పల్నాటి యుద్ధం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పల్నాటి యుద్ధం, ఆంధ్ర ప్రాంతం లోని పల్నాడు ప్రాంతములో 1182 వ సంవత్సరంలో జరిగింది. మహాభారతం నకు, పల్నాటి వీరుల చరిత్రకు దగ్గరి పోలికలు ఉండటం చేత దీనిని ఆంధ్ర భారతం అనికూడా అంటారు. పల్నాటి యుద్ధం 12వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో రాజకీయ, సాంఘిక, మతమార్పులకు దోహదం చేసిన కీలక యుద్ధం. ఈ యుద్ధం తీరాంధ్రలోని రాజవంశాలన్నింటిని బలహీనపరచి కాకతీయ సామ్రాజ్య విస్తరణకు మార్గం సుగమం చేసింది.

చారిత్రకత

[మార్చు]

సా.శ.1176-1182 మధ్యకాలంలో కారంపూడి వద్ద పల్నాటి యుద్ధం జరిగింది. ఇందులో జరిగిన అపారమైన జన, ఆస్తి నష్టం వల్ల ఆంధ్ర రాజులందరూ బలహీనులయ్యారు. ఈ పరిస్థితిలో ఓరుగల్లు కాకతీయులు ఇక్కడున్న రాజులందరినీ ఓడించారు. పల్నాటి యుద్ధం ఆంధ్రదేశంలో ఎంతో ప్రాచుర్యం పొందిన యుద్ధం అయినప్పటికీ సమకాలీన శాసనాలలో గానీ, ఆ తరువాత శాసనాలలో గానీ ఈ యుద్ధం యొక్క ప్రస్తావన ఎక్కడా లేదు. శాసనాలలో పేర్కొనక పోయినా ఈ యుద్ధం జరగలేదని భావించుటకు వీలులేదు. క్రీడాభిరామంలో పలనాటి యుద్ధ గాథలు పేర్కొనటమే గాక ఓరుగల్లు నగరంలో వీరచరిత్రను గానం చేయటం, అక్కడి యువకులు ప్రేరణ పొందటం, ఓరుగల్లు ఇళ్లలో పలనాటి యుద్ధ చిత్రాలు చిత్రించబడి ఉండటాన్ని వర్ణిస్తుంది.

ఈ క్రీడాభిరామానికి మూల సంస్కృత గ్రంథమైన ప్రేమాభిరామాన్ని రావిపాటి త్రిపురాంతకకవి పలనాటి యుద్ధం జరిగిన తరువాత 50-60 సంవత్సరాలకు వ్రాశాడు. పలనాటి యుద్ధంలో ఓడిపోయిన బ్రహ్మనాయుని అనుయాయులు ఓరుగల్లు చేరి కాకతీయుల కొలువులో చేరారు. కనుక ఓరుగల్లులో పలనాటి వీరగాధ బాగా ప్రచారంలోకి వచ్చింది. ఇదే విషయము ప్రేమాభిరామంలో కూడా పేర్కొనబడింది.

యుద్ధం జరిగిన స్థలం

[మార్చు]
పల్నాటి యుద్ధం జరిగిన ప్రదేశంలోని వీరుల గుడి

కారంపూడిలో యుద్ధం జరిగిన స్థలం గుర్తించబడింది. యుద్ధంలో మరణించిన వీరులకు గుడి కట్టి ఉంది. పలనాటిలో ఆ వీరులకు పేరు పేరునా ప్రతి సంవత్సరం పూజలు జరుగుచున్నవి. కనుక పలనాటి యుద్ధం యథార్థ చారిత్రక సంఘటనే అని చెప్పవచ్చు.

