రాజనాల కాళేశ్వరరావు
రాజనాల కాళేశ్వరరావు నాయుడు | |
జన్మ నామం | రాజనాల కాళేశ్వరరావు నాయుడు |
జననం | జనవరి 3, 1925 |
మరణం | మే 21, 1998 (వయసు 73) చెన్నై, తమిళనాడు |
ఇతర పేర్లు | రాజనాల |
భార్య/భర్త | ఆర్.బి.దేవి |
రాజనాల ఇంటి పేరు గల ఇతర వ్యాసాల కోసం అయోమయ నివృత్తి పేజీ రాజనాల చూడండి.
రాజనాల (జనవరి 3, 1925 - మే 21, 1998) తెలుగు సినిమా నటుడు. ఇతని పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు నాయుడు. పౌరాణిక, జానపద,సాంఘిక చిత్రాలలో కంసుడు, జరాసంధుడు, మాయల ఫకీరు, భూకామందు, దొంగల నాయకుడు కూడా ప్రతినాయక పాత్రలలో రాణించాడు.
విషయ సూచిక
జీవిత విశేషాలు[మార్చు]
నెల్లూరు జిల్లా కావలి కి చెందిన రాజనాల అసలు పేరు రాజనాల కల్లయ్య (రాజనాల కాళేశ్వరరావు). ఈయన 1925, జనవరి 3న జన్మించాడు. ఇంటర్ చదువుతూనే 1948లో నెల్లూరులో స్నేహితుడు లక్ష్మీకుమార్ రెడ్డితో కలిసి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ అనే నాటక సంస్థను ప్రారంభించాడు. మొదటగా నెల్లూరు టౌన్‌హాలులో ఆచార్య ఆత్రేయ ‘ఎవరు దొంగ’ నాటకాన్ని ప్రదర్శించారు. నాటకం చూసిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ప్రభుత్వ శాఖలోని అవినీతిని బట్టబయలు చేశావంటూ రాజనాలపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆ తరువాత ‘ప్రగతి’ అనే నాటకాన్ని ప్రదర్శించగా కోపగించిన కలెక్టర్ రాజనాలను సస్పెండ్ చేశారు. ఆ తరువాత ఉద్యోగం వచ్చినా ఇష్టంగా చేసేవారు కాదు.
సినిమా ప్రస్థానం[మార్చు]
1951లో రాజనాలకు మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి నుంచి మద్రాసుకు పిలుపువచ్చింది. అప్పటికే లక్ష్మీకుమార్‌రెడ్డి నిర్మాత హెచ్. ఎం. రెడ్డి వద్ద పని చేస్తున్నారు. వారు తీసే ‘ప్రతిజ్ఞ’ సినిమాకు విలన్‌గా రాజనాలను ఎంపికచేశారు. నెలకు రూ.200/– జీతానికి హెచ్‌ఎం రెడ్డితో కాంట్రాక్టు కుదుర్చుకున్నాడు. 1953లో విడుదలైన ఆ సినిమా విజయవంతమై అందరికీ మంచి పేరు తీసుకొచ్చింది. పాతికేళ్ల వయసులోనే ‘వద్దంటే డబ్బు’ సినిమాలో ఎన్టీఆర్కు మామగా ముసలి జమీందారు పాత్రలో నటించాడు. అప్పటినుంచి ఎన్టీఆర్‌కు అత్యంత సన్నిహితంగా మెలిగారు. 1966లో ‘మాయా ది మెగ్నిషిమెంట్’ అనే హాలివుడ్ సినిమాలో నటించి, హాలివుడ్‌లో నటించిన తొలి తెలుగు నటునిగా రికార్డు సృష్టించారు. 25 ఏళ్లపాటు విలన్‌గా, హాస్యనటుడుగా తారాజువ్వలా వెలుగొందాడు.
