సుమతీ శతకము
సుమతీ శతకం | |
---|---|
కవి పేరు | బద్దెన |
వాస్తవనామం | SUMATHI SATAKAM |
వ్రాయబడిన సంవత్సరం | సుమారు సా.శ.1260 |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
మకుటం | సుమతీ |
విషయము(లు) | నీతి పద్యములు |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | కంద పద్యములు |
మొత్తం పద్యముల సంఖ్య | శతకం |
అంతర్జాలం లో | వికీసోర్సు లో సుమతీ శతకం |
తెలుగు సాహిత్యంలో శతకములకు ఒక ప్రత్యేక స్థానము ఉంది. బహుజన ప్రియమైన శతాకాలలో సుమతీ శతకం ఒకటి. ఇది బద్దెన అనే కవి రచించాడని అంటారు. సరళమైన చిన్న పద్యాలలో చెప్పబడిన నీతులు తెలుగు వారి జీవితంలోనూ, భాషలోనూ భాగాలైపోయాయి. "అప్పిచ్చువాడు వైద్యుడు", "తన కోపమె తన శత్రువు" వంటి పద్యాలు తెలియని తెలుగు వారు ఉండరు. ఈ శతకంలోని ఎన్నో పద్యభాగాలను సామెతలు లేదా జాతీయములుగా పరిగణించ వచ్చును.
ఈ శతకానికి మకుటం "సుమతీ". సాధారణంగా ఇతర కావ్య, సాహిత్య ప్రక్రియలు పండితులకు పరిమితమైనాగాని, శతకాలు మాత్రం సామాన్య ప్రజానీకంలో ఆదరణపొందినవి. ఇలా తెలుగులో శతక సాహిత్యము పామరులకూ పండితులకూ వారధిగా నిలిచింది. వీటిలో వేమన శతకానికీ, సుమతీ శతకానికీ ఉన్న ప్రాచుర్యము అత్యధికం. సుమతీ శతకం 108 నీతి పద్యాల సమాహారం.
రచయిత
[మార్చు]సుమతీ శతకం వ్రాసినదెవరో కచ్చితమైన సమాచారం లభించడంలేదు. పలు రచనల్లో "సుమతీ శతక కర్త" అని ఈ రచయితను ప్రస్తావించడం జరుగుతుంది. సా.శ. 1220-1280 మధ్య కాలంలో బద్దెన లేదా భద్ర భూపాలుడు అనే కవి సుమతీ శతకం రచించాడని సాహితీ చరిత్రకారుల అభిప్రాయం. ఇతడు కాకతీయ రాణి రుద్రమదేవి (1262-1296) రాజ్యంలో ఒక చోళ సామంత రాజు. ఈ రచయితే రాజనీతికి సంబంధించిన సూక్తులతో నీతిశాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని వ్రాశాడు. ఇతడు మహాకవి తిక్కనకు శిష్యుడు.
సుమతీ శతకాన్ని బద్దెనయే రచించినట్లయితే తెలుగు భాషలో వచ్చిన మొదటి శతకాలలో అది ఒకటి అవుతుంది. (పాలకురికి సోమనాధుని వృషాధిప శతకము, యాతావక్కుల అన్నమయ్య సర్వేశ్వర శతకము వచ్చిన కాలంలోనిదే అవుతుంది.)
