బోటు గ్రంథాలయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం ఆధ్వర్యంలో బోటు గ్రంధాలయం (లైబ్రరీ) నడిపారు. ప్రజలకు పుస్తకపఠనం, గ్రంథాలయాల మీద ఆసక్తి పెరగాలనే ఆలోచన దీని ప్రారంభానికి నాంది పలికింది[1].

ప్రారంభం

[మార్చు]

పాతూరి నాగభుషణం తమ ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయోద్యమ కార్యక్రమాలతో పాటు బోటు గ్రంధాలయ సేవలను కూడా 1935 వ సంవత్సరం లో ఆరంభించి సుమారు ఏడు సంవత్సరాలు 1942 పెదపాలెం సేవాశ్రమ వాణీ మందిరం తరపున వరకూ నిర్వహించారు. ఆరోజుల్లో ఆంధ్రప్రదేశ్ కి చెందిన గుంటూరు జిల్లాలో అన్ని గ్రామాలలోని ప్రజలు అందరూ పడవలనే ప్రధాన ప్రయాణ, రవాణా సౌకర్యముగా వినియయోగించుకొనేవారు.ఆ ప్రయాణ సమయాన్ని వినోదంగా గడిపేవారు. ప్రజలందరూ ఈ బోటు గ్రంధాలయ సేవలను కూడా సంతోషంగా వినియోగించుకున్నారు[2].

దీని ఆలోచనకు అమలుకు మొదట కృషిచేసిన వారు పాతూరి నాగభూషణం. పాతూరి నాగభుషణం మొదట బోటు గ్రంధాలయ ప్రారంభ ఉత్సవం పెదపాలెం వద్ద సేవాశ్రమ వాణీ మందిరం ఆధ్వర్యంలో కృష్ణా బాంక్ కాలువ మీద పెదవడ్లపూడి - కొల్లురు మధ్య ప్రయాణం చేసే పడవలో 1935 అక్టోబర్ 25న గ్రామప్రజలు, పెద్దలు, మండల అధ్యక్ష్యులు, సేవాశ్రమ సభ్యుల సమక్షములో అత్యంత చైతన్యవంతముగా ప్రారంభించారు.

Boat library organised by APLA
Boat library organised by APLA

పాలొన్న ప్రముఖులు

[మార్చు]

పాతూరి నాగభూషణం ఆర్యబాల సమాజం, సేవాశ్రమవాణీ మందిరంల సహకారంతో బోటు గ్రంథాలయాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి గుంటూరు మండల గ్రంధాలయ అధ్యక్షులు శరణు రామస్వామి చౌదరి 1935 అక్టోబరు 25న లాంచనంగా ప్రారంబించారు. బోటు గ్రంధాలయ ప్రారంభోత్సవం అక్టోబర్ 28న అక్కడ ఆర్యబాల సమాజంలో పూజలు నిర్వహించారు. సేవాశ్రమవాణీ మందిరం నుండి సంచార గ్రంథాలయ పెట్టెలను ఊరేగించారు. ఈ ఉత్సవంలో పెద్దలు, గ్రామ ప్రముఖులు, చుట్టు ప్రక్కల గ్రామాల వారు పాల్గొన్నారు. కాలువ వద్ద సభ నిర్వహించి ప్రముఖుల ఉపన్యాసాల అనంతరం గ్రంథాల పెట్టెలను బోటులో అమర్చారు. చినపాలెం వాస్తవ్యురాలు వాశిరెడ్డి అన్నపూర్ణమ్మ బోటులో పుస్తకాలు పెట్టుకోవడానికి ఒక పెట్టెను కానుకగా ఇచ్చారు[3].

సేవలు

[మార్చు]

ఈ గ్రంథాలయం కృష్ణా బ్యాంక్ కాలువ గుండా పెదవడ్లపూడి నుండి కొల్లూరుల మద్య తిప్పేవారు. రేవులలో ఆగుతూ పాఠకులకు పఠనా సౌకర్యాన్ని కలిగించేవారు. గ్రామీణ జీవితములోని ఈ విన్నూత్న గ్రంధాలయ సేవలను ప్రజలు ఉత్సాహముతో వినియోగించుకొనుట వలన ఈ గ్రంథాలయం విశేష ప్రాచుర్యం పొందటంతో నాగభూషణము మరో ఇరవై రోజులకే అంటే 1935 నవంబర్ 17న రెండవ బోటు గ్రంధాలయమునకు శ్రీకారం చుట్టారు. దీనిని పెదవడ్లపూడి - పిడపర్రు గ్రామాల నడుమ నడిపారు. ఈ గ్రంధాలయాలలో భారతి, కృష్ణాపత్రిక, గ్రంధాలయసర్వస్వం, ఆరోగ్యపత్రిక, ప్రకృతి వంటి సాహిత్య పత్రికలు, పుస్తకాలు ఉంచేవారు. ఈ బోటు గ్రంధాలయాల కొరకు కొందరు దాతలు, ప్రచురణకర్తలు పత్రికలు, పుస్తకాలు, ఇచ్చేవారు. వేసవిలో మాత్రము ఈ సేవలను తాత్కాలికముగా నిలిపేవారు. రెండవ సంవత్సరం బోటు గ్రంధాలయాలు ప్రారంభం నాటికి మరి కొంతమంది కొన్ని చోట్ల బోటు గ్రంధాలయాలు ఆరంభించారు.[3] ఇదే విధంగా తెనాలి తాలూకా సంగం జాగర్లమూడి లోని సర్వజన విద్యాప్రదాయని గ్రంధాలయం కూడా బోటు గ్రంధాలయాలను పడవ ప్రయాణీకులకొరకు ఆరంభించారు[4].

గుర్తింపు

[మార్చు]

ఈ విన్నూత్న బోటు గ్రంధాలయ సేవలు పలు ప్రజాప్రతినిధులు, పుర ప్రముఖులు, గ్రంధాలయ ప్రముఖుల ప్రశంసలను పొందాయి. హిందూ, ఆంధ్రపత్రిక వంటి ప్రముఖ వార్తాపత్రికలు ఈ విషయాన్ని ప్రచురించి ప్రచారం చేశాయి. హిందూ దిన పత్రికలో ఈ వార్త చదివిన అప్పటి మద్రాస్ గ్రంధాలయ సంఘం కార్యదర్శి ఎస్.ఆర్.రంగనాధన్ బోటు గ్రంధాలయాల వివరాలను తెలుసుకొని ఈ వృత్తాంతాన్ని తమ అష్టమ వార్షిక నివేదికలో ప్రకటించారు.లండన్ లోని ప్రపంచ వయోజన విద్యా సంఘం వారు కూడా ఈ బోటు గ్రంధాలయాల వివరాలు సేకరించారు[3] .

బయటి లంకెలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. http://www.apla.co.in/the-firsts-of-andhra-pradesh-library-association/[permanent dead link]
  2. https://www.thehindu.com/news/cities/Vijayawada/he-kept-library-movement-afloat/article5916193.ece
  3. 3.0 3.1 3.2 నరసింహ శర్మ, సన్నిధానం (2014). సరస్వతీ పూజారి:; పాతూరి నాగభుషణం జీవిత చరిత్ర. విజయవాడ: ఆంధ్ర ప్రదేశ్ గ్రంధాలయ సంఘం. pp. 30–37.
  4. Raju,, A.A.N., (1988). History of Library Movement in Andhra Pradesh (1900-1956). Delhi: Ajantha Publications. p. 250