తెలుగు లిపి
తెలుగు లిపి ఇతర భారతీయ భాష లిపుల లాగే ప్రాచీన దక్షిణ బ్రాహ్మీ లిపినుండి ఉద్భవించింది.[1] అశోకుని కాలంలో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. దక్షిణ భారతదేశములో బ్రాహ్మీ లిపిలో వ్రాసిన శాసనాలు మొదట భట్టిప్రోలులో దొరికాయి. అక్కడి బౌద్ధ స్తూపములో దొరికిన ధాతుకరండముపై మౌర్య కాలపు బ్రాహ్మీ లిపిని పోలిన లిపిలో అక్షరాలున్నాయి.[2] ఈ లిపిని భాషాకారులు భట్టిప్రోలు లిపి అంటారు. దక్షిణ భారతదేశ లిపులన్నియూ ఈ లిపినుండే పరిణామము చెందాయి.[3]
ఆవిర్భావం
[మార్చు]తీరాంధ్రప్రాంతము, కృష్ణా నదీ తీరాన ఉన్న భట్టిప్రోలు గ్రామమందు క్రీ. పూ. 5వ శతాబ్దములో గొప్ప బౌద్ధస్తూపము నిర్మించబడినది.[4] ఆ సమయములో బౌద్ధమతముతో బాటు మౌర్యుల కాలములో వాడుకలో నున్న బ్రాహ్మీ లిపి కూడా అచటకు చేరినది.[5] ఈ లిపి దగ్గరలోనున్న ఘంటసాల, మచిలీపట్నం రేవుల నుంచి ఇతర దేశాలకు కూడా చేరి అక్కడి లిపుల ఆవిర్భామునకు కారణభూతమయింది.[6][7] సా.శ. ఐదవ శతాబ్దము నాటికి భట్టిప్రోలు లిపి పాత తెలుగు లిపిగా పరిణామము చెందింది.[8][9][10][11][12][13]
తెలుగున నన్నయ్య కావ్యవ్యాకరణచ్చంద సంప్రదాయములకేకాక, తెలుగు లిపి సౌందర్యము నావిష్కరించుటయందు ప్రథమాచార్యుడు. నన్నయకు పూర్వము తెలుగు కన్నడభాషలకు ఒకే లిపి ఉండేది. దానిని వేంగీచాళుక్య లిపి అని దానిపేరు.నన్నయకు ముందు శాసనాలన్నీ వేంగీచాళుక్య లిపిలోనే వ్రాయబడినవి. ఆ లిపి చతురస్రముగాను, తలకట్లు గీతలకొరకు గంటము వ్రాతకు సాధనముగా ఏర్పడినది. తాటాకుపైనగాని గంటముతో వ్రాయునప్పుడు తలకట్లు అడ్డుగీతలుగా వ్రాసిన తాటాకు చినిగిపోవును. తలకట్టు-అనగా ఆకారమునకేగాక, ఆ దీర్ఘము వ్రాయవలసివచ్చినప్పుడు, ఆ దీర్ఘమును ఇప్పటివలె ా వ్రాయక --- అని నిలువుగీతగా రాసేవారు. ఒ కార చిహ్నమగు కొమ్ము ొ ా అని గీతగానే ఉండేది. -జ్క, ణ్బ, న + తవత్తు, ం + ప వత్తు, ఞ + చ వత్తు -అను రీతిగా వ్రాసెడివారు. ఇట్టివి తాటియాకుపైన వ్రాయుట కష్టసాధ్యము.
నన్నయ వీటిని పరిశీలించి, తెలుగు లిపిని చతురస్ర స్వరూపమునుండి గుండ్రదనమునకు మార్పు చేసి పలు మార్పులు చేసాడు. అవే తలకట్టునకు ా గాక ప్రస్తుత తలకట్టు లాగా, కొమ్ముల మార్పు ప్రస్తుత వరుసగా, ర్గ సంయుక్తాక్షరములు అనునవి పంకచంక-ఖండ-నంద-డింబ-అనురీతి పూర్ణబిందువులుగా వ్రాయుట, రకార సంయుక్తాక్షరములను ర్క, ర్త, ర్చ మొదలగునవి అర్క-అక౯, కర్త-కత౯, కర్చ-కచ౯ గా వ్రాయుట మొదలుచేసాడు. ౯ ఈ చిహ్నమునకే వలపలగిలక అని పేరు. ఈ వలపలగిలక వలన రకార సంయుక్తాక్షరములుగా నుండక ఏకాక్షరములుగా ఉండును. ఇందువలన లిపికి సమత ఏర్పడినది, అంతకుముందున్న ఒక అక్షరము శకటరేఫముకన్నా భిన్నమైనది, ష్జగా పలుకునదానిని "డ"గా మార్చాడు. ఈ మార్పుల వలన తెలుగు లిపికి గుండ్రనిదనము, సౌందర్యము చేకూరినవి. తెలుగులిపినందు ఈమార్పులు చేయుటయేకాక నన్నయ, తాను వ్రాసిన నందంపూడి శాసనము లో తాను ప్రతిపాదించిన సంస్కరణలిపిని ప్రవేశపెట్టి - ఆవెనుక తాను వ్రాసిన మహా భారతమును ఆ లిపిలోనే వ్రాసినాడు. తెలుగు అక్షరములకు అంతకుముందులేని రమ్యతను-లేక మనోహరత్వమును తాను ప్రతిపాదించుటచేత - నన్నయ తెలుగులిపి సౌందర్యమును వ్యక్తపరిచాడు. అర్ధ ముక్తి శబ్ద సంబంధమైనది అక్షర రమ్యత లిపి సంబంధమైనది-రెండింటి సమ్మేళనము నన్నయ కవితలో
మౌర్యులకాలపు (క్రీ.పూ. 3వ శతాబ్ది) బ్రాహ్మీలిపి పట్టికలోని రెండవ వరుసలో ఇవ్వబడింది. అటు పిమ్మట భట్టిప్రోలు ధాతుకరండముపై కొద్దిమార్పులుగల బ్రాహ్మీలిపి మూడవ వరుసలో చూడవచ్చును.
