తెలుగు వికీపీడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Favicon of Wikipedia తెలుగు వికీపీడియా
Wikipedia-logo-v2-te.png
TeluguWikipediaFirstPage9Feb2012.png
తెలుగు వికీపీడియా మొదటి పేజి తెరపట్టు (9 ఫిభ్రవరి2012న)
వెబ్ చిరునామాte.wikipedia.org
నినాదంస్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము
వాణిజ్యపరమా?కాదు
రకంవిజ్ఞానసర్వస్వం
నమోదుఐచ్ఛికం
దొరకు భాష(లు)తెలుగు
విషయం లైసెన్స్CC-BY-SA
యజమానివికీమీడియా ఫౌండేషన్
ప్రారంభండిసెంబరు 10, 2003; 16 సంవత్సరాలు క్రితం (2003-12-10)
ప్రస్తుత స్థితిఆన్లైన్
అంతర్జాల తెలుగు భాషాభిమానులు - హైదరాబాదు లో తెలుగు వికీ పీడియన్లు, బ్లాగర్ల సమావేశం - ఈనాడు ఆదివారం అనుబంధం పత్రికలో [1] వచ్చింది. (మధ్యలో తెలుగుతల్లి విగ్రహ చిత్రం పత్రిక వారు గ్రాఫిక్స్ ద్వారా సంకేత సూచకంగా కూర్చారు.)

2001, జనవరి 15న మొట్టమొదటగా ఆంగ్ల భాషలో వికీపీడియా అనే విజ్ఞానసర్వస్వం జాలస్థలిని జిమ్మీ వేల్స్, లారీ సాంగెర్ ఆరంభించారు. స్వచ్ఛందంగా ఎవరికి వారు తమకు తెలిసిన సమాచారాన్ని ఒక చోట చేర్చగలగటం, మార్చగలగటం అనే ఊహకు రూపమే ఇది. అంతర్జాలంలో ప్రజాదరణ పొందిన వెబ్ సైట్లలో 2017 లో ఈ వెబ్సైట్ 5వ స్థానంలో ఉంది. 2020లో 2వ స్థానంలో ఉంది.

ప్రపంచ నలుమూలల నుండి సమాచారం సేకరించడం, భద్రపరచడం సాధ్యమైన కార్యమేనని రుజువు కావడంతో తరువాతి దశలలో ప్రపంచ భాషలన్నిటిలో ఆయా భాషాభిమానుల కృషితో వికీపీడియా అభివృద్ధి పథంలో నడవటం మొదలైంది. దానిలో ఒక భాగమే వెన్న నాగార్జున కృషితో 2003 డిసెంబరు 10 న Hఆవిర్భవించిన తెలుగు వికీపీడియా (తెవికీ). దీనిలో చాలామంది సభ్యులై అభివృద్ధి పథంలో నడిపించారు. తెలుగు వికీపీడియా మొదటిపేజీ వివిధ రకాల శీర్షికలతో అందరినీ ఆకట్టుకొనేటట్లుగా ఉంటుంది. తెలుగు వికీపీడియాలో ఉన్న మంచి వ్యాసాలను వెలికితీసి, పదిమందికీ చూపించాలనే లక్ష్యంతో విశేష వ్యాసం అనే శీర్షికతో అప్పుడప్పుడు మొదటిపేజీలో మంచి వ్యాసాన్ని ప్రదర్శించేవారు. 2005 నవంబరు 14న గోదావరి వ్యాసంతో విశేష వ్యాసాల పరంపర మొదలయింది. ఈ ప్రక్రియ తరువాత "ఈ వారపు వ్యాసాలు"గా మారింది. 2007- 23 వారంలో (జూన్) మొదటిగా సుడోకు వ్యాసం ఈ వారం వ్యాసంగా ప్రదర్శించబడింది.

2011 లో ఆంగ్ల వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి. వాటిలో క్రియాశీలంగా ఉన్న ఎక్కువ మంది తెలుగు వికీ ప్రాజెక్టుల సభ్యులు ముఖాముఖిగా కలుసుకొని వివిధ అంశాలపై చర్చించారు. వికీపీడియాలో అనేక మార్పులతో పాటు, సాంకేతికాభివృద్ధి కారణంగా ఆధునిక స్మార్ట్ ఫోన్లకు తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది.

