Jump to content

సామాజిక స్పృహ నింపిన తొలి నాటికలు

వికీపీడియా నుండి

తెలుగు నాటికల ఇతివృత్తం

[మార్చు]

1929 నుండి తెలుగు నాటికల ఇతివృత్తంలో, సంవిధానంలో కొత్త ప్రయోగాలు జరిగాయి. 1930లో పి.వి. రాజమన్నార్‌ `తప్పెవరిది' నాటికతో తెలుగు నాటికా సాహిత్యం నూతన అధ్యాయం ప్రారంభమైంది. భమిడిపాటి `బాగు... బాగు, కచటతప', చలం వారి `భానుమతి, సావిత్రి, సీత అగ్నిప్రవేశం', ముద్దుకృష్ణ వారి `అనార్కలి, అశోకం, టీ క„ప్పులో తుఫాను', చింతా దీక్షితుల వారి `శర్మిష్ట, తుదిపలుకు', శ్రీపాదవారి `కలంపోటు', నోరి నరసింహశాస్త్రి వారి `స్వయంవరం', `బుచ్చిబాబు వారి `తిష్యరక్షిత', జి.వి. కృష్ణారావు వారి `బిక్షాపాత్ర', పాలగుమ్మి వారి `ఖూనీ', నార్ల వెంకటేశ్వరరావువారి `కొత్తగడ్డ' (1947) మొదలైన నాటికలు తెలుగు నాటికా సాహిత్యానికి దిశానిర్దేశం చేశాయి.

నాటకం కంటే నాటిక చిన్నది. నాటిక కంటే ఏకాంకిక చిన్నది. నాటిక, ఏకాంకికలను ఒకే అర్థంలో నేడు సంబోధిస్తున్నా, వీటిమధ్య తేడాఉంది. నాటిక- రెండు మొదలు ఐదు రంగాలుగా, గంట కాలానికి తక్కువ కాకుండా ప్రదర్శితమవుతుంది. ఏక నాయకుడు, ఏక వస్తువుతో కూడి ఉంటుంది. స్థల, కాలైక్యం విధిగా పాటించనక్కరలేదు. ఏకాంకికను ఆంగ్లంలో `వన్‌ యాక్‌‌ట ప్లే' అంటారు. ఒక రంగంతో ఇరవై నుండి నలభై అయిదు నిమిషాలలోపు ప్రదర్శితమవుతుంది. ఏక నాయక, ఏక వస్తువు, స్థల కాలైక్యాలతో కూడి ఉంటుంది. సంక్షిప్తత ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. సమకాలీన సమాజంలోని పరిస్థితులను వైవిధ్యంగా పాఠకులకు అందించే ప్రయత్నంలో నాటికలు, ఏకాంకికల కన్నా తక్కువ నిడివిగల, ప్రదర్శనకు వీలుకాని సంభాషణా రచనలను కూడా ఒక ప్రత్యేక ప్రక్రియగా పరిగణించవచ్చు. రచయితలు వ్రాసే ప్రతి నాటిక, ఏకాంకిక ప్రదర్శనానుగుణమైనవని చెప్పలేం. అందరూ ప్రదర్శనీయం కావాలని వ్రాస్తారు. కానీ ఆయా ప్రాధాన్యాలనుబట్టి, ప్రదర్శనానుకూలతనుబట్టి, కొన్నే వేదికపైకి వస్తాయి. వేదికలమీద ప్రదర్శించనంత మాత్రాన అవి నిష్ర్పయోజనాలని అనుకోరాదు. సాహిత్యపరంగా వాటి విలువ వాటికి ఉంటుంది. నాటికలను దృశ్య రూప నాటికలు, శ్రవ్య రూప నాటికలని రెండు రకాలుగా విభజించవచ్చు.

