ఆదిరాజు వీరభద్రరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆదిరాజు వీరభద్రరావు

వ్యక్తిగత వివరాలు

జననం నవంబరు 16, 1890
దెందుకూరు
మరణం సెప్టెంబరు 28, 1973

ఆదిరాజు వీరభద్రరావు (నవంబరు 16, 1890 - సెప్టెంబరు 28, 1973) తెలంగాణ ప్రాంతపు చరిత్ర, సంస్కృతిపై విశేష పరిశోధన చేసిన గొప్ప బాషా శాస్త్రవేత్త.

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

ఇతను 1890 నవంబరు 16న ఖమ్మం జిల్లా, మధిర మండలం, దెందుకూరు గ్రామంలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. చిన్న వయస్సులో ఉన్నప్పుడే తండ్రి లింగయ్య మరణించాడు. తల్లి వెంకమాంబ ఇతన్ని మంచి చదువు చదివించాలని తలచి దూరపు బంధువైన రావిచెట్టు రంగారావు ను ఆశ్రయించింది. రావిచెట్టు ప్రోత్సాహం, సహాయంతో ఆదిరాజు చాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలనుండి విద్యనభ్యసించి, రావిచెట్టు రంగారావు ఇంట్లో నెలకొల్పిన శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం గ్రంథాలయానికి తొలి గ్రంథపాలకుడిగా ఆదిరాజు వీరభద్రరావు నియమితులైనాడు.[1]

రచనా ప్రస్థానం

[మార్చు]

1908లో కొమర్రాజు లక్ష్మణరావు యొక్క విజ్ఞాన చంద్రికా మండలి హైదరాబాదు నుండి మద్రాసుకు తరలి వెళ్ళవలసి వచ్చిన తరుణంలో, లక్ష్మణరావు విజ్ఞప్తి మేరకు వీరభద్రరావు కూడా మండలిలో పనిచేయటానికి మద్రాసు వెళ్ళాడు. మండలిలో పనిచేస్తున్న సమయంలో అనేక ప్రసిద్ధ రచయితలు, కవులు, పండితులు, పరిశోధకులతో పరిచయం ఏర్పడింది. లక్ష్మణరావుచే ప్రభావితుడై, ఆయన మార్గదర్శకత్వంలో చక్కని పరిశోధకునిగాను, బాధ్యతాయుత రచయితగాను శిక్షణ పొందాడు. 1914లో హైదరాబాదుకు తిరిగివచ్చి మహబూబ్ కళాశాలలో తెలుగు ఆచార్యునిగా నియమితుడయ్యాడు. ఆ తరువాత ఛాదర్‌ఘాట్ ఉన్నత పాఠశాలలోనూ, నారాయణగూడలోని బాలికోన్నత పాఠశాలలోనూ తెలుగు పండితునిగా పనిచేశాడు. మర్రి చెన్నారెడ్డి ఇతని శిష్యులలో ప్రముఖుడు.[2]

1921లో తెలంగాణ సాహితీ సాంస్కృతిక వికాసానికై ఆంధ్ర పరిశోధక మండలి స్థాపించినప్పుడు దానికి కార్యదర్శిగా ఆదిరాజు పనిచేశాడు. ఆ సంస్థ తెలంగాణ లోని పలు చారిత్రక ప్రదేశాలు, శిలా శాసనాలు, తాళపత్ర గ్రంథాలు సేకరించి "తెలంగాణ శాసనాలు" పేరిట పెద్ద గ్రంథాన్ని ప్రచురించుటలో ఆదిరాజు కృషి నిరుపమానమైనది. కాకతీయ రాజ్య పతనానంతరం ఓరుగల్లును ఏలిన సీతాపతి (షితాబుఖాను) చరిత్రను వెలువరించాడు. తెలంగాణ 9 జిల్లాల చరిత్రను, భాగ్యనగరం గ్రంథాలను కూడా రచించాడు.

సారస్వత, గ్రంథాలయ సేవ

[మార్చు]

ఇతడు శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంలో లైబ్రేరియన్‌గా, కార్యదర్శిగా, అధ్యక్షుడిగా పనిచేశాడు. విజ్ఞానచంద్రిగా గ్రంథమాల కార్యాలయ ప్రముఖుడిగా, ఆంధ్ర జనసంఘ కార్యవర్గ సభ్యుడిగా, లక్ష్మణరాయ పరిశోధకమండలి కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వతపరిషత్తు స్థాపక సభ్యుడిగా, ఆంధ్ర చంద్రికా గ్రంథమాల ప్రధాన సంపాదకుడిగా, విజ్ఞానవర్ధినీ పరిషత్తు సభ్యుడిగా, సంగ్రహాంధ్ర విజ్ఞానకోశ ప్రధాన సంగ్రాహకుడిగా, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ విశిష్ట సభ్యునిగా ఇతడు తన సేవలను అందించాడు.

అలనాటి దక్కన్ రేడియోలో తెలుగులో మొట్టమొదటి ప్రసంగం చేసిన ఘనత ఇతనికే దక్కింది.

మరణం

[మార్చు]

1973, సెప్టెంబరు 28 న మరణించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. చరితార్థులు మన పెద్దలు, మల్లాది కృష్ణానంద్ రచన, 2012 ప్రచురణ, పేజీ 64
  2. వేపచేదు.ఆర్గ్‌లో ఆదిరాజు వీరభద్రరావుపై వ్యాసం
  3. తెలుగు సాహితీవేత్తల చరిత్ర, మువ్వల సుబ్బరామయ్య రచన, 2012 ప్రచురణ, పేజీ 221