వికీపీడియా సంస్థాగత రూపంలో సాధారణ సభ్యులతో పాటు సభ్యులచే ఎన్నుకోబడిన నిర్వాహకులు, అధికారులుంటారు. కొత్త సభ్యులకు వికీ గురించి నేర్చుకునేందుకు పాఠాలు, సహాయాలు, ప్రోత్సాహకాలు ఉంటాయి. 2011-2019 కాలంలో వికీమీడియా భారతదేశం చాప్టర్, సిఐఎస్-ఎ2కే సంస్థలు వికీపీడియా అవగాహన సదస్సుల ద్వారా వికీపీడియాని అభివృద్ధి పరచటానికి సహాయం చేశాయి.

తెలుగు వికీపీడియా ఆవిర్భావం[మార్చు]

వెన్న నాగార్జున

బోస్టన్ నగరంలో సమాచార సాంకేతిక నిపుణుడిగా పనిచేస్తున్న వెన్న నాగార్జున తెలుగు వీకీపీడియాకు శ్రీకారం చుట్టాడు. ఈయన రూపొందించిన పద్మ అనే లిప్యాంతరీకరణ పరికరం (ఇది ఇంగ్లీషు కీబోర్డ్ తో తెలుగు వ్రాసే తెలుగు భాషా అనువాద పరికరం) నెట్ లో తెలుగు సమాచార అభివృద్ధికి ఒక మైలురాయి. ఇది క్రమంగా తెలుగు భాషాభిమానులను విశేషంగా ఆకర్షించింది. పద్మ అనే లిప్యంతరీకరణ పరికరం సృష్టితో వెలుగులోకి వచ్చిన నాగార్జునకి వికీ నిర్వాహకులలో ఒకరైన విలియంసన్ పంపిన విద్యుల్లేఖ (టపా) తెలుగు వీకీపీడియా ఆవిర్భావానికి నాంది పలికింది. ఆసక్తి ఉండి నిర్వహిస్తామని నమ్మకం ఉంటే తెలుగు వికీపీడియాను రూపొందించి ఇస్తామని దాని సారాంశం. దానిని సవాలుగా తీసుకొని నాగార్జున అనుకూలంగా స్పందించాడు. ఈ విధంగా తెవికీ 2003 డిసెంబరు 10న[2] ఆవిర్భవించింది. తెలుగు వికీపీడియా మొదటి చిహ్నాన్ని (లోగోని) రూపొందించిన ఘనత ఆయనదే.

తెలుగు వికీపీడియా అభివృద్ధి[మార్చు]

2003 డిసెంబరులో ఆరంభించిన తెవికీలో 2004 ఆగస్టు వరకూ ఒక్క వ్యాసం కూడా నమోదు కాలేదు. తన తరువాతి ప్రయత్నాలలో ఒక భాగంగా నాగార్జున రచ్చబండ వంటి తెలుగు సమాచార సమూహములలో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఆయన ప్రయత్నం సక్రమ ఫలితాలను ఇవ్వడం ప్రారంభించింది. రావు వేమూరి, మిచిగాన్ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా బాధ్యతను నిర్వహిస్తున్న కట్టా మూర్తి లాంటి విద్యాధికులు స్పందించారు. అయ్యలరాజు నారాయణామాత్యుడు రచించిన హంసవింశతి గ్రంథం, శ్రీకృష్ణదేవరాయల ఆముక్తమాల్యదలో రాయలవారు వర్ణించిన ఊరగాయ రుచులను ఆధారంగా వ్రాసిన ఊరగాయ వ్యాసం (నెట్) వాడుకరులను తెలుగు వికీపీడియా వైపు అడుగులు వేసేలా చేసింది. ఆ తరువాత వాకా కిరణ్, చావాకిరణ్‌, వైజాసత్య, మాకినేని ప్రదీపు, చదువరి మొదలైన వారి విశేష కృషితో మరింత ముందుకు సాగింది.