సుమతి శతకము ప్రథమత: 1868వ సంవత్సరమునందు ప్రకటింపబడింది.1877 వ సంవత్సరమునందు రంగనాయకులు, 1889వ సంవత్సరమునందు జి.బాలగురునాధయ్య, అదే సంవత్సరమునందు పి.శల్వరాజమొదలి, 1910వ సంవత్సరమునందు అజ్ఞాతవ్యక్తి, 1912వ సంవత్సరమునందు జి.వి.రామానుజులు నాయుడు, అజ్ఞాత సంవత్సరమునందు నరసింహులుశెట్టి ప్రకటించిన సుమతి శతకము ఇదే మనకు ప్రసిద్ధి సుమతీ శతకము అయినది. దీనిని 1928లో వావిళ్ళవారి ప్రచురణకు వచ్చింది. అది మొదలు 1982 వరకు ఇదే ముద్రితములైన, పునర్ముద్రితములైన సుమతి శతకములు అనేకములు పుష్కములుగా ఉన్నాయి. కాని వేటిలోను కర్తృకాలములు సరిగా నిర్ణయించబడలేదు. సుమతి శతకము కర్త శైవ, వైష్ణవమత సంబంధమైన పురాణగాధలను వదలి, ఎక్కువ ఉపమానములను జీవితమునుండి గ్రహించెను.ఇది జైనకవుల ప్రత్యేకత. తమిళ వేదముగ ప్రసిద్ధమైన తిరుక్కురల్ అను తమిళ గ్రంథములో మత సంబంధమైన ఉపమానములు తక్కువ. జీవిత ఉపమానాలు ఎక్కువ. అందువలన కొందరు దీనిగ్రంధకర్త తిరువల్లు కార్ జైనుడని సామాన్యముగా విశ్వసింతురు. సుమతి శతకము తాళపత్ర ప్రతులు మదరాసు ప్రాచ్యలిఖిత పుస్తక భాండాగారము నందు; తంజావూరు సరస్వతీ మహల్ గ్రంథాలయమునందు మాత్రమే కాక, కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్కార్యాలయమునందు, హైదరాబాదు ప్రాచ్యలిఖిత గ్రంథాలయములో ఉన్నాయి. వీటిలో 'శ్రీరాముని దయచేతను' అనే శతక పద్యము గ్రంథాదిని ఉంది. వేమన, భర్తృహరి మొదలగు వారు కూడా జీవిత ఉపమానాలు ఉపయోగించారు కూడా. అందువలన సుమతి శతకము జైనకవి విరచితము అనుట సునిసతము కాదు. బద్దెనకు భీమా: అని మరియొక పేరుకలదు. సుమతి శతకము భీమనకృత మని కల పద్యము లిఖితప్రతియందు ఉంది. అందువలన ఇది బద్దెన విరచితము అని కొందరి విశ్వాసము. అలానే ఇది బద్దెన విరచితము అనుటకు మరికొన్ని ఆధారాలు: నీతిశాస్త్ర ముక్తావళిలోని ప్రథమ పద్యము, ధారాశుద్ధి లేని కొన్ని పద్యములు.మానవల్లి రామకృష్ణకవి గారు 1910వ సంవత్సరమునందు నీతిశాస్త్ర ముక్తావళి గ్రంథమును ప్రకటించారు. అప్పటికే బద్దెన విరచిత నీతి సారము మద్రాసు ప్రాచ్యలిఖిత భాంఢాగారమునందు రెండు తాళప్రతులు ఉన్నాయి. కావున ఇది ఆయన్ విరచితము అనుటకు ఇది మరొక ఆధారముగా భావించవచ్చును.
సుమతీ శతకమందు కొన్ని పద్యములు సంస్కృత శ్లోకముల కాంధ్రీకరణములు. ఉదాహరణ:
శ్లో:కార్యేషుదాసీ కరణేషు మంత్రీ
రూపేచలక్ష్మీ క్షమయా ధరిత్రీ
భోజ్యేషు మాతా శయనేషు రంభా
షడ్ధర్మయుక్తా కులధర్మపత్నీ
తే.గీ:పని సేయునెడల దాసియు
ననుభవమున రంభ మంత్రి యాలోచనలన్
దనభుక్తియెడల దల్లియు
నన దనకుల కాంత యుండ నగురా సుమతీ.
అదే విధంగా భర్తృహరి శ్లోకములకు భాషాంతీకరణములు కూడా ఉన్నాయి.
పాలను గలసిన జలమును
బాలవిధంబుననె యుండు బరికింపంగా,
బాలచవి జెరుచు, గావున
తాలసుడగువానిపొందు వలదుర సుమతీ...!
పెట్టిన దినముల లోపల
నట్టడవులకైన వచ్చు నానార్థములున్
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ.
1840లో సి.పి.బ్రౌన్ సుమతీ శతకాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.[1]
సుమతీ శతకం విశిష్టత
[మార్చు]శతాబ్దాలుగా సుమతీ శతకం పద్యాలు పండితుల, పామరుల నోళ్ళలో నానుతున్నాయి. సుమతీ శతకం పద్యాలలోని పదాలు చాలా తేలికగా గుర్తుంటాయి. అనేక సందర్భాలలో ఇందులోని పదాలను ఉదహరించడం జరుగుతాయి. సుమారు ఏడు వందల ఏళ్ళ క్రితం వ్రాయబడినా దాదాపు అన్ని పదాలూ ఇప్పటి భాషలోనూ వాడుకలో ఉన్నాయి. ఇది పాతకాలం కవిత్వమని అసలు అనిపించదు. పండితులకు మాత్రమయ్యే పరిమితమైన భాష కాదు. పెద్దగా కష్ట పడకుండానే గుర్తు పెట్టుకొనే శక్తి ఈ పద్యాలలోని పదాలలోనూ, వాటిని కూర్చిన శైలిలోనూ అంతర్లీనమై ఉంది. అందుకే చదవడం రానివాళ్ళు కూడా సుమతీ శతకంలోని పద్యాలను ధారాళంగా ఉదహరించగలిగారు.