దృశ్యరూప నాటికలలో ఆయా పాత్రల హావభావాలను కళ్లేదుట చూడటానికి, సంభాషణలను నేరుగా వినటానికి వీలుంటుంది. శ్రవ్య రూప నాటికలు కేవలం వినడానికి మాత్రమే వీలుంటుంది. వీటినే `రేడియో నాటికలు' అని కూడా అంటారు. ఆయా పాత్రల మాటలను మాత్రమే విని విషయాన్ని అర్థం చేసుకోగలం. నృత్యానికి అనుగుణమైన నాటికలు ఉన్నాయి. దృశ్య, శ్రవణ మాధ్యమాల ద్వారా వెలువడనప్పటికీ- సమకాలీన సమాజం గురించి నాటికలు, ఏకాంకిల కంటే తక్కువ నిడివిగల సంభాషణా రచనలు పత్రికలలో ప్రచురితమవుతుంటాయి. వీటిని చదవటం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. వస్తుపరంగా నాటికలను సామాజిక, రాజకీయ, పౌరాణిక తదితరాలుగా విభజించవచ్చు. సమకాలీన సమాజంలో జరిగే పరిణామాల గురించి, ప్రజలకు అవసరమైన అంశాల గురించి అందరికీ అర్థమయ్యేలా, ఆకట్టుకునేలా నాటికలు, ఏకాంకికలు వెలువడడం ఒక సామాజిక అవసరం అయింది. 1920ల నుండి ఆంగ్ల సాహిత్య ప్రభావంతో- తెలుగు సాహిత్యంలో నాటిక, ఏకాంకిక ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. తొలి దశలో ప్రభుత్వ పథకాల ప్రచారంలో, పాఠశాలల్లో జరిగే ఉత్సవాల సందర్భాలలో విద్యార్థులు ఉపాధ్యాయుల సహకారంతో చిన్న నాటికలను ప్రదర్శించేవా రు.1930ల నుండి సాహిత్యంలో ఒక ప్రక్రియగా నాటిక, ఏకాంకికలు నిలదొక్కుకున్నాయి. 1912లో ద్వితీయ ముద్రణ పొందిన `డ్రామాస్‌ ఇన్‌ సివిక్‌' అనే సంపుటంలో సర్వారాయుడు రచించిన `గ్రామ కచేరి' అనే ఏకాంకిక- లభ్యమవుతున్న వాటిలో తొలి తెలుగు స్వతంత్ర ఏకాంకికగా చెప్పవచ్చు. 1920 నుండి భారతి, శారద, 1926 నుండి శ్రీ సాధన తదితర పత్రికలు నాటికల ప్రచురణకు కృషి చేశాయి. 1928లో ఇబ్బన్‌ నాటకోత్సవాల ప్రభావంతో ప్రపంచ నాటక చరిత్రలో నూతన శకం ప్రారంభమైంది. సమకాలీన, ఆర్థిక, సామాజిక పరిస్థితులను నాటికలలో ప్రతిబింబింప చేయడంలో ఇబ్బన్‌ ప్రభావం ఉంది. తెలుగు నాటికా సాహిత్యం కూడా ఆ ప్రభావానికి లోనైంది.

1929 నుండి తెలుగు నాటికల ఇతివృత్తంలో, సంవిధానంలో కొత్త ప్రయోగాలు జరిగాయి. 1930లో పి.వి. రాజమన్నార్‌ `తప్పెవరిది' నాటికతో తెలుగు నాటికా సాహిత్యం నూతన అధ్యాయం ప్రారంభమైంది. భమిడిపాటి `బాగు... బాగు, కచటతప', చలం వారి `భానుమతి, సావిత్రి, సీత అగ్నిప్రవేశం', ముద్దుకృష్ణ వారి `అనార్కలి, అశోకం, టీ క„ప్పులో తుఫాను', చింతా దీక్షితుల వారి `శర్మిష్ట, తుదిపలుకు', శ్రీపాదవారి `కలంపోటు', నోరి నరసింహశాస్త్రి వారి `స్వయంవరం', `బుచ్చిబాబు వారి `తిష్యరక్షిత', జి.వి. కృష్ణారావు వారి `బిక్షాపాత్ర', పాలగుమ్మి వారి `ఖూనీ', నార్ల వెంకటేశ్వరరావువారి `కొత్తగడ్డ' (1947) మొదలైన నాటికలు తెలుగు నాటికా సాహిత్యానికి దిశానిర్దేశం చేశాయి.రంగస్థల పద్యనాటకాలకు నెలవైన రాయలసీమలో 1926 నుండే శ్రీ సాధన పత్రికలో ఆధునిక స్పృహతో, సమకాలీన సమాజ పరిస్థితులకు అద్దంపట్టే రీతిలో నాటికలు, ఏకాంకికలు వెలువడినాయి. అప్పటికి రాయలసీమలో వెలువడిన ఇతర పత్రికలలోనూ నాటికలు ప్రచురించి ఉండవచ్చు. కానీ ప్రస్తుతానికి లభిస్తున్నంతలో సాధన పత్రికలో ప్రచురించిన ఈ నాటికలు, ఏకాంకికలు, సంభాషణలు ఆధునిక సాహిత్య ప్రక్రియలలో సీమ భాగస్వామ్యాన్ని తెలియజేస్తాయి. ఆనాటి సీమలోని సామాజిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి.