2005లో జూలైలో వైజాసత్య, చదువరి కృషితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలు, మండలాల గురించిన సమాచారం తెలుగులో చూసుకొనగలిగిన అవకాశం పాఠకులకు కలిగింది. ఈ ప్రాజెక్టులో బాటు (ఆటోమేటిక్ ప్రోగ్రాం స్క్రిప్ట్)లను తయారుచేసి మ్యాపులతో పేజీలను సిద్ధం చేయడంలో మాకినేని ప్రదీప్ కృషి గుర్తింపదగినది. 2005 సెప్టెంబరులో విశేషవ్యాసం, మీకు తెలుసా, చరిత్రలో ఈ రోజు శీర్షికల [3] ప్రారంభమైంది.

ఆ తరువాత వీవెన్ కృషితో తెవికీ రూపురేఖలు సుందరంగా తయారైంది. బ్లాగర్ల సాయంతో వైజాసత్యతో చేతులు కలిపిన కాజా సుధాకరబాబు, చిట్టెల్ల కామేశ్వరరావు, దాట్ల శ్రీనివాస్, నవీన్ మొదలైన వారికృషితో తెలుగు చిత్రరంగ వ్యాసాలు మొదలయ్యాయి. బ్లాగేశ్వరుడు, విశ్వనాధ్ పుణ్యక్షేత్రాల వ్యాసాలను రూపొందించడంలో కృషి చేశారు. రాజశేఖర్, వందన శేషగిరిరావు వంటి వైద్యులు వ్యాధులు, మానవశరీరం వంటి వ్యాసాలలో తమవంతు కృషి అందించారు. చంద్ర కాంత రావు కృషి ఆర్థిక శాస్త్రం, క్రీడారంగం వ్యాసాలను అందించడానికి దోహదమైంది. విక్షనరీలో విశేషంగా కృషి చేసిన టి.సుజాత తెవికీలో కూడా ప్రపంచ ప్రసిద్ధ నగరాలు, వంటకాల వ్యాసాలపై కృషి చేశారు. చిట్కాలను, ప్రకటనలపై దేవా, ఇస్లాము, ఉర్ధూ భాష వివరాలపైఅహ్మద్ నిసార్ కృషి చేశారు. 2007 జూన్ లో ఈ వారం వ్యాసం శీర్షిక అక్టోబరులో ఈ వారపు బొమ్మ శీర్షిక ప్రారంభమైంది. కాసుబాబు ఈ శీర్షికలను దాదాపు ఐదేళ్లు ఒక్కడే నిర్వహించడం విశేషం. వీటిని కొంత కాలం అర్జున కొనసాగించగా, 2013 నుండి ప్రధానంగా కె.వెంకటరమణ, రవిచంద్ర నిర్వహిస్తున్నారు.

వికీదశవర్షపూర్తి వేడుక, వెబ్ పేజి

తెవికీ తెరవెనుక సంగతులను, వికీపీడియన్లను అందరికి పరిచయంచేసి, తెవికీ సముదాయ చైతన్యాన్ని పెంచే ఆశయాలతో తెవికీ వార్త 2010 జూలై 1న ప్రారంభమైంది. 8 సంచికలు తరువాత ఆగిపోయింది. 2010 లో ప్రారంభమైన గూగుల్ అనువాద వ్యాసాలు 2011 లో దాదాపు 900 పైగా వ్యాసాలు చేర్చిన తరువాత వాటి నాణ్యత పెంచడానికి తెవికీ సభ్యుల సూచనలు అమలు చేయకుండానే ఆగిపోయాయి. వీటివలన సగటు వ్యాస పరిమాణం పెరిగింది. 2011 లో వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదులో జరిగాయి[4]. తెలుగు వికీపీడియన్లు భారత వికీ సమావేశం 2011 లో పాల్గొన్నారు[5]. వికీమీడియా భారతదేశం విశిష్ట వికీమీడియన్ గుర్తింపు రాజశేఖర్,టి.సుజాత లకు లభించింది[6]