తెలుగు శాసనములు
[మార్చు]శాతవాహనుల శాసనములు
[మార్చు]శాతవాహనుల శాసనములలోని (క్రీ. శ. 1వ శతాబ్ది) భట్టిప్రోలు లిపి పరిణామము 4వ వరుసలో ఇవ్వబడింది.
ఇక్ష్వాకుల శాసనములు
[మార్చు]సా. శ. 218 లో శాతవాహనుల సామంతులు ఇక్ష్వాకులు స్వతంత్రులైరి. వారికాలమునాటి లిపి 5వ వరుసలో గలదు.
శాలంకాయన నందివర్మ శాసనము
[మార్చు]ఇక్ష్వాకుల తరువాత శాలంకాయనులు ఆంధ్ర దేశాన్ని క్రీ. శ. 300 నుండి 420 వరకు పాలించారు. శాలంకాయనుల రాజధాని వేంగి. ఆకాలమునాటి లిపి 7వ వరుసలోనున్నది. ఈ కాలములోనే తెలుగు లిపి మిగిలిన దక్షిణ భారత, ఉత్తర భారత లిపులనుండి వేరుపడుట ప్రారంభమయింది. క్రీ. శ. 420-611 మధ్యకాలములో విష్ణుకుండినులు వినుకొండ రాజధానిగా పరిపాలించారు.
విష్ణుకుండిన శాసనములు
[మార్చు]విష్ఱుకుండినుల కాలంనాటి 5వ శతాబ్ది తెలుగు శాసనం ‘తొలుచువాన్డ్రు’ను కీసరగుట్టలో పురావస్తుశాఖ గుర్తించింది(1987 పురావస్తుశాఖ నివేదిక). ఇంత స్పష్టంగా వాడుక తెలుగులో చెక్కిన శాసనమేదీ అంతకు ముందు లభించలేదు. ఇదే తెలుగులో మొదటి శాసనం.
విష్ణుకుండినుల పరిపాలనాకాలములో భాషల వాడుకలో, వ్రాతలో పలుమార్పులు వచ్చాయి. ప్రాకృతము బదులు సంస్కృతము వాడుట ఎక్కువయ్యింది. అదేసమయములో రాయలసీమను పాలించిన రేనాటి చోళులు రాజశాసనములు తెలుగులో వ్రాయించారు. మనకు దొరికిన వారి మొదటి శాసనము క్రీ. శ. 573 నాటిది. తీరాంధ్రప్రాంతంలో దొరికిన క్రీ. శ. 633 నాటి శాసనము మొదటిది. అప్పటినుండి తెలుగు వాడకము బాగా ఎక్కువయింది.
పల్లవ నరసింహవర్మ శాసనము
[మార్చు]శాతవాహనులకు సామంతులుగానున్న పల్లవులు మొదట పల్నాడులో స్వతంత్రులై పిమ్మట ఉత్తర తమిళదేశములోని కంచిలో స్థిరపడ్డారు. తొలుత దొరికిన శాసనములు తమిళములో ఉన్నా, పిమ్మట పల్లవులు సంస్కృతమును, భారవి, దండి లాంటి సంస్కృత కవులను ఆదరించారు. శాసనాలు "పల్లవ గ్రంథం" అనబడు లిపిలో వ్రాయించారు. 8వ వరుసలో ఈ లిపిని చూడవచ్చును. ఆధునిక తమిళ లిపి దీనినుండే పరిణామము చెందింది.