పలనాడు శబ్దం

[మార్చు]

వెల్నాడు, పల్నాడు, పోల్నాడు, వేగినాడు, కోర్నాడు-ఇలా అన్ని నాడులు ఆంధ్రారాష్ట్ర భాషతో బాటు అమల్లో కొచ్చినపేర్లు. వెల్నాడు 'వలనాడూ గా, పల్నాడు 'డాపలనా' డై 'డా' పోయి 'పల్నాడు' కావచ్చును. వేగినాడు అనేపదానికి వేడినాడు అని అర్ధం చెప్పి మిట్టమధ్యాహ్నంగా భావిస్తే 'పలపల' అనేపదానికి తెల్లవారు అనే అర్ధం చెప్పుకోవచ్చును. పలపలనడు- మేలుకొన్న ప్రదేశమనో, వెలుగున్న ప్రదేశమనో అనుకోవచ్చును. ఒక పల పోయి పలనాడు అని మిగిలియుండవచ్చును. అర్ధం ఏదైయినా వీరచరిత్రను బట్టి చూస్తే పలనాడు మంచి నాగరికత వైభవంతో తులతూగిన సామ్రాజ్యంగా తట్టితీరుతుంది.

నాయకురాలు నాగమ్మ

[మార్చు]
నాయకురాలు నాగమ్మ పెయింటింగ్ చిత్రం

ప్రపంచంలోనే తొలి మహిళా మంత్రి. వితంతువైనా స్వశక్తితో అత్యున్నత స్థాయికి ఎదిగిన ధీరోదాత్త వనిత. కత్తిసాము, గుర్రపు స్వారీ చేసేది. దాచేపల్లిలో ఆమె విగ్రహం ఉంది. గామాలపాడులో ఆమె శివాలయం నిర్మించింది. గురజాలలో దూబచెరువు తవ్వించింది. పలు వాగులపై వంతెనలు నిర్మించింది.

సాహిత్యంలో పల్నాటి యుద్ధం

[మార్చు]
కైలాసగిరిలోని తెలుగు సాంస్కృతిక నికేతనంలో పల్నాటి యుద్ధం సూచించే శిల్పం

పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు మూడు వందల సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించాడు. ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దం) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతంలో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతం అను పేరుతో మనోహరమైన పద్యకావ్యంగా రచించాడు.పల్నాటి వీరచరిత్రలో బాలచంద్రుని యుద్ధ ఘట్టం మాత్రమే శ్రీనాథుడు రచించాడని పరిశోధకుల అభిప్రాయం. మిగిలిన కథా భాగాలు కొండయ్య,మల్లయ్య రచించినవి. శ్రీనాథుడు పూర్తి గ్రంథం రచించి ఉంటే అది కాలగర్భములో కలిసిపోయిందేమో తెలియదు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911లో అచ్చువేయించాడు. కొండయ్య, మల్లయ్య రచనలను కూడా చేర్చి, సంపూర్ణ గ్రంథాన్ని సంస్కరించి 1961లో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం ప్రచురించాడు.

పర్నాటి వీరచరిత్రలో కథమొత్తం నవలలాగు నడుస్తుంది. అన్న ముక్క మళ్ళీ రాదు. వర్ణనలో పౌనరుక్త్యం లేదు. సూటిగా యుద్ధానికి క్కారణం మొదటి పంక్తిలోనే సూచింపబడుతుంది - "మేడపిలో అలరాజు చావు.". ఈ చావును గురించిన వెనుక ముందులు అక్కడక్కడ ప్రస్తావింపబడింది. మరీ విశ్లేషించి వ్రాయబడలేదు. మలిదేవుడు మేడపిలో పాట్టం గట్టి 'నలగాముతో' పోరాడ్డానికిగాను 'కార్యమాపూడి (కారంపూడి) కదనరంగానికీ 'జయముహూర్తం' పెట్టించుకొని పయనిస్తాడు. దండు పయనిచండం దారిపొడుగుతా వినిపిస్తాయి- డమాయీలు, కాహళలు, మురజలు, బూరలు, శంఖాలు, మురళి జయం, తప్పెటలు, రుంజలు, డోళ్ళు, చిరుగంటలు వీటి గురించి శ్రీనాధుడి వర్ణన దివ్యస్వరూపాల్తో మూర్తీభవించి ఉంటారు. మలిదేవభూపతి, బ్రహ్మన్న. ఇందులో శ్రీనాధుడి కథనాచాతుర్యం అసమానం. అంతకు ముందు ఆంధ్రగ్రంధంలో గాని, సంస్కృత గ్రంథంలో గాని వినియుండని విషాదాంతగాధకు కవి సత్కళాసౌందర్యం అతికించాడు. ఇందులో బాగా పేరుగాంచిన రసఖండిక "బాలచంద్రయుద్ధం". ఇందులో బ్రహ్మన్నను యుద్ధానికి హెచ్చరిస్తున్నట్లు ముందుగా తెలుపబడింది. బ్రహ్మాన్న ప్రార్థన. బ్రహ్మన్న సంధి ప్రయత్నం, నలగాముని వైభవ వర్ణన ఇందులో చక్కగా కవి చక్కగా వర్ణించాడు.