స్వాతంత్ర్య పోరాట వీరుల విజయం- `ఓట్ల నాటకం'

[మార్చు]

1926 అక్టోబరు 23న `ఓట్ల నాటకం' అనే నాటిక శ్రీసాధన పత్రికలో ప్రచురితమైంది. మద్రాసు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో- `శ్రీమతి అనంతపురి' అనే స్త్రీ, పోటీలోఉన్న ఐదుగురు అభ్యర్థులలో ఎవరిని వరించినదన్న ఇతివృత్తంతో ఈ నాటిక సాగుతుంది. ఎన్నికలలో అభ్యర్థులైన కేశవ పిళై్ల, తోపుదుర్తి నారాయణరెడ్డి, చిన్నపొలమడ ఓబిరెడ్డి, చీమలవాగుపల్లి బత్తిని నారాయణరెడ్డి, గార్లదిన్నె రామేశ్వరరావు తమ అభ్యర్థనలను, ఆలోచనలను అనంతపురి స్త్రీకి తెలియజేసి, శాసనసభకు ఎంపికయ్యేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతారు. అంతిమంగా అనంతపురి దేశ ప్రయోజనాల దృష్టా్య స్వరాజ్య పార్టీ అభ్యర్థులైన ఓబిరెడ్డి, బత్తిని నారాయణరెడ్డిలకు విజయం వరింపజేస్తుంది. `ఈతూరికి నాటకం ముగిసినది, ఇంకా మూడేండ్ల వరకు నిశ్చింతంగా నుండగలను. ఈ రెడ్డి యువకులు నా భక్తులనియే నమ్మెదను, చూచెదను గాక' అని అనంతపురి అనడంతో నాటిక ముగుస్తుంది. పూర్వరంగం, ఉత్తరరంగం రెండు భాగాలుగా ఈనాటిక ఉంది. ఆనాటి ఎన్నికల నేపథ్యంలో స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న స్వరాజ్య పార్టీ అభ్యర్థుల గెలుపును ఈ నాటిక సూచిస్తుంది.

స్త్రీలను చైతన్యపరచిన `స్త్రీ విద్య'

[మార్చు]

1926 నవంబరు 20న ప్రచురించిన `స్త్రీవిద్య' అనే సంభాషణాత్మక సన్నివేశాన్ని కదిరి వాసి వి. ఖండేరావు వ్రాశాడు. కమల, విమల, శకుంతల, సుమాల్య మొదలగు తదితర పాత్రల ద్వారా సంభాషణ నడుస్తుంది. సాంప్రదాయ భావజాలం గల అవ్వకు- కమల అనే మనవరాలు ఉంటుంది. అవ్వ ప్రభావంతో చదువు విషయంలో కమల శ్రద్ధ వహించక అనాసక్తిగా పాఠశాలకు వెడుతుంటుంది. స్నేహితురాలైన విమల చదువు గొప్పతనాన్ని గురించి కమలకు చెబుతూ `విద్య ఉద్యోగములు చేయుటకేగాదు, మానవజన్మ ఎత్తినందుకు జ్ఞానమార్జించుట మనకు విధిగాయున్నది. అట్టి జ్ఞానము ముఖ్యంగా స్త్రీలకే ఆవశ్యము. వారు గదా బిడ్డలను బాల్యమునుండి పెంచెదరు. ఇప్పుడు మన దేశంలో బాలురు బడికు వెళ్ళు సమయమున వారికి జ్ఞానరీతి యందు ఎలాంటి శోధన లేనందున దేశము క్షీణించుచున్నది. తల్లి జ్ఞానవంతురాలైన ఖండితముగా బిడ్డలు గొప్పవారగుదురు' అని తెలియజేస్తుంది. మరో స్నేహితురాలైన శకుంతల ప్రవేశించి ఐరోపా ఖండంలో స్త్రీలు విద్యావంతులవుట వలన జరుగుతున్న ప్రయోజనాలను తెలియజేస్తుంది. దగ్గరలోనే శకుంతలకు పెళ్ళిచేసే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తుండడంవలన విద్యకు దూరమవుతానేమోనని ఆమె చింతిస్తుంది. స్త్రీలు చదువుకొనేందుకు తోడ్పాటు తక్కువగా ఉందని, ఆడపిల్లలకు బాల్యవివాహాల కారణంగా చదువుకోవడం సాధ్యంకాదని తన అభిప్రాయాలను చెబుతుంది.