తెలుగు వికీపీడియా మహోత్సవం లో పాత్రికేయులతో తెలుగు వికీపీడియా సభ్యులు

తెలుగు వికీపీడియా మహోత్సవం ఏప్రిల్ 10,11, 2013న థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు) ఆధ్వర్యంలో హైదరాబాదులోని గోల్డెన్ త్రెషోల్డ్లో జరిగింది. దీనిలో భాగమైన వికీ సర్వసభ్యసమావేశం, వికీ అకాడమీ, వికీచైతన్యవేదికలలో వికీపీడియా సభ్యులు పాల్గొని వికీపీడియా అభివృద్ధికి చేపట్టవలసిన చర్యలను చర్చించారు,తరువాత హెచ్ఎమ్టీవి రాజశేఖర్, రహ్మానుద్దీన్, మల్లాది, విష్ణులు పాల్గొన్న వికీపీడియా ఫోన్ ద్వారా వీక్షకుల ప్రశ్నలకు సమాధానాల కార్యక్రమము ప్రసారంచేసింది.[7]

దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలుగు వికీమీడియా ప్రాజెక్టులలో గత 10 సంవత్సరాలలో విశేష కృషి చేసిన చదువరి, మాకినేని ప్రదీపు, చావా కిరణ్, వీవెన్, పాలగిరి రామకృష్ణా రెడ్డి, రవిచంద్ర, అహ్మద్ నిసార్, వీర శశిధర్ జంగం, జలసూత్రం వెంకట రామకృష్ణ ప్రసాద్, ఎల్లంకి భాస్కర నాయుడు లకు కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము నకు ఎంపికయ్యారు.

తెవికీ 11వ వార్షికోత్సవ గ్రూప్ ఫోటో

తెలుగు వికీమీడియా 11వ వార్షికోత్సవాలు 2015, ఫిబ్రవరి 14, 15 తేదీలలో తిరుపతి లోని ఉదయీ ఇంటర్నేషనల్ హోటల్ జరిగాయి. 2014 సంవత్సరం తెలుగు వికీపీడియాలో విశేష కృషి చేసిన రాజశేఖర్, టి. సుజాత, వెంకటరమణ, సుల్తాన్ ఖాదర్, పవన్ సంతోష్ లకు కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారము అందజేయడం జరిగింది.

ప్రతిరోజూ ఒక వ్యాసం చొప్పున 2016 లో ప్రారంభించి 2019 లో వెయ్యి వ్యాసాలకు పైబడి అభివృద్ధి చేసి ప్రణయ్ రాజ్ తెవికీ అభివృద్ధికి తోడ్పడ్డాడు. 2014 తో తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లాలు పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా, జిల్లా, మండల, గ్రామ వ్యాసాలను సవరించడంలో యర్రా రామారావు విశేషకృషి చేశాడు.

స్మార్ట్ ఫోన్లలో తెలుగు వికీపీడియా
స్మార్ట్ ఫోన్ లో తెలుగు వికీపీడియా మొబైల్ రూపం

స్మార్ట్ ఫోన్లలో తెర విస్తీర్ణము చిన్నదిగా ఉండటంవలన దీనికి తగ్గ మొబైల్ రూపంలో వికీపీడియా అందుబాట్లో ఉంది.[8] దీనికొరకు ప్రత్యేక ఉపకరణం కూడా విడుదలైంది.[9][10]

భౌతిక సంస్థ[మార్చు]

వికీమీడియా భారతదేశం జనవరి 2011 నుండి పని ప్రారంభించింది. వివిధ కార్యక్రమాల ద్వారా వికీపీడియా, సోదర ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికి కృషి చేస్తున్నది. నగర,భాషా ప్రత్యేక ఆసక్తి జట్టుల ద్వారా కార్యక్రమాలను దేశమంతటా విస్తరించింది. అయితే విదేశీ ద్రవ్యం పొందేందుకు అవసరమైన చట్టపరమైన ఇబ్బందుల వలన, నేరుగా, సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ (సిఐఎస్) ద్వారా వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలు మరి ఇతరచర్యల వలన వికీమీడియా భారతదేశం బలోపేతం కాలేకపోయింది,, ఇతర కారణాలవలన సోదర సంస్థగా కొనసాగుటకు కావలసిన నిబంధనలను పాటించలేకపోయింది. 2019 సెప్టెంబరు 14 నుండి అమలు అయ్యేటట్లు వికీమీడియా భారతదేశం గుర్తింపు వికీమీడియా ఫౌండేషన్ రద్దుచేసింది[11]. సిఐఎస్ లో ప్రత్యేక ఉద్యోగి ద్వారా తెలుగు వికీపీడియా అభివృద్ధికై కృషి 2013 నుండి 2019 జూలై వరకు కొనసాగింది.

