అనసూయ (పత్రిక)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అనసూయ పత్రికా సంపాదకురాలు వింజమూరి వెంకటరత్నమ్మ

అనసూయ 1914 లో ప్రారంభింపబడిన మొదటి మహిళా పత్రిక.దీనిని కాకినాడ నుంచి వింజమూరి వెంకటరత్నమ్మ నడిపింది. ఈ పత్రిక మహిళా ఉద్యమాలకు ఎంతగానో తోడ్పడింది. ఇందులో స్త్రీలకు ఉపయోగపడే రచనలు ఉండేవి. గృహనిర్వహణ, ప్రకృతిశాస్త్రాలు, పురాణస్త్రీల చరిత్రలు, వివిధ రంగాలలో వన్నెకెక్కిన ప్రపంచ ప్రసిద్ధ మహిళల చరిత్రలు మొదలైన అంశాలకు సంబంధించిన విషయాల గూర్చి ఈ పత్రికలో ప్రచురించేవారు.[1] ఈ పత్రిక అభ్యుదయ భావాలకు నాంది అయినది. ఇందులో స్త్రీ విద్య ఆవశ్యకత, ఆనాడు ఉన్న సాంఘిక దురాచారాల పైన వివిధ ఆర్టికల్స్ ప్రచురించేవారు. ఆనాడు ఈ పత్రిక ప్రారంభించే నాటికి హిందూ సుందరి అనే ఒక్క పత్రిక మాత్రమే ఉండేది. ఒకరకంగా చెప్పాలంటే ఆరోజులలో స్త్రీని మేల్కొలిపిన పత్రిక అని చెప్పవచ్చు.[2]

తెలుగులో స్త్రీల కోసం స్థాపించిన మొదటి పత్రిక సతీహితబోధిని. దాన్ని స్థాపించినది కందుకూరి వీరేశలింగం పంతులు. స్వాతంత్ర్యానికి పూర్వమే స్త్రీల సంపాదకత్వంలో పత్రికలు వెలువడటం గొప్ప విషయమైతే అందులో కొన్ని పత్రికలు స్త్రీవిద్య కోసం, తద్వారా స్త్రీలలో చైతన్యం పెంపొందటం కోసం కృషి చేయడం మరింత విశేషమనే చెప్పాలి. 'హిందూసుందరి' స్త్రీ సంపాదకత్వంలో వెలువడిన తొలి తెలుగు పత్రిక. శ్రీమతి మొసలికంటి రమాబాయి సంపాదకత్వంలో 1902లోనే ఈ పత్రిక ప్రారంభమైంది. స్త్రీ విద్యపైనా, సమాజంలో ఆనాడు ఉన్న సంఘ దురాచారాలపైనా వచ్చిన మరో పత్రిక 'అనసూయ'. "స్త్రీలెచ్చట నుచ్ఛస్థితిలో నుందురో యాదేశ మభివృద్ధిలోనున్న మాటయే. అట్లుండుటకు వారి యజ్ఞానాంధకారము పారద్రోలబడవలయును. వారు పురుషులతో సర్వవిధముల సమానలని యెన్నుకొనబడు నవస్థ రావలయును." [3] అనే భావాన్ని వ్యక్తం చేయడం నిజంగా అప్పట్లో సంచలమే. 1917లో మొదలైన పత్రిక ఎప్పటివరకూ వచ్చిందో కచ్చితంగా తెలీదు కానీ 1924 జూలై సంచిక వరకు లభ్యమవుతున్నది. ఆర్థిక ఇబ్బందుల మూలంగానే ఆ పాత్రిక ఆగిపోయిందనుకోవచ్చు. ఏదేమైనా స్త్రీవిద్య, సమానత్వం కోసం స్వాతంత్ర్యానికి పూర్వమే ఓ స్త్రీ సంపాదకత్వంలో వచ్చిన ఓ గొప్ప మాస పత్రికగా 'అనసూయ'కు స్థానం ఉంటుంది.[4]

మూలాలు[మార్చు]

  1. స్త్రీలకోసం నడిచిన తొలి తెలుగుపత్రిక
  2. తెలుగు పత్రికలు : మహిళా సంపాదకులు
  3. వింజమూరి వెంకటరత్నమ్మ, 1920 జనవరి సంచిక
  4. - బుద్ధి యజ్ఞమూర్తి - ఆంధ్రభూమి డైలీ, 12 ఏప్రిల్ 1996.

ఇతర లింకులు[మార్చు]