ఈ మాటలను విన్న కమల `అందుకే మన కెందుకే ఈ చదువంతా' అని విమలను ఎత్తిపొడుస్తుంది. మరో స్నేహితురాలు సుమాల్య వీరిని కలుస్తుంది. స్త్రీ విద్యపట్ల వ్యతిరేకంగా మాట్లాడుతున్న కమలకు కనువిప్పు కలిగేలా తెలియజేయమని విమల సుమాల్యను కోరుతుంది. ఈ సందర్భంలో సుమాల్య విద్య ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ `లోకంలో స్థూల దేహమును పెంచుటకు ఆహారం ఏవిధంగా ఆవశ్యకమో ఆ రీతిగానే జ్ఞానదేహమును వృద్ధిపరచుటకు విద్యయను ఆహారం అత్యంత ఆవశ్యకము. సాధారణంగా చదువుకున్నవారు తమ విద్యకు తగిన బుద్ధియు, సత్ప్రవర్తనము గలవారయి, ఏదో యొక విధమున గౌరవముతో జీవనం చేయుదురు. ఉద్యోగములలో స్త్రీలు చేరనంత మాత్రాన ఫలనిమిత్తమున నాటిన ఫలవక్షములు నీడనిచ్చుట మొదలగు ఇతర పనులకు ఉపయోగించులాగున, తెలివితేటలకేర్పడిన చదువు సహితము ఇతరా కార్యములకు కూడా నుపయోగించును. జ్ఞానాభివృద్ధికి హేతుభూతమైన విద్య పురుషులకెట్లో స్త్రీలకునట్లే పరమ ప్రయోజనకరమైనదిగా నుండుననుటకు సందేహము వలదు. స్త్రీ విద్య దేశంలో ననాది సిద్ధముగా నున్నది. గానీ ఈ నడుమ కొత్తగా నెక్కడినుండియో వచ్చినదిగాదు. స్త్రీ రత్నములు విద్యలేక సానపట్టని పాతమాణిక్యములవలె ప్రకాశరహితమై యున్నారు. పురుషులతో పాటు స్త్రీలును విద్యగరిచిరేని `బుద్ధిశ్చాపి చతుర్గుణా' యను సూక్తిసార్థకము చేయకుందురా. వేదములలోను, పురాణాలయందును చదువుకున్న పొలతులు ఎన్నో ప్రయోజనకరమైన పనులు చేశారు.

తల్లుల గుణశీలములు సులభముగా బిడ్డలకు వచ్చునని శాస్త్రజ్ఞులు వక్కాణింతురు. అందువలన స్త్రీలుకూడా సకల విద్యలనభ్యసించి సద్గుణ సంపద నార్జింపవలయును. ఏలయన మగబిడ్డ లెపుడును తమ జననీ జనకుల యొద్దనే యుండదగినవారు. ఆడబిడ్డలన్ననో ఎ„ప్పుడైననూ వేరొక ఇల్లు చేరవలసినవారేగానీ పుట్టినింటనే కలకాలం ఉండ తగినవారుకారు. కావున పెంచినవారికి అపఖ్యాతి రాకుండుటకై వారి నత్తవారింటికి పంపుకాలము రాకమునుపే ప్రియపుత్రికల నుత్తమ గుణములు గలవారిగాను, తెలివిగలవారినిగాను చేసి మరీ పంపవలెను. మొదట సుగుణములను బోధించి జ్ఞానవంతుండ్రుగా చేయక సంసార సాగరము నీదుటకై తమ పుత్రికలను పురు„షుల గహములకు పంపు తల్లిదండ్రులు ఈత నేర్వనివారిని మహాసముద్రమున ద్రోచి వారు కొట్టుకొనుచుండగా కన్నుల గాంచుచూ పిదప పశ్చాత్తాపులైయ్యునూ, ఏమియూ చేయనేరక నింద పొందువారివలనే తామునూ పిమ్మట నపకీర్తిపాలై పారములేని దుఃఖాంబుధిని ఈదవలసివారగుదు'రని ఆడపిల్లలను తప్పక చదివించాలని సుమాల్య తెలియజేస్తుంది. ఇదంతా విన్నతరువాత విమల, కమలను ఇప్పుడేమంటావని అడగగా `నేనేమని చె„పుదూ, మాటలాడుటకు సిగ్గగుచున్న'దని విమల తెలపడంతో నాటిక ముగుస్తుంది. ఈ నాటిక స్త్రీ విద్య ఆవశ్యకత మూలాలను తెలియజేస్తుంది. యువతులు సంప్రదాయభావాలనుండి, ఆటంకాలనుండి బయటపడి విద్యను అభ్యసిస్తే కుటుంబానికి, సమాజానికి మేలు జరుగుతుందని తెలియజేస్తుంది.1926 నాటికే స్త్రీ విద్య అవసరాన్ని నాటిక ద్వారా తెలియజేసి వారి అభ్యున్నతిని కోరుకున్న ఖండేరావు అభినందనీయుడు.