"ఓ విశ్వమానవమూర్తీ! ఓ విశ్వకర్త!
               ఓ లోకపావన! యో జగద్భరణ!
               యో శాంభవీదేవీ! యో జగన్మాత!
               సమరంబునకు నీవు సాక్షివైయుండు"

బాలచంద్రుడు బంగారుబొంగరాల ఆట ఇందులో ప్రధానత చాటురించుకున్నది. బాలచంద్రుడు తనతండ్రీ, తన ప్రభువు యుద్ధానికి వెళ్ళినప్పుడు బొంగరాలు ఆడుతూ ఓభోగం దాని ఇంట నిదురపొతూ ఉంటాడు. అటుపై బొంగరాల ఆటప్పుడు అన్నమ్మ అనే వైశ్యకాంతయొక్క బొంగరం బాలచంద్రుని బొంగరానికి తగుల్తుంది. దాంతో ఆ " ఆచక్కటి కోమటిజలజాయతాక్షి" బాలుని తిడుతుంది. తిడుతూ బాలచంద్రుని ఎగసం చేస్తుంది.

" మీ యయ్యలెల్లను మించినబలిమి 
               జేరి వైరులతోడ శ్రీయుద్ధభూమి 
               నుప్పొంగుచున్న వా రుర్వీశునెదుట
               వారిలో గలియు నీవడి కానవచ్చు"

అని ఎసగొల్పుతుంది. కార్యంపూడి వెళ్ళారని చెప్పదు. దాంతో బాలచంద్రునికి నిజం తెలుసుకోవాలని కుతూహలం కలుగుతుంది.తల్లిఅయిన ఇతాంబను అడుగుతాడు. ఇతాంబ ఎన్నోనోములు నోచి కన్న బాలచంద్రునికి నిజం చెప్పదు. కాని ఇతడు వినుకోడు. మరి ఇతణ్ణి యుద్ధ విముఖుణ్ణి చేయడం తనవల్ల కాదని తలపోసి ఆతల్లి ఆతనయుణ్ణి గండువారింటికి అంపుతుంది. గండువారంటే బాలచంద్రుని అత్తవారు. గండుకన్నమ కుమార్తె అయిన మాంచాలను బాలచంద్రునికిచ్చి పెళ్ళి చేస్తారు, కాని వీరీద్దరి మధ్య సరిఅయిన సంసారము లేదని, అప్పటి సంప్రదాయం ప్రకారము యుద్ధంనకు వెళ్ళే ముందు భార్య దీవెనకోసం వెళ్ళుట జరుగుతుంది.

"సంపెంగతైలంబు చయ్యన దెచ్చి 
               మగువకు శిరసంటి మంచి గంధమున
               నటకలి రాచిరి యానూనె పోవ
               బంగారుబిందెల పన్నెరు దెచ్చ
               స్నానమాడించిరి సంతసం బొప్ప!"

