దేవతల యుద్ధము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దేవతల యుద్ధము నవలను కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించారు. రచయిత నవలలో సమాజంలో ఆధ్యాత్మిక భావాల విషయంలో వస్తున్న మార్పులను ఒక జమీందారీ గ్రామాన్ని నేపథ్యంగా తీసుకుని చిత్రీకరించారు.

పుస్తకము మొదటి పుట చిత్రపటం
పుస్తకము మొదటి పుట చిత్రపటం

రచన నేపథ్యం

[మార్చు]

దేవతల యుద్ధము అనే నవల విశ్వనాథ సత్యనారాయణ 1947లో రచించారు. రచయిత నవలను ఆశువుగా చెప్తూ ఉండగా చతుర్వేదుల లక్ష్మీనరసింహం లిపిబద్ధం చేసి ఉండవచ్చని గ్రంథకర్త కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రి అభిప్రాయ పడ్డారు. ఈ పుస్తకం ద్వితీయ ముద్రణ 1960లో జరిగింది. [1]

ఇతివృత్తం

[మార్చు]

ఇది ఒక జమీందారీ రాజకుటుంబంలో జరిగిన కథగా గ్రంథకర్త కుమారుడు విశ్వనాథ పావని శాస్త్రి అభివర్ణించారు. కొత్త దేవతలు పాత దేవతలు - మనుషుల విశ్వాసాల వల్ల మారిన పరిస్థితుల్లో సంఘంలోని కొందరు వ్యక్తులు ఎలా బలి అవుతారో ఈ నవలలో చిత్రించారు. జమీందారు, ఆయన దివాను నీలకంఠశాస్త్రి వేదబాహిరమైన వేదాంత సంబంధమైన రెండు వేర్వేరు కొత్త మతాలు అవలంబించడం ప్రారంభించడంతో ఆయన చుట్టూ ఉన్న సేవకులు, ఆశ్రితులు కూడా వారి అనుగ్రహం కోసం ఆ మతాల్లో ఒకటి ఎంచుకోవడం చేస్తారు. ఆశ్రితుల్లో ఒకరైన సోమేశ్వరం మాత్రం ఆయన మతమూ స్వీకరించక, పూర్వాచారాలైన బాల్యవివాహం కూడా చేసుకోవడంతో దేవిడీలోకి మన్నా అవుతుంది. పూర్వం ఈ జమీందారు వంశానికి జమీ రావడానికి సోమేశ్వరం తండ్రి రామశాస్త్రి కొన్ని న్యాయపరమైన కాగితాలు బయటపెట్టకపోవడం కారణం. సోమేశ్వరం కొత్తగా జమీందారుతో ఏర్పడ్డ వైమనస్యం పక్కన పెట్టి మరీ ఆ కాగితాలు జమీందారు ప్రతిపక్షులు ప్రలోభపెట్టినా వారికి ఇవ్వక, జమీందారుకు నిరపేక్షంగా ఇస్తాడు. ఈ నేపథ్యంలో సంఘజీవితంలో పాత, కొత్త మత విశ్వాసాల ఘర్షణ వంటి అంశాలు నవలలో పొందుపరిచారు.

శిల్పం

[మార్చు]

శైలి

[మార్చు]

ఈ నవలను విశ్వనాథ సత్యనారాయణ వాడుక భాషలో రాశారు. ఆయన నవలలో ఉపయోగించే పదప్రయోగాలు పాఠకులను వెంటాడే లక్షణంతో ఉన్నాయి. ముఖ్యంగా క్లుప్తంగానూ, స్పష్టంగానూ పెద్ద పెద్ద అంశాలను చెప్పడం శైలిలో ఉన్న బలంగా భావించవచ్చు.

ఉదాహరణలు

[మార్చు]
  • నాటకం వాడికి రూపాయి ఇచ్చి టికెట్టు కొంటే వాడు సంతోషిస్తాడా? దానం అనుకుంటాడా? ఇవన్నీ నీ సంతోషం కోసం చేసే పనులు. నీ వనుభవించే ఆ సంతోషం ఒక దర్జా కోసం, ఒక ఠీవి కోసం, ఒక బడాయి కోసం కలిగే సంతోషం. ఈ డబ్బు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? వాళ్ళ మనసంతా ద్రవీభూతం అవుతుంది. వాని సంసారం పరిస్థితి ఎట్లంటిది అంటే వాడికి నీవిచ్చిన నాలుగు రూపాయలకు వాడి వళ్ళు కోసి ఇచ్చినా నీ యందలి కృతజ్ఞత తీర్చుకోలేనేమో అనిపించేది. అప్పుడు వాడి మనసులో కలిగే ఆర్ద్రత లౌకికమైనది కాదు. నీకు ప్రత్యుపకారం చేద్దాం అనేది కాదు. ఇది ఐహికమైనది కాదు. ఆధ్యాత్మికమైనది. నీవు ఉద్యోగస్తులకి డబ్బిస్తే వాళ్ళు నీకు ఐహికంగా యెట్లా ఉపయోగపడతారో ఆ ఉపయోగాన్ని ఎలా వాంఛిస్తావో అల్లా అధ్యాత్మికమైనది ఒకటి ఉంది అని నీవు విశ్వసించి దాన్ని వాంఛిస్తే ఈ పేదవాళ్ళకు ఆ డబ్బు ఇస్తావు
  • నీవెంతైనా భగవంతుడు లేడూ అనూ. వాడు లేడు అనటానికి కారణం ఇంకేదో ఉంది అన్న బలం. ఆ ఏదో వీటిలో ఏదైనా కావచ్చు. ఒకటి ధనం రెండు సంఘ బలం. ఇవి రెండు చాలా ప్రధానం. ఈ రెంటిలో ఏదీ లేకపోతే అప్పుడు దేవుడున్నాడు.
  • ఇదేమి రోజులో, అన్ని ధర్మాలు పోయి ఇష్టమనే ధర్మం చాలా పైకి వచ్చింది. తనకేది సిద్ధాంతమో అదే ధర్మం ; అదే మానవ ప్రకృతి ; అదే సంఘం; అదే రాజనీతి, ఇక అన్నీ అదే.

ఇతరుల మాటలు

[మార్చు]

విశ్వనాథ నవలాచక్రంలో ధ్వన్యాత్మకతను అవలంబింపక వర్తమాన పరిస్థితులలోని లోపాలను ఇంత స్పష్టంగా అభివ్యక్తీకరింపబూనిన నవల వేఱొకటి లేదు. ‘దేవతల యుద్ధము’ ఒక సమ్మోహకమైన విశిష్ట కథనశిల్పంతో సాగిన ఉపన్యాసప్రవాహం. -ఏల్చూరి మురళీధరరావు, విమర్శకుడు, సాహితీవేత్త.[2]

మూలాలు

[మార్చు]
  1. దేవతల యుద్ధము నవల ముందు విశ్వనాథ పావని శాస్త్రి "ఒక్కమాట" శీర్షికన రాసిన నోట్
  2. http://pustakam.net/?p=15737&cpage=1#comment-66403

ఇవి కూడా చూడండి

[మార్చు]

విశ్వనాథ సత్యనారాయణ, పుస్తకం.నెట్లో దేవతల యుద్ధము సమీక్ష