కల్లు సారాయిలను పారద్రోలాలనే `కల్లుపెంట'

[మార్చు]

1931 జూలై 25న పప్పూరు రామాచార్యులు వ్రాసిన `కల్లుపెంట' నాటిక ప్రచురితమైంది. 1929-31లో ఇల్లూరు, తరిమెల పరిసర ప్రాంతాలలోని యాభై గ్రామాలలో జాతీయో ద్యమంలో భాగంగా సారాయి, కల్లు వ్యతిరేక పోరాటాలు కొనసాగాయి. పప్పూరి రామాచార్యులు ఈ ఉద్యమాలలో ప్రధానపాత్ర పోషించారు. ఆ అనుభవంతోటే గ్రామాలలో కల్లు సారాయిల త్రాగుడు మాన్పించడం కోసం చైతన్యం తీసుకురావటానికి పప్పూరి రామాచార్యులే ఈనాటికను వ్రాశారు. మూడు అంకాలుగా ఈ నాటిక ఉంది. ఆ నాటికలో గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితుడైన రామారావు కల్లు వ్యతిరేక ప్రచారంచేస్తూ, దానిని రూపు మాపేందుకు గ్రామాలలో పర్యటిస్తాడు. అనంతపురం పరిసరాలలోని ఒక గ్రామానికి వెళ్తాడు. ఆ గ్రామంలో సుబ్బరాయ శాస్త్రి వద్ద ఆశ్రయం పొందుతాడు. ఆ గ్రామంలో కల్లంగడిని నెట్టికల్లు నడుపుతుంటాడు. అందుకుగాను ఆ గ్రామానికి రెడ్డి అయిన రంగారెడ్డికి సంవత్సరానికి నూట యాభై రూపాయలు నెట్టికల్లు చెల్లించే విధంగా ఒప్పందం ఉంటుంది. రంగారెడ్డి తన కొడుకుకి పుట్టువెంట్రుకలు తీయించేందుకు విదురాశ్వార్థం వెడుతున్న సందర్భంగా, తనకివ్వవలసిన మొత్తంలో నెట్టికల్లును డెబై్బఅయిదు రూపాయలు అడుగుతాడు. గత కొన్ని రోజులుగా ఊర్లో కల్లువ్యతిరేక ప్రచారం జరుగుతోందని, వ్యాపారం కష్టంగా ఉందని నెట్టికల్లు తెలియజేస్తాడు.

