శ్రీకాళహస్తీశ్వర శతకము
![]() | విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (నవంబర్ 2016) |
శ్రీ కాళహస్తీశ్వర శతకము | |
---|---|
కవి పేరు | ధూర్జటి |
ఆంగ్లంలో పేరు | KALAHASTISWARA SATHAKAM |
వ్రాయబడిన సంవత్సరం | సుమారు సా.శ.1740 |
దేశం | భారత దేశము |
భాష | తెలుగు |
మకుటం | శ్రీ కాళహస్తీశ్వరా! |
విషయము(లు) | కాళహస్తీశ్వరుని కీర్తిస్తూ |
పద్యం/గద్యం | పద్యములు |
ఛందస్సు | వృత్తములు |
మొత్తం పద్యముల సంఖ్య | శతకం |
అంతర్జాలం లో | వికీసోర్సు లో శ్రీ కాళహస్తీశ్వర శతకము |
అంకితం | శ్రీ కాళ హస్తీశ్వరునికి |
కీర్తించిన దైవం | శ్రీకాళహస్తీశ్వరుడు |
ధూర్జటి తానీ శతకమును వ్రాసినట్టు గ్రంథములో ఎక్కడా పేర్కొనలేదు. కానీ సా.శ. 1740 ప్రాంతము వాడైన ప్రసిద్ధ లాక్షణికుడు కస్తూరి రంగ కవి తన యానంద రంగ రాట్ఛందమున... ఈ శతకము లోని ఒక పద్యాన్ని ఉదహరిస్తూ దీనిని ధూర్జటి వారి కాళహస్తీశ్వర శతకమున అని ప్రస్తావించినందున ఈ శతకాన్ని ధూర్జటి కవి యే రచించెననుట నిర్వివాదంశం. శ్రీకాళహస్తీశ్వర శతక కవి ధూర్జటి. ఈతఁడు శ్రీకృష్ణ దేవరాయల సభలో అష్ట దిగ్గజములు అనబడు ఎనిమిది మందిలో ఒకడు అని వాడుక. శ్రీ కాళహస్తి మాహాత్మ్యమును బట్టి ఈ కవి సింగమ రమా నారాయణ (జక్కయ నారాయణ) తనూభవుడు అని తెలియును. కవి సమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి మాటలలో ‘ఈ కాళహస్తి మాహాత్మ్యము వంటి గ్రంథము తెలుగులో మరియొకటి లేదు. తక్కినవారి కవిత్వము మనస్సునకు వాడి పెట్టి హృదయమును పాటునకు తెచ్చును. ఈ (ధూర్జటి) కవిత్వము మనస్సు వాడిమిని దాటి, గండె పాటు దాటి, దూరాన శివుడు కనిపించునట్లు చేయును’. ధూర్జటి రచనలుగా మనకు లభించునవి రెండు. (1) శ్రీకాళహస్తి మాహాత్మ్యము (2) శ్రీకాళహస్తీశ్వర శతకము భాష విషయమున ఈ రెండు రచనలును రెండు వేరువేరు మార్గములలో నడచినట్లు కనబడును. శ్రీకాళహస్తి మాహాత్మ్యము, శ్రీకాళహస్తి క్షేత్ర పతియగు శ్రీకాళహస్తీశ్వరుని మహిమమును బహువిధములుగా తెలుపు స్థల పురాణము. కావ్యముగా ఇది ప్రబంధము. ఎందుకంటే ఇది పంచభూత లింగములలో ఒకటిగా వాయు లింగ రూపుడగు శివుడు వర్ణనీయుడుగా రచించబడిన వస్తుప్రధాన కావ్యము. శ్రీకాళహస్తీశ్వర శతకము, భక్తుడు తన మనస్సులోని భక్తి మొదలగు భావములను భగవంతునితో సూటిగా చెప్పుటకై రచించబడిన కావ్యము. కవి తన హృదయమును అనుదినమును మాటలాడు వాడుక భాషలోనే భగవంతుని ఎదుట ఉంచుటకై చేసిన రచన ఇది. అందుకు తగినట్లే ఈ శతక రచమలోని భాషను, అంటే వాక్యనిర్మాణాన్ని, వాడుక తీరులోనే చేయడమైంది.
అంకితము[మార్చు]
శ్రీ కాళహస్తీశ్వరునకు
విశేషాలు[మార్చు]
బహుశా దీనిని ధూర్జటి తన చివరి కాలములో వ్రాసి ఉండవచ్చును. ప్రఖ్యాత "రాజుల్ మత్తుల్ వారిసేవ నరకప్రాయంబు, వారిచ్చు నంభోజాక్షు చతురంతయాన తురగ భూషాదులాత్మవ్యదాబీజంబుల్" అనే పద్యము ఈ శతకము లోనిదే! ఇందు రాజులను రక రకాలుగా తిట్టినాడు.
ఏ వేదంబు ఫఠించె లూత భుజంగం బే శాస్త్రముల్ ల్సూచె తా
నేవిద్యాభ్యాసం బొనర్చె గరి చెంచే మంత్రం బూహించె భో
దావిర్భావ విధానముల్ చదువులులయ్యా కావు మీపాద
సంసేవా శక్తియే కాక జంతుతతికిన్ శ్రీ కాళహస్తిశ్వరా
పద్యములు[మార్చు]
దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే
కాంతాసంఘము రోయనప్పుడే జరక్రాంతంబు గానప్పుడే
వితల్మేన జరించనప్పుడె కురుల్వెల్లెల్ల గానప్పుడే
చింతింపన్వలె నీపదాంభుజములన్ శ్రీ కాళహస్తీశ్వరా!