ఇతర వివరాలు[మార్చు]
దాదాపు 45ఏళ్ళు అత్యంత వైభవంగా బతికిన రాజనాల చివరి దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు. 1979లో భార్య మరణించడంతో ఆయన వైభవం తగ్గుతూ వచ్చింది. ‘భీమాంజనేయ’ అనే భక్తి, సంగీత ప్రాధాన్య సినిమా సొంతంగా నిర్మించాలన్న ఆయన కోరిక నెరవేరలేదు. 1984లో ఆయన కుమారుడు కులవర్ధన్ మూర్ఛవ్యాధితో మృతి చెందగా, మరో కుమారుడు కాళీచరణ్ బొంబాయి వెళ్లి అదృశ్యమయ్యారు. దీంతో 1991లో మద్రాసులో ఉన్న వన్నీ అమ్మేసి మిత్రులు, అభిమానుల సహాయంతో హైదరా బాద్ అమీర్‌పేట రూబీ అపార్టుమెంట్లో ఒక చిన్న గదిని కొనుగోలు చేసి తన రెండవ భార్యతో కాపురం పెట్టారు. 1995లో ‘తెలుగు వీర లేవరా’ అనే సినిమాలో నటించారు. హీరో కృష్ణతో కలిసి అరకులో షూటింగ్లో ఉండగా కాలికి దెబ్బ తగిలింది. ఇన్ఫెక్షన్ కావడంతో 1995 డిసెంబరులో కాలు తీసేశారు. అభిమానుల సహాయంతో చివరి రోజుల్లో జ్యోతిష్యం, అష్టసాముద్రికం చెప్పుకుని జీవించాడు. సైగల్, ఎం.ఎస్.రామారావు లాగా అద్భుతంగా పాటలు పాడేవారు.
మరణం[మార్చు]
చివరి రోజులలో మధుమేహం వ్యాధితో బాధపడుతూ 1998, మే 21న హైదరాబాద్‌లో మరణించాడు.[1]
నటించిన చిత్రాలు[మార్చు]
- హలో బ్రదర్ (1994)
- భలే తమ్ముడు (1985)
- పటాలం పాండు (1981)
- నకిలీ మనిషి (1980)
- గంధర్వ కన్య (1979)
- ఉత్తమురాలు (1976)
- అందరూ బాగుండాలి (1975)
- అల్లూరి సీతారామరాజు (1974) - మేజర్ గుడాల్
- గండర గండడు (1969)
- సప్తస్వరాలు (1969)
- వరకట్నం (1968)
- గూఢచారి 116 (1967)
- శ్రీకృష్ణావతారం (1967)
- శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
- పల్నాటి యుద్ధం (1966)
- శ్రీకృష్ణ పాండవీయం (1966)
- దేవత (1965)
- సత్య హరిశ్చంద్ర (1965)
- బొబ్బిలి యుద్ధం (1964)
- రాముడు భీముడు (1964)
- నర్తనశాల (1963)
- పరువు ప్రతిష్ఠ (1963)
- గుండమ్మ కథ (1962)
- దక్షయజ్ఞం (1962)
- సిరిసంపదలు (1962)
- గులేబకావళి కథ (1962)[2]
- జగదేకవీరుని కథ (1961)
- ఉషాపరిణయం (1961) - శివుడు
- సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి (1960)
- శ్రీ వెంకటేశ్వర మహత్యం (1960)
- రాజమకుటం (1959)
- సువర్ణసుందరి (1957)
- కుటుంబ గౌరవం (1957)
- వినాయక చవితి (1957)
- తెనాలి రామకృష్ణ (1956)
- జయసింహ (1955)
- ప్రతిజ్ఞ
- పిడుగురాముడు
- అగ్గిపిడుగు
మూలాలు[మార్చు]
- ↑ జీ తెలుగు, వినోదం (3 January 2018). "రాజనాల... తెలుగు విలన్లకే రారాజు..!". మూలం నుండి 15 April 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 April 2019. Cite news requires
|newspaper=
(help) - ↑ ఆంధ్రభూమి (19 January 2019). "గులేబకావళి కథ (నాకు నచ్చిన సినిమా)". కాకుటూరి సుబ్రహ్మణ్యం. మూలం నుండి 15 April 2019 న ఆర్కైవు చేసారు. Retrieved 15 April 2019. Cite news requires
|newspaper=
(help)
వనరులు[మార్చు]
- వెండితెర నేలనేలిన రాజనాల, సితార వెబ్
- ఈతకోట సుబ్బారావు, ఆంధ్రజ్యోతి, 3.1.2018
- http://earlytollywood.blogspot.com/2008/02/rajanala-kaleswara-rao.html