పరిణామము
[మార్చు]భాషాపరంగా కన్నడ తమిళ భాషలు దక్షిణ ద్రావిడ కుటుంబానికి చెందినవి. కాని, చారిత్రకంగా ఆంధ్ర శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటులు ఆంధ్ర కర్నాట దేశాలను పాలించడంవల్ల తెలుగు, కన్నడ భాషల లిపి ఉమ్మడిగా పరిణామము చెందింది. శాతవాహనుల కాలములోనే భట్టిప్రోలు లిపి కర్ణాట దేశానికి వ్యాప్తి చెందింది. ఆంధ్రదేశము, వేంగీ విషయము, కమ్మనాడు, పుంగనూరు వాస్తవ్యుడైన పంప అనే బ్రాహ్మణపండితుడు జైనమతావలంబియై వేములవాడను పాలించిన అరికేసరి అను చాళుక్య రాజు ఆశ్రయముపొంది విక్రమార్కవిజయము అనబడు తొలి కన్నడ గ్రంథము వ్రాశాడు. తెలుగు కన్నడ లిపులు ముడిపడి ఉండడానికి ఇలాంటి కారణాలు కొన్నిఉన్నాయి. వరుసలు 9, 10, 11 చాళుక్యుల కాలము (7, 10, 11వ శతాబ్దములు) నాటి లిపులను సూచిస్తునాయి. 10, 11 వరుసలలోని లిపిని వేంగీలిపి అనికూడ అంటారు. 12వ వరుసలో కాకతీయుల కాలమునాటి లిపిచూడవచ్చు. ఈ కాలములో తెలుగు భాష, సాహిత్యములు ప్రజ్వరిల్లాయి. 13, 14 వరుసలలో మహాకవి శ్రీనాథుని కాలము నాటి లిపి, చివరి వరుసలో విజయనగరకాలము నాటి తెలుగు-కన్నడ ఉమ్మడి లిపి చూడవచ్చు. అధునిక తెలుగు లిపికిది చివరి పరిణామదశ.
బెంజమిన్ షుల్జ్ అను మతప్రచారకుని మూలముగ క్రైస్తవ సాహిత్యము జర్మనీ దేశమందు తెలుగులిపిలో ప్రచురించబడింది. బ్రౌను దొర తెలుగు పుస్తకముల ప్రచురణకు చాల కృషిచేశాడు. 20వ శతాబ్ది మధ్యలో తెలుగు గొలుసుకట్టు పద్ధతిలో (ఆంగ్లమువలె) కూడా వ్రాయబడింది. కాని అది ప్రాచుర్యము చెందలేదు.
మూలాలు
[మార్చు]- ↑ తెలుగు లిపి; http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf Archived 2007-09-26 at the Wayback Machine
- ↑ ఆనంద బుద్ధ విహార;http://www.buddhavihara.in/ancient.htm Archived 2007-09-30 at the Wayback Machine
- ↑ The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire; http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm Archived 2007-03-26 at the Wayback Machine
- ↑ The History of Andhras, Durga Prasad; http://igmlnet.uohyd.ernet.in:8000/gw_44_5/hi-res/hcu_images/G2.pdf Archived 2007-03-13 at the Wayback Machine
- ↑ "Ananda Buddha Vihara". Archived from the original on 2007-09-30. Retrieved 2008-03-30.
- ↑ థాయ్ లిపి ఆవిర్భావ వివరాలు
- ↑ భాష ఆవిర్భావ వివరాలు[permanent dead link]
- ↑ The Blackwell Encyclopedia of Writing Systems by Florian Coulmas, p. 228
- ↑ Vishwabharath by K. N. Murthy and G. U. Rao, http://tdil.mit.gov.in/TelugulScriptDetailsApr02.pdf Archived 2007-09-26 at the Wayback Machine
- ↑ Indiain Epigraphy: a guide to the study of inscriptions in Sanskrit, Prakrit, and the other Indo-Aryan languages, by Richard Solomon, Oxford University Press, 1998, p.40, ISBN 0-19-509984-2
- ↑ Indian Epigraphy by Dineschandra Sircar, Motilal Banarsidass, 1996, p.46, ISBN 81-208-1166-6
- ↑ The Dravidian Languages by Bhadriraju Krishnamurti, 2003, Cambridge University Press, pp.78-79, ISBN 0-521-77111-0
- ↑ K. Raghunath Bhat, http://ignca.gov.in/nl001809.htm Archived 2007-09-27 at the Wayback Machine
వనరులు
[మార్చు]- ఇవల్యూషన్ ఆఫ్ తెలుగు కారక్టర్ గ్రాఫ్స్: https://web.archive.org/web/20090923234606/http://www.engr.mun.ca/~adluri/telugu/language/script/script1d.html
- తిరుమల రామచంద్ర (1916-1997). "మన లిపి పుట్టు పూర్వోత్తరాలు"
- పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి (1890-1951). "ఆంధ్ర లిపి పరిణామం"
- ఏటుకూరు బలరామమూర్తి, 1953, "ఆంధ్ర సంక్షిప్త చరిత్ర," ప్రచురణ: విశాలాంధ్ర.
- 1971 భారతి మాస పత్రిక- వ్యాసము -తెలుగు లిపి-వ్యాస కర్త-నిడదవోలు వేంకటరావు.
బయటి లింకులు
[మార్చు]- Useful and authenticated information about Telugu Archived 2010-04-12 at the Wayback Machine
- Telugu Association Inc. Sydney Australia. Celebration of Telugu Culture in Sydney Archived 2014-09-07 at the Wayback Machine
- Omniglot - Telugu script
- PROEL - Telugu script compared with other Dravidian scripts
- Vignanam - Learn Something Today Archived 2021-01-16 at the Wayback Machine