చక్కట్ల దండ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చక్కట్ల దండ ఒక అచ్చ తెలుగు పద్య శతకం. చక్కట్లు అంటే 'లౌకికనీతులు'; దండ అనగా 'మాలిక'. కావున చక్కట్ల దండ అనగా 'లౌకిక నీతిమాలిక' యను నర్ధమిచ్చుచున్నది. ఇందు నూరు సీసపద్యములు ఉన్నాయి. ప్రతి పద్యము చివర రెండు గీతచరణములు మకుటముగా అన్ని పద్యములకు చివర వర్తిస్తాయి. ఆ మకుటం యేదనగా "అనిపలుకు దాసు రాముడిట్లచ్చ తెనుఁగు | కబ్బమందము నిండ జక్కట్ల దండ|". ఈ పద్య శతక రచయత మహాకవి దాసు శ్రీరాములు. మకుటమును ఇష్టదేవతా పరముగానో, గురువు మున్నగువారి పరముగానో కాకుండా ఆత్మసంబోధనాపరముగా ఉపయోగించారు.[1]

డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు తమ పీఠికలో "నీతి పద్యాల్లో సువతీశతకం మకటాయమానమైనది; వేమన పద్యాలు అత్యంత సుందరాలు. అయితే సామాజిక పరిస్థితులను బట్టి అనేక నీతి పద్యాల శతకాలూ (విశేషించి సీసపద్య శతకాలు) సంపుటులూ వెలువడ్డాయి. చక్కట్ల దండ ఒక చక్కని పద్య శతకం" అని వ్రాసారు. ఇది జయసంవత్సర శ్రావణశుద్ధ ప్రతివత్తు నాడారంభింపబడి శ్రావణ బహుళ పంచమీ జయవాసరమునాటి రెండుజాముల పగలింట ముగింపబడినది. హూణశకము 1894వ సంవత్సరము ఆగస్టు నెలలో పూర్తి అయినదని కవి ప్రస్తావించారు.. దీనికి చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఈ విధంగా వ్యాఖ్యానించారు - జయ సంవత్సరం (గెలుపు సాలున) వర్షర్తవునందు (వానకారు) శ్రావణమాసంలో (మింటి నెలయందు) కృష్ణపక్షంలో (వన్నెతగ్గెడినాళ్లు) పంచమినాడు (పడగ తాల్పెడి రోజు) అశ్వనీ నక్షత్రమందు. (జేజేల వెజ్జులు) వృశ్చికలగ్నంలో (చెలగిన తేలు) అనగా అపహార్ణం 3-00 గంటలకు ఇది పూర్తి అయింది.

విశేషాలు[మార్చు]

శతక పద్య కావ్యం

ఈ చిన్న గ్రంధము లోని విశేషములు చివర పద్యములలో అగుపడుతాయి. 98 సీసమువలన కవిగ్రంధ సమాప్తి నొందించిన కాలము తెలియును. 99వ సీసము వలన గ్రామము తెలియును. 88వ సీసము రెండర్థములు కలదిగా నున్నది. మొదటి యర్ధము వలన నీతియు రెండవ యర్ధము వలన గ్రంథసమాప్తి జేసిన కాలమును దెలియును. ఈ రెండర్థములును అందరికి సులభముగా తెలియు చేయుటకొరకు చివర పట్టిక ఇచ్చారు.

పదము నీతినిఁ దెలుపు నర్థము కవి గ్రంధసమాప్తిజేసిన

కాలమునుఁ దెలుపునర్ధము

గెలుపుసాలు జయకరమగుసంవత్సరము జయవత్సరము
వానకారు వానలుగురియు కాలము వర్షాకాలము
మింటినెల ఆకాశమునందలి చంద్రుడు నభోమాసము అనగా

శ్రావణ మాసము

వన్నె తగ్గేడినాళ్ళ కళలు క్షీణించు దినముల

యందు

బహుళ పక్షమందు
పడగదాల్పెడిరోజు ధ్వజమెత్తు దినము

మంగళకరదినము

సర్పతిధి అనగా పంచమి
పుడమి బుట్టిన

యొక్కడు

భూమియందు

బుట్టిన యొకానొకడు

భూమియందుబుట్టినకుజుడు

అనగా మంగళవారము

జేజేల వెజ్జులు దేవతావై ద్యులు అశ్వనీనక్షత్రము
చెలఁగినతేలు చెలరేగిన వృశ్చికముు వృశ్చిక రాశి అనగా

ఆనాడు మూడుగంటలకు

కవి ధారాశుద్ధి, హాస్యప్రియత్వంను పట్టిఇచ్చే ఒకటి రెండు పద్యాలు డాక్టర్ చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు ఉదహరించారు .

కురియక కురియక కురిసెనా మొయివారి
     యెడవాన పొలమెల్ల యెద్దుకన్ను
కాయక కాయక కాచె నా తరం బూచి
      గున్న మామిడి కొమ్మ కోటివేలు
      
పొరుగు వారికి మేలు పొందరాదందువా
       ఇరుగువారికి నీవ పొరుగువాఁడు
ఇరుగు వారికి మేలు పొందరాదందువా
        పొరుగు వారికి నీవ ఇరుగువాఁడు

వేదు రెత్తినకుక్క వేఁటకై కొనిపోవ
      కట్టి పెంచిన వాని కాలుఁ గఱచు
తేలుకుట్టినవాని మేలె న పల్లకి
      మీఁద నెక్కించిన బాద లేదే

దీని ప్రధమ ముద్రణ 1930లో జరిగింది, 1984లో మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి, హైదరాబాద్ ద్వితీయ ముద్రణ కావించింది.[2] ఈ పద్య శతక కావ్యాన్ని ఆంధ్ర విశ్వకళా పరిషత్ ఉపన్యాసకులు డా. చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు డా. దాశరధి అధ్యక్షతన జరిగిన సభలో ఆవిష్కరించారు. ఈ పుస్తకము గురించి శాస్త్రిగారు "ఈ నీతి శతకములో మానవ ప్రవర్తనల పట్ల వారికున్న నిర్దిష్టమైన అభిప్రాయాలకు నిదర్శనమని" పుస్తక ఆవిష్కరణ ఉపన్యాసములో పేర్కొన్నారు.[3]

ప్రస్తావనలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. వైదేహి, వెలగపూడి (2013). "చక్కట్ల దండ". మహాకవి దాసు శ్రీరాములు గారి కృతులు; ఒక సమీక్ష (2 ed.). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.
  2. శ్రీరాములు, దాసు (1984) [1934]. చక్కట్ల దండ (2 ed.). హైదరాబాద్: మహాకవి దాసు శ్రీరాములు స్మారక సమితి.
  3. "దాసు శ్రీరాములు రచనల ఆవిష్కరణ". ఉదయం. 19 August 1986.