భావం:
శ్రీ కాళహస్తీశ్వరా! మానవులు ఎవ్వరే కాని తమ దంతములు రాలని స్థితియందు ఉండగనే, తన శరీరమునందు బలము బాగుగ ఉండగానే, స్త్రీలకు తన విషయమున ఏవగింపు కలుగుటకు ముందే, శరీరము ముసలితనముచే శిథిలము కాక ముందే, తన వెండ్రుకలు నెరసి తెలతెల్లన కాకుండగనే, తన శరీరమున మెరుగులు తగ్గని సమయముననే నీ పాదపద్మములను సేవించవలెను.
నిచ్చల్ నిన్ను భజించి చిన్మయమహా నిర్వాణపీఠంబు పై
రచ్చల్సేయక యార్జవంబు కుజన వ్రాతంబుచేఁ గ్రాంగి భూ
భృచ్చండాలురఁ గొల్చి వారు దనుఁ గోపింమన్ బుధుం డార్తుఁడై
చిచ్చారం జము రెల్లఁ జల్లుకొనునో శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! వివేకవంతులగు పండితులు, కవులు నిరంతరము నిన్ను సేవించుచు, నీ విమలజ్ఞానమను మోక్ష పీఠమునధిష్థించి నీ ఆదరము పొందుచుండవలెను. కాని వీరు అట్లు చేయకున్నారు. తమ పాండితీ ప్రతిభల సౌష్థవము చెడుదారిలోనికి గొనుపోవునట్లుగ దుర్జనసమూహముల చేత క్రాగిపోగా రాజులను ఛండలురను సేవించుచున్నారు. ఎన్నడు రాజులు కోపగించగా, ఎంత తప్పు చేసితిని, ఎంత కష్టపడుతున్నాను అని దుఃఖపదురు. ఇది మంటనార్పుటకు అందులో నూనె ప్రోసినట్లె. అనగా కష్టములు తీరకపోగా అవమానము మొదలైన దుఃఖములు అధిక మగును.
నీకుం గాని కవిత్వ మెవ్వరికి నేనీనంచు మీదెత్తితిన్
జేకొంటిన్ బిరుదంబు కంకణము ముంజేఁ గట్టితిం బట్టితిన్
లోకుల్ మెచ్చ వ్రతంబు నాతనువు కీలుల్ నేర్పులుం గావు ఛీ
ఛీ కాలంబులరీతి దప్పెడు జుమీ శ్రీ కాళహస్తీశ్వరా!
శ్రీ కాళహస్తీశ్వరా! నా కవిత్వము నిన్ను స్తుతించుటకే కాని మరి ఎవ్వరిని స్తుతించుటకుపయోగింపను. మరి ఎవ్వరికి అంకితమివ్వను. జనులు మెచ్చునట్లు ప్రతిజ్ఞ చేసితిని. కాని శివా నా శరీరావయవములు, శక్తి, నేర్పు, ప్రతిభ, పాండిత్యము మొదలగునవి ఆ ప్రతిజ్ఞ నిలుపుకొనుటకు చాలవేమో అనిపించుచున్నది. అన్ని అనుకూలించినను నేను నిన్ను సేవించజాలనేమొ. ఏలయన కాలములే తమ రీతిని తప్పుచున్నవి. నేను ఏమి చేయుదును. నాకోరిక తీరునట్లు నీవే అనుగ్రహించవలయును.
అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెఱింగిన్ సదా
కాంత ల్పుత్త్రులు నర్థమున్ తనువు నిక్కంబంచు మోహార్ణవ
భ్రాంతిం జెంది జరించుఁ గాని పరమార్థంబైన నీయందుఁ దాఁ
జింతాకంతయుఁ జింత నిల్పడుగదా శ్రీకాళహస్తీశ్వరా!
శ్రీకాళహస్తీశ్వరా! ఆలోచించి చూస్తే, మనుజునకు అంతా మాయే అని తెలిసినప్పటికీ, తన కాంతలు (పతులు), పుత్రులు, ధనము, శరీరములే వాస్తవము, శాశ్వతములని తలచి వానికై తపిస్తూ మోహమనెడి సముద్రంలో కొట్టుమిట్టాడుతాడేగానీ, పరమార్థము, పరమాత్మవైన నీయందు చింతాకంతైననూ ధ్యానము నిలుపజాలకున్నాడు గదా.
కొడుకుల్ పుట్టరటంచు నేడ్తురవివేకుల్ జీవనభ్రాంతులై
కొడుకుల్ పుట్టరె కౌరవేంద్రున కనేకుల్ వారిచే నేగతుల్
వడసెం బుత్రులు లేని యా శుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్ !
చెడునే మోక్షపదం బపుత్త్రకునకున్ శ్రీ కాళహస్తీశ్వరా !
ఐహికజీవనమనే మాయలో తగులుకున్న అవివేకులు తమకు పుత్ర సంతతి కలగలేదే అని చింతిస్తూ ఉంటారు. ఐతే, కౌరవ రాజగు ధృతరాష్ట్రునకు నూరుగురు పుత్రులు కలిగినా వారి వలన ఆతడు ఏ ఉత్తమలోకాలను పొందగలిగాడు? బ్రహ్మచారిగానే యుండి సంతతియే లేని శుకునకు దుర్గతి ఏమయినా కలిగిందా? పుత్రులు లేని వారికి మోక్షపదం సిద్ధించకుండా పోదుకదా శ్రీ కాళహస్తీశ్వరా !
వనరులు, బయటి లింకులు[మార్చు]
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు from నవంబర్ 2016
- తక్కువ వికీలింకులున్న వ్యాసాలు
- Articles covered by WikiProject Wikify from నవంబర్ 2016
- All articles covered by WikiProject Wikify
- Articles that link to Wikisource
- శతకాలు
- Wikipedia articles with VIAF identifiers