తెలుగు శాసనాలు
అశోకుని శాసనాలలో కనిపించే మౌర్యలిపియే భారతీయ భాషలన్నిటికి మాతృక అనిపిస్తున్నది. అందులోనుండే తెలుగు అక్షరాలు రూపొందినా యనిపిస్తుంది.[1] కుబ్బీరకుని భట్టిప్రోలు శాసనము, అశోకుని ఎఱ్ఱగుడిపాడు (జొన్నగిరి) గుట్టమీది శాసనము ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో లభించే మొదటి వ్రాతలుగా భావిస్తున్నారు. వాటిలోని భాష ప్రాకృతము, లిపి బ్రాహ్మీలిపి.
తరువాత అమరావతిలోని నాగబు అనే పదము (సా.శ. 1వ శతాబ్ది), విక్రమేంద్రవర్మ చిక్కుళ్ళ సంస్కృత శాసనంలోని "విజయరాజ్య సంవత్సరంబుళ్" (సా.శ. 6వ శతాబ్ది) మనకు కనిపిస్తున్న మొదటి తెలుగు పదాలు. నాగార్జునకొండ వ్రాతలలో కూడా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఇవన్నీ ప్రాకృత శాసనాలు లేదా సంస్కృత శాసనాలు. కనుక తెనుగు అప్పటికి జనసామాన్యంలో ధారాళమైన భాషగా ఉన్నదనడానికి ఆధారాలు లేవు. ఆరవ శతాబ్ది తరువాత బ్రాహ్మీలిపినే కొద్ది మార్పులతో తెలుగువారు, కన్నడంవారు వాడుకొన్నారు. అందుచేత దీనిని "తెలుగు-కన్నడ లిపి" అని పరిశోధకులు అంటారు.[1]
అనేక ఆధారాలు
[మార్చు]6,7 శతాబ్దాలలో పల్లవ చాళుక్య సంఘర్షణల నేపథ్యంలో రాయలసీమ ప్రాంతం రాజకీయంగా చైతన్యవంతమయ్యింది. ఈ దశలో రేనాటి చోడులు సప్తసహస్ర గ్రామ సమన్వితమైన రేనాడు (కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు) పాలించారు. తెలుగు భాష పరిణామంలో ఇది ఒక ముఖ్యఘట్టం.[2] వారి శాసనాలు చాలావరకు తెలుగులో ఉన్నాయి. వాటిలో ధనంజయుని కలమళ్ళ శాసనం (వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా) మనకు లభిస్తున్న మొదటి పూర్తి తెలుగు శాసనంగా చరిత్రకారులు భావిస్తున్నారు. ఇది సా.శ. 575 కాలందని అంచనా. అంతకుముందు శాసనాలలో చెదురు మదురుగా తెలుగు పదాలున్నాయి గాని సంపూర్ణమైన వాక్యాలు లేవు.[1]
ఆ తరువాత జయసింహవల్లభుని విప్పర్ల శాసనము సా.శ. 641 సంవత్సరానికి చెందినది. 7,8, శతాబ్దులలోని శాసనాలలో ప్రాకృత భాషా సంపర్కము, అరువాతి కాలంలో సంస్కృత భాషా ప్రభావం అధికంగా కానవస్తాయి. 848 నాటి పండరంగుని అద్దంకి శాసనములో ఒక తరువోజ పద్యమూ, తరువాత కొంత వచనమూ ఉన్నాయి. 934 నాటి యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో ఐదు సీసము (పద్యం) పద్యాలున్నాయి. 1000 ప్రాంతమునాటిదని చెప్పబడుతున్న విరియాల కామసాని గూడూరు శాసనములో మూడు చంపకమాలలు, రెండు ఉత్పల మాలలు వ్రాయబడ్డాయి.[3] వీటి ఆధారాల కారణంగా నన్నయకు ముందే పద్య సాహిత్యం ఉండి ఉండాలని నిశ్చయంగా తెలుస్తున్నది. కాని లిఖిత గ్రంథాలు మాత్రం ఇంతవరకు ఏవీ లభించలేదు.
ధనంజయుని కలమళ్ళ శాసనం
[మార్చు]సుమారు సా.శ. 575 - కమలాపురం తాలూకా - (ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 221) కు చెందిన ఈ శాసనం మనకు లభించే మొట్ట మొదటి పూర్తి తెలుగు శాసనం.
