Jump to content

శ్రీవేంకటాచల విహార శతకము

వికీపీడియా నుండి

శ్రీవేంకటాచల విహార శతకమ్ ఒక అజ్ఞాత కవి వేంకటేశ్వర స్వామిని గురించి రచించిన శతకం. తిరుమలపై వెలసిన వేంకటేశ్వర స్వామిని గురించి వచ్చిన అనేకమైన భక్తి రచనలలో ఇది ప్రముఖమైనది.

రచన నేపథ్యం

[మార్చు]

సా.శ.1700 శతాబ్ది ఉత్తరార్థంలో మహమ్మదీయ పరిపాలకులు దక్షిణ భారతదేశంపై చేసిన దండయాత్రల్లో భాగంగా తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాల్లో కూడా ప్రభావం తాకింది. సుల్తానుల సైన్యం రాజకీయ, సాంఘిక, మతపరమైన జీవనాన్ని అల్లకల్లోలం చేసి, దోపిడీలు, అకృత్యాలకు పాల్పడడంతో జనజీవనం కల్లోలభరితమైంది. ఆ కాలంలో వేంకటాచల విహారునిగా శ్రీవేంకటేశ్వరస్వామిని సంబోధిస్తూ రచించిన శతకం ఇది.[1] సంఘజీవనంలోని అలజడులను రచన ప్రతిబింబిస్తూ వేంకటేశ్వరస్వామిని ఈ దుస్థితి నుంచి రక్షించమని, శత్రువులను నిర్జించమనీ వేడుకుంటూ సాగే పద్యాలు చాలానే ఈ శతకంలో కనిపిస్తాయి.

గ్రంథకర్త వివరాలు

[మార్చు]

ఈ శతకంలోని ఏ పద్యంలోనూ కవి తన పేరు చెప్పుకోలేదు. శతకంలో కనీసం వంద పద్యాలు ఉండవలిసి ఉండగా, ఇందులో 98 పద్యాలే దొరుకుతున్నాయి. మిగిలిన రెండు పద్యాలలో కృతికర్త వివరాలు చెప్పుకుని ఉండొచ్చునని ప్రముఖ సాహిత్య పరిశోధకుడు, ఈ గ్రంథపరిష్కర్త వేటూరి ప్రభాకరశాస్త్రి భావించారు. ఐతే ఏ ఇతర స్థితిగతుల ప్రభావం వల్లనైనా ఇలా రచనకు కర్త పేరు తెలియకుండా గుప్తంగా ఉంచుకునే అవకాశం ఉంది. మొత్తంగా ఈ కృతి కర్త పేరు తెలియకుండా పోయినా పద్యాలలోని రెండు చోట్ల సందర్భవశాన "బ్రాహ్మణుడను" అనీ, "నీ (తిరుమల వేంకటేశ్వరస్వామి) సొమ్ము తిన్నవాడను" అనీ చెప్పుకున్నాడు.

విషయాలు

[మార్చు]

శ్రీవేంకటాచల విహార శతకంలోని పద్యాలను కవి సీస ఛందస్సులో రచించారు. సాధారణమైన పద్యాలకు రెట్టింపు పరిమాణంలో ఉండే సీస పద్యాలను విషయ విస్తారం వల్ల ఎంచుకుని ఉంటారని భావించవచ్చు. ఈ శతకానికి మకుటంగా శత్రుసంహార వేంకటాచలవిహారను స్వీకరించారు. మొదటి నాలుగు పద్యాలలో కాక మిగిలిన అన్ని పద్యాలలోనూ చివర పాదంగా శత్రుసంహార వేంకటాచలవిహార అన్న పదాలే పునరుక్తి చెందుతూంటాయి. శతకంలో ఉన్న విషయాలకు ఈ శతకానికి ఎంచుకున్న మకుటానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. సుల్తానుల సైన్యం (వీరినే తురకలని వ్యవహరించారు) చేస్తున్న ఆగడాలను భరించలేక వారిని నశింపజేయమని కోరుతూ ఈ శతకం రచించారు. ఇందులోని కొన్ని పద్యాల సారాంశం ఇది:

  • దేవాలయాలలోకి వెళ్ళి దైవవిగ్రహాలను నాశనం చేస్తూన్నప్పుడు, జిగురుపాల కోసమనే వంకన చిగురించే (పవిత్రమైన) రావిచెట్లు కొట్టి నుజ్జు చేసేప్పుడూ, గురువులకే గురువులైన వారి పట్టె నామాలు (నిలువు నామాలు) నాకించి వేసినప్పుడు, గద్దిస్తూ వైదికులైన బ్రాహ్మణ బాలకుల పిలకలను ఊడబెరుకుతున్నప్పుడూ తురక మూకల (సుల్తాను సైనికులు, ఇతర అల్లరిమూకలు అయివుండొచ్చు)ను అడ్డగించి గెలవడం వేంకటేశా నీకైనా శక్యమేనా? ఏదో వెఱ్ఱితనం కొద్దీ విన్నవించుకున్నాను. మీ చిత్తమూ, మా భాగ్యమూను. (5వ పద్యం)
  • తలనీలములు లేని బోడి సన్యాసులను పొట్టేళ్ళలాగా ఒకరినొకరితో కొట్టించేవాడొకడు, సోమయాజుల జంధ్యాలు తెంచి వాటితో విల్లులకు అల్లెతాళ్ళు తయారుచేసుకునేవాడు ఒకడు.... ... యవనులు మేఘాల్లా వ్యాపించి దుర్దినములు వచ్చిన దిగువ తిరుపతిని చూడు, (ఇవన్నీ చూడకుండా) నిదురపోతున్నాడు మీ అన్న (గోవిందరాజస్వామి) లేవలేక.

తిరుమల-తిరుపతి దుస్థితిని వివరించడం, సైన్యాల దుష్కృత్యాలను వర్ణించడమే కాక వేంకటేశ్వర స్వామిని దుష్కరులను వెళ్ళగొట్టవేమంటూ రాసిన ఎంతో నిందా కవిత్వం కూడా ఇందులో ఉంది.

ఉదాహరణ

[మార్చు]

శ్రీవేంకటాచల విహార శతకంలో నుంచి ఉదహరింపదగిన పద్యాలు కొన్ని:

ప్రచురణలు

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. శ్రీవేంకటేశ్వర లఘుకృతులులోని తొలి పలుకు:వేటూరి ప్రభాకరశాస్త్రి:తితిదే ప్రచురణ:1948