Jump to content

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం

వికీపీడియా నుండి
(శ్రీ కృష్ణదేవరాయ ఆంధ్రభాషా నిలయం నుండి దారిమార్పు చెందింది)
శ్రీ కృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం
ఇది తెలంగాణ రాష్ట్రంలోని పురాతన గ్రంథాలయం
దేశముభారతదేశం
తరహాస్టేట్ లైబ్రరీ
స్థాపితము1901
ప్రదేశముసుల్తాన్ బజార్, హైదరాబాదు
భౌగోళికాంశాలు17°23′17″N 78°29′11″E / 17.387946466586428°N 78.48646027214616°E / 17.387946466586428; 78.48646027214616
గ్రంధ సంగ్రహం / సేకరణ
సేకరించిన అంశాలుపుస్తకాలు, విద్యా పత్రికలు]], వార్తాపత్రికలు, మాన్యుస్క్రిప్ట్ తదితర ప్రచురణలు
చట్టపరమైన జమఅవును
ప్రాప్యత, వినియోగం
వినియోగించుటకు అర్హతలుపౌరులు అందరికి

శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయం (శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయం; ఆంగ్లం: Sri Krishna Devaraya Andhra Bhasha Nilayam), తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ప్రాచీన గ్రంథాలయం.[1] తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగాక ఈ గ్రంథాలయం 2016 జూన్ 29న నుంచి శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషానిలయంగా పేరు మార్చుకున్నది.[2] దీని వ్యవస్థాపకులు నాయని వెంకట రంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు మరియు రావిచెట్టు రంగారావు—విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల చారిత్రక వారసత్వం నుండి స్ఫూర్తి పొందారు, రాబర్ట్ సీవెల్ రచించిన A Forgotten Empire పుస్తకం ద్వారా రాయలవారి గొప్పతనాన్ని గుర్తించి, ఆ మహానుభావుని స్మరణార్థంగా ఈ భాషా నిలయాన్ని స్థాపించామని తెలిపారు.. భాషా నిలయం ప్రభావంతో తెలంగాణ అంతటా గ్రంథాలయాల గొలుసుకట్టు ఏర్పడింది. దాని రజతోత్సవం నాటికి హైదరాబాద్‌లో ఏడు, సికింద్రాబాదులో నాలుగు గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి. దీని తరువాత వరంగల్ జిల్లాలో 15, నల్గొండలో 13, కరీంనగర్‌లో 9, మహబూబ్‌నగర్‌లో 5, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాలలో ఒక్కొక్కటి చొప్పున గ్రంథాలయాలు ఏర్పాటయ్యాయి. ప్రస్తుతం ఈ గ్రంథాలయంలో సుమారు 53 వేల పుస్తకాలు ఉన్నాయి. తెలుగు, సంస్కృత భాషల్లో పురాణాలు, వేదాలు, కావ్యాలు, నాటకాలు, నవలలు, సాహిత్య విమర్శ, విజ్ఞానశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. బ్రహ్మశ్రీ బంకుపల్లి మల్లయ్యశాస్త్రి తెనిగించిన మూడు వేదాలు – సామవేదం, కృష్ణ యజుర్వేదం, ఋగ్వేదం – ఈ గ్రంథాలయంలో ప్రత్యేకంగా ఉన్నాయి. ఆంధ్ర పత్రిక ఉగాది సంచికలు 1910 నుండి, భారతి పత్రిక 1933 నుండి లభ్యమవుతున్నాయి. ఇవే కాకుండా, కృష్ణ పత్రిక, సమదర్శిని, సుజాత, ప్రతిభ, తెలుగు స్వతంత్ర జయంతి, శారద, ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి వారపత్రికల సంపుటాలు మరియు అనేక పురాతన పత్రికలు, గ్రంథాలు కూడా ఇక్కడ ఉన్నాయి. 2025 సెప్టెంబర్ నెలలో శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం 124 సంవత్సరాలు పూర్తిచేసుకోనుంది.[1]

ఈ గ్రంథాలయం సెప్టెంబరు 1, 1901 సంవత్సరంలో (ప్లవ నామ సంవత్సరం శ్రావణ బహుళ తదియ ఆదివారం) హైదరాబాదులోని రామ కోటి ప్రాంతంలో స్థాపించబడింది.[3] ఇది తెలంగాణా ప్రాంతంలో మొదటి గ్రంథాలయం. దీని స్థాపనతో ప్రారంభమైన నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమం తెలంగాణా ప్రజలలో చైతన్యం కలుగజేసి తెలుగు భాషా సంస్కృతుల పునరుజ్జీవనానికి అపారమైన కృషి జరిపింది. దీని స్థాపనకు విశేషకృషి చేసినవారు కొమర్రాజు లక్ష్మణరావు. వీరికి ఆర్థిక సహాయం అందిస్తూ ప్రోత్సాహమిచ్చినవారు నాయని వేంకట రంగారావు, రావిచెట్టు రంగారావు గార్లు. అప్పటి పాల్వంచ రాజాగారైన పార్థసారథి అప్పారావు స్థాపన సభకు అధ్యక్షత వహించారు. ఆనాటి సభను హాజరైన వారిలో మునగాల రాజా నాయని వెంకట రంగారావు, రఘుపతి వెంకటరత్నం నాయుడు, డా. ఎం.జి.నాయుడు, ఆదిపూడి సోమనాథరావు, మైలవరపు నరసింహశాస్త్రి, రావిచెట్టు రంగారావు, ఆదిరాజు వీరభద్రరావు, కొఠారు వెంకట్రావు నాయుడు పేర్కొనదగినవారు.

ఈ సంస్థ ప్రథమ గౌరవ కార్యదర్శి రావిచెట్టు రంగారావు. వీరు 1910లో మరణించగా, వీరి స్థానంలో కర్పూరం పార్థసారథి నాయుడు కార్యదర్శిగా గ్రంథాలయానికి స్వంత భవనం నిర్మించాలని సంకల్పించారు. రంగారావు సతీమణి రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ భాషా నిలయానికి అవసరమైన ఇల్లు కొనడానికి 3,000 రూపాయలు విరాళం ప్రకటించారు. దానితో ఇప్పుడు సుల్తాన్‌బజార్లో భాషా నిలయం భవనం ఉన్న చోటనే 1910లో ఒక పెంకుటిల్లు కొని, కొన్ని మార్పులు చేసి అందులో గ్రంథాలయం నెలకొల్పడం జరిగింది.

1915 సంవత్సరంలో ఆంధ్ర పితామహుడిగా ప్రసిద్ధిచెందిన మాడపాటి హనుమంతరావు పంతులు కార్యదర్శి పదవిని చేపట్టిన తర్వాత పాత ఇల్లు స్థానంలో కొత్త భవనం నిర్మించడానికి దీక్ష వహించారు. నాయని వెంకట రంగారావు, కర్పూరం పార్థసారథి, నాంపల్లి గౌరీశంకర వర్మ, లాల్ జీ మేఘ్‌జీల ఆర్థిక సహాయంతో భవన నిర్మాణం జరిగింది. ఈ భవనానికి ప్రఖ్యాత విద్యావేత్త కట్టమంచి రామలింగారెడ్డి సెప్టెంబరు 30, 1921 తేదీన ప్రారంభోత్సవం చేశారు.[4] ఇది సామాన్య ప్రజలలో పఠనాసక్తిని పెంపొందించే గ్రంథాలయంగా పనిచేయడమే కాకుండా, సామాజిక మరియు రాజకీయ క్రియాశీలతకు కేంద్రంగా మారింది.

2002లో జరిగిన శతాబ్ది ఉత్సవాల అనంతరం ఆధునిక నాలుగు అంతస్తుల భవనం నిర్మించబడింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ₹30 లక్షల గ్రాంటును ప్రకటించారు. ఐఏఎస్ అధికారి డా. కె.వి. రమణాచారి మార్గదర్శకత్వంలో 2007లో చేపట్టిన ఈ నిర్మాణానికి రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ (కోల్‌కతా), జి. సంజీవరెడ్డి (ఎంపీ నిధుల నుండి), మరియు తెలంగాణ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి నుండి కూడా గణనీయమైన ఆర్థిక సహాయం అందింది.[5]

ఉత్సవాలు

[మార్చు]

ఈ భాషా నిలయం జంట నగరాలకే కాక తెలంగాణ ప్రాంతపు ఆంధ్రులందరికీ కూడలి స్థలమైనది. ఉత్సవాలు, ప్రసంగాలు, సభలు, సమావేశాలు జరుపుకోవడానికి మంచి అవకాశం కలిగింది. శ్రీ కృష్ణదేవరాయల జయంతి ఉత్సవంతో ప్రారంభించి క్రమేణా నన్నయ, తిక్కన, పోతన, వేమన మొదలైన మహాకవుల జయంతి ఉత్సవాలను ప్రతియేట జరుపుతూ ఉండేవారు. ప్రాచీన కవులే కాక కందుకూరి, గురజాడ, గిడుగు, కొమర్రాజు వంటి ఆధునిక భాషా సేవకుల జయంతులు, వర్ధంతులు కూడా జరుపసాగారు. ఆంధ్రదేశం నలుమూలల నుంచి వివిధ రంగాలలో నిష్ణాతులైన పండితులను, రచయితలను, కవులను ఆహ్వానించి, సన్మానాలు చేశారు.