సుమతి శతకమున పద్యములన్నియు అ కారాది క్రమమున ఉన్నాయి. ఈ విధానానికి సుమతి శతక కర్థ బద్దెన యే ప్రారంబకుడు. ఇతనిననుసరించి ఆ తర్వాతి కాలములలో భాస్కర శతకము, వేణుగోపాల శతక కర్థలు కూడా సుమతి శతకాన్ని అనుసరించారు.
పూర్తి పద్యం రానివారు కూడా ఒకటి రెండు పాదాలను ఉట్టంకించడం తరచు జరుగుతుంది. ఇందుకు కొన్ని ఉదాహరణలు
- అక్కరకు రాని చుట్టము
- అప్పిచ్చువాడు, వైద్యుడు
- ఇత్తడి బంగారమగునె
- తను వలచినదియె రంభ
- ఖలునకు నిలువెల్లవిషము
- బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ
- కనకపు సింహాసనమున శునకము కూర్చుండ బెట్టి
- ఎప్పుడు సంపదలు గలిగిన నప్పుడు బంధువులు వత్తురు
తరతరాలుగా తల్లిదండ్రులు తమ పిల్లలకూ, పంతుళ్ళు తమ శిష్యులకూ సుమతీ శతకంలోని నీతులను ఉపదేశిస్తున్నారు. 700 సంవత్సరాల తరువాత కూడా ఇందులోని సూక్తులు నిత్య జీవనానికి సంపూర్ణంగా వర్తిస్తాయి. చెప్పదలచిన విషయాన్ని సూటిగా, కొద్ది పదాలలో చెప్పిన విధానం అత్యద్భుతం. మొదటి పద్యంలోనే కవి "ధారాళమైన నీతులు నోరూరగ జవులుపుట్ట, ఔరా యనగా, నుడివెద"నని చెప్పుకున్నాడు. ఇందుకు పూర్తి న్యాయం చేయగలిగాడు.
కొన్ని అధిక్షేపింపదగిన విషయాలు
[మార్చు]ఇప్పటి "సామాజి సృహ" పరంగా ఉన్న అవగాహనతో చూస్తే కొన్ని పద్యాలలో కనిపించే ఆనాటి దృష్టి అసంబద్ధంగా కనిపిస్తుంది. "నమ్మకుమీ వామ హస్తుని"). ముఖ్యంగా స్త్రీల పట్ల, కొన్ని కులాల పట్ల వ్యక్తమైన అభిప్రాయాలు దురాచారాలుగా అనిపిస్తాయి. ("కోమలి నిజము, గొల్ల ని సాహిత్య విద్య" ఉండవని కవి వ్రాశాడు). ఎవరైనా తమ కాలానికి సంబంధించిన అభిప్రాయాలకు బందీలే అని మనం గ్రహించాలి.
మూలాలు
[మార్చు]- ↑ "Colonial Lists/Indian Power: Sumati Satakam". www.gutenberg-e.org. Retrieved 2022-11-20.
వనరులు
[మార్చు]- అడ్లూరి శేషు మాధవరావు వ్యాసం
- https://web.archive.org/web/20130121194002/http://eenadu.net/Magzines/Sahitisampadainner.aspx?qry=sumathi
ఇవి కూడా చూడండి
[మార్చు]
బయటి లింకులు
[మార్చు]భూపాలుడు, బద్దెన (AD 1220-1280). సుమతీ శతకము. వికీసోర్స్.
- Open Source Audio by Dr. Goli Anjaneyulu.
- Sumati Satakam Versions: Adyar Library
- Sumati Satakam Versions: Charles Philip Brown
- Sumati Satakam Transcription, Andhra Pradesh Sate Oriental Manscript Library and Research Institute
- https://kalyankrishna4886.files.wordpress.com/2013/09/sumathisatakalu-english.pdf