ఆమె ఎన్ని చేసినా బాలచంద్రుడు కొదమసింహంలా మెరిసిపోతూ ఆలిని ఆశీర్వదించుమనుట, నవ్వుచు ఆనలినాయతాక్షి దీవించి ఆయుధం చేతికిచ్చి యుద్ధంనకు పంపుట, పంపేముందు సలహా చెబుతుంది. అనపోతు అనే బ్రాహ్మణవీరుని వెంటపెట్టుకుపోవద్దంటుంది. అతనుగాని యుద్ధంలో చనిపోతే అని మగనికి బ్రహ్మహత్యదోషం పట్తుకుంటుందని భయంతో చెప్పింది. నిజానికి ఈఅనపోతు బాలచంద్రునికి వరసకు అన్నగారు. ఎటుల అనగా బాలచంద్రుని తల్లి ఇతాంబ సంతానానికిగాను నిమ్మచెట్టును ఒక ఏడాది పూజిస్తే ఆనిమ్మచెట్టు ఒక ఫలం ఇస్తుంది. దాన్ని ఎనిమిది ముక్కలుగా చేసి తొలిముక్క విప్రకాంతకు పెట్టింది. తక్కిన ఆరున్నొక్క ముక్క తానున్ను, తన ఆరుగురు సపతులున్నూ తిన్నారు. ఈ విప్రక్కాంత కుమారుడే అనపోతు. అనపొతు అన్నంత పనీ చేయగల సమర్ధుడు. బాలచంద్రుడు మాంచాల మాటను విని అనపోతుని ఏదో నెపంతో అనపోతును వెనక్కు పంపివేస్తాడు. పంపివేసి అక్కణ్ణే రావిచెట్టుకు ఓచీటీ కట్టి తిరిగి రావడంలో ఆరావిచెట్టు దాటరాదని, అనపోతు తిరిగి వచ్చి, మాయ గ్రహించి తాను యుద్ధానికి వెళ్ళక పోయినట్టయితే ఇక బ్రతకటమెందులకు అని ఆరావిచెట్టు క్రిందనే పొడుచుకు చనిపోయాడు. చనిపోయే ముందు మాడచి అనే ఓ దారిపోయే చిన్నదాన్ని పిలచి దాని ద్వారా తన నెత్తురుజందెం, తన బిరుదు బాలచంద్రునికి పంపుతాడు. ఈ జందెం, ఈ బిరుదు, ఈ సాహసపు ఆత్మహత్య వీరులందరూ ఇరుప్రక్కలవారూ సంధిమాటలు గావించుకొని విందులార గింపబోయే సమయానికి బాలచంద్రునికి తెలుస్తాయి. వెంటనే యుద్ధం చేయవలె అని తండ్రితో నరసింగు తలనరికి తెచ్చి పెడతాను అను పూనుట జరుగుతుంది.

"వీరులు దొరలును వేగమె లేచి
             సంధికార్యము మాని జాహ్నవికేగి 
             యామడ్గులో వేసి రన్న మంతయును."

తరువాత బాలచంద్రుడు నరశింగుని తలనరుకుట, తండ్రి పాదాల దగ్గర పెట్టడం, అటుపై సంకుల సమరంలో బాలచంద్రుడు అభిమన్యుడు లా వీర మరణం చెందుట చెప్పబడుతుంది.ఇలా రణరంగంలో ఒక వంక బాలచంద్రుని చావు, మరొక ప్రక్క నాయకురాలు నాగమ్మ బంధింపబడుట యుద్ధంలో విషాద సన్నివేషాలు. నాయకురాలు నాగమ్మ బాలవితంతువట. ఆమె అసలు ఊరు ఓమారుమూల పల్లెటూరట. ఆమె వచ్చి నలగాంరాజుకు మంత్రిత్వం చేసింది. పల్నాటి చరిత్రలో ఆమె విదూషీమణి! వీరనారీమణి! విచిత్రవిఖ్యాతఖని!. యుద్ధభూమిలో మలిదేవుని మరణించుట, తుదకు నలగాముడు, బ్రహ్మన్న, మాత్రమే మిగిలిపోయి "పోరు నష్టం పొందు లాభం" అనే మార్గాన్ని అవలంబించుట, ఏకరాజ్యంగా, రామరాజ్యంగా గురిజాలను రాజధానిగా చేసుకోవడంతో కథ ముగిస్తుంది.తరచితే తరుగని మహాగాధ ఈ వీరచరిత్ర. వలసలూ వనవాసాలూ ఎన్నో ఉన్నాయి. మహిమలూ మంత్రాంగాలూ చాలా ఉన్నాయి. ఆంధ్రులకు సంబంధించిన ఆనలూ ఆంవాయితలూ అసంఖ్యాకాలు.

