Jump to content

జయంతి రామయ్య పంతులు

వికీపీడియా నుండి
జయంతి రామయ్య పంతులు
జననంజయంతి రామయ్య పంతులు
జూలై 18, 1860
కోనసీమలోని ముక్తేశ్వరం
మరణంఫిబ్రవరి 19, 1941
వృత్తిమహారాజా వారి పాఠశాలలో ప్రధాన అధ్యాపకుడు
ప్రసిద్ధికవి, శాసన పరిశోధకులు.

జయంతి రామయ్య పంతులు ( జూలై 18, 1860 - ఫిబ్రవరి 19, 1941) కవి, శాసన పరిశోధకులు. తెలుగులో వ్యవహారిక భాషోద్యమం జరిగినప్పుడు ఆయన గ్రాంథికవాదులకు నాయకత్వం వహించి పోరాడారు. దీని కారణంగా ఆయన తెలుగు సాహిత్య చరిత్రలో ముఖ్యమైన స్థానం పొందారు.

బాల్యం, విద్య

[మార్చు]

వీరు కోనసీమలోని ముక్తేశ్వరం గ్రామంలో జూలై 18, 1860 సంవత్సరంలో జన్మించారు. సంస్కృతాంధ్ర భాషలలో ప్రాథమిక విద్యాభ్యాసం తరువాత రాజమండ్రిలో ఆంగ్లభాష అభ్యసించారు. 1882లో పట్టభద్రులై 1884 వరకు పిఠాపురం మహారాజా వారి పాఠశాలలో ప్రధాన అధ్యపకునిగా పనిచేశారు. తరువాత న్యాయవాది పరీక్షలో ఉత్తీర్ణులై ప్రభుత్వ మండలాధికారిగా చేరారు. 1911లో రాష్ట్ర న్యాయాధీశులయ్యారు.

ఆంధ్ర వాజ్మయానికి వీరు చేసిన సేవ సర్వతోముఖమైనది. మండలాధికారిగా అనేక శాసనాలను సేకరించి పరిశోధించారు. వీటిలో దేవులపల్లి శాసనం, యుద్ధమల్లుని శాసనం ముఖ్యమైనవి. ఇలా సేకరించిన శాసనాలలోని పద్యాలను క్రోడీకరించి "శాసన పద్య మంజరి" అనే పేరుతో రెండు భాగాలుగా ప్రచురించారు. రాష్ట్ర ప్రభుత్వం వారు తాము ప్రకటించినవి కాక 1926 వరకు సేకరించి ఉంచిన తెలుగు శాసనాలను వీరికి పరిష్కరించాలని ఇవ్వారు. అట్టి గ్రంథమే "దక్షిణ హిందూదేశ శాసనాలు" పదవ సంపుటంగా ప్రకటితమైనది.

వీరు రాష్ట్ర న్యాయాధీశులుగా పిఠాపురం, బొబ్బిలి, వెంకటగిరి సంస్థానాధీశుల ప్రోత్సాహంతో ఆంధ్ర సాహిత్య పరిషత్తును ఏర్పాటుచేశారు. దానికి ఐదు వేల తాళపత్ర గ్రంథాలను సేకరించారు. ఈ పరిషత్తు మొదట చెన్నపురిలో ఉండి తరువాత కాకినాడకు మార్చబడింది. ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికను ప్రకటించి దానిలో ఎన్నో ఆముద్రిత గ్రంథాలను ముద్రించారు.

రచనలు

[మార్చు]

వీరు రససిద్ధులైన కవి. ఉత్తర రామచరిత్ర, చంపూ రామాయణం వీరి స్వతంత్ర రచనలు. పిఠాపురం మహారాజా వారి ఆర్థిక సహాయంతో "సూర్యారాయంధ్ర నిఘంటువు"ను 1936లో రచించారు. "ఆధునికాంధ్ర వాజ్మయ వికాస వైఖరి" (1937) అనే విమర్శనాత్మక గ్రంథాన్ని రచించారు. ఆంగ్లభాషలో "డిఫెన్స్ ఆఫ్ లిటరరీ తెలుగు", "ద్రవిడియన్ లెక్సికోగ్రఫీ" (1925) అనే భాషా గ్రంథాలు రచించారు. వీరు గ్రాంథిక భాషావాది.

వీరు ఫిబ్రవరి 19, 1941 సంవత్సరంలో పరమపదించారు.

వీరి సంకల్పం అయిన ఆంధ్ర సాహిత్య పరిషత్తుకు శాశ్వత భవన నిర్మాణం వీరి నిర్యానానంతరం వీరు సోదరీమణి ప్రభల వెంకట సుబ్బమ్మ కల్పించిన ద్రవ్య సహాయంతో రూపొందినది.

ఇతడు కవిజనాశ్రయము-ఛందశ్శాస్త్రము అనే గ్రంథాన్ని రచించారు. దీని 1932 ముద్రణ ఆర్కీవులో లభిస్తున్నది.[1]

జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతి

[మార్చు]

ఆంధ్రవిశ్వకళాపరిషత్ వారు ప్రతియేడాదీ బి.ఏ. స్పెషల్ తెలుగులో విశ్వవిద్యాలయంలో, దీనికి అనుబంధంగా ఉన్న అన్ని కళాశాలల్లోను ఒకేసారి ఉత్తీర్ణులైన విద్యార్ధులకు కళాప్రపూర్ణ జయంతి రామయ్య పంతులు స్మారక బహుమతినిస్తారు.

మూలాలు

[మార్చు]
  1. https://archive.org/details/kavijanaashrayam020695mbp?q=Telugu

బయటి లింకులు

[మార్చు]
Wikisource
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: