బేతవోలు రామబ్రహ్మం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బేతవోలు రామబ్రహ్మం తెలుగు పండితుడు, అవధాని, రచయిత, విమర్శకుడు.

Betavolu Ramabrahmam

జీవిత విశేషాలు[మార్చు]

బాల్యం / విద్యాభ్యాసం[మార్చు]

ఇతడు పశ్చిమ గోదావరి జిల్లా, నల్లజర్ల గ్రామంలో ఒక అతి సామాన్య కుటుంబంలో 1948, జూన్ 10 న జన్మించాడు[1]. కష్టాలే తోడుగా ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ఆ తర్వాత కొవ్వూరు సంస్కృత కళాశాలలో భాషా ప్రవీణ చేశాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ తెలుగు చదివాడు. తరువాత నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య తూమాటి దొణప్ప పర్యవేక్షణలో తెలుగు వ్యాకరణాలపై సంస్కృత వ్యాకరణాల ప్రభావం అనే అంశంపై పి.హెచ్.డి చేశాడు.

ఉద్యోగం[మార్చు]

మొట్టమొదట ఇతడు గుంటూరులోని కెవికె సంస్కృత కళాశాలలో ఉపన్యాసకులుగా చేరాడు. ఇతని బోధన విద్యార్థులకే కాక సహ అధ్యాపకులైన మల్లంపల్లి వీరేశ్వరశర్మ , కోగంటి సీతారామచార్యులు, జమ్మలమడక మాధవరామశర్మ వంటి పండితులను కూడా ఆకర్షించేది. తరువాత ఇతడు నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశాడు. ఎన్‌.టి. రామారావు ముఖ్యమంత్రిగా ఒకరోజు నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంలో ఇతడి పద్యాలు విని అభినందిస్తూ… ‘మేం త్వరలో ఏర్పాటు చేయబోయే తెలుగువిశ్వవిద్యాలయానికి మీ వంటి వారు అవసరం. త్వరలో మనం తప్పకుండా కలుద్దాం’ అని అన్నాడు. దాంతో రామారావు ప్రత్యేకంగా కళలకు సంబంధించి తెలుగు విశ్వ విద్యాలయం స్థాపించడం, రాజమహేంద్రవరం వద్దనున్న బొమ్మూరు కేంద్రంగా సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయడం, అక్కడికి ఇతడిని ఆచార్యులుగా తీసుకోవడం జరిగింది. అక్కడ తెలుగు సాహిత్య అధ్యయనం రూపకల్పనలోనూ, పరిశోధన విషయంలోనూ ఇతడు పెనుమూర్పులు తీసుకువచ్చి భావితరాలకు మార్గదర్శకత్వం వహించడంలో కీలకపాత్ర పోషించాడు. ‘భారతి’ లేని లోటును తీర్చిన ‘వాజ్ఞ్మయి’ త్రైమాసిక పత్రిక పేరు ఇతడు సూచించిందే. హైదరాబాద్‌లో ప్రారంభమై ఏడాది పాటు నడిచిన ఆ పత్రికను బొమ్మూరుకు తీసుకెళ్ళి పరిశోధనలో ప్రామాణికతను పాటిస్తూ తెలుగు సాహిత్యానికి విశిష్టమైన సంచికగా రూపొందించడంలో కీలకంగా నిలిచాడు. ఇతడి మార్గదర్శకత్వంలో పాతికమంది వరకు పీహెచ్‌డీలు చేసి డిగ్రీలు పొందారు.

2005లో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరారు.

సాహిత్య రంగం[మార్చు]

ఇతడు రావూరి వెంకటేశ్వర్లు ప్రోత్సాహంతో, ప్రేరణతో భాషాప్రవీణ రెండవ సంవత్సరం చదివేప్పుడే అవధానాల వైపు ఆకర్షితుడై పద్ధెనిమిదేళ్ల కే ( 1967లో)నవరాత్రి ఉత్సవాలకు మొదటి అవధానం చేశాడు. దాదాపు పాతిక సంవత్సరాల్లో 300 వరకు అవధానాలు చేసి తెలుగు ప్రజల హృదయాలను దోచుకున్నాడు. తర్వాత లెక్కలేనన్ని అవధాన సభలకు సంచాలకత్వం వహించాడు. కొవ్వూరు సంస్కృత కళాశాల నుంచి వెలువడే ‘గౌతమి’ మాసపత్రికకు ఒక్క సంవత్సరం పాటు సంపాదకుడుగా వ్యవహరించి అంతవరకు గ్రాంథికంలో వెలువడుతున్న ఆ పత్రికను పూర్తిగా వ్యవహారంలోకి తెచ్చిన ఘనత ఇతనికే దక్కుతుంది. ఆ పత్రికలో ఇతను ‘జయసింహ చరిత్ర’ ( కల్పిత కథా ప్రబంధం) అన్న శీర్షికతో సరళ శైలిలో పద్యాలు వ్రాశాడు.

