భాస్కర శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

భాస్కర శతకము రచించిన మారయ (మారవి) వెంకయ్య కవి 1550-1650 కాలంలో శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలో నివశించిన కళింగ కవి. ఆ ప్రాతంలో ఉన్న అరసవిల్లి సూర్యదేవాలయంలోని సూర్యభగవానుడిని సంబోధిస్తూ భాస్కర శతకము వ్రాశాడు. అందులోని నీతి బోధలవల్ల, కవిత్వ సౌందర్యము వల్లా ఈ శతకము బాగా ప్రాచుర్యము పొదింది. దృష్టాంతాలంకారములు మెండుగా వాడిన మొదటి శతకాలలో ఇది ఒకటి అని విమర్శకుల అభిప్రాయము. ప్రతి విషయాన్నీ చక్కని పోలికతో ఈ కవి వర్ణించాడు.

కొన్ని ఉదాహరణలు:


ఉత్పలమాల - శ్రీగల భాగ్యశాలిఁ గడుఁ జేరఁగవత్తురు తారుదారె దూ

    రాగమన ప్రయాసము కాదట నోర్చియైన నిల్వ న
    ద్యోగము చేసి; రత్న నిలయుండని కాదె సమస్త వాహినుల్
    సాగరుఁ జేరుటెల్ల ముని సన్నుత మద్గురుమూర్తి భాస్కరా!

ఓ సూర్యభగవానుడా! సాగరుడు రత్ననిలయుడు కనుకనే నదులన్నీ సముద్రములో చేరుటకు పొర్లివచ్చును. అలాగే సదూరప్రాంతాలనుండి కూడ జనులు ధనవంతుని ఆశ్రయిస్తారు.


ఉత్పలమాల - ఊరక సజ్జనుండొదిగి యుండిననైన, దురాత్మకుండు ని

     ష్కారణ మోర్వలేక యపకారము చేయుట వాని విద్యగా;
     చీరలు నూరు అంకములు చేసెడివైనను బెట్టెనుండగాఁ
     జేరి చినింగిపోఁ గొఱుకు చిమ్మట కేమి ఫలంబు భాస్కరా!

భావం - ఎంతో ఖరీదైన చీరలను పెట్టెలో పెడితే చిమ్మెట పురుగు వాటిని తెగ కొరుకుతుంది. అలాగే మంచివాడు తనమానాన తానున్నా దుష్టుడు పూనుకొని ఏదో హాని తలపెడతాడు.


చంపకమాల - చదువది యెంత గల్గిన రసజ్ఞత యించుక చాలకున్న నా

     చదువు నిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చ రెచ్చటం;
     బదనుగ మంచికూర నలపాకము చేసిననైన నందు నిం
     పొదవెడొ నుప్పు లేక రుచి పుట్టఁగ నేర్చు నటయ్య భాస్కరా! 

భావం - ఎంత గొప్పగా వండినా ఉప్పు లేని కూర రుచించదు. అలాగే ఎంత చదివినా, ఆ చదువు సార ము గ్రహించలేకపోయినట్లయితే ఆ చదువు నిరుపయోగము. ఎవరూ మెచ్చుకొనరు.

ఉత్పల మాల - తెలియని కార్య మెల్లఁ గడతేర్చుట కొక్కవివేకిఁ జేకొనన్

     వలయునటైన దిద్దుకొనకవచ్చుఁ బ్రయోజన మాంద్య మేమియుం
     గలుగదు ఫాలమందుఁ దిలకం బిడునప్పుడు సేత నద్దమున్
     గలిగినఁ జక్కఁ జేసికొనుగాదె నరుండది చూచి భాస్కరా! 

భావం - తనకు పరిచయంలేని పనిని చేయబోవునప్పుడు, అది తెలిసిన మరొకరి సహాయము వలన ఎంతటి పనినైనా చక్కగా పూర్తి చేయవచ్చును. మొహమున బొట్టుపెట్టుకొనేటప్పుడు అద్దంలో చూసుకుంటే, వంకర లేకుండా పెట్టుకోవచ్చును.

ఉత్పలమాల - దక్షుఁడు లేనియింటికిఁ బదార్థము వేఱొక చోట నుండి వే

    లక్షలు వచ్చుచుండినఁ బలాయనమై చనుఁ గల్లగాదు ప్ర
    త్యక్షము వాఁగులున్ వఱదలన్నియు వచ్చిన నీరు నిల్చునే
    యక్షయ మైనగండి తెగినట్టి తటాకములోన భాస్కరా! 

మితంగా, తెలివిగా ప్రతిదీ తెలిసి ఉపయోపగించుకునే యజమానిలేని యింటికి, ఎన్ని వస్తువులు లక్షలుగా వచ్చిపడినా, వెంటనే ఎక్కడివక్కడ పోవునుగానీ, లాభము లేదు. గండిపడిన చెరువులో ఏరులు, వాగులు ఎన్ని వచ్చి చేరినా చుక్క నీరు నిలువదు కదా?


ఆధారాలు[మార్చు]

వెంకయ్య, మారయ (AD 1550-1650). Wikisource link to భాస్కర శతకము. వికీసోర్స్. 

Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


శతకములు
ఆంధ్ర నాయక శతకము | కామేశ్వరీ శతకము | కుక్కుటేశ్వర శతకము | కుప్పుసామి శతకము | కుమార శతకము | కుమారీ శతకము | కృష్ణ శతకము | గాంధిజీ శతకము | గువ్వలచెన్న శతకము | గోపాల శతకము | చక్రధారి శతకము | చిరవిభవ శతకము | చెన్నకేశవ శతకము | దాశరథీ శతకము | దేవకీనందన శతకము | ధూర్తమానవా శతకము | నరసింహ శతకము | నారాయణ శతకము | నీతి శతకము | భారతీ శతకము | భాస్కర శతకము | మారుతి శతకము | మందేశ్వర శతకము | రామలింగేశ శతకము | విజయరామ శతకము | విఠలేశ్వర శతకము | వేమన శతకము | వేంకటేశ శతకము | వృషాధిప శతకము | శిఖినరసింహ శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | శ్రీ కాళహస్తీశ్వర శతకము | శ్రీవేంకటాచల విహార శతకము | సర్వేశ్వర శతకము | సింహాద్రి నారసింహ శతకము | సుమతీ శతకము | సూర్య శతకము | సమాజ దర్పణం | విశ్వనాథ పంచశతి | విశ్వనాథ మధ్యాక్కఱలు | టెంకాయచిప్ప శతకము | శ్రీగిరి శతకము | శ్రీకాళహస్తి శతకము | భద్రగిరి శతకము | కులస్వామి శతకము | శేషాద్రి శతకము | ద్రాక్షారామ శతకము | నందమూరు శతకము | నెకరు కల్లు శతకము | మున్నంగి శతకము | వేములవాడ శతకము | శతకము