.......... కల్ము[తు]రా జు ధనంజ యుదు రేనా ణ్డు ఏళన్ చిఱుంబూరి రేవణకాలు [పం] పు చెనూరుకాజు అఱి కళా ఊరి [-] ణ్డవారు ఊరి ... ... ... .... ..... ... పఞ్చ [మ] హా పాతకస కు
ఎరికల్ మహారాజు ధనుంజయుడు రేనాడును ఏలుతుండగా చిఱుంబూరు అనే గ్రామానికి చెందిన రేవణ అనే ఉద్యోగి పంపున చెనూరు గ్రామానికి చెందిన 'కాజు' (వాక్యం అసంపూర్ణం) - ఈ ధర్మం చెడగొట్టువాడు పంచమహాపాతకుడగును - అని కావచ్చును. కానీ ప్రస్తుతం ఈ శాసనం ఎక్కడుందో తెలియరావడం లేదు. సమాచార హక్కు చట్టంద్వారా డాక్టర్ వేంపల్లె గంగాధర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం ఆ వివరాలు తమవద్ద లేవని పేర్కొంది. ఇప్పటి వరకూ ఈ శాసనం మద్రాసులోని ఎగ్మూర్ మ్యూజియంలో వున్నదని భావిస్తూ వచ్చాం
పుణ్యకుమారుని తిప్పలూరి శాసనం
[మార్చు]- పుణ్యకుమారుని తిప్పలూరి శాసనము - 630 - - కమలాపురం తాలూకా - ఎపిగ్రాఫికా ఇండికా XXVII - పేజి 231
- సత్యాదిత్య చోళుని మాలెపాడు శాసనము - 725 - - ఎపిగ్రాఫికా ఇండికా XI - పేజి 345
- అరకట వేముల శాసనము - 8వ శతాబ్దం - ప్రొద్దుటూరు తాలూకా -
- వేల్పుచర్ల శాసనము - జమ్మలమడుగు తాలూకా -
- గణ్డ త్రిణేత్ర వైదుంబ మహారాజు వన్దాడి శాసనము - రాయచోటి తాలూకా -
- కొండపఱ్తి శాసనం - 9వ శతాబ్దం - వరంగల్ వద్ద
తెలుగు ఛందస్సులో మొదటి తరువోజ పద్య శాసనము చారిత్రకముగా చాలా విలువైనది. దీనిని కొమర్రాజు వెంకట లక్ష్మణరావు పరిష్కరించి ప్రకటించారు:[4] పట్టంబు గట్టిన ప్రథమంబు నేడు
- బలగర్వ మొప్పగ బైలేచి సేన
- పట్టంబు గట్టించి ప్రభు బండరంగు
- బంచిన సామంత పదువతో బోయ
- కొట్టము ల్వండ్రెండు గొని వేంగినాటి
- గొఱల్చియ త్రిభువనాంకుశ బాణ నిల్చి
- కట్టెపు దుర్గంబు గడు బయల్సేసి
- కందుకూర్బెజవాడ గవించె మెచ్చి.
గుణగ విజయాదిత్యుని కందుకూరు శాసనం (సా.శ. 848-850)
[మార్చు]గుణగ విజయాదిత్యుడు స్వయముగా వేయించిన కందుకూరు శాసనములో మనకు మొట్టమొదటి సీసపద్యం కనిపిస్తుంది.
"శ్రీ నిరవద్యుండు చిత్తజాత సముండు
శివ పద వర రాజ్య సేవితుండ
ఖిలుడు ననృతరిపు బలుడు నాహవరావ
దండమోద్య సిఘాసనుండగణిత
దానమాన్యుండు దయా నిలయుండును
భండన నండన పండరంగు
...................................కొలది లేని
కొట్టము ల్వోడిచి గుణక నల్ల
తాని పక్ష పాతి................
....................విభవ గౌరవేంద్ర..
ఈ పద్యం చాల వరకూ శిథిలమైందని చరిత్ర కారులు చెప్పారు. అయితే ఉన్నంతవరకూ కొమర్రాజు లక్ష్మణరావుగారు ఇచ్చారు.
గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనం (సా.శ. 848-850)
[మార్చు]గుణగ విజయాదిత్యుని ధర్మవరం శాసనంలో తొలి ఆటవెలది పద్యం కనపడుతున్నట్లుగా తెలుస్తోంది.
కిరణపురము దహళ నిరుతంబు దళెనాడున్
అచలపురము సొచ్చెనచలితుండు
వల్లభుండు గుణకె నల్లుండు (వంచి) నన్
బండరంగ చూరె పండరంగు
మధ్యాక్కఱల్లో వ్రాసి చెక్కించిన ఈ పద్యశాసనాన్ని జయంతి రామయ్య పంతులు పరిష్కరించారు[4].
