వేమన శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేమన శతకం
VEmana text.jpg
కవి పేరువేమన
వ్రాయబడిన సంవత్సరంసుమారు 1652 - 1730 మధ్య కాలము
దేశంభారత దేశము
భాషతెలుగు
మకుటంవిశ్వదాభిరామ వినురవేమ
విషయము(లు)లోక నీతులు. సామాజిక చైతన్యం
పద్యం/గద్యంపద్యములు
ఛందస్సుఆటవెలది పద్యములు
మొత్తం పద్యముల సంఖ్య100 కి పైగా
అంతర్జాలం లోవికీసోర్సు లో వేమన శతకం
శతకం లక్షణంసామాజిక చైతన్యం

వేమన శతకం యోగి వేమన ఆటవెలది పద్యాలలో ఆశువుగా చెప్పిన పద్యాలు. వేమన సుమారు 1652 - 1730 మధ్య కాలములో జీవించాడు.

శతక విశిష్టత[మార్చు]

వేమన పద్యాలలో ఎక్కువగా లోక నీతులు, సామాజిక చైతన్యంనకు సంబంధించినవి ఉంటాయి. అతను సృశించని అంశం లేదు. సమాజంలోని అన్ని సమస్యలు భిన్న కోణాల్లోంచి దర్శించి ఆ దర్శన వైశిష్ట్యాన్ని వేమన తన పద్యాలలో ప్రదర్శించాడు. కుటుంబ వ్యవస్థలోని లోటు పాట్లు, మతం పేరిట జరుగుతున్న దోపిడీలు, విగ్రహారాధనను నిరసించడం, కుహనా గురువులు, దొంగ సన్యాసులు ఒకటేమిటి కనిపించిన ప్రతి సామాజిక అస్థవ్యస్థత మీద వేమన కలం ఝళిపించాడు. ఈ పద్యాలకు బహుళ ప్రచారం లభించటానికి కారణాలు చాలా ఉన్నాయి. సామాన్య నీతులను ప్రజల హృదయాలకు హత్తుకొనేటట్లు వారికి పరిచితమైన భాషలో, స్పష్టమైన రీతిలో సూటిగా, తేటగా, శక్తివంతంగా వ్యక్తీకరించటం, సామాన్యులైన వారిలో తనను ఒకనిగా భావించుకొని నీతి ఉపదేశం చేయటం వేమన నీతులలోని ప్రధాన గుణం. సునిశితమైన హాస్య, వ్యంగ్య, అధిక్షేప చమత్కృతులతో కల్పించి, నవ్వించి ఎదుటివారి లోపాలను, తన లోపాలను, గుర్తెరిగి ఉపదేశించిన రీతిని గమనించేటట్లు చేసే శైలిని ఆయన ప్రదర్శించాడు. సామాన్యాలు మనోజ్ఞాలు అయిన ఉపమాన దృష్టాంతాలతో సూక్తిప్రాయంగా నీతులను బోధించాడు[1].

పద్య లక్షణము[మార్చు]

వేమన పద్యాలన్నీ ఆటవెలది ఛందంలోనే చెప్పాడు. ఎంతో లోతైన భావాన్ని కూడా సరళమైన భాషలో, చక్కటి ఉదాహరణలతో హృదయానికి హత్తుకునేలా చెప్పాడు. సాధారణంగా మొదటి రెండు పాదాల్లోను నీతిని ప్రతిపాదించి, మూడో పాదంలో దానికి తగిన సామ్యం చూపిస్తాడు. నాలుగో పాదం "విశ్వదాభిరామ వినుర వేమ" అనే మకుటం. ఉదాహరణకు:

అల్పుడెపుడు బల్కు నాడంబరముగాను
సజ్జనుండు పలుకు చల్లగాను
కంచుమ్రోగినట్లు కనకంబుమ్రోగునా
విశ్వదాభిరామ వినురవేమ.

కొన్ని పద్యాల్లో ముందే సామ్యం చెప్పి, తరువాత నీతిని చెబుతాడు. ఉదా:

అనగననగరాగ మతిశయించునుండు
తినగ తినగ వేము తియ్యనుండు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ.

పద్య మకుటంపై వాదనలు[మార్చు]

"విశ్వదాభిరామ వినురవేమ" మకుటానికి భిన్న వాదనలున్నాయి. అవి:

  • వేమన ఆలనా పాలనా చూసిన ఆయన వదిన విశ్వదనూ, ఆయన ఆప్తమిత్రుడు అభిరాముడినీ మకుటంలో చేర్చి వారికి శాశ్వతత్వాన్ని ఇచ్చాడని ఒక వాదన.
  • విశ్వద అంటే విశ్వకారకుడికి, అభిరామ అంటే ప్రియమైనవాడని - అంటే సృష్టికర్తకు ప్రియమైన వేమా, వినుము - అని ఈ మకుటానికి మరో అర్థం చెప్పారు, పండితులు.
  • విశ్వద అంటే వేమన వద్ద ఉన్న వేశ్య అని, అభి రాముడు అంటే వేమన ఆప్తమిత్రుడైన స్వర్ణకారుడు,అనే వాదన కూడా ఉంది.

బ్రౌన్ కూడా ఈ రెండో అర్థాన్నే తీసుకుని పద్యాలను ఇంగ్లీషులోకి అనువదించాడు.

వేమన గురించి పరిశోధన[మార్చు]

వేమన పద్యాలు వందల సంవత్సరాల వరకు గ్రంథస్తం కాకుండా కేవలం సామాన్యుల నోటనే విలచి ఉన్నాయి. 1731లో ఫాదర్ లెగాక్ తొలిసారిగా వేమన పద్యాలు సేకరించాడని పరిశోధకులు భావిస్తారు. 1816లో ఒక ఫ్రెంచి మిషనరీ, తరువాత ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఎన్నో వేమన పద్యాలను సేకరించారు. తాను వేమనను కనుగొన్నానని బ్రౌన్ దొర సాధికారికంగా ప్రకటించుకొన్నాడు. అతను వందల పద్యాలను సేకరించి వాటిని లాటిన్, ఆంగ్ల భాషలలోకి అనువదించాడు. అలాగే హెన్రీ బ్లూచాంస్ (1897), విలియమ్ హోవర్డ్ కాంబెల్ (1910), జి.యు.పోప్, సి.ఇ.గోవర్ వంటి ఆంగ్ల సాహితీవేత్తలు వేమనను లోకకవిగా కీర్తించారు.[2]

మూలాలు[మార్చు]

  1. "Vemana Satakam - వేమన శతకం by Vemana - Vemana Satakam". anandbooks.com/ (in ఇంగ్లీష్). Retrieved 2020-01-18.[permanent dead link]
  2. తెలుగు పెద్దలు - మల్లాది కృష్ణానంద్ - మెహెర్ పబ్లికేషన్స్, హైదరాబాదు (1999)

బయటి లంకెలు[మార్చు]

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు: