భట్టిప్రోలు లిపి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగులిపిపరిణామ క్రమంలో భట్టిప్రోలు లిపి

తెలుగు లిపి పరిణామక్రమంలో ప్రధానమైన ఆనవాలు దక్షిణ భారతదేశమందలి తెలుగునాడులో కృష్ణానదీమైదానంలో సముద్రతీరానికి సమీపములో గల గ్రామము భట్టిప్రోలులో లభించిన బౌద్ధస్థూపము వలన తెలుస్తున్నది.

చరిత్ర[మార్చు]

ప్రతీపాలపురం, ప్రితుడనగరం, పిటిండ్రలు భట్టిప్రోలుకు నామాంతరాలని చరిత్రకారుల అభిప్రాయం. క్రీ. శ. 8వ శతాబ్దివాడయిన జైనకవి నయసేనాని వ్రాసిన 'ధర్మామృత' కావ్యములో ప్రతీపాలపుర ప్రసక్తి ఉంది. ఇది క్రీ. పూ. 5వ శతాబ్దిలో జరిగిన కథ. ఇక్ష్వాకు రాకుమారుడైన యశోధరుడు దక్షిణదేశానికి వలస వచ్చి ప్రతీపాలపురం రాజధానిగా పాలన చేశాడు. ఈతని వారసుడు ధనదుడు జైన మతము వదిలి బౌద్ధురాలైన కమలశ్రీని పెళ్ళి చేసుకుంటాడు. ఈ కథే బృహత్కథాకోశములో కూడా ఉంది. ధనదుడు తన పేర ధనదపురం నిర్మించాడనీ, అదే నేటి చందోలు అని చరిత్రకారుల అభిప్రాయం. భట్టిప్రోలులో లభించిన శాసనాలలో 'కుబీరక' రాజు ప్రసక్తి ఉంది. కుభీరక, కుబేర ధనదుడి నామాంతరాలు. జైనరాజగు ఖారవేలుడు పితుడ్రనగరం బౌద్ధక్షేత్రాన్ని గాడిదలతో దున్నించి నాశనం చేశాడని ఖారవేలుని శాసనాలలో చెప్పబడింది. ఆ శాసనాలలోని పితుడ్రనగరం భట్టిప్రోలేనని చరిత్రకారులు భావిస్తున్నారు.[1]

బౌద్ధస్తూపము[మార్చు]

తెలుగుదేశ చరిత్రలో ప్రాచీనాంధ్ర నగరమయిన భట్టిప్రోలుది విశిష్టస్థానం[2]. ప్రపంచ బౌద్ధారామాలలో ప్రముఖ చరిత్ర గలిగినదిగా కీర్తించబడిన బృహత్ స్తూపం ఇక్కడ ఉన్నది[3]. క్రీ. పూ. 4-3 శతాబ్దాల నాటి ఈ స్తూపం భవననిర్మాణ రీతులలోని ప్రథమ దశలను ప్రతిబింబిస్తుంది. ఇక్కడ లభించిన శాసనాలు ప్రజాస్వామిక విలువలకు నెలవైన గణతంత్ర రాజ్యంగా భట్టిప్రోలు ఉనికిని బలపరుస్తున్నాయి[4]. గౌతమ బుద్ధుడు, జైన తీర్థంకరుడైన మహావీరుడు ఈ ప్రాంతాన్ని దర్శించారన్న అభిప్రాయం చరిత్రకారులలో ప్రబలంగా ఉంది[5][6].

భట్టిప్రోలు స్తూపము ధాతుగర్భము. అనగా బుద్ధుని ధాతువులపై నిర్మించబడింది. శాసనాలలోని 'బుధ శరీరాని నిఖేతుం', 'బుధ శరీరాని మహనీయాని కమ్మనే' అనే వాక్యాలనుబట్టి స్తూపం యదార్ధమయిన బుద్ధ ధాతువుపై నిర్మించబడినట్లు స్పష్టం. స్తూపం మధ్య అమూలాగ్రంగా రంధ్రం ఉంది. రంధ్రము చుట్టూ ఇటుకలను పద్మాకారములో అమర్చారు. రంధ్రంలో స్తూపాగ్రాన ఉండే ఛత్రపుకాడను అమర్చారు. రంధ్రముగుండా మూడు బండరాతి పేటికలు (శిలా మంజూషికలు) లభించాయి.

లిపి[మార్చు]

భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని తెలుగు శాసనములు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై )

తెలుగు దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు.[7][8]

స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును,[9]. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.[10][11].

శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. అశోకుని శాసనాలలో కన్పించని "ళ" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు

మూలాలు[మార్చు]

 1. సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి మొదటి భాగం - ముప్పాళ్ళ హనుమంతరావు పేజీ.417 ఏ.బి.ఎస్.పబ్లిషర్స్ రాజమండ్రి
 2. శాతవాహన పూర్వయుగపు స్థావరాలు: చారిత్రక నేపథ్యం, పి. ఆర్. కె. ప్రసాద్, 2004, గుంటూరు జిల్లా సమగ్ర చరిత్ర, గుంటూరు జిల్లా చరిత్ర సంఘం, గుంటూరు
 3. The Buddhist Architecture in Andhra, D. J. Das, 1993, Books and Books, New Delhi
 4. భట్టిప్రోలు స్తూపము: వాస్తువు, బ్రాహ్మీ శాసనములు, ప్రాక్తెలుగు, కార్తికేయ శర్మ, 1986, భారతి, అక్టోబరు సంచిక
 5. Buddha's Preaching of the Kalachakra Tantra at the Stupa of Dhanyakataka, H. Hoffman, in: German Scholars on India, Vol. I, 1973, PP. 136-140, Varanasi
 6. Taranatha; http://www.kalacakra.org/history/khistor2.htm
 7. The Bhattiprolu Inscriptions, G. Buhler, 1894, Epigraphica Indica, Vol.2
 8. Buddhist Inscriptions of Andhradesa, Dr. B.S.L Hanumantha Rao, 1998, Ananda Buddha Vihara Trust, సికింద్రాబాద్
 9. Antiquity of Telugu language and script: http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm
 10. Ananda Buddha Vihara
 11. The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire

ఇవి కూడా చూడండి[మార్చు]