- స్వస్తి నృపాంకుశాత్యంత వత్సల సత్యత్రిణేత్ర
- విస్తర శ్రీయుద్ధమల్లుం డనవద్య విఖ్యాతకీర్తి
- ప్రస్తుత రాజాశ్రయుండు త్రిభువనాభరణుండు సకల
- వస్తు సమేతుండు రాజసల్కి భూవల్లభుం డర్థి.
- పరగంగ బెజవాడ గొమరుసామికి భక్తుడై గుడియు
- నిరుమమమతి నృపధాము డెత్తించె నెగిదీర్చె మఠము
- గొరగల్లా కొరులిందు విడిసి బృందంబు గొనియుండువారు
- గరిగాక యవ్వారణాసి వ్రచ్చిన పాపంబు గొండ్రు.
కొరివి శాసనం - (సా.శ. 930) - వరంగల్ జిల్లా మానుకోట sasanam
[మార్చు]కొరివి గద్య శాసనము తూర్పు చాళుక్యులు, రాష్ట్రకూటులకు చెందిన ముగ్గురు సామంత రాజుల మధ్య జరిగిన పోరాటమును తెలియజేస్తుంది. తెలుగు వచనములో పటిష్ఠమైన రచన దీనిలో కనిపిస్తుంది.
శ్రీ విక్రమాదిత్య నృపాగ్ర తనయుండైన చాళుక్య భీమునకు శౌచకందర్పునకుం వేగీశ్వరునకు రణమర్దాన్వయ కులతిలకుండైన కుసుమాయుధుండు గన్నరబల్లహుని కస్తప్రాప్తంబైన రణమర్దన కండియందన భుజనీర్య బలపరాక్రమంబున దెచ్చి ... శ్రీ నిరవద్యుం డనేక సమరసంఘట్టన భుజాసి భాసురుడై తమయన్న రాజశ్రీకెల్లం దానయర్హుండై నిల్చి.
- జినవల్లభుని కుర్క్యాల శాసనము - 945 - కరీంనగర్ జిల్లా కుర్క్యాల
- బణపతి దీర్ఘాసి శాసనము - 997 - కళింగపట్నం
గూడూరు శాసనం - (సా.శ. 1124) - జనగామ తాలూకా, గూడూరు
[మార్చు]- అరుదగునట్టి ఎఱ్ఱనృపు నంగన గామమ సాని యాక మే
- ల్గరదని బేతభూవిభుని గాకతి వల్లభుచేసి వాని దా
- బరగంగ జేతబెట్టి ఘను బల్లవరాయని యాగిజొచ్చె భా
- స్కర విభు చక్రవర్తి గని కాకతి నిల్పుట కోటిసేయదే !
హన్మకొండ శాసనం (సా.శ. 1163)
[మార్చు]వేయి స్తంభాల గుడి లోని రుద్రదేవుని శాసనము చరిత్ర, భాషా కావ్యరచనా విషయాలలో ముఖ్యమైన శాసనము. ఇది చాళుక్యుల తర్వాత కాకతీయులు స్వాతంత్ర్యము వహించుటకు కారణమైనది. ఇందులో అనేక విజయముల గురించి రమ్యమైన భాషాశైలిలో చెప్పబడింది.
- హస్త్యారోహణ కర్మ కర్మఠగతిం చాళుక్య చూడామణిం
- శశ్వద్యుద్ధ నిబద్ధ గహ్యరమతిం యుద్ధే బబంధ క్షణాత్
- కృద్ధేనోద్ధుర మంత్రకూటనగరీ నాథో థయో నిస్త్రపో
- గుండః ఖండిత ఏవ ముండితశిరః క్రోడాంక వక్షఃస్థలః
- కందూరోదయ చోడ వంశ విలసత్ క్షీరాబ్ధిగర్భోద్భవ
- త్పద్మైకాశ్రయ రుద్రదేవనృపతేః కింవర్ణ్యతే విక్రమః
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 తెలుగు శాసనాలు - రచన: జి. పరబ్రహ్మశాస్త్రి - ప్రచురణ: ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాదు (1975) ఇంటర్నెట్ ఆర్చీవులలో లభ్యం
- ↑ ఆంధ్రుల చరిత్ర - రచన: ఆచార్య బి.ఎస్.ఎల్. హనుమంతరావు - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2003)
- ↑ దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ↑ 4.0 4.1 ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.