గణాంకాలు[మార్చు]

తెలుగు వికీపీడియా అభ్యర్థించే విశిష్ట పరికరాల గణాంకాలు.

నెలవారీ తాజపరచబడే సారాంశ గణాంకాలు ఆధారంగా తెలుగు వికీని మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.[12] మరిన్ని వివరాల కొరకు [13], ఇతర భాషలతో పోల్చిచూడడం కొరకు గణాంకాలు [14] చూడవచ్చు. నెలవారీగా మరింత పేజీవీక్షణల వివరాలు [15] అందుబాటులోవున్నాయి. భారతదేశ భాషల భాషల పేజీవీక్షణలు [16] కూడా చూడవచ్చు. తెలుగు వికీపీడియా అభ్యర్థించే విశిష్ట పరికరాలు 2018 ఆగస్టు 1 నాటికి 10 లక్షలు చేరాయి. నవంబరు 2018 పేజీ అభ్యర్ధనల గణాంకాల ప్రకారం, దేశాలవారీగా భారతదేశం, అమెరికా, హాంగ్ కాంగ్, యునైటెడ్ కింగ్డమ్ మొదటి నాలుగు స్థానాలలో ఉన్నాయి.[12]

తెవికీ మార్గ దర్శనం[మార్చు]

తెవికీలో ఉన్న వ్యాసాలను చేరుకోవటానికి శోధన పెట్టె, లింకులు, వ్యాసం చివర కనిపించే వర్గాలు, మార్గదర్శన పెట్టె ఉపయోగంగా ఉంటాయి. వీటిద్వారా కంప్యూటర్ పరిజ్ఞానం లేని వాళ్లుకూడా వారికి కావలసిన వ్యాసాలకు సునాయాసంగా చేరుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


తెవికీ సంస్థాగత స్వరూపం[మార్చు]

సభ్యులు, నిర్వాహకులు , అధికారులు[మార్చు]

తెలుగు వికీపీడియాలో 2019 డిసెంబరు నెలాంత గణాంకాల ప్రకారం 93 లక్షల పేజీ వీక్షణలు, 16 లక్షల నిర్దిష్ట పరికరాల ద్వారా జరుగుతున్నాయి.[17] నవంబరు 2019 లో కొత్తగా 243 మంది నమోదు కాగా, కనీసం ఐదు సవరణలు చేసే సభ్యులు 71 మంది వున్నారు [18]. సభ్యత్వానికి ఎటువంటి షరతులు నిబంధనలు ఉండవు వ్రాయాలన్న కుతూహలం,కొంత భాషా పరిజ్ఞానం మాత్రమే అర్హత. సభ్యత్వం లేకున్నా రచనలు, దిద్దుబాట్లు ఎవరైనా చేయవచ్చు. కొత్తగా చేరిన సభ్యులకు సహాయంగా సాంకేతిక వివరణలను విధాలను తెలుసుకొనే విధంగా సులభ శైలిలో వివరించిన పాఠాలు సభ్యులందరికి అందుబాటులో ఉంటాయి. మొదటి పేజీలో వీటికి లింకులు ఉంటాయి. లింకుల వెంట పయనిస్తూ రచనలను కొనసాగించవచ్చు. ఖాతా తెరచి పనిచేసే సభ్యులు చేసే దిద్దుబాట్లు గణాంకాలు చూపిస్తూ ఉంటాయి. సభ్యులు చర్చల్లోనూ పాల్గొనవచ్చు, సలహాలు, సహాయం తీసుకోవచ్చు, అందించనూ వచ్చు.