అదే సమయంలో- జానెడు పొట్టకు మీరాశించిన చెడుకొంపల లెక్కించండీ/ తానొక్కనికై పెక్కు వంశములు చరగూలుట సరియేమండీ/ మఱపి కల్లు సారాయములమ్మి మత్తుగొల్పి చంపుటకన్నా/ నిరుపేదల గుడిసెలకొక మాఱుగా నిపపెట్టరాదేమండీ!- అంటూ కల్లువ్యతిరేక ప్రచారకులు పాట పాడుతూ వెళతారు. అది విని రంగారెడ్డి, రామారావును ఊరునుండి వెళ్ళగొట్టాలనుకుంటాడు. అశ్వర్థం వెళ్లివచ్చిన తరువాతైనా ఆ డబ్బులు ఇవ్వమని నెట్టికల్లుతో రంగారెడ్డి చెప్పివెడతాడు. నెట్టికల్లు మనిషి పుల్లన్న- పోతిగాడికి కల్లుతాపి రామారావును తిట్టమంటాడు. అలా చేస్తే తమకివ్వాల్సిన అప్పు ఇవ్వనవసరం లేదంటాడు. పోతిగాడు రామారావును తిట్టగా కల్లువ్యతిరేక ప్రచార సభ్యులైన భీముడు, ఆంజనేయులు వాడిని కొట్టేందుకు ప్రయత్నిస్తారు. అప్పుడు రామారావు `నాయనలారా! ఒక్కరిని హింసించితిమా మన ఉద్యమము అంతలోనే నిలిచిపోవును, వీడి వెనుక ఎవరో ఇలా పంపివుంటా'రని శాంతింపజేస్తాడు. పోతిగాడు వాస్తవాలను తెలుసుకొని ఇక నుంచి కల్లుముట్టనని చెప్పి వెళ్తాడు. నెట్టికల్లు, పుల్లన్నలు పోతిగాడిని పిలిచి రామారావు విషయం అడగగా, మీరు చెప్పినట్లుచేయలేనని, రామారావువాళ్లు మంచోళ్ళని తప్పుకుంటాడు. నెట్టికల్లు, పుల్లన్నలు ఓబిగాణ్ణి పిలిచి పోలేరమ్మ పూనకం వచ్చినట్లు నటింపజేసి ఊరిదేవర చేయాలని సిద్దమవుతారు. మనుషులకు వ్యాధులు రాకుండా ఉండేదుకు, పంటలు పండేందుకు `దేవర' తప్పకుండా చేయాలని గ్రామస్థులను రెచ్చగొడతారు. హింసాప్రవత్తి మానుకోవాలని, దేవర వలన ఖర్చులు తప్ప లాభంలేదని, దేవర సందర్భంగా చెరువులో జంతు కళేబరాలను కడుగుతారని అందువలన కలరా, అంటువ్యాధులు వ్యాపిస్తాయని కల్లు వ్యతిరేక ప్రచారకులు దేవరను వ్యతిరేకిస్తారు.

దేవరవల్ల లబ్ధిపొందాలనుకునే నెట్టికల్లు, పుల్లన్న, వ్యాపారంచేసే శెట్టి మొదలగువారు దేవరను చేసేందుకు ముందుండి నడిపిస్తారు. జాతర సమయంలో కలరా పురుగులు వ్యాపించి కోనేరులో కలవకుండా రామారావు అతని మనుషులు దగ్గరుండి జాగ్రత్తలు తీసుకుంటారు. జాతరలో కల్లు, సారా, కోడిపందేలు విపరీతంగా సాగుతాయి. ఎన్నో మూగజీవాలను బలి ఇస్తారు. జాతర ద్వారా కల్లు అమ్ముకొని లాభం పొందిన నెట్టికల్లును పుల్లన్న తనకు రావలసిన వాటా అడుగుతాడు. తన వాటా ఇవ్వకపోతే రామారావు దగ్గరకు చేరుతానని చెబుతాడు. అప్పటికే ఊరంతా కలరా సోకుతుంది. పట్టణం నుండి డాక్టరును పిలిపించి కలరా బారినుండి రామారావు బృందం ప్రజలను కాపాడుతారు. కలరా కారణంగా రంగారెడ్డి కొడుకు మరణిస్తాడు. ప్రజలందరూ రామారావు సేవలను గుర్తించి అతను మార్గాన్ని కొనియాడుతారు. ఊళ్లో కలరా సోకడానికి కారణం రామారావే, చెరువులో ఏదో మందు కలిపాడని నెట్టికల్లు మను„షులు ప్రచారం చేస్తారు. డాక్టరు ఇచ్చిన మందులను చెరువులో కలిపామని, లేకుంటే అందరికి కలరా సోకేదని రామారావు వివరిస్తాడు. అంతలోనే పుల్లన్న ప్రక్క ఊరైన సిద్ధంపల్లె నుండి కల్లు పిపాయి తెస్తుండగా దొంగకల్లు తాగేవాడు వెంటపడి ఆ పిపాయిలో గొట్టంపెట్టి పీలుస్తుండగా అందులోకే వాంతిచేసుకున్నాడని, ఆ కల్లు తాగినవారందరికి కలరా సోకిందని తెలియజేస్తాడు. ఈ విధంగా సిద్ధంవారిపల్లిలోని కలరా తమ గ్రామంలోకి వ్యాపించిందని వివరిస్తాడు. ప్రజలంతా నెట్టికల్లు ఇంటిని కాల్చివేయడానికి సిద్ధమవుతారు. నెట్టికల్లును అని ఏమి లాభం, మనం కల్లు తాగకపోతే సరిపోతుందని రామరావు వారిని వారించి ఇకనైనా మానండని అంటాడు. అందరూ కలిసి కల్లుతాగమని ప్రమాణం చేస్తారు. రామారావును ఊరిలోనుంచి వెళ్లగొట్టి కల్లు అమ్మకం సాగించాలని నెట్టికల్లు అనుకొంటాడు. రామారావు వైపు ఉన్న పుల్లన్నకు యాభైరూపాయలిచ్చి, కల్లు ఉచితంగా పోస్తానని లోబరుచకుంటాడు. ఓబిగాడు కల్లు తాగుతుంటే అడ్డుకొని కల్లు ముంత పగులగొట్టి, వాడి చెంపకు రామారావు కొట్టాడని దొంగ సాక్ష్యం చెప్పించేందుకు సిద్ధం చేస్తాడు.

