గోపాల శతకము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాల శతకము
కవి పేరుసత్యవోలు సోమసుందరకవి
మొదటి ప్రచురణ తేదీ1923
దేశంభారతదేశం
భాషతెలుగు
మకుటంగోపాలా!
విషయము(లు)భక్తి
పద్యం/గద్యంపద్యం
ఛందస్సుకందపద్యాలు
ప్రచురణ కర్తరావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
ప్రచురణ తేదీ1923
మొత్తం పద్యముల సంఖ్య101
అంకితంరావు గంగాధర రామారావు
ముద్రాపకుని పేరురావు వేంకటకుమార మహీపతి సూర్యారావు
ముద్రణా శాలవిద్ద్వజ్జనమనోరంజనీ ముద్రాక్షరశాల, పిఠాపురము
సత్యవోలు సోమసుందరకవి

సత్యవోలు సోమసుందరకవి కృతమైన ఈ శతకము రావుగంగాధర రామారావుకు అంకితమివ్వబడింది.[1]1923లో శ్రీ విద్వజ్జన మనోరంజనీ ముద్రాక్షరశాలలో ముద్రించబడి మాహారాజా రావు సూర్యారావుచే ప్రకటించబడింది. గోపాలా అనే మకుటంతో భక్తి ప్రధానముగా ధారాళమైన శైలి ఈ శతకంలో ఉంది.

ప్రత్యేకతలు[మార్చు]

ఇది "కవివర విశ్వంభరా రమణ నామ గుంభిత సరసవచనరచనా విచిత్ర పద్య గర్భిత కందపద్య శతకము". ఇది చిత్ర కవిత్వము.

1. మొదటి ఇరవై నాలుగు పద్యాల సమపాదాలలోని నాలుగవ అక్షరాలను కలిపి చదివితే రాజావారిని కవి ఆశీర్వదించినట్లు తెలుస్తుంది. ఆ అక్షరాల కూర్పు ఈ క్రింది కందము.

కం|| శ్రితకామిత ప్రదాయక
సతతం రేచర్లగోత్రజలధి శశాంకా
పతగాధిపవాహు డనా
రతమును మిముబ్రోచు రామరాయ మహీంద్రా!

2. తరువాతి ఇరవై పద్యాలలో ప్రతి పాదంలోని ఆరవ అక్షరము తీసి కలిపితే పండితులను పోషింపమని కవి రాజావారిని కోరినట్లు అర్థం వచ్చే ఉత్పలమాల అవుతుంది.

ఉ|| శ్రీరహిమీఱు రావుకులసింధు సుధాకర హారహీర మం
దార శతార తార దర నారద పారద కీర్తి సార స
త్కార మొసంగ పండితులకాంక్షితముల్సమకూర్పుమా లస
ద్ధీరత రామరాయ నృపతీ నమమన్మథాకృతీ

చివరి పాదములో 5వ గణము భగణము మాత్రము లోపించిననూ ఈ గర్భిత వృత్తము చక్కనిశైలితో అలంకార వైభవముతో అలరారు చున్నది.

3. మూడవ భాగములోని 21 పద్యాలలో ప్రతిపాదములోని 6వ అక్షరాన్ని కలిపితే కవి హృదయము వ్యక్తం అవుతుంది.

చం|| వనజములంచు నెంచి యెడబాయక తావక నేత్రయుగ్మమం
దనవరతంబు బ్రీతి దనరార రమాసరసీరుహాక్షి దా
ఘనతరలీల నిల్చెనది గాన భవత్కరుణాకటాక్ష వీ
క్షణముల నెల్లడం సిరులజల్లెదు ఝల్లున రామరాట్ప్రభూ!

రామరాయ ప్రభువు ఐశ్వర్యవంతుడై పండితాదిపోషణ్ చేయుటకు కారణం కవి ఇట్లూహిస్తున్నాడు. విశాలమైన రాజావారి నేత్రాలను పద్మములనుకొని పద్మనిలయ యగు లక్ష్మీదేవి దానిలో నిలిచెను. కనుకనే రామరాయ ప్రభుని కటాక్షవీక్షణములు సిరులను వెదజల్లు చుండెను. ఈ పద్యములో భ్రాంతిమదాలంకారము, అతిశయోక్త్యలంకారము, అర్థాంతరన్యాసాలంకారములు ఉన్నాయి. కమనీయమైన ఈ కల్పన గర్భిత చంపకము చేయుట కవి ప్రతిభను చాటుచున్నది.

4. నాలుగవ భాగములోని 20 పద్యాలలో ప్రతిపాదపంచమాక్షరములను కలిపి చూస్తే తనను పోషింపమని రాజావారిని వేడుచు, ప్రభువుకు శ్రీరంగనాయకులు శుభములు కల్గించుగాక అని కవి ఆశీర్వదించిన భావము వస్తుంది.

5. ఐదవ భాగములో కవి తన పేరు నిక్షిప్తాక్షరాలలో తెలుపుతాడు.

6. శతకాంతములోని ఐదు పద్యాలలో గర్భితార్థము "దీనజనపోషకా మాన్యం దయచేసి పోషింపుమని కోరిక అని కలదు.

మచ్చుతునక[మార్చు]

ఈ శతకములోని ఒక పద్యము

కం. శాంతా షడ్జ స్వరను
స్వాంతా దగురీతి గీత సరస్ కవితలన్
సంతోషించి నుతింతు ని
తాంత రిమపథ ససమేళ తతి గోపాలా!

మూలాలు[మార్చు]

  1. పిఠాపుర సంస్థానము - కవిపండితపోషణ -పి.హెచ్.డి.సిద్ధాంత గ్రంథము - సి.కమలా అనార్కలి-1973