అనంతమైన ఆకాశం నుండి మట్టి రేణువు వరకూ దేనిని గురించైనా ఆధారాలుంటే ఏదైనా వ్రాయవచ్చు. అచ్చుతప్పులుంటే సరిదిద్ద వచ్చు.ప్రాజెక్టులుగా, వర్గాలుగా విడదీసి పనులు జరుగుతుంటాయి కనుక ఆసక్తి ఉన్న రంగంలో వ్రాసే వీలుంటుంది. విస్తారమైన సమాచారం ఉంటుంది కనుక చదివి తెలుసుకోవడమూ చక్కని అనుభవమే. సభ్యుల ఊహలకు ఇక్కడ తావులేదు. సమాచారానికి వాస్తవం, నిష్పాక్షికం ప్రధానం. ఇతర వికీపీడియాలనుండి నాణ్యత గల వ్యాసాలకు అనువాదాలను సమర్పించ వచ్చు. ఇతరుల రచనలను అనుమతి లేకుండా ప్రచురించకూడదు. రచనలనే కాకుండా, బొమ్మలనూ (చిత్రం), ఛాయా చిత్రాలను అప్ లోడ్ చేయవచ్చు. అవి చట్టపరమైన ఇబ్బందులు కలిగించనవై ఉండాలి. వాటిని వివిధ వ్యాసాలలో వివరణ చిత్రాలుగా వాడుకొనే వీలుంది. రచనలను అనేకంగా తెలుగులోనే చేయాలి. ఇతర భాషాపదాలను వాడటం ప్రోత్సహించరు. అనివార్య కారణాలలో మాత్రమే ఇతరభాషా పదాలను వాడటానికి అనుమతి ఉంటుంది.

సర్వజనీనమైనవి, సమాచార పూరితమైనవి, వాస్తవతను ప్రతిబింబిచేవి అయిన రచనలకు మాత్రమే తెలుగు వికీపీడియాలో స్థానం. అవాంఛనీయమైన రచనలను నిర్వాహకులు తొలగిస్తూ ఉంటారు. వారికి ఈ విషయంలో విశేష అధికారాలు ఉంటాయి. తొలగించడంతో పాటు సభ్యుల రచనలపై కొంతకాలం నిషేధం అమలవుతుంది. దుశ్చర్య, అవాంఛనీయమైన రచనలను నియంత్రించడానికి ఈ విధానాలు, శిక్షలు పాటిస్తుంటారు.

నిర్వహణ కోసం తెవికీ సభ్యులలో కొందరు నిర్వాహకులు, అధికారులగా సభ్యులచే ఎన్నుకోబడతారు. తెవికీ నిర్వాహకుల, అధికారుల వివరాలు చూడండి.

సభ్యులకు ప్రోత్సాహం[మార్చు]

తెలుగు వికీపీడియా అభివృద్ధికి ముఖ్య కారణం కొత్త సభ్యులను ప్రోత్సహించడం. కొత్త సభ్యులను ప్రోత్సహించడంలో సభ్యులు, నిర్వాహకులు, అధికారులు సైతం ఓర్పు నేర్పుతో వ్యవహరిస్తుంటారు. అత్యుత్సాహంతో కొత్తవారు చేసే పొరపాట్లను సరిచేస్తూ సూచనలను, సలహాలను అందిస్తూ ఉంటారు. కావలసిన సహాయం అందించడంలో అందరూ ఉత్సాహం చూపుతూనే ఉంటారు. సభ్యుల మధ్య ఉండే స్నేహపూరిత వాతావరణం కొత్త వారి ఆందోళనను ఒకింత తగ్గిస్తూ ముందుకు సాగేలా చేస్తుంది. మృదుమధురంగా సూచనలను అందించడం ఎక్కువమంది సభ్యుల పద్ధతులలో ఒకటి.