అధికారులకు నెట్టికల్లు డబ్బులిచ్చి అక్రమకేసు బనాయింపజేస్తాడు. పోలీసులు రామారావును కచేరికి తీసుకువెళతారు. రామారావు అనుచరులు ఆంజినేయులు, భీమలు జైలుకు వస్తామని సిద్ధమవగా రామారావు వారిని వారించి గ్రామంలో కల్లు తాగకుండా చూసుకోమంటాడు. గ్రామరెడ్డి అయిన రంగారెడ్డి మాదిగల నందరిని పిలిపించి కల్లు తాగాలని, లేకపోతే సర్కారుకు నష్టం వస్తుందని తెలియజేస్తాడు. మాదిగలు కల్లుతాగమని చెబితే తనకివ్వాల్సిన అప్పులు కట్టండని రెడ్డి ఒత్తిడి చేస్తాడు. లభిస్తున్నంతలో `కల్లుపెంట నాటకం'లోని ఇతివృత్తమిది. పప్పూరు రామాచార్యులు ఉద్యమకాలంలో ఎదురైన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ నాటికను రాశారు. పప్పూరువారిపై ఉద్యమంలో ఇలాంటి కేసునే బనాయించారు. ఆ కేసు కోర్టులో వీగిపోయింది. ఈ నాటికలో కూడా కేసు వీగిపోయి ఉంటుంది. ఒక గ్రామం నేపథƒ్యంగా కొనసాగిన సారా కల్లు వ్యతిరేకోద్యమం ఈ నాటికలో చిత్రితమైంది. గ్రామంలోని పెత్తందార్లు, కల్లంగడి యజమానుల దౌర్జన్యాలు, దోపిడీల స్వరూపాన్ని ఈ నాటిక తెలియ జేస్తుంది. అలాంటి సంక్లిష్ట పరిస్థితులలోను గాంధీ సిద్ధాంత అనుయాయులు శాంతియుతంగా అహింసా మార్గాన ప్రజలను చైతన్యవంతులను చేయడం గమనించాలి. ప్రజలు తిరగబడి వారిని ఎదుర్కొనే సామర్థా్యలుఉన్నప్పటికీ, గాంధీయమార్గంలో పోరాడాలనే ఈ నాటిక నిర్దేశం చేస్తుంది. మద్యనిషేధ ఉద్యమంలోభాగంగా ఈనాటిక గ్రామాలలో ప్రదర్శితమై ప్రజలు చైతన్యవంతులు కావాలని పప్పూరు రామాచార్యులు కోరుకున్నారు. ఆరోగ్యమే మాహా భాగ్యమనే `ఆరోగ్య నాటకం'