అలరాచమల్లు గారి గురజాల రాయబారం

[మార్చు]

మద్రాసు ప్రాచ్యలిఖిత పుస్తకభాండాగారంనందు, కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్ గ్రంథాలయంనందు, గుంటూరు నెల్లూరు మండలంలలో ఉన్న వీరవిద్యావంతు లనబడెడి గాథాకారుల (minstrels) కడను పల్నాటి వీరగాధలకు సంబంధించిన తాళపత్రపత్రులు, వ్రాతప్రతులు పెక్కుగలవు. ఇట్టివానిలో అలరాచమల్లుగారి గురజాల రాయబారం అను వీరగాధనుగూర్చి వివరించుచున్నవి. ఈ వీరగాధను గురిజాల రాయబారం అనియు, అలరాజు రాయబారం అను పేరును ఉన్నాయి. పల్నాటి వీరకథాచక్రమును వచ్చు వీరు లందరిలోను అలరాజు మిక్కిలి గొప్పవాడు.ఈగాధలలో పెద్దన్న, బ్రహ్మన్న మున్నగు మహావీరులు సైతము ఇతని తరువాతివారే. కాని ఆంధ్రులు లీతనిని నాగమ్మ విషప్రయోగమ వలన మరణించిన అర్చకునిగా జమకట్టి,బ్రహ్మనాయకునికి లేని ప్రాముఖ్యాన్ని అంటగట్టిరి. ఆతనిని నాగమ్మ పంపిన విషాన్నాన్ని జీర్ణించుకున్న అవతారమూర్తిగా చిత్రించారు.

అలరాజు కల్యాణాన్ని ఏలిన వీరసోముని పౌత్రుడు. ఈ వీరసోముడు కాలచుర్య బిజ్జలుని పుత్రుడని చారిత్రుకులు భావించుచున్నారు.వీరగాధలలో ఇతడు చోళరాజని ఉంది.కొమ్మరాజు-చల్లమాదేవుల ఏకైక పుత్రుడు.ఇతడు నలగాముని ఏకైక పుత్రికయగు రత్నాల పేరమ్మను వివాహమాడెను. అలరాజు మేనత్త అగు సిరాదేవి పెదమలి దేవుని భార్య ఇట్లు, అటు నలగామునకును, ఇటు మలిదేవునకును ఆప్తబంధువు అలరాజు.మైలమ దేవికి అరణముగావచ్చిన పల్నాటికి నలగాముడు రాజయ్యెను. పుత్రులులేని ఈ నలగాముని రాజ్యంనకు రత్నాలపేరమ్మ భర్తయగు అలరాజే వారసుడు. ఈచిక్కును గుర్తించియే కాబోలు, నరసింగరాజునకు పట్టంగట్టించిన నాగమ్మ ఇతనిపై విషప్రయోగము చేసింది.

అలరాజు మహాశూరుడు.నూర్గురు రాజులను జయించి, రాచమల్లు అను బిరుదును వహించెను. ఈతని ఖడ్గము పేరు సూర్య బేతాళము. ఇతని అశ్వము పేరు సవరాల జిమ్మడు, శివక అశ్వం అని రెండు పేర్లు.ఈ గుర్రం కాలికి అలరాజుచే జయించబడిన నూర్గురు రాజుల బొమ్మలుగల పెండెరముండును.ఈతడే కనుక నాగమ్మ విషప్రయోగముతో గురికాకున్నచో పల్నాటి యుద్ధం అన్ని దినములు జరిగెడిదికాదు! ఒకటి రెండు దినంలలో నలగాముని వీరులందరినీ తుడిచిపెట్టగల సమర్ధుడు అలరాజు! అలరాజు నలగామున కల్లుడును, రాచమల్లు బిరుదాంకితుడును అగుటచే ఇతనిని అల్లు మల్లన్న అని ముద్దుగా పిలిచెడివారని తెలుస్తుంది.