తెలుగు వికీపీడియా చేసే కృషికి గుర్తింపుగా సభ్యులు ఒకరికి ఒకరు పతకాలు ప్రధానం చేస్తూ ఉంటారు. దిద్దుబాట్లు గణించి కొన్ని ప్రాజక్టులలో సాధించిన విశేష కృషి ఉపయోగకరమైన విషయాలు సమర్పించినప్పుడు పతకాలు ఇచ్చి ప్రోత్సహిస్తుంటారు. ఈ పతకాలు ఇవ్వడానికి ప్రత్యేక అర్హతలు అవసరం లేదు. సభ్యులు ఎవరైనా ఎవరికైనా వారు గుర్తించిన సభ్యుల కృషికి తగినట్లు పతకాలు సమర్పించ వచ్చు.

చర్చలు[మార్చు]

ప్రతి పేజీకి ఒక చర్చాపేజి ఉంటుంది. వ్యాసానికి సంబంధించి ఆ చర్చాపేజీలో ఎవరైనా తమ అభిప్రాయాలను వెలిబుచ్చవచ్చు రచయిత నుండి సమాధానం పొందవచ్చు. వ్యాసంపై అభిప్రాయం అక్కడ జతచేయవచ్చు. సభ్యుని పేజీలో ఒక చర్చాపేజీ ఉంటుంది దానిలో సభ్యునితో అనేక విషయాలపై చర్చించవచ్చు. అభినందనలు, ప్రశంసలు, నెనర్లు (ధన్యవాదాలు) కూడా అక్కడ చోటు చేసుకుంటూ ఉంటాయి. రచ్చబండ ఇది తెలుగు వికీపీడియా సభ్యుల అభిప్రాయవేదిక. సభ్యులందరి,సలహాలూ సంప్రదింపులూ,సందేహాలూ ఇక్కడ చోటు చేసుకుంటాయి.తెవికీ అభివృద్ధికి చర్యలకు ఇది ప్రధానమైన నెలవు.

ప్రచారం[మార్చు]

తొలిగా బ్లాగరుల సమావేశాలు, ఆ తరువాత తెవికీ అకాడమీ, వార్షిక పుస్తకప్రదర్శనల ద్వారా, అనుబంధ సంస్థల ద్వారా శిక్షణ, ప్రచార కార్యక్రమాల వలన, పత్రికలలో వచ్చిన ప్రత్యేక వ్యాసాల ద్వారా తెవికీ ప్రచారం జరుగుతున్నది[1][19][20][21].

సమావేశాలు[మార్చు]

క్రియాశీలంగా ఉండే వికీపీడియా సభ్యులు హైద్రాబాదు లాంటి నగరాలలో ప్రతి నెల సమావేశాలు నిర్వహించి కొత్త సాంకేతికతలు,ప్రాజెక్టుల గురించి చర్చిస్తారు. దేశంలో జరిగే సోదర భాష ప్రాజెక్టుల సమావేశాలలో, వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే సాంకేతిక సదస్సులలో పాల్గొనటం, అలాగే వికీమీడియా ఫౌండేషన్ ప్రతిసంవత్సరం ప్రపంచలో వివిధ నగరాలలో నిర్వహించే వికీమేనియా అనబడే అంతర్జాతీయ సమావేశానికి హాజరయి వికీపీడియా అభివృద్ధికి జరుగుతున్న వాటిని తెలుసుకొని తదుపరి తెలుగు వికీ ప్రాజెక్టులలో అమలు చేయడానికి సహకరిస్తారు.

సోదర ప్రాజెక్టులు[మార్చు]

మెటా-వికీ, కామన్స్, విక్షనరీ, వికీబుక్స్, వికీకోట్,వికీసోర్స్ మొదలైనవి తెలుగు వికీపీడియా సోదర ప్రాజెక్టులు.

  • మెటా-వికీ దీనిలో వికీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలు చర్చిస్తారు.
  • వికీసోర్స్‌లో సార్వజనీయమైన రచనలు రచనలను మూలరూపంలో భద్రపరుస్తారు. ఉదాహరణగా శతకములు, పురాణములు, వేదములు మొదలైనవి. ఈ పనులు ప్రణాలికాబద్దంగా చేస్తారు.
  • కామన్స్ లో తెలుగు వికీపీడియాకు ఉపయోగపడే చిత్రాలు, ఛాయాచిత్రాలు, దృశ్య శ్రవణమాధ్యమాలను భద్రపరుస్తారు. ఇవి ఏ వికీప్రాజెక్టులోనైనా వాడుకోవచ్చు
  • వికీబుక్స్ లో అందరూ కలిసి రూపొందించే పాఠ్యపుస్తకాలుంటాయి.
  • విక్షనరీలో తెలుగుపదాలకు అర్ధాలు, బహువచనాలు, ఇతర భాషానువాదాలు, వ్యాకరణ వివరాలు ఒక్కొక్క పదానికి ఉంటాయి.
  • వికీకోట్ లో ప్రముఖుల వాఖ్యలు ఉంటాయి.