1936 జనవరి 11న ఆరోగ్య నాటకం అను మూడు రంగాల నాటిక ప్రచురితమైంది. ఆధునిక వ్యవహారిక భాషలో అందరికి అర్థమయ్యేలా, ప్రదర్శనాయోగ్యమైన నాటిక ఇది. ఈ నాటికలో సూత్రధారుడు ప్రవేశించి చేసిన నాంది ప్రస్తావనలో ఆరోగ్య దేవతలుగా భావించే పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం పాత్రలు ధరించిన పిల్లలు నరుడితో తమ ప్రాధాన్యం గురించి వివరిస్తున్నట్లు ఉంది. నాటిక మొదటి రంగంలో మద్యపానానికి అలవాటైన శోభనరావు పుట్టెడు రోగాల పాలై మంచం పడతాడు. అతని భార్య లీలమ్మ, పిల్లల ఒత్తిడికి తలొగ్గి శోభనరావు మద్యానికి దూరమై మామూలు మనిషిగా మారుతాడు. నాటిక రెండవ రంగంలో జిల్లా బోర్డు ప్రెసిడెంట్‌గా శోభనరావు ఎన్నికవుతాడు. ఆ సందర్భంలో `నాభార్య లీలకు నేను కతజ్ఞుడను. ఆ సాధ్వీ పట్టుపట్టకపోతే నా పనేమయి యుండెడో, లీల నా దురభ్యాసాలన్నింటిని వదలగొట్టింది. నా పిల్లలను మంచి మార్గంలో పెట్టింది. `మమ్మలినందరిని ఆరోగ్యవంతులను చేసింది. మా ఇల్లు, ఊర్లో వారందరికినీ ఆదర్శప్రాయయ్యేట్లుగా చేసింది. పొదుపుగా సంసారం చేసి నా అప్పులన్నీ తీర్చింది. సంసారం బాగుచేయవలెనన్న, పాడుచేయవలెనన్నా ఆడదాని చేతిలోనే ఉంది' అని వివరిస్తాడు. జిల్లా వ్యాప్తంగా విస్తరించిన కలరా, ప్లేగు, స్పోటక, చలి జ్వరాల వ్యాధుల గురించి శోభనరావు జిల్లా హెల్‌‌త ఆఫీసర్‌ జగదీశ్వరరావును వివరాలను అడిగి తెలుసుకుంటాడు. ఆ అధికారి బాధ్యతా రాహిత్యాన్ని నిలదీస్తాడు. ప్రజలను పట్టిపీడిస్తున్న ఈ వ్యాధులగురించి కాకుండా సంబంధంలేని `టూబర్కు్యలాసిస్‌' వ్యాధి గురించి కరపత్రం వేయటం, అందులోను ప్రజలకు అర్థంకాని ఇంగీషు భాషలో వేయడాన్ని మందలిస్తాడు. తెలుగు అనువాదం చేసిన మరో కరపత్రం ప్రజలకు అర్థమయ్యే వ్యవహారిక భాషలోకాక గ్రాంథిక భాషలో వేయటాన్ని శోభనరావు ఎత్తిచూపుతాడు.

శోభనరావు, అతని భార్య లీలమ్మ పల్లెల్లో పర్యటనచేస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలలో పాల్గొంటూ స్వచ్ఛంద సేవకులను తయారుచేసి ఒక ఉద్యమంలా నడుపుతున్నారని పత్రికల ద్వారా నారపరెడ్డి తెలుసుకుంటాడు. నారపరెడ్డి తాను నివసిస్తున్న గ్రామంలోకి శోభనరావు వస్తాడేమోనని ముందుగా తమ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలను ప్రజలతో కలిసి చేపట్టుతున్నట్లు తెలియజే„స్తూ నాటిక ముగుస్తుంది. నాటక లక్షణాల ప్రభావం నాందిప్రస్తావనలో కొంత కనిపిస్తుంది. నాటక లక్షణాల నుండి విడివడి నాటికగా నిలదొక్కుకునే ప్రయత్నం ఈ నాటికలో కనిపిస్తుంది. కష్టకాలంలో కుటుంబాన్ని నిలబెట్టడంలో స్త్రీల పాత్రను, ప్రజలతో అర్థమయ్యేలా వ్యవహారికభాషలో కరపత్రాలు రావాలనే వ్యవహారిక భాషా స్పృహను, బాధ్యతలు అదమరచి పనిచేసే అధికారుల బాధ్యతారాహిత్యాన్ని, నాయకులు మాటలద్వారా కాకుండా ఆచరణలద్వారా ముందుకు నడవాలని ఈ నాటిక తెలియజేస్తుంది.1936 ఫిబ్రవరి 22న ప్రచురితమైన `గంగా భాగీరథి' నాటికను చిలుకూరు నారాయణరావు రాశారు. నాటకాలు వేసే సమయంలో ఎదురయ్యే పరిస్థితులను, రసాభాసాలను ఇందులో వివరించారు.ఈ విధంగా రాయలసీమలోని ఆనాటి రాజకీయ పరిస్థితులను, స్త్రీవిద్య ఆవశ్యతకతను, మద్యపాన నిషేధ ఉద్యమాన్ని, ఆరోగ్య ప్రాధాన్యతల గురించి వివరించే నాటికలు వెలువడినాయి. ప్రదర్శనానుగుణ్యంగా రాసిన ఈ నాటికలు తరువాతి కాలంలో సీమలో నాటికా సాహిత్య వికాసానికి దిశానిర్దేశం చేశాయనిపిస్తుంది