భాషా నిలయం స్థాపన జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో రజతోత్సవాలను 1927 ఫిబ్రవరి 16, 17, 18 తేదీలలో కావ్యకంఠ గణపతి శాస్త్రి గారి అధ్యక్షతన జరిగాయి. అప్పటి గౌరవ కార్యదర్శి బూర్గుల రామకృష్ణారావు ప్రధాన పాత్ర పోషించి రజతోత్సవ సంచిక ప్రచురించారు.

దీని స్వర్ణోత్సవాలు 1952 సెప్టెంబరు 1వ తేదీనుండి మూడు రోజులపాటు వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అధ్యక్షత వహించారు. అప్పటి ఆంధ్ర ప్రభుత్వ ఆస్థానకవి శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ప్రారంభోత్సవం చేశారు. ఉత్సవాలలో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం, స్త్రీల సభ, వైజ్ఞానిక సభ, సాహిత్య సభ, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ సంచికను ప్రచురించారు.

భాషానిలయ వజ్రోత్సవాలు 1962 సంవత్సరంలో వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన జరిగిన మూడు రోజుల ఉత్సవాలలో వివిధ సాహిత్య, సాంస్కృతిక విషయాలపై చర్చలు, గోష్ఠులు జరిగాయి. వజ్రోత్సవ సంచికను ప్రచురించారు.

భాషా నిలయపు అమృతోత్సవం 1977లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నేతృత్వంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉత్సవాలలో యావదాంధ్ర దేశం నుంచి వచ్చిన అనేకమంది రచయితలు, కవులు, కళాకారులు పాల్గొన్నారు.

శతాబ్ది ఉత్సవాలు 2002 సెప్టెంబరు 16వ తేదీన భాషా నిలయం ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ఉత్సవాలను ప్రారంభించారు.

2009 సెప్టెంబరు 4, 5 తేదీలలో శ్రీకృష్ణదేవరాయల పంచశతాబ్ది ఉత్సవాల సందర్భంగా బృహత్  సంచిక ప్రచురించారు.

ఈ గ్రంథాలయంలో సుమారు 53,000 పైగా గ్రంథాలు, పత్రికలు సేకరించబడి సాహితీ ప్రియులకు ఉపకరిస్తున్నాయి. ఈ భాషా నిలయం నేటికీ సాహిత్య సభలూ, సమావేశాలు జరిపిస్తూ కవి సమ్మేళనాల్ని నిర్వహిస్తూ తెలుగు భాషాభివృద్ధి కోసం పాటుపడుతున్నది.

శ్రీకృష్ణదేవరాయ తెలుగుభాషా నిలయం 2025 సెప్టెంబరు 1 నాడు 125వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. ఈ సందర్భంగా ఆ రోజు ప్రాంగణంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని ప్రస్తుత కార్యవర్గం సంకల్పించింది.[6]

ప్రస్తుత కార్యవర్గం

[మార్చు]

అధ్యక్షులు: డాll కె. వి. రమణాచారి ఐ.ఏ.ఎస్ (రి)

ఉపాధ్యక్షులు: కె. చంద్రప్రకాశ రావు

గౌరవ కార్యదర్శి: టి. ఉదయవర్లు

సంయుక్త కార్యదర్శి: డాll గంగు నరసింహ మూర్తి

కోశాధికారి: కె. జగదీశ్వర రావు

సలహాదారు: డాll ఎస్. సుదర్శన్ రావు

కార్యవర్గ సభ్యులు

  • నూతి శంకర రావు
  • ఆర్. మాధవ రావు
  • ఎ.వి. జనార్ధన రావు
  • యం. శ్రీనివాస రావు

మూలాలు

[మార్చు]
  1. "Andhra Bhasha Nilayam demolished in The Hindu". Archived from the original on 2008-03-22. Retrieved 2009-12-16.
  2. Ravi (2022-09-06). "తెలంగాణ తొలి గ్రంథాలయం గురించి తెలుసా". www.dishadaily.com. Retrieved 2025-08-02.
  3. వరంగల్ ముచ్చట. "తెలంగాణ సజీవ చరిత్రకు 115 ఏండ్ల సాక్ష్యమిది..." www.warangalmucchata.com. Retrieved 14 June 2017.[permanent dead link]
  4. "మన సాంస్కృతిక కూడలి". నమస్తే తెలంగాణ. ఆగస్టు 28, 2016. Archived from the original on 28 August 2016. Retrieved 29 August 2016.
  5. Murthy, Neeraja (2025-05-26). "Sri Krishnadeva Raya Telugu Bhasha Nilayam to celebrate 124th anniversary in Hyderabad". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2025-08-02.
  6. ABN. "A Legacy of Literary Enlightenment: అపూర్వ ఆధునిక దేవాలయం". Andhrajyothy Telugu News. Retrieved 2025-08-31.