్రవిశ్వకళాపరిషత్తు 1975లో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. యార్లగడ్డ రాజ్యలక్ష్మి వెంకన్న చౌదరి కళాపీఠం పురస్కారం కూడా అందుకున్నారు.

తెలుగు కవి కరుణశ్రీ (జంధ్యాల పాపయ్య శాస్త్రి) పాతూరిని "మానవత్వ విశ్వవిద్యాలయం, నడచే గ్రంధాలయం" అని అభివర్ణించారు. ఆచార్య ఎన్.జి.రంగా ఈయనను "సరస్వతీ పూజారి" అని పేర్కొన్నారు. గ్రంధాలయ పితామహుడు ఎస్.ఆర్.రంగనాధన్ "గ్రంధాలయ విజ్ఞానానికి సంబంధించి, భారతదేశము అందించిన అకుఠింత భక్తులలో పాతూరి ఒకరు" అని ప్రశంసించారు. సురవరం ప్రతాపరెడ్డి వీరిని గురించి - గ్రంధాలయోద్యమానికి జీవితము అంకితము చేసిన వ్యక్తి అని అన్నారు. గాడిచర్ల హరిసర్వోత్తమరావు వీరిని "గ్రంధాలయం అను పదానికి మారుపేరు" అని చెప్పారు.[4]

శత జయంతి

[మార్చు]
దస్త్రం:PN Centenary.jpg
పాతూరి నాగభూషణం శతజయంతి సభ 2007 ఆగస్టు 20 జరిగింది.

ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం, పాతూరి నాగభుషణం శత జయంతి ఉత్సవ సమితి కలసి 2006 ఆగస్టు 20 నుండి 2007 ఆగస్టు 20 వరకూ పాతూరి శత జయంతి ఉత్సవాలను నిర్వహించాయి. ఉత్సవాలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి డా.వై.ఎస్.రాజశేఖర రెడ్డి హైదరాబాదులో 2006 ఆగస్టు 20న ప్రారంభించారు. ఈ సందర్భంలో రాష్ట్ర మంత్రులు కె. రోశయ్య, ఎన్.రాజ్యలక్ష్మి కూడా పాల్గొన్నారు.

రాయలసీమ ప్రాంత గ్రంధాలయోద్యమ నాయకులు బత్తుల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో 2006 సెప్టెంబరు 10న, అనంతపూర్ జిల్లాలో ఈ శత జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. రాజమహేంద్రవరంలో రాజమహేంద్రపుర మందిర గ్రంధాలయము 2006 సెప్టెంబరు 17న ఉత్సవాలను నిర్వహించారు. ఇదే విధంగా మచిలీపట్నం గ్రంధాలయం వికాస్ సమితి, విశాఖపట్నం పౌర గ్రంధాలయం, విజయవాడ బుక్ ఫెస్టివల్ లో కూడా పాతూరి శత జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు. కర్నూలు, అనంతపురం, మెదక్, కరీంనగర్, నల్గొండ జిల్లా కేంద్ర గ్రంధాలయాలు; పలు జిల్లాలలో గ్రంధాలయాలు; ఏ.ఎన్.ఆర్ కళాశాల (గుడివాడ), డి.ఎన్.ఆర్ కళాశాల (చిలకలూరిపేట), సి.ఆర్.రెడ్డి పిజి కళాశాల (ఏలూరు), కె.వి.ఆర్ కళాశాల (నందిగామ) వంటి పలు కళాశాల గ్రంధాలయాలు తమతమ ప్రాంగణాలలో ఈ పాతూరి శత జయంతి ఉత్సవాలను జరుపుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం వారు పాతూరి నాగభుషణం శత జయంతి ఉత్సవాల ముగింపు వేడుకలను తమ "రిఓరిఎంటేషన్ ఆఫ్ లైబ్రరీ సర్వీసెస్ ఇన్ ఇండియా" అను జాతీయ సదస్సులో 2007 ఆగస్టు 18-20 తేదీల మధ్య విజయవాడలో నిర్వహించారు.[4]

ముగింపు

[మార్చు]

పాతూరి నాగభుషణం కేన్సర్ వ్యాధితో చాలా జబ్బు పడినప్పటికీ, చికిత్స తీసుకుంటూ కూడా తమ రచనలు, సంఘ కార్యక్రమాలను విడువలేదు. తమ 80వ పడిలో 1987 జూలై 24న సంఘ కార్యవర్గ సభ్యులు, కుటుంబ సభ్యులు సమక్షం లోనే విజయవాడ, సర్వోత్తమ భవన ప్రాంగణం లోనే కన్ను మూసారు. తమ జీవితాన్ని అంకితం చేసిన గ్రంధాలయోద్యమం, సర్వోత్తమ గ్రంధాలయం, గ్రంధాలయ శిక్షణాలయం, గ్రంధాలయ సర్వస్వం మాసపత్రికల కొనసాగింపు గురించే చివరి వరకూ ఆందోళన పడేవారు. పాతూరి నిబద్ధత వారి ఈ క్రింది మాటలలోనే అవగతమవుతుంది - "నాకు వేరు కోరిక ఏమీలేదు. మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇక్కడే పుట్టి, ఈ గ్రంధాలయ సంఘానికి ఇలాగే సేవ చేయాలని ఆశిస్తున్నాను".[4]

పాతూరి నాగభుషణం మార్గదర్శకత్వంలో అభివృద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం 2014 లో వంద సంవత్సరాలు పూర్తిచేసుకుని పాతూరి అందించిన వారసత్వాన్ని, విలువలని కొనసాగిస్తూ తమ కార్యక్రమాలను విస్తరించుకుంటోంది.[6]

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 ఆంధ్ర దేశ గ్రంధాలయోద్యమ రూపశిల్పి: కళాప్రపూర్ణ పాతూరి నాగభుషణం 20.08.1907 - 24.07.1987; సంక్షిప్త పరిచయం. విజయవాడ, అంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం, 1987
  2. పాతూరి, నాగభూషణము (1951). మదరాసు పౌరగ్రంథాలయముల చట్టము (1 ed.). పటమటలంక: ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము. Retrieved 16 January 2015.
  3. పాతూరి, నాగభూషణం (1951). గ్రంథాలయములు (1 ed.). హైదరాబాద్: ఆంధ్రసారస్వతపరిషత్. Retrieved 16 January 2015.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 4.6 నరసింహ శర్మ, సన్నిధానం. సరస్వతీ పూజారి: పాతూరి నాగభుషణం జీవిత చరిత్ర. విజయవాడ, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం 2014.174 పుటలు.
  5. పాతూరి, నాగభూషణము (సెప్టెంబరు 1986). జీవితధర్మము (1 ed.). విజయవాడ: సర్వోత్తమ ప్రచురణలు. Retrieved 16 January 2015.
  6. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2020-03-17. Retrieved 2020-04-08.