Jump to content

అందరూ బాగుండాలి

వికీపీడియా నుండి

'అందరూ బాగుండాలి' తెలుగు చలన చిత్రం, పద్మశ్రీ పిక్చర్స్ పతాకంపై, పోలిదాసు పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కైకాల సత్యనారాయణ, సంగీత, శాంతకుమారి,మొదలగు తారాగణం నటించారు. ఈ చిత్రానికి సంగీతం మాస్టర్ వేణు అందించారు .

అందరూ బాగుండాలి
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం పి.పుల్లయ్య
నిర్మాణం పి.వెంకటేశ్వర్లు
కథ కొట్టార్కర
తారాగణం కైకాల సత్యనారాయణ,
సంగీత,
శాంతకుమారి
సంగీతం మాస్టర్ వేణు
నృత్యాలు వెంపటి సత్యం,
రాజు - శేషు
గీతరచన ఆత్రేయ,
దాశరథి
సంభాషణలు గొల్లపూడి మారుతీరావు
ఛాయాగ్రహణం యస్.యస్.లాల్
కూర్పు ఎన్.ఎం.శంకర్
నిర్మాణ సంస్థ పద్మశ్రీ పిక్చర్స్
భాష తెలుగు

నటీనటులు

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: పి పుల్లయ్య

సంగీతం: మాస్టర్ వేణు

నిర్మాత: వి.వెంకటేశ్వర్లు

నిర్మాణ సంస్థ: పద్మశ్రీ పిక్చర్స్

సాహిత్యం: దాశరథి, ఆత్రేయ,

నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వి.రామకృష్ణ, బి.వసంత, ఎల్.ఆర్ ఈశ్వరి, మూర్తి.

విడుదల:30:01:1976

జానకమ్మకు ముగ్గురు కొడుకులు - సూర్యం, చంద్రం, వాసులు. మంచిగా మర్యాదగా బ్రతకాలి అని ఆమె తన బోధించేది. ఉద్యోగాల కోసం తిరిగి తిరిగి వేసారి పోయిన ఆ యువకులు ముగ్గురూ చిన్న చిన్న తమాషాలు చేస్తూ డబ్బు సంపాదించడం మొదలు పెట్టారు. కాని అసలు బండారం బయటపడి జానకమ్మ చేత చీవాట్లు తిన్నారు.

లక్షాధికారి విశ్వేశ్వరరావు మేనకోడలు గీత, వడ్డీ వ్యాపారి గోవిందయ్య కూతుళ్ళు చంప, విజయలు స్నేహితురాళ్ళు. ఒకసారి పిక్నిక్‌లో కొందరు దుర్మార్గులు అల్లరిపెట్టగా సోదరులు ముగ్గురూ వారిని రక్షిస్తారు. స్నేహం కుదిరింది. వాసు - గీతల మనసులు కలిసాయి. ఇది విశ్వేశ్వరరావు బాబాయి కొడుకు బలరామ్‌కు కన్నెర్ర జేసింది. అతనికి, వాసుకు ఒకసారి ఘర్షణ జరిగింది కూడా. బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన కోటీశ్వరులుగా గోవిందయ్యకు పరిచయం చేయబడ్డారు సూర్యం, చంద్రం, వాసులు. కోటీశ్వరులు అల్లుళ్ళుగా దొరికారని గోవిందయ్య ఆనందానికి అంతులేదు. ఐతే ఈ ముగ్గురి అల్లరి చేష్టలకు అంతులేకపోయింది. వీళ్ళ అసలు గుట్టు తెలుసుకున్న గోవిందయ్య ఆ ముగ్గుర్ని తూలనాడి, హెచ్చరిక చేసి పంపించేశాడు. ప్రతీకారంగా ఆయన్ని పరాభవించాలనుకున్నాడు సూర్యం. వలపన్నాడు; కాని ఫలితం సూర్యం జైలు పాలయ్యాడు. సూర్యాన్ని విడిపించాలన్న చంద్రం వాసుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. సూర్యం తన పెంపుడు కొడుకు మాత్రమేనని, అసలతను స్వయాన విశ్వేశ్వరరావు కొడుకేనని జానకమ్మ విశ్వేశ్వరరావుతో చెప్పి సూర్యాన్ని విడుదల చేయించింది.

ఇంతకాలానికి తన కొడుకు దొరికాడన్న సంబరంలో విశ్వేశ్వరరావు గొప్ప విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో చంద్రం, వాసులు పరాభవింపబడ్డారు. సూర్యానికి గీతనిచ్చి వివాహం నిశ్చయించాడు విశ్వేశ్వరరావు. తన యావదాస్తిని సూర్యానికి విల్లు వ్రాయడానికి కూడా ఏర్పాటు చేశాడు. ఈ పరిణామాలకు బలరామ్‌ అగ్గి అయిపోయాడు. ఏనాడో అతనికి విశ్వేశ్వరరావు ఆస్తిపాస్తులపై కన్నుపడింది. తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి యుక్తులు, కుయుక్తులు పన్నసాగాడు. సూర్యానికి - చంద్రం వాసుల మధ్య పొసగకుండా చేశాడు. ఒకసారి గీతను చూడ్డానికి వచ్చిన వాసుమీద సూర్యను చేయి చేసుకున్నాడు. మందలించడానికి వచ్చిన జానకమ్మను లెక్కచేయకుండా కారెక్కి వెళ్ళిపోయారు సూర్యం బలరాములు.

జానకమ్మ కారు ప్రమాదానికి గురవుతుంది. ఆస్పత్రిలో చావు బ్రతుకుల్లో వున్న జానకమ్మ సూర్యాన్ని గురించి కలవరించింది.

విశ్వేశ్వరరావుపై సముద్రపు ఒడ్డున ఎవరో తుపాకి పేల్చారు.

జానకమ్మ ఆస్పత్రిలో మాయమైంది.

చివరకు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ జరిగి అందరూ బాగుంటారు.[1]




పాటల జాబితా

[మార్చు]

1.ఆడుకుందాం పాడుకుందాం చేసుకుందాం పండుగ, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల

2.జగమే మాయ బ్రతుకేమాయ వీరబ్రహ్మం, రచన:ఆచార్య ఆత్రేయ, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, విస్సంరాజు రామకృష్ణ దాస్.

3.త్రుళ్లి త్రుళ్లి పడుతోంది, రచన: ఆత్రేయ, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత, ఎల్ ఆర్ ఈశ్వరి, వి.రామకృష్ణ, మూర్తి

4.దైవం ఉన్నా లేకున్నా ఉన్న దైవం, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వి.రామకృష్ణ, బి.వసంత

5.మన్నించండి దొరగారు మా మనవి కాస్త వింటారా, రచన: ఆత్రేయ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల

మూలాలు

[మార్చు]
  1. సంపాదకుడు (1 November 1975). "పద్మశ్రీ పిక్చర్స్ అందరూ బాగుండాలి". విజయచిత్ర. 10 (5): 20–22.

2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బయటిలింకులు

[మార్చు]