గుర్తింపులు[మార్చు]

"ఉత్సాహం, చొరవ ఉండి, కొద్దిమందే అయినా చేయి చేయి కలిపితే సాధించగల అద్భుతానికి 'తెలుగు వికీపీడియా' మచ్చుతునక" అని ప్రముఖ మాధ్యమాల యజమాని, సంపాదకుడు రామోజీరావు కొనియాడారు[22].

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "మన తెలుగు వెబ్ లో బహుబాగు". ఈనాడు. 2008-02-03.
  2. "తెలుగు వికీపీడియా మొదటిపేజీ తొట్టతొలి రూపం". 2003-12-10.
  3. "మెరుగు పరచిన మొదటిపేజీ". 2005-09-27.
  4. "వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు హైదరాబాదు". 2011-06-19.
  5. "భారత వికీ సమావేశం 2011 వెబ్ సైటు". 2011-11-18.
  6. "NWR2011". Wikimedia India. 2011-11-24. Archived from the original on 2013-12-18. Retrieved 2014-02-01.
  7. "A Feature on Wikipedia and Telugu Wikipedians on HMTV". CIS. Retrieved 2019-01-03.
  8. Tomasz Finc (2011-10-27). "Wikimedia mobile grows up, offers opt-in beta features". Wikipedia.
  9. "Wikipedia app on Google Play Store". Retrieved 2019-01-04.
  10. Tomasz Finc (2012-01-26). "Announcing the Official Wikipedia Android App". Wikipedia.
  11. "Derecognition of Wikimedia India". Wikipedia Signpost. 2019-07-31. Retrieved 2019-10-22.
  12. 12.0 12.1 "Monthly Oveview(Telugu)". Archived from the original on 24 జనవరి 2020. Retrieved 23 Dec 2018. Check date values in: |archive-date= (help)
  13. "Telugu Wikipedia at a glance". Retrieved 23 Dec 2018.
  14. "Wikipedia statistics". Retrieved 23 Dec 2018.
  15. "Telugu Wikipedia pageviews (default:top)". Retrieved 23 Dec 2018.
  16. "Page Views for Wikipedia for India, All Platforms, Normalized". WMF. 2014-01-30. Retrieved 2014-02-01.
  17. "వికీపీడియావీక్షణలు". 2020-01-03. Archived from the original on 2020-01-24. Retrieved 2018-12-23.
  18. "తెలుగు వికీపీడియా ఎడిటర్ గణాంకాలు". 2019-01-03. Archived from the original on 2020-01-24. Retrieved 2018-12-23.
  19. అరుణ పప్పు (2009-01-18). "వెబ్ లో తెలుగు వెలుగు". ఆంధ్రజ్యోతి ఆదివారం. Missing or empty |url= (help)
  20. Mohan, Manasa (2012-03-30). "Telugu Wiki crosses 50,000 articles". IBN. Archived from the original on 2013-12-21. Retrieved 2014-02-01.
  21. చంద్ర మదన్ మోహన్ (2018-10-01). "తెవికీ అక్షర సేనానులు.. (తెలుగు వెలుగు, అక్టోబరు 2018 )". రామోజీ ఫౌండేషన్. Archived from the original on 2018-11-10. Retrieved 2018-11-01.
  22. రామోజీరావు (2013-02-01). "నడుద్దాం తెలుగులోకి ..వెలుగులోకి.. (తెలుగు వెలుగు, ఫిభ్రవరి 2013 సంపాదకీయం)". రామోజీ ఫౌండేషన్. Retrieved 2014-02-01.