అలరాచమల్లు మహావీరుడనుటకు మరొక తార్కాణమున్నది.అతడు తన యొరనుండి సూర్య భేతాళమును బయటకు తీసినచో, దానిని ప్రయోగించకుండా వ్యర్థంగా మరల లోపల పెట్టడు.ఇది శూరకులమున గానవచ్చు గొప్పనియమం. అలరాజు పెద్దన్నను ఎదిరించి కంభ్హంపాటి మిట్టలపై పోరునప్పుడు, బ్రహ్మనాయుడు వచ్చి వారి యుద్ధమును ఆపి, అల్లుడా కత్తిని ఒరచెయ్యి అని అలరాజును కోరగా, అలరాజు తన ఖడ్గమన కాహారములేనిదే ఉపసంహరింపజాలనని తెల్పెను. అప్పుడు బ్రహ్మన్నాయుడు అలరాజు సూర్యభేతాళమునకు ఏడు దున్నపోతులు, ఏడు పెద్దగొర్రెలు ఆహుతిగా పెట్టెనని గురిజాల రాయబారం అను వ్రాతప్రతిలో ఉంది. ఇట్లే అలరాజు, నలగాముని కొలువుకూటమునకు పోయినప్పుడు, నాగమ్మ మాటలకు కోపించి కత్తి దూసినాడు. నాగమ్మ భయపడి నలగాముని చాటునకు తప్పుకుంది. నలగామాదులాతనిని శాంతపర్చారు. అలరాజు అంతటితో తనకత్తిని దించలేదు.దాని కాహారము పెట్టికాని ఉపసహిరింపడు కదా! రౌద్రమూర్తియై ఎదురుగా చూచాడు, సభాభవమున స్తంభమును పగలగొట్టాడు.

అలరాజు, నాగమ్మ విషప్రయోగముచే చనిపోవుచు, తన బిరుదులన్నియు బాలచంద్రునికిచ్చెను. ఈ సూర్య భేతాళ ఖడ్గం కూడా బాలచంద్రునకు దక్కెను.ఈ మహాఖడ్గంతో యుద్ధం చేయుటవలన బాలచంద్రుని శార్యము ద్విగిణీకృతమైనదనవచ్చును.

ఇంతటి మహావీరుడగు అలరాచమల్లు, పల్నాటి రాజ్యానికి వారసుడనియు, యుద్ధం వచ్చినచో తమ్మునందరును తుడిచిపెట్టుడని భయపడి, నలగాముని తరువాత నరసింగరాజును సింహాసనమెక్కింపదలచిన నాగమ్మ ఇతనిని మాయోపాయముచే చంపింది. దీనిని బట్టి అలరాజు మరణంనకు కారణం నాగమ్మయే కారణమని భావించవచ్చును. మరియొక కథ ప్రకారమ ఇందు బ్రహ్మనాయుడు అలరాజుకు పెద్దన్న కలహం కారణంగా అలరాజుపై ద్వేషంతో బ్రహ్మనాయుడే కుట్రపన్ని చంపినాడని గురజాల రాయబారం ఉన్న కథ తెలుపుతుంది.

పల్నాటి యుద్ధం.... వచన కావ్యం

[మార్చు]

పల్నాటి యుద్ధం ద్విపద కావ్యాన్ని వచన కావ్యంగా అత్యంత రమణీయంగా రచించిన వారు ఆచార్య యార్లగడ్డ బాల గంగాధరరావు. ఇతని శైలి అత్యంత సులభ గ్రాహ్యంగా ఉండి, చదువరులను కట్టిపడేసేటట్లు ఉంది. కావ్యం చివరన నాలుగు అనుబంధాలను కూడా చేర్చినందున, కావ్యానికి మరింత సొబగును కలిగించింది. ఆ అనుబంధాలు. 1. పలనాటి చరిత్రలో ప్రసక్తులైన వ్యక్తులు, 2. పలనాటి చరిత్రలో ప్రసక్తమైన గ్రామాలు, ప్రదేశాలు, 3. పలనాటి వీర చరిత్రలో ప్రసక్తమైన సామాజిక వర్గాల వివరణ 4. ఈ గ్రంథంలో వాడబడిన జాతీయాలు, సామెతలు పలుకు బళ్ళు. ఈ గ్రంథాన్ని నిర్మలా పబ్లికేషన్ విజయవాడ వారు ప్రచురించారు. ఈ గ్రంథ స్వీయకర్తలు: శ్రీమతి వి.ఎల్. ఇందిరాదత్తు, శ్రీయుత వి. లక్ష్మణదత్తు దంపతులు.

మూలాలు

[మార్చు]
  • సమగ్ర ఆంధ్రదేశ చరిత్ర - సంస్కృతి రెండవ భాగం రచన: ముప్పాళ్ళ హనుమంతరావు
  • పల్నాటి వీరచరిత్ర - రెంటాల గోపాలకృష్ణ (1971)

ఇవికూడా చూడండి

[మార్చు]