ఒకసారి నాగార్జున విశ్వవిద్యాయలంలో బుద్ధిస్ట్ స్టడీస్ కేంద్రాన్ని ప్రారంభిచడానికి భూటాన్ దేశపు మఠాధిపతి జె.కంపూ, వారి బృందం వచ్చారు. వారితోపాటు అప్పటి మన ఉపరాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్, యూజీసీ వైస్ చైర్మన్ ఆచార్య కొత్త సచ్చిదానంద మూర్తి కూడా వచ్చారు. ప్రారంభోత్సవం అయ్యాక సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా బేతవోలు రామబ్రహ్మం రాసిన ‘సౌందర నందం’ నాటకాన్ని ఆ భూటాన్ మఠాధిపతి, బృందం సభ్యులు నిల్చొనే తిలకించారు. నాటకం అయ్యాక బుద్ధుడి భిక్షాపాత్రని డాలర్లతో నింపి, రచయితను అభినందించి, ఆ ఆనందంలో మీరంతా మా దేశం వచ్చి పలుచోట్ల ప్రదర్శనలు ఇవ్వమన్నారు. దాంతో ఇతడు భూటాన్ వెళ్ళి అక్కడ ‘ఉన్మత్త యక్షరాజం, సౌందరనందం’ వంటి బౌద్ధ సంబంధి నాటక ప్రదర్శనలు ఇప్పించి, అక్కడివారి ఆదరాభిమానాలను చూరగొన్నాడు. ఇలా ఇతడు తన రచనల ద్వారా విదేశీయులను సైతం ఆకర్షించాడు.

ఇతడు బొమ్మూరు విశ్వవిద్యాలయం తరపున ఒకసారి ‘వచన కవితకు షష్టిపూర్తి’ అన్న శీర్షికతో కవి సమ్మేళనాలు, సభలు నిర్వహించాడు. తరువాత హైదరాబాదులో ‘ఆంధ్ర పద్య కవితా సదస్సు’ నిర్వహించి నండూరి రామకృష్ణమాచార్యులు అధ్యక్షలుగా,ఇతడు ఉపాధ్యక్షులుగా రాష్ట్రం నలుదిశలా పర్యటించి పద్యం విశిష్టతను తెలిపారు. ఇతడు కొత్త గోదావరి వంటి పద్య కావ్యాలే కాకుండా నాటకాలూ వ్రాశాడు. కథలు వ్రాశాడు. అనువాద రచనలు వ్రాశాడు. సాహిత్య వ్యాసాలు, పరిశోధనా గ్రంథాలు వ్రాశాడు. అన్నింటికన్నా సంస్కృత నాటకాలకు వ్యాఖ్యానాలు రాసి ఎనలేని కీర్తి గడించాడు. దేవీ భాగవతం వచన రచన ద్వారా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. తొలినాళ్ళలో నాస్తిక భావాలున్న ఇతడికి ఆధ్యాత్మిక దిగ్ధర్శకత్వం నెరపినవారు లక్ష్మణ యతీంద్రులు. ఇతడికి దిశానిర్దేశం చేసి ఆచార్యునిగా తీర్చినది ఆచార్య తూమాటి దొణప్ప.

రచనలు[మార్చు]

 1. వ్యాసగౌతమి
 2. వ్యాసపీఠిక
 3. పద్యకవితా పరిచయం
 4. శ్రీ మద్రామాయణము (తెలుగు వచనము యథాతథము)
 5. వాల్మీకి రామాయణము
 6. శ్రీదేవీ భాగవతము
 7. శూద్రక మహాకవి మృచ్ఛకటికం
 8. భట్ట నారాయణస్య వేణిసంహారం
 9. శ్రీహర్షుడు నాగానందం
 10. తెలుగు వ్యాకరణాలపై సంస్కృత ప్రాకృత వ్యాకరణాల ప్రభావం
 11. ప్రతిభా మూర్తి పురస్కారోత్సవ సదస్సుల ప్రసంగపత్రాలు
 12. క్రొత్త గోదావరి
 13. పలుకు చిలుక
 14. శకుంతలాదుష్యంతం
 15. అనర్ఘ రాఘవం

భక్తి రచన[మార్చు]

తల్లి నీరాజనం[2]

శీతాద్రి శిఖరాన్న పగడాలు తాపించు మా తల్లి నత్తునకు నీరాజనం కెంపైన నీరాజనం భక్తి కింపైన నీరాజనం
యోగీంద్ర హృదయాన మ్రోగేటి మాతల్లి, బాగైన అందెలకు నీరాజనం, బంగారు నీరాజనం భక్తి పొంగారు నీరాజనం
నెలతాల్పు డెందాన వలపు వీణలు మీటు, మాతల్లి గాజులకు నీరాజనం, రాగాల నీరాజనం భక్తి తాళాల నీరాజనం
మనుజాళి హృదయాన తిమిరాలు తొలగించు, మాతల్లి నవ్వులకు నీరాజనం, ముత్యాల నీరాజనం భక్తి నృత్యాల నీరాజనం
చెక్కిళ్ళ కాంతితో కిక్కిరిసి అలరారు, మా తల్లి ముంగురుల నీరాజనం, రతనాల నీరాజనం భక్తి జతనాల నీరాజనం
పసి బిడ్డలను చేసి - ప్రజనెల్ల పాలించు, మాతల్లి చూపులకు నీరాజనం, అనురాగ నీరాజనం భక్తి కనరాగ నీరాజనం
పగడాలు మరపించు ఇనబింబ మనిపించు, మాతల్లి కుoకుమకు భక్తి నీరాజనం, నిండిన నీరాజనం భక్తి మెండైన నీరాజనం
ఏటి పిల్లల వోలె గాలి కల్లల నాడు, మాతల్లి కురులకు నీరాజనం, నీలాల నీరాజనం భక్తి భావాల నీరాజనం
జగదేక మోహిని సర్వేశు గేహిని, మా తల్లి రూపులకు నీరాజనం, నిలువెత్తు నీరాజనం భక్తి నిలువెత్తు నీరాజనం

బిరుదములు[మార్చు]

 • అవధాన సుధాకర
 • సభా సంచాలక సార్వభౌమ

మూలాలు[మార్చు]